![Central Govt planning to run Telangana delivery centers across the country - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/19/LABOUR-ROOM-670X500.jpg.webp?itok=jx_ujTHk)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులు కల్పించడం వంటి చర్యల కారణంగా గర్భిణులు ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అస్సాంలో జరిగిన జాతీయ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రశంస లభించింది. లేబర్ రూంల ఏర్పాటు వల్ల ప్రసవాలు ముఖ్యంగా సాధారణ ప్రసవాలు పెరిగినట్లు గుర్తించారు. అస్సాంలో జరిగిన సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చారు.
గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పడకలపై గర్భిణులను పక్కపక్కనే పడుకోబెట్టేవారు. ప్రత్యేక గదులు లేకుండానే ప్రసవాలు చేస్తుండేవారు. దీనివల్ల గర్భిణులు అసౌకర్యానికి గురయ్యేవారు. దీంతో సాధారణ ప్రసవాలు జరిగేవి కావు. ఇప్పుడు ఆ పద్ధతి మార్చి ప్రత్యేకంగా లేబర్ రూంలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు ఆ నివేదికలో వెల్లడించారు. లేబర్ రూంలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. గర్భిణీ సహాయకులకు ప్రత్యేక వసతి, అప్పుడే పుట్టిన పిల్లల కోసం వసతి, టాయిలెట్లు తదితర సౌకర్యాలు కల్పించారు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకునేందుకు మహిళలు ముందుకు వచ్చారని ఆయన వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్నట్లుగానే లేబర్ రూంలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది.
31% నుంచి 54 శాతానికి చేరిన ప్రసవాలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 31 శాతమే ఉండేవి. గతేడాది జూన్‌లో 40.87 ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 54.10 శాతానికి చేరుకోవడం గమనార్హం. గతేడాది జూన్‌లో ప్రభుత్వాసుపత్రుల్లో 21,797 ప్రసవాలు జరగ్గా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 28,847 ప్రసవాలు జరిగినట్లు నివేదిక తెలిపింది. ఈ కాలంలో మొత్తం 4.13 లక్షల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులు కలిపి 492 ప్రసవ కేంద్రాలున్నాయి. వైద్య, విద్య సంచాలకుల పరిధిలోని బోధనాసుపత్రుల్లో 8, ఆరోగ్య కుటుంబ సంక్షేమ పరిధిలో 7, వైద్య విధాన పరిషత్ పరిధిలో 48, సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 48, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 347, ఏహెచ్ పరిధిలో 31 ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిల్లో ప్రత్యేకంగా లేబర్ రూంలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment