జిల్లాలో పెరుగుతున్న మాతా, శిశు మరణాలు
పురిటిలోనే చనిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం
అధికారుల చర్యలు కాగితాలకే పరిమితం
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో! తగినన్ని మౌలిక వసతులు.. దండిగా నిధులున్నా వైద్య, ఆరోగ్య శాఖ చిత్తశుద్ధిలోపం జిల్లా వాసులకు శాపంగా పరిణమించింది. జిల్లాలో మాతా, శిశు మరణాలను నివారించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. జిల్లాలో 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 584 సబ్‌సెంటర్లు, 15 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రీషియన్ క్లష్టర్స్, 13 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 35 రౌండ్ ది క్లాక్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 17 అర్బన్ హెల్త్ సెంటర్లు, 7 బోధనాసుపత్రులు... జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మౌలిక వసతులు ఇవీ... సాక్షి, విశాఖపట్నం
మాతా, శిశు మరణాలను తగ్గిస్తామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటల్లో చిత్తశుద్ధికనిపించడం లేదు. మాతా, శిశు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా మంజూరు చేసిన నిధులన్నీ వ్యయం చేశామని అధికారులు లెక్కలు చూపుతున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులు రూ.1.17కోట్లు. కేంద్ర ప్రభుత్వ జననీ శిశు సురక్ష కార్యక్రమం కింద ఏపీ వైద్య విధానపరిషత్ కమిషనర్ రూ.18,36,916 నిధులు విడుదల చేశారు. జననీ సురక్ష యోజనకు రూ.98,37,798 నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జననీ శిశు సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం గా విజయవంతంగా ప్రసవాలు చేయించాలి. గర్భిణికి ఉచితంగా పౌష్టికాహారం అందించడంతోపాటు రాను పోను దారి ఖర్చులు, మందులు, రక్తం వంటివి ఉచితంగా అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. కానీ ఈ ఏడాది సగం మందికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరలేదు. ఇన్ని నిధులు కేటాయిస్తున్నా మాతా శిశు మరణాలు పెరగడం ఆశ్చర్యం కలిగించే అంశం.
కారణాలు ఇవీ.. నివారణ చర్యలేవీ?
రక్త హీనత, అధిక రక్తస్రావం, సకాలంలో వైద్యం అందకపోవడం, పౌష్టికాహార లోపం, అవగాహన లేమి తదితర కారణాలతోనే ఎక్కువుగా మాతా, శిశు మరణాలు సంభ విస్తున్నాయి. గిరిజన, గ్రామీణ ప్రాం తాల్లో ఈ మరణాలు రేటు ఎక్కువుగా ఉంటోంది. ఆ ప్రాంతాల్లో కొన్ని వ్యాధులు తీవ్రంగా ఉండటం, సమీపంలోని పీహెచ్‌సీలకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల గిరిజనుల్లో ఈ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి.వీరి కోసం ప్రసవానికి వారం ముందే వైద్యుల సంరక్షణలో ఉండేలా పాడేరు డివిజన్‌లో 4 బర్త్ వెయిటింగ్ హోమ్‌లు నెలకొల్పారు. కానీ అక్కడకు ఎవరూ వెళ్లడం లేదు. సెకండ్ ఎఎన్‌ఎంలు కూడా 409 మంది మాత్రమే ఉన్నారు. 111పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల మారుమూల ప్రాంతాల గర్భిణు లు ప్రసవ సమయంలో ఆయాలను, స్థానిక మహిళల సహకారం పొందాల్సి వస్తోంది. ఆ సమయంలో బిడ్డ అడ్డం తిరిగినా, అధిక రక్తస్రావం జరిగినా ఆస్పత్రికి తరలించే అవకాశం లేక ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. అవగాహన కల్పించాల్సిన వైద్యాధి కారులు కనీసం పట్టించుకోకుండా వదిలేయడం అనర్థాలకు కారణమవు తోంది. అంబులెన్స్ అందుబాటులో లేక..పీహెచ్‌సీల అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం వల్ల కూ డా మరణాలు చోటుచేసు కుంటు న్నాయి. ఇలాంటి సంఘటనే తాజాగా పెదబయలు మండలంలో వెలుగుచూ సింది.
పెదబయలు మండలం అరడ కోట పంచాయతీ బొంగదారి గ్రామా నికి చెందిన గర్భిణి (34) ఈ నెల 18న కాన్పు కష్టమై మృతి చెందింది. శిశువు కూడా కడుపులోనే చనిపోయింది. ఆమెకు ఈ నెల 15న పురిటినొప్పులు రావడంతో పెదబయలు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యాధికారి లేక పోవడంతో పాడేరు ఏరియ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి రక్తహీతన ఉందని, కాన్పు కష్టమని చెప్పి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించారు. అయితే వారి చేతిలో చిల్లిగవ్వ లేక తిరిగి ఇంటికి తీసుకెళ్లడంతో మూడు రోజుల పాటు నరకయాతన అను భవించి మృతి చెందింది. వైద్య సిబ్బం దే చొరవ తీసుకొని ఆమెను ప్రభుత్వ అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించి ఉంటే తల్లీ బిడ్డా ప్రాణాలు దక్కేవి.
ఆందోళనకరంగా మరణాల రేటు
మాతా, శిశు మరణాలను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసినట్లుంది. జిల్లాలో మాతా, శిశు మరణాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మరణాలు పెరగడం అధికారుల నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. జిల్లాలో 2013-14లో 692 మంది శిశువులు, 60 మంది తల్లులు మృతి చెందారు. 2014-15లో ఇప్పటి వరకు 1006 మంది శిశువులు, 72 మంది మాతృమూర్తులు చనిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి పెద్ద వైద్యాలయమైన కేజీహెచ్‌తో సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ప్రసూతి విభాగాల్లో కనీస సౌకర్యాలు లేవు. గత ఆర్థిక సంవత్సరంలో 70,908 ప్రసవాలు జరిగితే, ఈ ఏడాది ఇప్పటి వరకూ 55,636 ప్రసవాలు జరిగాయి.71 వేల ప్రసవాల్లో 696 మంది శివులు మరణిస్తే, ఈ ఏడాది 55వేల ప్రసవాల్లోనే 1006 మరణాలు జరిగాయి. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సగటున ప్రతి వెయ్యి మంది శిశువుల్లో పద్దెనిమిది మంది పురిటిలోనే తుది శ్వాస వీడుతున్నారు.
కడుపు కోత!
Published Sat, Feb 21 2015 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement
Advertisement