Community Health Centers
-
పనులు చకచకా
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని బొబ్బిలి సామాజిక కేంద్రంలో 30 పడకలు ఉన్నాయి. ఆరు మండలాల పేద రోగులు ఇక్కడికి వస్తుంటారు. పాత భవనంలో అరకొర వసతులతో ఆస్పత్రి నడిచేది. ఈ పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నాడు–నేడు కింద ఆస్పత్రి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఓపీ బ్లాక్ పాత భవనాన్ని కూల్చి రూ.3.36 కోట్లతో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వం ఇక్కడ నూతన భవనాన్ని నిర్మించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన నూతన భవనంలో ఓపీ, ల్యాబ్, సర్జికల్, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. వసతులు మెరుగుపడటంతో ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి పెరిగింది. రోజుకు సగటున 250 నుంచి 300 వరకూ ఓపీలు ఉంటున్నాయి. నూతన భవనంపై మరో అంతస్తు నిర్మించి జనరల్ వార్డుతోపాటు, ఇతర వసతులు కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. సాక్షి, అమరావతి: నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ప్రాంతీయ ఆస్పత్రుల(ఏహెచ్)లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వీటిలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 ఏహెచ్‌లు, 177 సీహెచ్‌సీలు ఉండగా.. వీటిలో 11,380 పడకలు ఉన్నాయి. టీడీపీ పాలనలో ఆస్పత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. పెరుగుతున్న రోగుల తాకిడికి అనుగుణంగా ఆస్పత్రులు అప్‌గ్రేడ్ కాకపోవడం, వసతులు అరకొరగా ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదలకు ప్రభుత్వ రంగంలో ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో నాడు–నేడు కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీంతో సీహెచ్‌సీ, ఏహెచ్‌ల రూపురేఖలు మారుతున్నాయి. రూ.1,223 కోట్లు వెచ్చించి.. రాష్ట్రవ్యాప్తంగా 45 ఏహెచ్‌లు, 121 సీహెచ్‌సీలు, 2 ఎంసీహెచ్/సీడీహెచ్‌లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,223.28 కోట్లను వెచ్చిస్తోంది. ఏపీ వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో నాడు–నేడు పనులు చేపట్టారు. మూడు ప్యాకేజీలుగా పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెలకు సగటున రూ.60 కోట్లకు పైగా విలువైన పనులు జరుగుతున్నాయి. ఆస్పత్రుల అభివృద్ధిలో భాగంగా పలుచోట్ల ఉన్న భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు. మరికొన్నిచోట్ల నూతన భవనాలు నిర్మిస్తున్నారు. ప్రతి ఆస్పత్రిలో అన్ని వసతులతో ఓపీ బ్లాక్, లేబర్ వార్డు, పోస్టుమార్టం యూనిట్, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను అభివృద్ధి చేస్తున్నారు. మూడు దశలుగా వచ్చే డిసెంబర్ నాటికి ఈ పనులన్నిటినీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి 59 ఆస్పత్రులు, అక్టోబర్ నెలాఖరు నాటికి మరో 69, డిసెంబర్ నెలాఖరు నాటికి మిగిలిన 40 ఆస్పత్రుల్లో నిర్మాణాలను పూర్తి చేస్తారు. సకాలంలో పూర్తి చేయకుంటే పెనాల్టీలు ఆస్పత్రుల్లో చేపట్టే పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లేకుండా చూస్తున్నాం. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు పెనాల్టీలు విధిస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పనులన్నీ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంన్నాం. పనుల నాణ్యతలో రాజీపడటం లేదు. డిసెంబర్‌లోగా మొత్తం పనులు పూర్తి చేస్తాం. – డి.మురళీధర్‌రెడ్డి, ఎండీ అండ్ వైస్‌చైర్మన్, ఏపీ ఎంఎస్ఐడీసీ ఆస్పత్రి మెరుగుపడింది నాడు–నేడు కింద బొబ్బిలి ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. గతంతో పోలిస్తే ఆస్పత్రిలో చాలా మార్పు వచ్చింది. వసతులు మెరుగుపడ్డాయి. గతంలో ఆస్పత్రిలోకి అడుగు పెట్టాలంటేనే అపరిశుభ్రత వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. వాతావరణం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రైవేట్ ఆస్పత్రులకన్నా బొబ్బిలి ఆస్పత్రి మెరుగ్గా ఉంది. – రేజేటి ఈశ్వరరావు, బొబ్బిలి -
