మళ్లీ నిరాశపర్చిన ఫ్రీడమ్ 251
న్యూఢిల్లీ: 251కే స్మార్ట్‌ఫోన్ అంటూ.. ఫోన్ లవర్స్ ను ఊరించిన ఫ్రీడం ఫోన్ల పంపిణీ మరోసారి వాయిదా పడింది. అనేక వివాదాల నేపథ్యంలో ఈ స్మార్ట ఫోన్ ఇప్పటివరకు వినియోగదారుల చేతికి రాలేదు. జూన్ 30నుంచి పంపిణీకి సర్వం సిద్ధమని చెప్పుకొంటూ వచ్చిన రింగింగ్ బెల్స్ మరోసారి నిరాశ పర్చింది. ఫోన్ల డెలివరీ ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. తాజాగా మరోసారి వాయిదా వేసి జులై 7నుంచి ఫోన్లు డెలివరీ చేయనున్నట్లు రింగింగ్‌బెల్స్ ప్రకటించింది.
బ్యాటరీ సమస్యల వల్ల డెలివరీ ఆలస్యమైందని రింగింగ్‌బెల్స్ సీఈవో, వ్యవస్థాపకుడు మోహిత్ గోయల్ వివరణ ఇచ్చారు. జులై 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. జులై 7న ఢిల్లీలో ఒక కార్యక్రమం ఏర్పాటుచేసి.. డెలివరీని ప్రారంభిస్తామని గోయల్ తెలిపారు. అంతేగాక.. అమ్మకాలు ప్రారంభించే ముందుగా ప్రధాని నరేంద్రమోదీని కలిసి తమ ఫోన్లకు మద్దతివ్వాల్సిందిగా కోరనున్నట్లు మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా తమకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరనున్నామని... ప్రధానితో సమావేశం విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను పంపామని గోయల్ తెలిపారు.
రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రావడంతో లక్కీ డ్రా పద్ధతి ద్వారా కొనుగోలు దారులను ఎంపికచేయనున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో జూన్ 30 నుంచి జులై 5 వరకు లక్కీ డ్రా నిర్వహించి.. ఫ్రీడం ఫోన్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే.. అత్యధికంగా 2కోట్ల రిజిస్ట్రేషన్లు రాగా.. ఆ రాష్ట్రానికి 10వేల ఫోన్లను కేటాయించినట్లు తెలిపారు.
కాగా ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ అందిస్తామని నోయిడాకు చెందిన రింగింగ్‌బెల్స్ సంస్థ ప్రకటించింది. విషయం తెలిసిందే. ఫ్రీడమ్ 251 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్లపై అప్పట్లో పెద్ద దుమారాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.