
ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రసవాలు సగటున ఎక్కువగా జరుగుతున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మొదటి స్థానంలో ఉన్నట్లు వైద్య విధాన పరిషత్ గణాంకాల్లో తేలింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కాన్పుల గణాంకాలు సేకరించారు. ఇక ఏరియా ఆస్పత్రుల్లో కాన్పుల్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, జిల్లా ఆస్పత్రుల్లో విజయనగరం అగ్రస్థానంలో నిలిచాయి.
జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లు...
34 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు సగటున 50కి మించి ప్రసవాలు జరుగుతున్నాయి. సగటున వందకు మించి ప్రసవాలు జరుగుతున్నవి 8 ఆస్పత్రులున్నాయి. ఏరియా ఆస్పత్రుల్లో సగటున నెలకు వంద ప్రసవాలు జరిగే ఆస్పత్రులు 19 ఉన్నాయి. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో మొత్తం 1,67,128 ప్రసవాలు జరగ్గా 58,960 సిజేరియన్లు ఉన్నాయి. 35.27 శాతం సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువగా 47 శాతం సిజేరియన్ ప్రసవాలు నమోదయ్యాయి. సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సగటుకు మించి ప్రసవాలు జరుగుతున్న ఆస్పత్రులను హైలోడ్ డెలివరీ ఆస్పత్రులుగా గుర్తించి వసతులు మరింత మెరుగు పరచనున్నారు. ప్రసూతి వార్డులను యుద్ధప్రాతిపదికన ఉన్నతీకరిస్తున్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యుల బృందం ఉండేలా చర్యలు చేపట్టారు.
అత్యాధునిక ప్రసూతి వార్డులు
‘నాడు – నేడు’ పనుల ద్వారా ప్రధానంగా సీహెచ్‌సీల్లో అత్యాధునిక ప్రసూతి వార్డులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో ముగ్గురు వైద్యుల బృందం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మౌలిక వసతులు భారీగా పెరగనున్నాయి.
–డాక్టర్ యు.రామకృష్ణారావు, కమిషనర్, వైద్యవిధానపరిషత్
Comments
Please login to add a commentAdd a comment