171 ఆస్పత్రుల్లో సదరం క్యాంపులు
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిన సదరం క్యాంపుల నిర్వహణను పునరుద్ధరించారు. ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 171 ఆస్పత్రుల్లో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడానికి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. ఈనెల 16 నుంచి మీసేవ కేంద్రాల్లో ముందస్తు స్లాట్లు బుక్ చేసుకోవచ్చని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ తెలిపారు. సదరం క్యాంపుల్లో భాగంగా వివిధ జబ్బులతో కదలలేని వారికి, మూగ, చెవుడు, కంటిచూపు లేకపోవడం, ఆర్థోపెడిక్ (ప్రమాదాల్లో గాయపడి లేదా పుట్టుకతో వికలాంగులుగా మారినవారు) సమస్యలు గుర్తించి వారికి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. -
కాన్పుల్లో ఎమ్మిగనూరు టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రసవాలు సగటున ఎక్కువగా జరుగుతున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మొదటి స్థానంలో ఉన్నట్లు వైద్య విధాన పరిషత్ గణాంకాల్లో తేలింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కాన్పుల గణాంకాలు సేకరించారు. ఇక ఏరియా ఆస్పత్రుల్లో కాన్పుల్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, జిల్లా ఆస్పత్రుల్లో విజయనగరం అగ్రస్థానంలో నిలిచాయి. జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లు... 34 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు సగటున 50కి మించి ప్రసవాలు జరుగుతున్నాయి. సగటున వందకు మించి ప్రసవాలు జరుగుతున్నవి 8 ఆస్పత్రులున్నాయి. ఏరియా ఆస్పత్రుల్లో సగటున నెలకు వంద ప్రసవాలు జరిగే ఆస్పత్రులు 19 ఉన్నాయి. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో మొత్తం 1,67,128 ప్రసవాలు జరగ్గా 58,960 సిజేరియన్లు ఉన్నాయి. 35.27 శాతం సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువగా 47 శాతం సిజేరియన్ ప్రసవాలు నమోదయ్యాయి. సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సగటుకు మించి ప్రసవాలు జరుగుతున్న ఆస్పత్రులను హైలోడ్ డెలివరీ ఆస్పత్రులుగా గుర్తించి వసతులు మరింత మెరుగు పరచనున్నారు. ప్రసూతి వార్డులను యుద్ధప్రాతిపదికన ఉన్నతీకరిస్తున్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యుల బృందం ఉండేలా చర్యలు చేపట్టారు. అత్యాధునిక ప్రసూతి వార్డులు ‘నాడు – నేడు’ పనుల ద్వారా ప్రధానంగా సీహెచ్‌సీల్లో అత్యాధునిక ప్రసూతి వార్డులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో ముగ్గురు వైద్యుల బృందం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మౌలిక వసతులు భారీగా పెరగనున్నాయి. –డాక్టర్ యు.రామకృష్ణారావు, కమిషనర్, వైద్యవిధానపరిషత్ -
వైద్యానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ), ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ప్రజారోగ్య ప్రమాణాలకు తగినట్లుగా లేకపోవటంతో వీటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం పలు ఆసుపత్రిల అభివృద్ధి కోసం రూ.436.96 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవరత్నాల అమలులో భాగంగా సీహెచ్‌సీలను, ప్రాంతీయ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు నిధులు విడుదల చేస్తున్నామని అందులో పేర్కొంది. రాష్ట్రంలోని మూడు ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి రూ.24.45 కోట్లు, 89 సీహెచ్‌సీల కోసం రూ.399.73 కోట్లు విడుదల చేసింది. ఒంగోలులోని మాతా శిశు ఆసుప్రతికి రూ. 1.76 కోట్లు, అనంతపురంలోని సీడీహెచ్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.11.07 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటి అభివృద్ధికి ఏపీ వైద్య విధాన పరిషత్ తక్షణమే చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడు. ఆరోగ్య భాగ్యం 5,000 ఆరోగ్య ఉపకేంద్రాలకు కొత్త భవనాలు -
డీసీహెచ్ఎస్ అధికారుల తొలగింపు
సీహెచ్‌సీ సూపరింటెండెంట్లకే బాధ్యతలు ప్రధాన ఆస్పత్రులుగా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్ ఆస్పత్రులు..? సాక్షి, నిర్మల్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ల పర్యవేక్షణ బాధ్యతను జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్ఎస్) నుంచి తొలగించారు. ఆయా జిల్లాల్లోని జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్లకే ఈ బాధ్యతలను అప్పగించారు. డీసీహెచ్ఎస్ పేరును తొలగిస్తూ సూపరింటెండెం ట్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ అని మార్పు చేశారు. డీసీహెచ్ఎస్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని నాలుగు జిల్లాలకు పంపకాలు చేశారు. ఇక రానున్న రోజుల్లో నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్ ఆస్పత్రులు జిల్లా ప్రధాన ఆస్పత్రులుగా మార్చేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రులు ఇవే... ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఉట్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్(టి), బెల్లంపల్లి, మంచిర్యాల, నిర్మల్(ఎన్సీహెచ్) డీసీహెచ్ఎస్ పరిధిలోకి వచ్చేవి. ఈ ఆస్పత్రుల్లో 404 మంజూరు పోస్టులు ఉండగా 248 మంది రెగ్యులర్, 43మంది కాంట్రాక్ట్, 75 మంది ఔట్సోర్సింగ్, 9 మంది ఇతర ఉద్యోగులు ఉన్నారు. ఇందులో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, ఆఫీస్ మినిస్టీరియల్ స్టాఫ్ వస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆస్పత్రుల పర్యవేక్షణ అంతా డీసీహెచ్ఎస్ చూసేవారు. జీతాలు, పదోన్నతులు, బదిలీలు, సెలవులు, ఇంక్రిమెంట్లు, క్రమబద్ధీకరణ, బడ్జెట్, టీఏ, డీఏ, ఇతర అంశాలకు సంబంధించి జిల్లాస్థాయిలో అయితే ఇక్కడ లేనిపక్షంలో జోనల్, రాష్ట్రస్థాయికి పంపించేవారు. చిన్న జిల్లాలు ఏర్పాటు నేపథ్యంలో డీసీహెచ్ఎస్ అధికారులను తొలగించేసి ఆయా జిల్లాలోని జిల్లా కేంద్ర సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌కు ఈ బాధ్యతలను బదిలీ చేశారు. తద్వారా ఆస్పత్రులు, సిబ్బందికి సంబంధించిన పూర్తి పర్యవేక్షణ ఇకపై సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌పైనే ఉంటుంది. ఆయా జిల్లాల్లోకి ఈ ఆస్పత్రులు నిర్మల్ ఏరియా ఆస్పత్రి, నిర్మల్ ప్రసూతి ఆస్పత్రి, భైంసా ఆస్పత్రి, ఖానాపూర్ ఆస్పత్రి నిర్మల్ జిల్లాలోకి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆస్పత్రులు మంచిర్యాల జిల్లాలోకి, ఆసిఫాబాద్, సిర్పూర్(టి) ఆస్పత్రులు కొమ్రం భీం జిల్లాలోకి, ఉట్నూర్ ఆస్పత్రి ఆదిలాబాద్ జిల్లాలోకి వస్తాయి. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ బాధ్యతలను అప్పగించారు. మెరుగైన సేవలకు కృషి.. - డాక్టర్ సురేశ్, సూపరిండెంట్ జిల్లా హెడ్‌క్వార్టర్స్ టీవీవీపీ, నిర్మల్ నిర్మల్ ఏరియా ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి, భైంసా, ఖానాపూర్ ఏరియా ఆస్పత్రు ల్లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స జరిగేలా చర్యలు మరింత ఎక్కువగా తీసుకుంటాం. రోగులకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. -
కడుపు కోత!
