సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యాన్ని మరింత చేరువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెంచి నాణ్యమైన వైద్య సేవలను పల్లె ముంగిటకే తెచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఆరోగ్య ఉపకేంద్రాలను బలోపేతం చేయడం, గ్రామ సచివాలయాల్లో ఏఎన్‌ఎంల నియామకం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే దూరం భారం కాకూడదని, నడిచి వెళ్లేంత సమీపంలోనే ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీహెచ్‌సీల సంఖ్య పెంచితే గ్రామీణులకు మరింత సులువుగా వైద్యసేవలు లభిస్తాయని భావిస్తోంది.
ఒక్కో పీహెచ్‌సీకి రూ.4 కోట్లు వ్యయం
► రాష్ట్రంలో 671 మండలాలు ఉన్నాయి.
► ప్రస్తుతం రాష్ట్రంలో 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
► కొత్తగా మరో 142 పీహెచ్‌సీలు వస్తాయని అంచనా.
► గిరిజన ప్రాంతాల్లో మండలంలో ఇప్పటికే రెండు పీహెచ్‌సీలున్నా అవసరాన్ని బట్టి మరింతగా పెంచేందుకు వెసులుబాటు
► తాజా అంచనాల ప్రకారం.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరు పీహెచ్‌సీలు అందుబాటులోకి వస్తాయి.
► ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు రూ.4 కోట్లు వ్యయమవుతుందని అంచనా.
► వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించి ఆర్థిక శాఖకు పంపాక వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు ఉంటాయి.
వైద్యులు 24 గంటలూ అందుబాటులో..
► ఇప్పటికే ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు నర్సులు విధిగా ఉండాలని సర్కార్ నిర్ణయించింది.
► ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఒకరు, 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు ఓపీ చూస్తారు.
► రాత్రి 8 గంటల తర్వాత అత్యవసర సేవల్లో భాగంగా ఫోన్ చేస్తే ఆస్పత్రికి వచ్చి వైద్యం అందించాలి.
► ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు.
► 104 వాహనం నెలలో ప్రతి పల్లెకూ వెళ్లి ఆ గ్రామాల్లో ఉన్నవారి వైద్యంపై వాకబు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment