కునికి పాట్లు
గతంలో ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని జిల్లాలో ఏడాదికి 35 వేల ఆపరేషన్లు చేసేవారు. ఐదేళ్లుగా ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రస్తుతం ఆపరేషన్ల సంఖ్య 25 వేలకు కూడా చేరుకోవడం లేదు.
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ఒకరు లేదా ఇద్దరు అనే నినాదంతో ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రోత్సహిస్తోంది. అయితే ఇందుకు అనుగుణంగా నిధుల విడుదల చేయడం లేదు. అలాగే వైద్యాధికారులను నియమించకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. ఫలితంగా జిల్లాలో జనాభా నియంత్రణ సాధ్యం కావడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 24 గంటలు పనిచేసే ఆరోగ్య కేంద్రాలు 40 ఏర్పాటు చేశారు.
వీటితో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 16 ఉన్నాయి. ఇవే గాక కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల, నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోని, ఎమ్మిగనూరు, బనగానపల్లిలో ఏరియా ఆసుపత్రులు వైద్యసేవలు అందిస్తున్నాయి. వీటన్నింటిలో తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉంది. కానీ నిపుణులైన వైద్యులు లేకపోవడంతో జిల్లాలో ఎంపిక చేసిన 33 సర్వీస్ సెంటర్లలో మాత్రమే ప్రస్తుతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
అందులోనూ ప్రస్తుతం 24 మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. దీంతో పాటు నంద్యాల, ఆదోని, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిల్లోని పీపీ యూనిట్లలో కు.ని. ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. పీపీ యూనిట్లలో కేవలం 6 నుంచి 10 వరకు మాత్రమే ఆపరేషన్లు చేసి, మిగిలిన వారిని ఏదో ఒక కారణం చూపి వెనక్కి పంపిస్తున్నారు. జిల్లా మొత్తంగా నలుగురైదుగురు వైద్యులు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుండటంతో గందరగోళం నెలకొంది.
ఫిక్స్‌డ్ డే ప్రోగ్రామ్‌గా కాకుండా ఆపరేషన్ చేసే వైద్యులు ఏ ఆసుపత్రిలో ఎప్పుడు వెళ్లి కు.ని. ఆపరేషన్లు చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సంఖ్యపై చూపుతోంది. ఆరేళ్ల క్రితం వరకు జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు లక్ష్యాన్ని ఏర్పాటు చేసేవారు. ఆ మేరకు అప్పటి అధికారులు మెడికల్ ఆఫీసర్లపై ఒత్తిడి పెంచి లక్ష్యాన్ని చేరుకునేవారు. అయితే ఐదేళ్లుగా పరిస్థితిలో మార్పు వచ్చింది. అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, వైద్యసిబ్బంది మధ్య సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణమని ఓ అధికారి వివరించారు.
పారితోషికం కోసం ముప్పుతిప్పలు..
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం రూ. వెయ్యి నగదును అందిస్తుంది. గతంలో ఓ ప్రైవేటు సంస్థ చీర, సారె, మందులను సైతం అందించేది. అయితే ప్రస్తుతం నగదు ఇచ్చేందుకు సైతం వైద్య సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతున్నారు. సాధారణంగా ఆపరేషన్ చేయించుకుని డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పారితోషికం ఇచ్చి పంపించాలి.
కానీ ఆపరేషన్ చేయించుకున్న వారు ఆ డబ్బు కోసం మూడు, నాలుగు సార్లు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో అధికశాతం ప్రజలు ఈ మొత్తాన్ని పొందలేక వదులుకుంటున్నారు. నిధులున్నా ఆసుపత్రి ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా పారితోషికం ఇవ్వడంలో ఆలస్యమవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
బాలింతలకు నరకమే..
కు.ని. ఆపరేషన్ చేయించుకోవడానికి బాలింతలు ఉత్సాహం చూపుతున్నా అధికారులు మాత్రం వారికి నరకం చూపుతున్నారు. ఆసుపత్రులకు వచ్చిన వారికి కనీస వసతులు కల్పించలేకపోతున్నారు. సాధారణంగా కు.ని. ఆపరేషన్ చేయించుకునే వారికి రవాణా సౌకర్యం, వారి సహాయకులకు భోజనం, పసిపిల్లలకు పాలు, నీరు వంటివి ఏర్పాటు చేయాలి. అధిక శాతం సర్వీస్ కేంద్రాల్లో ఇవి చేయకున్నా చేసినట్లు రికార్డుల్లో రాసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆపరేషన్ చేసిన వైద్యునికి ఒక్కో కేసుకు రూ.100, స్టాఫ్‌నర్సుకు రూ.25 ఇస్తున్నారు. ఇవి గాక బాలింతను తీసుకొచ్చిన ఆశా వర్కర్లకు తగిన పారితోషికం అందిస్తున్నారు. పీపీ యూనిట్లలో వైద్యులు పరిమిత సంఖ్యలో ఆపరేషన్లు చేస్తుండటంతో అధిక శాతం బాలింతలు వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఒక్కసారి వెనక్కివెళ్లిన వారు మరోసారి గర్భం దాలుస్తున్నారు.