జిల్లాలో పెరుగుతున్న మాతా, శిశు మరణాలు పురిటిలోనే చనిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం అధికారుల చర్యలు కాగితాలకే పరిమితం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో! తగినన్ని మౌలిక వసతులు.. దండిగా నిధులున్నా వైద్య, ఆరోగ్య శాఖ చిత్తశుద్ధిలోపం జిల్లా వాసులకు శాపంగా పరిణమించింది. జిల్లాలో మాతా, శిశు మరణాలను నివారించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. జిల్లాలో 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 584 సబ్‌సెంటర్లు, 15 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రీషియన్ క్లష్టర్స్, 13 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 35 రౌండ్ ది క్లాక్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 17 అర్బన్ హెల్త్ సెంటర్లు, 7 బోధనాసుపత్రులు... జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మౌలిక వసతులు ఇవీ... సాక్షి, విశాఖపట్నం మాతా, శిశు మరణాలను తగ్గిస్తామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటల్లో చిత్తశుద్ధికనిపించడం లేదు. మాతా, శిశు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా మంజూరు చేసిన నిధులన్నీ వ్యయం చేశామని అధికారులు లెక్కలు చూపుతున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులు రూ.1.17కోట్లు. కేంద్ర ప్రభుత్వ జననీ శిశు సురక్ష కార్యక్రమం కింద ఏపీ వైద్య విధానపరిషత్ కమిషనర్ రూ.18,36,916 నిధులు విడుదల చేశారు. జననీ సురక్ష యోజనకు రూ.98,37,798 నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జననీ శిశు సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం గా విజయవంతంగా ప్రసవాలు చేయించాలి. గర్భిణికి ఉచితంగా పౌష్టికాహారం అందించడంతోపాటు రాను పోను దారి ఖర్చులు, మందులు, రక్తం వంటివి ఉచితంగా అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. కానీ ఈ ఏడాది సగం మందికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరలేదు. ఇన్ని నిధులు కేటాయిస్తున్నా మాతా శిశు మరణాలు పెరగడం ఆశ్చర్యం కలిగించే అంశం. కారణాలు ఇవీ.. నివారణ చర్యలేవీ? రక్త హీనత, అధిక రక్తస్రావం, సకాలంలో వైద్యం అందకపోవడం, పౌష్టికాహార లోపం, అవగాహన లేమి తదితర కారణాలతోనే ఎక్కువుగా మాతా, శిశు మరణాలు సంభ విస్తున్నాయి. గిరిజన, గ్రామీణ ప్రాం తాల్లో ఈ మరణాలు రేటు ఎక్కువుగా ఉంటోంది. ఆ ప్రాంతాల్లో కొన్ని వ్యాధులు తీవ్రంగా ఉండటం, సమీపంలోని పీహెచ్‌సీలకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల గిరిజనుల్లో ఈ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి.వీరి కోసం ప్రసవానికి వారం ముందే వైద్యుల సంరక్షణలో ఉండేలా పాడేరు డివిజన్లో 4 బర్త్ వెయిటింగ్ హోమ్‌లు నెలకొల్పారు. కానీ అక్కడకు ఎవరూ వెళ్లడం లేదు. సెకండ్ ఎఎన్ఎంలు కూడా 409 మంది మాత్రమే ఉన్నారు. 111పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల మారుమూల ప్రాంతాల గర్భిణు లు ప్రసవ సమయంలో ఆయాలను, స్థానిక మహిళల సహకారం పొందాల్సి వస్తోంది. ఆ సమయంలో బిడ్డ అడ్డం తిరిగినా, అధిక రక్తస్రావం జరిగినా ఆస్పత్రికి తరలించే అవకాశం లేక ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. అవగాహన కల్పించాల్సిన వైద్యాధి కారులు కనీసం పట్టించుకోకుండా వదిలేయడం అనర్థాలకు కారణమవు తోంది. అంబులెన్స్ అందుబాటులో లేక..పీహెచ్‌సీల అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం వల్ల కూ డా మరణాలు చోటుచేసు కుంటు న్నాయి. ఇలాంటి సంఘటనే తాజాగా పెదబయలు మండలంలో వెలుగుచూ సింది. పెదబయలు మండలం అరడ కోట పంచాయతీ బొంగదారి గ్రామా నికి చెందిన గర్భిణి (34) ఈ నెల 18న కాన్పు కష్టమై మృతి చెందింది. శిశువు కూడా కడుపులోనే చనిపోయింది. ఆమెకు ఈ నెల 15న పురిటినొప్పులు రావడంతో పెదబయలు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యాధికారి లేక పోవడంతో పాడేరు ఏరియ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి రక్తహీతన ఉందని, కాన్పు కష్టమని చెప్పి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించారు. అయితే వారి చేతిలో చిల్లిగవ్వ లేక తిరిగి ఇంటికి తీసుకెళ్లడంతో మూడు రోజుల పాటు నరకయాతన అను భవించి మృతి చెందింది. వైద్య సిబ్బం దే చొరవ తీసుకొని ఆమెను ప్రభుత్వ అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించి ఉంటే తల్లీ బిడ్డా ప్రాణాలు దక్కేవి. ఆందోళనకరంగా మరణాల రేటు మాతా, శిశు మరణాలను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసినట్లుంది. జిల్లాలో మాతా, శిశు మరణాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మరణాలు పెరగడం అధికారుల నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. జిల్లాలో 2013-14లో 692 మంది శిశువులు, 60 మంది తల్లులు మృతి చెందారు. 2014-15లో ఇప్పటి వరకు 1006 మంది శిశువులు, 72 మంది మాతృమూర్తులు చనిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి పెద్ద వైద్యాలయమైన కేజీహెచ్‌తో సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ప్రసూతి విభాగాల్లో కనీస సౌకర్యాలు లేవు. గత ఆర్థిక సంవత్సరంలో 70,908 ప్రసవాలు జరిగితే, ఈ ఏడాది ఇప్పటి వరకూ 55,636 ప్రసవాలు జరిగాయి.71 వేల ప్రసవాల్లో 696 మంది శివులు మరణిస్తే, ఈ ఏడాది 55వేల ప్రసవాల్లోనే 1006 మరణాలు జరిగాయి. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సగటున ప్రతి వెయ్యి మంది శిశువుల్లో పద్దెనిమిది మంది పురిటిలోనే తుది శ్వాస వీడుతున్నారు. -
వైద్యానికి సుస్తీ
ఏలూరు : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లల్లో సౌకర్యాలేమి రోగులకు ప్రాణసంకటంగా మారింది. ఏళ్ల తరబడి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం జరగకపోవడంతో ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం పూజ్యంగా మారింది. 48 మండలాల్లో 79 పీహెచ్సీలుండగా, 158 మంది వైద్యులున్నారు. తొమ్మిది సీహెచ్‌సీల్లో తొమ్మిది మంది డాక్టర్లు ఉన్నారు. అదనపు పోస్టుల మంజూరు లేక డిప్యూటేషన్‌పైనే స్థానికంగా ఉన్న పీహెచ్సీ వైద్యులు సేవలందిస్తున్నారు. టె క్నీషియన్, నర్సుల పోస్టులు 60కు పైగా ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత వల్ల రోగుల పడుతున్న బాధలు అన్నీ ఇన్నీకావు. మందుల కొరత, వివిధ రోగాల నిర్ధారణకు ల్యాబ్‌లు లేకపోవడంతో వైద్యం అందడం లేదు. డాక్టర్లు, కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతుండడంతో రోగులు ఆర్ఎంపీ, ఇతర వైద్యులను ఆశ్రయిస్తున్నారు. పీహెచ్‌సీల్లోను ప్రసవాలు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకావడం లేదు. జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను ‘సాక్షి’ బృందం సోమవారం పరిశీలించగా అనేక సమస్యలు వెలుగుచూశాయి. సకాలంలో రాని డాక్టర్లు చింతలపూడి పీహెచ్సీలో డాక్టర్ రాకపోవడంతో స్టాఫ్ నర్సు, ఆరోగ్యమిత్ర కార్యకర్తలు రోగులను పరీక్షించి మందులు ఇచ్చారు. ఇరగవరం పీెహ చ్‌సీ వైద్యుడు సెలవులో ఉండగా ఇన్చార్జి డాక్టరు సౌజన్య 11 గంటలకు వచ్చారు. ఉండ్రాజవరం పీహెచ్సీలో వైద్యుడు సెలవులో ఉన్నారు. స్టాఫ్ నర్సే ఓపీ నిర్వహించారు. టి నర్సాపురం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఎం.నాగేశ్వరరావు 10.30 గంటలకు విధులకు హాజరయ్యారు. లింగపాలెం పీహెచ్సీ డాక్టర్ డిప్యుటేషన్‌పై ఏలూరు వెళ్లడంతో నర్సులు రోగులను పరీక్షించారు. బుట్టాయగూడెం ఆసుపత్రిలో ఉదయం సమయంలో వైద్యాధికారి ఒక్కరే ఉండడంతో రోగులు బారులు తీరుతున్నారు. దెందులూరు పీహెచ్సీలో ఆరుగురు వైద్యులుసాయంత్రం విధులకు డుమ్మా కొడుతున్నారు. ఆచంట సీహెచ్‌సీలో సోమవారం ఆరుగురు వైద్యాధికారులకు ఒక్కరే సేవలు అందించారు. ఇక్కడ గైనకాలజిస్టు, ఎనస్తీషియన్ లేకపోవడంతో ప్రసవాలు జరగడం లేదు. సిబ్బంది, పరికరాల కొరతే అవరోధం ఏలూరు మండలం గుడివాకలంక పీహెచ్‌సీకి ప్రహరీ లేక పశువుల విశ్రాంతి నిలయంగా మారింది. కొయ్యలగూడెంలో సిబ్బంది పోస్టులు ఏళ్లతరబడి భర్తీ కావాల్సి ఉంది. భీమవరం మండలం గొల్లవానితిప్ప పీహెచ్సీలో ప్రసవాల కోసం వచ్చే మహిళలకు సౌకర్యాలు లేవు. కొయ్యలగూడెంలో యుజీపీహెచ్‌సీలో జనరేటర్ లేక విద్యుత్ కోతల వేళల్లో తల్లులు చంటిపిల్లలను చెట్లరే ఊయలలు కట్టి ఆడిస్తున్నారు. చింతలపూడి ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ పని చేయడం లేదు. వసతుల్లేని భవనాలు అత్తిలి పీహెచ్సీ భవనం ఇరుకుగా ఉండడంతో రోగులు ఆరుబయటే కూర్చుంటున్నారు. గోపాలపురం 30 పడకల ఆసుపత్రిలో డాక్టర్టు, సిబ్బంది కొరత వేధిస్తోంది. లంకలకోడేరు పీహెచ్సీలో ఆపరేషన్ థియేటర్ శ్లాబు పాడై వర్షం నీరు లోపలికి వస్తోంది. -
సచ్చినా కష్టమే..
