ఇక్కడ ఆపరేషన్లు చేయలేం..
ములుగు ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిస్సహాయత
సౌకర్యాలున్నా జీఎంహెచ్, ఎంజీఎం ఆస్పత్రులకు రెఫర్
డీజీఓ స్థాయి వైద్యురాలు ఉన్నా అందని వైద్యం
108లో జరుగుతున్న ప్రసవాలు
ములుగు : గర్భిణీలకు మెరుగైన సేవలందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం జరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇస్తున్న ఆదేశాలు బుట్టదాఖలవుతున్నారుు. ప్రసవంలో చిన్నపాటి ఇబ్బంది ఉన్నా మనకు రిస్క్ ఎందుకులే.. అనే భావనతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రసవాల కేసులను ఎంజీఎం, జీఎంహెచ్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. డీజీఓ స్థాయి వైద్యాధికారిణి అందుబాటులో ఉన్నా గర్భిణీలకు సరైన వైద్యం, భరోసా అందడం లేదు. నవంబర్, డిసెంబర్‌లో ఆస్పత్రి పరిధిలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల నుంచి సుమారు 50 మంది గర్భిణీలను 108లో జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ కేసులు కేవలం 108 రికార్డుల్లో నమోదైనవి మాత్రమే. సొంత వాహనాల్లో తరలించినవారి సంఖ్య మరో 20 నుంచి 30 వరకు ఉండొచ్చు.
డాక్టర్లున్నా.. ఆపరేషన్లు సున్నా..
నాలుగు నెలల క్రితం సామాజిక ఆస్పత్రిలో గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి చొరవతో ప్రస్తుతం డీజీఓను నియమించారు. అంతేగాక ఆస్పత్రిలో గర్భిణీలకు తప్ప ని పరిస్థితుల్లో ఆపరేషన్ నిర్వహించేందుకు ఆనస్థిషియూ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు. అరుునా ప్రసవం చేయడానికి డాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. గర్భిణీలను ప్రసవం కోసం వెయిటింగ్‌లో ఉంచుతున్న వైద్యులు ఏ చిన్న ఇబ్బంది అనిపించినా జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు.
ఇక్కడ సీరియస్.. అక్కడ సిజేరియన్ లేకుండానే ప్రసవం..
అరుుతే ఇక్కడి వైద్యులు రిస్క్ కేసులుగా పరిగణించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు రెఫర్ చేస్తుంటే తీరా అక్కడికి వెళ్లాక అక్కడ సాధారణ ప్రసవాలు జరుగుతుండడం విశేషం. ప్రసవంలో చిన్నపాటి ఇబ్బందులను హైరిస్క్‌గా పరిగణించి బాధిత కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నారుు. గత మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు గర్భిణీలు 108లోనే ప్రసవించారు. గురువారం ఉదయం మండంలోని జంగాలపల్లికి చెందిన ములకలపల్లి రమ్య(23) పురిటి నొప్పులతో ములుగు ఆస్పతికి వచ్చింది. ఆమెను పరిశీలించిన వైద్యులు రిస్క్ కేసని చెప్పారు. దీంతో ఆమెను మధ్యాహ్నం 108లో వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆత్మకూరు శివారులో ప్రసవించింది. అలాగే జంగాలపల్లికి చెందిన ఎండీ షాజహాన్‌సుల్తానా(27) శుక్రవారం సాయంత్రం నొప్పులతో ఆస్పత్రికి చేరుకుంది. ఆమెను పరీక్షించిన వైద్యులు హన్మకొండలో ని జీఎంహెచ్‌కు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు 108లో హన్మకొండకు తరలిస్తుండగా పందికుంట స్టేజీ సమీపంలో అంబులెన్స్‌లోనే అర్ధరాత్రి ప్రసవించింది. దీంతో ఆమెను తిరిగి ములుగు ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు కేసుల్లో పైలట్ రాజేష్, సిబ్బంది బాలాజీ అందించిన వైద్యాన్ని కూడా వైద్యులు అందించలేకపోవడం గమనార్హం.
సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ వైద్యులు..
ములుగు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల తీరుతో ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఖర్చరుునా ఫరవా లేదని, ఇబ్బందులు లేకుండా ప్రసవం జరిగితే అంతేచాలని గర్భిణీల కుటుంబ సభ్యులు అంటున్నారు.
ఎండీ బదరోద్దీన్,
షాజామాన్ సుల్తానా సోదరుడు, ములుగు
మా అక్కకు పురిటి నొప్పులు రావడంతో గురువారం సాయంత్రం 7 గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లాం. వైద్యులు చెకప్ చేసి వెయిటింగ్‌లో ఉంచారు. రాత్రి 12 గంటల సమయంలో బిడ్డ గర్భంలో ల్యాట్రిన్ పోయిందని చెప్పారు. దీంతో హుటాహుటిన 108లో జీఎంహెచ్‌కు తరలించాం. పందికుంట దగ్గర నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది బాలాజీ, రాజేష్ సుఖప్రసవం జరిగేలా చేశారు. ప్రసవం ఇబ్బందని చెప్పడంతో కుటుంబ సభ్యులమంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాం. ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా ఉన్నారు.