మాతా,శిశు మరణాల తగ్గింపే లక్ష్యం
ఆరోగ్య కేంద్రాలకు నిధుల పెంపు
‘సాక్షి’తో డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగ మల్లేశ్వరి
గుంటూరు మెడికల్ జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో సురక్షితమైన ప్రసవాలు జరిగేలా చూసి మాతా, శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా ైవె ద్యులు, వైద్య సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రావిపాటి నాగమల్లేశ్వరి అన్నారు. ఆమె శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రస్తుతం కాన్పులు జరుగుతున్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి, తెనాలి జిల్లా ఆస్పత్రి, మూడు ఏరియా ఆస్పత్రులు, 16 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలూ పనిచేసే 32 ఆస్పత్రులలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది వివరాలు, వైద్య పరికరాలు, వైద్య సౌకర్యాల వివరాలన్నీ సేకరించి, మెరుగైన వైద్యసేవలందించడానికి నివేదిక రూపొందించామన్నారు. సురక్షితమైన కాన్పులు జరిగేలా వినుకొండ, గురజాల ఆస్పత్రుల స్థాయిని పెంపుదల చేశామని, వాటి అభివృద్ధి కోసం రూ.25 లక్షలు ప్రభుత్వం విడుదల చేసినట్టు చెప్పారు. పీహెచ్‌సీలకు జాతీయగ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులను ఇకనుంచి ఏడాదికి రూ.2.50లక్షలు ఇస్తామని వెల్లడించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజ్, బ్లడ్‌గ్రూప్, బ్లడ్ షుగర్, యూరిన్ పరీక్షలు, గర్భ నిర్ధారణ పరీక్షలను తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు. ల్యాట్ టెక్నీషియన్లు లేని ప్రాంతాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు.
గ్రామాలకు 104 వాహనాలు వెళ్లిన సమయంలో ఆరోగ్య కేంద్రాల్లో చేసే వ్యాధి నిర్ధారణ పరీక్షలన్నీ వాహనంలో ఉండే ల్యాబ్ టెక్నీషియన్లు చేస్తారని తెలిపారు. గర్భిణులకు చేసే అన్ని పరీక్షలను వారికి ఇచ్చే మాతా,శిశు సంరక్షణ కార్డులో తప్పనిసరిగా న మోదు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు డాక్టర్ నాగమల్లేశ్వరి చెప్పారు. గర్భవతిగా నిర్ధారణ జరిగిన వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. గర్భిణులకు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించే పారితోషికాలను చెల్లించేందుకు వారి ఆధార్ వివరాలను అనుసంధానం చేయాలని తెలిపారు.