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా వ్యాప్తంగా నిర్మల్, భైంసా, మంచిర్యాల ఏరి యా ఆస్పత్రులతోపాటు ఖానాపూర్, ఉట్నూర్, సిర్పూర్ (టి), బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌లలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ముథోల్, లక్సెట్టిపేట, చెన్నూర్, బోథ్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం జరుగుతాయి. పోస్టుమార్టం చేసేందుకు ఒక సివిల్ సర్జన్, ముగ్గురు ఎంఎన్‌వోలు అవసరం. వీరు షిఫ్ట్వైస్గా విధులు నిర్వర్తించాలి. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రుల్లో 26 మంది సివిల్ సర్జన్లు, 17 మంది ఎంఎన్‌వోలు ఉన్నారు. సీహెచ్‌సీల్లో 24 మంది సివిల్ సర్జన్లు, 20 మంది ఎంఎన్‌వోలు, సివిల్ ఆస్పత్రుల్లో 11 మంది మెడికల్ ఆఫీసర్లు, 13 మంది ఎంఎన్‌వోలు పనిచేస్తున్నారు. ఈ ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్ కిందకి వస్తాయి. అయితే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న 72 పీహెచ్‌సీల్లో ఎక్కడా కూడా పోస్టుమార్టం నిర్వహించడం లేదు. పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించకపోవడంతో ఈ ప్రాంతాల్లో చనిపోయిన వారిని ఏరియా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం గదులు ఏర్పాటు చేయాలని, అందుకు కావాల్సిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. కానరాని సౌకర్యాలు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలో మూడు ఫ్రీజర్లు ఉండగా ఒకటి మూలనపడింది. గది చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, చెత్తచెదారం ఉంది. పోస్టుమార్టం గదుల్లో మృతదేహాన్ని భద్రపరిచేందుకు కావాల్సిన ఫ్రీజర్లు(మార్చురీ యూనిట్) కనిపించడం లేదు. పోస్టుమార్టం గదుల్లో నీటిసౌకర్యం, రెండు పెద్ద బెంచిలతోపాటు, ఒక విశాలమైన హాల్ ఉండాలి. మూడు మృతదేహాలను ఉంచే సామర్థ్యం గల ఫ్రీజర్లు అందుబాటులో ఉంచాలి. గదిని ఎప్పుడు శుభ్రం చేసేందుకు కెమికల్స్ ఉపయోగించాలి. పోస్టుమార్టం చేసే సమయంలో ఉప్పు, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉండాలి. మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు ముందస్తుగా సెంట్ చల్లాలి. అయితే ప్రస్తుతం పోస్టుమార్టం చేస్తున్న చాలా ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవు. మృతదేహాలను పడుకోబెట్టేందుకు గద్దెలు (బెంచీ), శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు, ఇతర పరికరాలు కానరావడం లేదు. శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు లేకపోవడంతో అనాథ శవాలు వచ్చినప్పుడు రోజుల తరబడి ఉంచడం ద్వారా కుళ్లిపోతున్నాయి. ఒక రిమ్స్ ఆస్పత్రిలో తప్ప ఎక్కడ కూడా ఫ్రీజర్లు లేవని తెలుస్తోంది. పోస్టుమార్టం గది అంటేనే భయపడేలా కనిపిస్తున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదితోపాటు, ఇతర ఆస్పత్రుల్లో పిచ్చిమొక్కలు పెరిగి, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. పోస్టుమార్టం చేసేందుకు ఉపయోగించే సుత్తె, కత్తెర, ఇతర చిన్న పరికరాలు కూడా పాతవే వాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గదిలోపల పోస్టుమార్టం తర్వాత శుభ్రపర్చకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. నిర్మల్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలోపల సౌకర్యాలు లేక ఆరుబయటే పోస్టుమార్టం చేస్తున్నారు. కొన్ని సమయాల్లో ఇక్కడి సిబ్బంది పోస్టుమార్టం గదులకు తాళం వేసి వెళ్లిపోవడంతో వైద్యులు, సిబ్బంది కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా కేసుల్లో పోస్టుమార్టం ఒకరోజులో చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో బాధిత బంధువులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సౌకర్యాలు కల్పిస్తాం.. - బసవేశ్వరీ, డీఎంహెచ్‌వో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పోస్టుమార్టం గదుల్లో లేని సౌకర్యాలపై దృష్టిపెట్టాం. ఫ్రీజర్లు లేని ఆస్పత్రులను గుర్తించి వాటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటాం. మృతదేహం వచ్చిన వెంటనే పోస్టుమార్టం నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం నిర్వహించే వెసులుబాటు లేదు. అన్ని ఏరియా, సివిల్ ఆస్పత్రుల్లో మెడికల్ ఆఫీసర్లు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. -
కునికి పాట్లు
గతంలో ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని జిల్లాలో ఏడాదికి 35 వేల ఆపరేషన్లు చేసేవారు. ఐదేళ్లుగా ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రస్తుతం ఆపరేషన్ల సంఖ్య 25 వేలకు కూడా చేరుకోవడం లేదు. కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ఒకరు లేదా ఇద్దరు అనే నినాదంతో ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రోత్సహిస్తోంది. అయితే ఇందుకు అనుగుణంగా నిధుల విడుదల చేయడం లేదు. అలాగే వైద్యాధికారులను నియమించకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. ఫలితంగా జిల్లాలో జనాభా నియంత్రణ సాధ్యం కావడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 24 గంటలు పనిచేసే ఆరోగ్య కేంద్రాలు 40 ఏర్పాటు చేశారు. వీటితో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 16 ఉన్నాయి. ఇవే గాక కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల, నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోని, ఎమ్మిగనూరు, బనగానపల్లిలో ఏరియా ఆసుపత్రులు వైద్యసేవలు అందిస్తున్నాయి. వీటన్నింటిలో తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉంది. కానీ నిపుణులైన వైద్యులు లేకపోవడంతో జిల్లాలో ఎంపిక చేసిన 33 సర్వీస్ సెంటర్లలో మాత్రమే ప్రస్తుతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం 24 మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. దీంతో పాటు నంద్యాల, ఆదోని, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిల్లోని పీపీ యూనిట్లలో కు.ని. ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. పీపీ యూనిట్లలో కేవలం 6 నుంచి 10 వరకు మాత్రమే ఆపరేషన్లు చేసి, మిగిలిన వారిని ఏదో ఒక కారణం చూపి వెనక్కి పంపిస్తున్నారు. జిల్లా మొత్తంగా నలుగురైదుగురు వైద్యులు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుండటంతో గందరగోళం నెలకొంది. ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్‌గా కాకుండా ఆపరేషన్ చేసే వైద్యులు ఏ ఆసుపత్రిలో ఎప్పుడు వెళ్లి కు.ని. ఆపరేషన్లు చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సంఖ్యపై చూపుతోంది. ఆరేళ్ల క్రితం వరకు జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు లక్ష్యాన్ని ఏర్పాటు చేసేవారు. ఆ మేరకు అప్పటి అధికారులు మెడికల్ ఆఫీసర్లపై ఒత్తిడి పెంచి లక్ష్యాన్ని చేరుకునేవారు. అయితే ఐదేళ్లుగా పరిస్థితిలో మార్పు వచ్చింది. అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, వైద్యసిబ్బంది మధ్య సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణమని ఓ అధికారి వివరించారు. పారితోషికం కోసం ముప్పుతిప్పలు.