సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం చేపట్టిన కేసీఆర్ కిట్ పథకంపై ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. 2014లో 30 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగ్గా 2021 నాటికి 22 శాతం పెరుగుదలతో 52 శాతానికి చేరాయని, ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు.
కేసీఆర్ కిట్లను ఇప్పటివరకు 13.30 లక్షల మందికి అందజేశామని, కిట్‌లో 16 రకాల వస్తువులు ఇస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. ప్రసవం అయిన తల్లీ బిడ్డల ను అమ్మ ఒడి వాహనాల ద్వారా ఇళ్లకు పంపిస్తున్నామని, అందుకోసం 300కు పైగా వాహనాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఇక మాతృత్వ మరణాల రేటు దేశవ్యాప్త సరాసరి ఎంఎంఆర్ 113 ఉండగా, రాష్ట్రంలో 92 నుంచి 63కు తగ్గిందన్నారు. దేశవ్యాప్త శిశు మరణాల రేటు(ఐఎంఆర్) సరాసరి 42 ఉండగా, తెలంగాణలో 39 నుంచి 23కు తగ్గిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment