కొందుర్గు(షాద్‌నగర్): ‘ఇంటివద్ద, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకోకూడదు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకోండి’అని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకుంటే కేసీఆర్ కిట్‌తోపాటు, రూ.12 వేలు ప్రోత్సాహకం అందిస్తామని చెబుతుంది. కానీ, చాలా ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల సరైన వైద్య సేవలు అందడం లేదు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇక్కడ 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాలి.
స్టాఫ్‌నర్స్ అందుబాటులో ఉండి ప్రసూతి చేయాలి. కానీ ప్రస్తుతం ఇక్కడ వైద్యులు లేరు. బూర్గుల పీహెచ్‌సీ డాక్టర్ సుమంత్ కొందుర్గు పీహెచ్‌సీకి ఇన్‌చార్జీగా సేవలందిస్తున్నారు. స్టాఫ్‌నర్స్‌లు ఎవరూ లేకపోవడంతో ఏఎన్‌ఎంలు స్టాఫ్‌నర్స్‌లుగా వ్యవహరిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. కొందుర్గు, జిల్లేడ్‌చౌదరిగూడ మండలాల్లో దాదాపు 70 గ్రామాలు, 70 వేల పైనే జనాభా ఉన్నారు. అయినా ఈ రెండు మండలాల ప్రజలకు కొందుర్గులో ఒకే ఒక పీహెచ్‌సీ ఉంది. ఇందులోనూ వైద్యులు, సరిపడా సిబ్బంది లేక రోగులకు సరైన వైద్యసేవలు అందక అవస్థలు పడుతున్నారు.
మాతృమూర్తుల నరకయాతన
జిల్లేడ్‌చౌదరిగూడ మండలం ముష్టిపల్లి తండాకు చెందిన లలిత బుధవారం రాత్రి 11 గంటలకు ప్రసవం కోసం కొందుర్గు పీహెచ్‌సీకి వచ్చింది. ఈ సమయంలో అక్కడ వైద్యులెవరూ లేరు. స్టాఫ్‌నర్స్ సలోమి ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నారు. కానీ ఉదయం 7 గంటల వరకు ఆమె ప్రసవించలేదు. అదేవిధంగా గురువారం ఉదయం 5 గంటలకు కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన చాకలి లావణ్య, జిల్లేడ్‌చౌదరిగూడ మండలం వనంపల్లికి చెందిన పల్లవి ప్రసవం కోసం కొందుర్గు పీహెచ్‌సీకి వచ్చారు.
అప్పటికీ ఆసుపత్రిలో వైద్యులు లేరు. కేవలం స్టాఫ్‌నర్సే ఉన్నారు. వారికి ప్రాథమిక చికిత్స చేసి ఆమె ఉదయం 7.30 గంటలకు డ్యూటీ నుంచి వెళ్లిపోయింది. పీహెచ్‌సీలో ఎవరూ లేకపోవడంతో ప్రసవం కాక మాతృమూర్తులు పురిటినొప్పులతో తల్లడిల్లారు. వారి రోదనను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఈ సమయంలో పర్వతాపూర్ గ్రామానికి చెందిన లావణ్యకు పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. ఆమె ప్రసవించి మగ శిశువుకు జన్మనిచ్చింది.
తనకు సహాయంగా వెంట వచ్చిన గ్రామస్తురాలు లావణ్యకు సహకరించింది. ఇక వనంపల్లికి చెందిన పల్లవికి భరించలేని నొప్పులు రావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ముష్టిపల్లితండాకు చెందిన లలిత ప్రస్తుతం కొందుర్గు పీహెచ్‌సీలోనే చికిత్స పొందుతోంది. ఇంకా ప్రసవం కాలేదు.
విచారణ జరపాలని ఆదేశించిన కలెక్టర్..
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ రఘనందన్‌రావు దృష్టికి ‘సాక్షి’తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. దీనిపై తక్షణం పూర్తి విచారణ జరిపి తనకు నివేదిక పంపించాలని షాద్‌నగర్ ఆర్డీవో కృష్ణను ఆదేశించారు. దీంతో కొందుర్గు తహసీల్దార్ ప్రమీలారాణి పీహెచ్‌సీని సందర్శించి వివరాలు సేకరించి నివేదిక పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment