కాన్పులు లేవు!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణం
బాగా తగ్గిన ప్రసవాల సంఖ్య
పర్యవేక్షణ లేక ప్రజల దూరం
ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు
జిల్లాల పునర్విభజన అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోకి వచ్చిన 11 పీహెచ్‌సీల్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 153 ప్రసవాలు జరిగాయి. జిల్లాలు ఏర్పాటయ్యాక అదే పీహెచ్‌సీల్లో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు అంటే మూడు నెలల కాలంలో కేవలం 62 ప్రసవాలే జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
వరంగల్ : పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యల పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడమే కాకుండా అవసరమైన నిధులు విడుదల చేస్తోంది. ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన వసతులను కల్పిస్తోంది. అంతేకాకుండా జిల్లాల పునర్విభజన తర్వాత క్షేత్రస్థాయిలో వైద్య సేవలపై పర్యవేక్షణ పెరగాలని జిల్లాల అధికారులను ఆదేశిస్తోంది. ఇంత చేస్తున్నా వరంగల్ అర్బన్ జిల్లాలో మాత్రం ప్రభుత్వ ఆకాంక్షలు, ఆదేశాలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య బాగా తగ్గడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
చర్యలు లేవు..
ప్రభుత్వ ఆస్పత్రులపై పర్యవేక్షణ పెంచి వైద్యసేవల పరంగా భరోసా కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దీంతో ప్రసవాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవల పరంగా భరోసా కల్పించే పరిస్థితి లేకపోవడంతో పేదలు సైతం ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగంపై వేల కోట్లు ఖర్చుపెడుతున్నా పేదలకు ఆసరాగా నిలిచే పరిస్థితి లేకుండా పోతోంది.
అప్పట్లో 69,..
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. వైశాల్యం పరంగా పెద్దగా ఉండడంతో వైద్యసేవల పర్యవేక్షణ కొంత ఇబ్బంది కలిగించేది. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో వరంగల్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించగా ఉమ్మడి జిల్లాకు వైద్యాధికారిగా వ్యవహరించిన అధికారి వరంగల్ అర్బన్ జిల్లా బాధ్యతలు చేపట్టారు. వరంగల్ నగరంలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు ఉండడంతో.. అర్బన్ జిల్లాలోని 12 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(యూహెచ్‌సీ)ల్లో ప్రసవాలు జరగవు. ఇక జిల్లాలో ఏడు గ్రామీణ మండలాలు ఉండగా వీటిలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు) ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ పీహెచ్‌సీలు వైద్య సేవలు అందించాలి. ముఖ్యంగా ఈ కేంద్రాల్లో ప్రసవాలు జరిగేలా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోంది. జిల్లాలోని గ్రామీణ పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. వరంగల్ అర్బన్ జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు (2016 నవంబర్ – 2017 జనవరి) జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీల్లో కేవలం 62 ప్రసవాలే జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో పీహెచ్‌సీల ప్రసవాల సంఖ్యతో పోలిస్తే బాగా తగ్గడం ప్రభుత్వ వైద్య సేవల పరిస్థితిని స్పష్టం చేస్తోంది. కొత్త జిల్లాల ఆవిర్భావంతో జిల్లా పరిధి, విస్తీర్ణం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో పీహెచ్‌సీలపై పర్యవేక్షణ పెరగాల్సి ఉండగా అది మాత్రమే జరగడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.