Hyderabad Police Investigation On Deputy Tahsildar Case - Sakshi
Sakshi News home page

Smita Sabharwal: నెల క్రితమే నిందితుడి రెక్కీ.. ప్లజెంట్‌ వ్యాలీలో కరువైన నిఘా.. ఏంటీ పరిస్థితి?

Published Tue, Jan 24 2023 1:57 AM | Last Updated on Tue, Jan 24 2023 8:40 AM

Hyderabad Police Investigation On Deputy Tahsildar Case - Sakshi

బంజారాహిల్స్‌: తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి, సీనియర్‌ ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి గురువారం అర్ధరాత్రి మేడ్చల్‌ జిల్లా పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌ చెరుకు ఆనంద్‌ కుమార్‌రెడ్డి చొరబడిన వ్యవ హారంలో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు నెల క్రితమే యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌లో ఉన్న ప్లజెంట్‌ వ్యాలీలో స్మితా సబర్వాల్‌ ఇంటికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అయితే ఆ రోజు ఇంట్లో ఆమె లేకపోవడంతో తిరిగి వెళ్ళినట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో మరో నిందితుడు బాబును జూబ్లీహిల్స్‌ వైపు వెళ్ళొద్దామంటూ తీసుకొచ్చిన నిందితుడు స్మితా సబ ర్వాల్‌ ఇంటిదాకా తీసుకొచ్చి ఆయనను కూడా ఈ కేసులో అడ్డంగా ఇరికించినట్లయింది. ఇదిలా ఉండగా బాబు బయట కారులో కూర్చోగా నిందితుడు ఆనంద్‌ కుమార్‌ రెడ్డి నేరుగా ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. కారులో కూర్చున్న బాబు బయటికి దిగి తన సెల్‌ఫోన్‌లో అక్కడి క్వార్టర్లు అ న్నింటిని దర్జాగా వీడియో తీస్తున్నా ఏ ఒక్కరూ గుర్తించలేకపోయారు.  

సీసీ కెమెరాలు ఉండవా..?: స్మితా సబర్వాల్‌ ఉంటున్న ప్లజెంట్‌ వ్యాలీలో మొత్తం 23 క్వార్టర్స్‌ ఉన్నాయి. ఆమెది బి–11వ నెంబర్‌క్వార్టర్‌. తెలంగాణకు చెందిన ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఈ క్వార్టర్లలో ఉంటున్నారు. అయితే ప్రధాన గేటు వద్ద జూబ్లీహిల్స్‌ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఒకటి మాత్రమే రోడ్డు వైపు పని చేస్తోంది. లోనికి వెళ్ళిన తర్వాత ఒక్క కెమెరా కూడా లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు.

ఈ ఘటన అనంతరం నిందితుడికి సంబంధించిన రాకపోకలకు దృష్టిపెట్టిన పోలీసులు నిఘా నేత్రాల కోసం ఆరా తీయగా ఒక్క చోట కూడా వాటి జాడ లేకుండా పోయింది. కమ్యూనిటీ పోలీసింగ్, నేనుసైతం అంటూ బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసే అధికార యంత్రాంగానికి తాము ఉంటున్న ప్రాంతంలో మాత్రం ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన లేకుండా పోయింది.

ఈ క్వార్టర్లలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారన్నది కూడా నిఘా గాలికి వదిలేసినట్లుగా గత మూడు రోజుల నుంచి పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఎవరిని కదిపితే ఏం సమస్యలొస్తాయోనని ఇక్కడి నిఘా విషయంలో పోలీసులు నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా ఈ క్వార్టర్స్‌ వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా నిందితుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

డిప్యూటీ తహసీల్దార్‌ సస్పెన్షన్‌
ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌రెడ్డిపై వేటు పడింది. జిల్లా పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న ఆనంద్‌కు మార్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తనుజా చంచల్‌గూడ జైలులో నిందితుడు ఆనంద్‌కుమార్‌రెడ్డికి సోమవారం సిబ్బంది ద్వారా సస్పెన్షన్‌ ఉత్తర్వులను అందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement