గో టూ..కుప్పం!
- 4 మండలాలకు నలుగురు ఆర్డీవోస్థాయిఅధికారుల నియామకం
- కుప్పం అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మార్గనిర్దేశం
- 28 లోపు సమగ్ర నివేదికకు ఆదేశం
- ఖాళీ పోస్టుల భర్తీకి ప్రత్యేక చర్యలు
- ఒక్క నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించడంపై విమర్శలు
‘ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపిరికట్టెది మరో దారి’ అంటే ఇదే. రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల పరిస్థితి ఒక విధంగా ఉంటే కుప్పం మాత్రం ప్రత్యేకం. 66 మండలాలున్న జిల్లాలో ముగ్గురు ఆర్డీవోలు ఉంటే కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ప్రత్యేకాధికారులుగా నలుగురు ఆర్డీవో స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ తీరుపై ఇటు ఉద్యోగుల్లో, అటు ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి, చిత్తూరు: కుప్పం నియోజవర్గంలోని రామకుప్పం, గుడుపల్లె, కుప్పం, శాంతిపురం మండలాలకు ప్రత్యేకాధికారులుగా మైనారిటీ వెల్ఫేర్ డీడీ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామారావు, సివిల్ సప్లయిస్ విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్లు సత్తిబాబు, విశ్వనాథలను శుక్రవారం ప్రభుత్వం నియమించింది. శనివారం ఉదయమే ఆయా మండలాలకు వెళ్లి అధికారులతో సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఆదేశించినట్లు తెలిసింది. నలుగురు అధికారులు తమ సొంత శాఖల పనులను పక్కనబెట్టి హుటాహుటిన శనివారం ఉదయం కుప్పం నియోజకవర్గానికి వెళ్లి సమావేశం నిర్వహించారు.
సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా..
మండలాల్లోని ఉద్యోగులను సమన్వయపరచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేసే బాధ్యతను ప్రభుత్వం వీరికి అప్పగించింది. ముఖ్యంగా రెస్కో(రూరల్ ఎలక్ట్రికల్ కో-ఆపరేటివ్ సొసైటీ), పంచాయతీరాజ్, హౌసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్, ఇళ్లు కేటాయించాలని, విద్యుత్ కనెక్షన్ ప్రతి ఇంటికీ ఉండేలా చూడాలని సూచించారు. ఈ పథకాలన్నిటికీ ‘ఆధార్’తో అనుసంధానం తప్పనిసరి అని కూడా అధికారులు చెప్పారు. వేర్వేరుగా ఓ ప్రణాళికను రూపొందించి ఈనెల 28వ తేదీలోపు అందించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది.
వెనుకబడిన నియోజకవర్గాల పరిస్థితేంటి బాబు..
కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు 9 ఏళ్లపాటు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మొత్తం మీద పాతికేళ్లుగా నిరాటంకంగా కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. జిల్లా మొత్తం మీదనిరక్షరాస్యత అధికంగా ఉండేది కుప్పం ప్రాంతంలో అంటే అతిశయోక్తి కాదు. చదువు, ఉపాధి లేక అక్కడి వారు పనికోసం వలస వెళుతుంటారు. కుప్పం నుంచి రోజుకు పదివేల మంది కూలీలు కర్ణాటక, తమిళనాడు ప్రాంతానికి ఉదయం రైల్లో వెళ్లి రాత్రికి తిరిగి వస్తుంటారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు కుప్పం నియోజకవర్గం ఎంత నిర్లక్ష్యానికి గురైందో.
ఈ క్రమంలో సీఎం కుర్చీ అధిరోహించిన బాబు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఉపక్రమించారు. అయితే కుప్పంలాగే సత్యవేడు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, నగరి నియోజకవర్గాలు కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. పైగా ఇందులో మొదటి మూడు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు. వీటి అభివృద్ధిని విస్మరించి కుప్పం ప్రాంతానికి మాత్రమే నలుగురు ప్రత్యేకాధికారులను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పానికి మాత్రమే సీఎం అన్నట్లు చంద్రబాబు వ్యవహరించ డం తగదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
కుప్పంలో ఖాళీలనూ పూరించాల్సిందే
కుప్పం నియోజకవర్గంలో ఉపాధ్యాయ, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. అవసరమైతే జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి బలవంతంగానైనా అధికారులను కుప్పానికి బదిలీ చేయాలని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం అధికారుల ఇష్టాలతో పనిలేకుండా ‘గో..టు కుప్పం’ అని ఆర్డర్ కాపీ చేతిలో పెట్టేందుకు సిద్ధమైంది.
అభివృద్ధి కోసమే ప్రత్యేకాధికారుల నియామకం
కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించాం. అధికారులను సమన్వయపరచి అభివృద్ధిని వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మా నిర్ణయమే. ప్రభుత్వ నిర్ణయం.
-శ్రీధర్, జాయింట్ కలెక్టర్, చిత్తూరు.