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం రూ. వెయ్యి నగదును అందిస్తుంది. గతంలో ఓ ప్రైవేటు సంస్థ చీర, సారె, మందులను సైతం అందించేది. అయితే ప్రస్తుతం నగదు ఇచ్చేందుకు సైతం వైద్య సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతున్నారు. సాధారణంగా ఆపరేషన్ చేయించుకుని డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పారితోషికం ఇచ్చి పంపించాలి. కానీ ఆపరేషన్ చేయించుకున్న వారు ఆ డబ్బు కోసం మూడు, నాలుగు సార్లు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో అధికశాతం ప్రజలు ఈ మొత్తాన్ని పొందలేక వదులుకుంటున్నారు. నిధులున్నా ఆసుపత్రి ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా పారితోషికం ఇవ్వడంలో ఆలస్యమవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. బాలింతలకు నరకమే.. కు.ని. ఆపరేషన్ చేయించుకోవడానికి బాలింతలు ఉత్సాహం చూపుతున్నా అధికారులు మాత్రం వారికి నరకం చూపుతున్నారు. ఆసుపత్రులకు వచ్చిన వారికి కనీస వసతులు కల్పించలేకపోతున్నారు. సాధారణంగా కు.ని. ఆపరేషన్ చేయించుకునే వారికి రవాణా సౌకర్యం, వారి సహాయకులకు భోజనం, పసిపిల్లలకు పాలు, నీరు వంటివి ఏర్పాటు చేయాలి. అధిక శాతం సర్వీస్ కేంద్రాల్లో ఇవి చేయకున్నా చేసినట్లు రికార్డుల్లో రాసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆపరేషన్ చేసిన వైద్యునికి ఒక్కో కేసుకు రూ.100, స్టాఫ్‌నర్సుకు రూ.25 ఇస్తున్నారు. ఇవి గాక బాలింతను తీసుకొచ్చిన ఆశా వర్కర్లకు తగిన పారితోషికం అందిస్తున్నారు. పీపీ యూనిట్లలో వైద్యులు పరిమిత సంఖ్యలో ఆపరేషన్లు చేస్తుండటంతో అధిక శాతం బాలింతలు వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఒక్కసారి వెనక్కివెళ్లిన వారు మరోసారి గర్భం దాలుస్తున్నారు. -
వైద్య విధాన పరిషత్‌లకు విభజన సెగ
కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏపీ వైద్య విధాన పరిషత్‌లుగా స్థాయి పెంచేందుకు రాష్ట్ర విభజన సెగ అడ్డంకిగా మారింది. దీంతో ప్రజలకు గతంలో మాదిరిగానే సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. జిల్లాలో 16 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏపీ వైద్య విధాన పరిషత్‌లుగా మార్చాల్సి ఉంది. కోవెలకుంట్లలోని 30 పడకల ఆసుపత్రిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వైద్య విధాన పరిషత్ ద్వారా వైద్య సేవలు అందాల్సి ఉండగా రాష్ట్రాల విభజన, సార్వత్రిక ఎన్నికల ఎఫెక్ట్ కారణంగా ఈ ఫైల్ ముందుకు కదలడం లేదు. గత జనవరి 22న ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రామకృష్ణరావుతో కూడిన బృందం జిల్లాలోని డోన్, కోడుమూరు, కోవెలకుంట్ల, మిడుతూరు, నందికొట్కూరు, పాణ్యం, ఓర్వకల్లు, పత్తికొండ, సున్నిపెంట, వెల్దుర్తి, వెలుగోడు, యాళ్లూరు, అవుకు కమ్యూనిటీ ఆసుపత్రులను పరిశీలించి ఆయా కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో ఉన్న సౌకర్యాలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. భవనాల సముదాయాలు, వసతులు ఉన్న ఆసుపత్రులలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వైద్యవిధాన పరిషత్‌లతో రోగులకు వైద్య సేవలు అందుతాయని పరిశీలన అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ వైద్య విధాన పరిషత్‌ల మార్పు ఫైల్‌ను పక్కనపెట్టినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. స్థాయిని పెంచడం వల్ల 24 గంటల వైద్యసేవలు, గైనకాలజిస్టులు, అన్ని రకాల సర్జన్లకు సంబంధించి డాక్టర్లతో పాటు 31 మంది వైద్య సిబ్బంది, గర్భిణులు, చిన్న పిల్లలకు అన్ని రకాల రోగాలకు సంబంధించి వైద్య విధాన పరిషత్‌ల్లో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రజలు ఊరట చెందారు. అయితే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన, ఉద్యోగులు, రాష్ట్రస్థాయి ఆఫీసుల పంపకాలు, తదితర వాటిపై గందరగోళం నెలకొనడం ఆరోగ్య శాఖకు సంబంధించి వివాదం కొనసాగుతుండటంతో వైద్య విధాన పరిషత్ మార్పు జాప్యం జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తే జిల్లా ప్రజలకు వైద్య విధాన పరిషత్‌ల కల నెరవేరుతుంది.