కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏపీ వైద్య విధాన పరిషత్‌లుగా స్థాయి పెంచేందుకు రాష్ట్ర విభజన సెగ అడ్డంకిగా మారింది. దీంతో ప్రజలకు గతంలో మాదిరిగానే సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. జిల్లాలో 16 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏపీ వైద్య విధాన పరిషత్‌లుగా మార్చాల్సి ఉంది. కోవెలకుంట్లలోని 30 పడకల ఆసుపత్రిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వైద్య విధాన పరిషత్ ద్వారా వైద్య సేవలు అందాల్సి ఉండగా రాష్ట్రాల విభజన, సార్వత్రిక ఎన్నికల ఎఫెక్ట్ కారణంగా ఈ ఫైల్ ముందుకు కదలడం లేదు.
గత జనవరి 22న ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రామకృష్ణరావుతో కూడిన బృందం జిల్లాలోని డోన్, కోడుమూరు, కోవెలకుంట్ల, మిడుతూరు, నందికొట్కూరు, పాణ్యం, ఓర్వకల్లు, పత్తికొండ, సున్నిపెంట, వెల్దుర్తి, వెలుగోడు, యాళ్లూరు, అవుకు కమ్యూనిటీ ఆసుపత్రులను పరిశీలించి ఆయా కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో ఉన్న సౌకర్యాలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. భవనాల సముదాయాలు, వసతులు ఉన్న ఆసుపత్రులలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వైద్యవిధాన పరిషత్‌లతో రోగులకు వైద్య సేవలు అందుతాయని పరిశీలన అధికారులు అప్పట్లో పేర్కొన్నారు.
అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ వైద్య విధాన పరిషత్‌ల మార్పు ఫైల్‌ను పక్కనపెట్టినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. స్థాయిని పెంచడం వల్ల 24 గంటల వైద్యసేవలు, గైనకాలజిస్టులు, అన్ని రకాల సర్జన్లకు సంబంధించి డాక్టర్లతో పాటు 31 మంది వైద్య సిబ్బంది, గర్భిణులు, చిన్న పిల్లలకు అన్ని రకాల రోగాలకు సంబంధించి వైద్య విధాన పరిషత్‌ల్లో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రజలు ఊరట చెందారు. అయితే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన, ఉద్యోగులు, రాష్ట్రస్థాయి ఆఫీసుల పంపకాలు, తదితర వాటిపై గందరగోళం నెలకొనడం ఆరోగ్య శాఖకు సంబంధించి వివాదం కొనసాగుతుండటంతో వైద్య విధాన పరిషత్ మార్పు జాప్యం జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తే జిల్లా ప్రజలకు వైద్య విధాన పరిషత్‌ల కల నెరవేరుతుంది.
వైద్య విధాన పరిషత్‌లకు విభజన సెగ
Published Mon, Jun 2 2014 2:38 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM
Advertisement
Advertisement