నాడు–నేడు పనులకు ముందు బొబ్బిలి సీహెచ్‌సీ, నాడు–నేడు పనుల అనంతరం బొబ్బిలి సీహెచ్‌సీ
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని బొబ్బిలి సామాజిక కేంద్రంలో 30 పడకలు ఉన్నాయి. ఆరు మండలాల పేద రోగులు ఇక్కడికి వస్తుంటారు. పాత భవనంలో అరకొర వసతులతో ఆస్పత్రి నడిచేది. ఈ పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక నాడు–నేడు కింద ఆస్పత్రి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఓపీ బ్లాక్ పాత భవనాన్ని కూల్చి రూ.3.36 కోట్లతో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వం ఇక్కడ నూతన భవనాన్ని నిర్మించింది.
ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన నూతన భవనంలో ఓపీ, ల్యాబ్, సర్జికల్, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. వసతులు మెరుగుపడటంతో ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి పెరిగింది. రోజుకు సగటున 250 నుంచి 300 వరకూ ఓపీలు ఉంటున్నాయి. నూతన భవనంపై మరో అంతస్తు నిర్మించి జనరల్ వార్డుతోపాటు, ఇతర వసతులు కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.
సాక్షి, అమరావతి: నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ప్రాంతీయ ఆస్పత్రుల(ఏహెచ్)లను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వీటిలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 ఏహెచ్‌లు, 177 సీహెచ్‌సీలు ఉండగా.. వీటిలో 11,380 పడకలు ఉన్నాయి.
టీడీపీ పాలనలో ఆస్పత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. పెరుగుతున్న రోగుల తాకిడికి అనుగుణంగా ఆస్పత్రులు అప్‌గ్రేడ్ కాకపోవడం, వసతులు అరకొరగా ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదలకు ప్రభుత్వ రంగంలో ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో నాడు–నేడు కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీంతో సీహెచ్‌సీ, ఏహెచ్‌ల రూపురేఖలు మారుతున్నాయి.
రూ.1,223 కోట్లు వెచ్చించి..
రాష్ట్రవ్యాప్తంగా 45 ఏహెచ్‌లు, 121 సీహెచ్‌సీలు, 2 ఎంసీహెచ్/సీడీహెచ్‌లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,223.28 కోట్లను వెచ్చిస్తోంది. ఏపీ వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో నాడు–నేడు పనులు చేపట్టారు. మూడు ప్యాకేజీలుగా పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెలకు సగటున రూ.60 కోట్లకు పైగా విలువైన పనులు జరుగుతున్నాయి.
ఆస్పత్రుల అభివృద్ధిలో భాగంగా పలుచోట్ల ఉన్న భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు. మరికొన్నిచోట్ల నూతన భవనాలు నిర్మిస్తున్నారు. ప్రతి ఆస్పత్రిలో అన్ని వసతులతో ఓపీ బ్లాక్, లేబర్ వార్డు, పోస్టుమార్టం యూనిట్, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను అభివృద్ధి చేస్తున్నారు. మూడు దశలుగా వచ్చే డిసెంబర్ నాటికి ఈ పనులన్నిటినీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి 59 ఆస్పత్రులు, అక్టోబర్ నెలాఖరు నాటికి మరో 69, డిసెంబర్ నెలాఖరు నాటికి మిగిలిన 40 ఆస్పత్రుల్లో నిర్మాణాలను పూర్తి చేస్తారు.
సకాలంలో పూర్తి చేయకుంటే పెనాల్టీలు
ఆస్పత్రుల్లో చేపట్టే పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లేకుండా చూస్తున్నాం. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు పెనాల్టీలు విధిస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పనులన్నీ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంన్నాం. పనుల నాణ్యతలో రాజీపడటం లేదు. డిసెంబర్‌లోగా మొత్తం పనులు పూర్తి చేస్తాం.
– డి.మురళీధర్‌రెడ్డి, ఎండీ అండ్ వైస్‌చైర్మన్, ఏపీ ఎంఎస్‌ఐడీసీ
ఆస్పత్రి మెరుగుపడింది
నాడు–నేడు కింద బొబ్బిలి ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. గతంతో పోలిస్తే ఆస్పత్రిలో చాలా మార్పు వచ్చింది. వసతులు మెరుగుపడ్డాయి. గతంలో ఆస్పత్రిలోకి అడుగు పెట్టాలంటేనే అపరిశుభ్రత వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. వాతావరణం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రైవేట్ ఆస్పత్రులకన్నా బొబ్బిలి ఆస్పత్రి మెరుగ్గా ఉంది.
– రేజేటి ఈశ్వరరావు, బొబ్బిలి
Comments
Please login to add a commentAdd a comment