సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో.. కార్పొరేట్ స్థాయిలో రైతుల కోసం ఆస్పత్రి త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఆస్పత్రి భవన నిర్మాణాలు పూర్తి కాగా, నవంబర్ మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. పూర్తి మల్టీ స్పెషాలిటీ వసతులతో కో ఆపరేషన్ స్టార్(సీ స్టార్) పేరుతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు అధ్యక్షతన 2013లో ఏర్పడిన రైతు సంక్షేమ నిధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆస్పత్రి రైతులకు వైద్య సేవలను అందించనుంది. ఈ తరహా ఆస్పత్రి సహకార రంగంలో దేశంలోనూ ఇంత వరకు లేదని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌లో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తులతో ఆస్పత్రిని నిర్మించారు. పూర్వపు ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో ఉన్న 1.60లక్షల మంది సభ్యులు స్వచ్ఛంద వాటా ధనం రూ.5 కోట్ల నిధులతో ఆస్పత్రి నిర్మితమైంది. రైతులపై ఆర్థిక భారం పడకుండా అన్ని వైద్య సేవలు పారదర్శకంగా.. లాభాపేక్ష లేకుండా అందించాలన్న సంకల్పంతో ఆస్పత్రిలో 100 పడకలను ఏర్పాటు చేశారు.
ఆధునిక వసతులు
ఆస్పత్రిలో నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు. ఈ థియేటర్ల వల్ల పేషెంట్లకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, 20 పడకలతో క్యాజువాలిటీ, గైనిక్ వార్డు, ఎన్‌ఐసీ(అత్యవసర చికిత్స విభాగం), 14 అత్యాధునిక ఏసీ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎముకలు, కీళ్ల విభాగం, గైనకాలజీ విభాగం, పెడియాట్రిక్, చర్మ వ్యాధులకు సంబంధించి డెర్మటాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు కంటి సేవలను అందించేందుకు నగరంలోని గౌతమి నేత్రాలయతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. రైతు ఆస్పత్రిలో వైద్య సేవలు.. ఆపరేషన్లు అయి డిశ్చార్జి అయిన తర్వాత ఇంటి వద్దనే ఉండి ఇంజక్షన్ వంటి వైద్య సేవలు పొందేందుకు ప్రతి ప్రాథమిక సహకార సంఘంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వైద్య సేవలపై ప్రాథమిక అవగాహన ఉన్న సిబ్బంది ఉంటారు. రోగులకు డ్రెస్సింగ్ చేయడం, ఇంజక్షన్ చేయడం, మందుల మోతాదులను తెలియజేయటం వంటివే కాకుండా బీపీ, షుగర్ వంటివి పెరిగినట్లుగా అనుమానం వస్తే జిల్లా కేంద్రంలోని రైతు ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లోనే సంప్రదించి తగు సూచనలు చేస్తారు.
రైతు సేవలో ట్రస్ట్
రైతు సంక్షేమ నిధి ట్రస్ట్ సహకార సంఘాల్లో సభ్యులైన రైతులకు ఇప్పటికే పలు సేవలను అందిస్తోంది. రైతు కుటుంబంలో ఎవరు మరణించినా రూ.10 వేలను దహన సంస్కారాల నిమిత్తం అందిస్తోంది. ఇప్పటి వరకు 400 కుటుంబాలకు ఈ మేరకు సహాయం అందించింది. ఇక ట్రస్ట్‌కు సహకార సంఘ సభ్యులైన రైతులు అందించిన రూ.300 స్వచ్ఛంద విరాళాన్ని ఆస్పత్రి నిర్మాణానికి వియోగించడంతో పాటు అందులో కొంత సొమ్మును రైతుల పేరుతో ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించారు. సహకార సంఘ సభ్యుడు అనుకోని విధంగా మరణిస్తే ఎల్‌ఐసీ ద్వారా రూ.50 వేలు చెల్లిస్తారు.
మొబైల్ ఆస్పత్రి సైతం..
జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిని ఏర్పాటు చేయటంతో పాటు అత్యవసర వైద్య సేవలను రైతుల ముంగిటకే చేర్చాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో మొబైల్ ఆస్పత్రిని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సుమారు రూ.60 లక్షల వ్యయంతో తమిళనాడులోని కోయంబత్తూరు లో ఈ మొబైల్ ఆస్పత్రి వాహనం సిద్ధమవు తోంది. మొబైల్ ఆస్పత్రిలో నలుగురు వైద్యులతోపాటు ల్యాబ్, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి సేవలు ఉంటాయి. షుగర్, యూరిన్, బ్లడ్‌టెస్ట్‌లను అదే వాహనంలో నిర్వహించి రిపోర్టులు అందించటంతోపాటు చికిత్స చేయనున్నారు. అలాగే, రెండు అంబులెన్స్‌లనూ సిద్ధం చేశారు.
రైతు ఆరోగ్యం కోసమే ఆస్పత్రి..
ఆరుగాలం కష్టపడే రైతుకు లభించేది అరకొర సంపాదనే. ఈ తరుణంలో రైతుకు, రైతు కుటుంబానికి ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే ఆర్థికంగా తల్లడిల్లుతున్నాడు. చిన్న, సన్నకారు రైతుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్న సంకల్పంతోనే ఈ రైతు ఆస్పత్రికి శ్రీకారం చుట్టాం. దేశంలోనే సహకార రంగంలో ఎవరూ చేయని సాహసాన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ట్రస్ట్ ఏర్పాటు చేయడం ద్వారా సాధ్యమైంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఆస్పత్రి కార్పొరేట్ స్థాయి సేవలను అందించనున్నాం. పల్లె లోగిళ్లలోకి మొబైల్ ఆస్పత్రి సేవలను అత్యాధునిక సదుపాయాలతో తీసుకెళ్లనున్నాం.
– మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ చైర్మన్
రైతులకు గుర్తింపు కార్డులు..
సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆస్పత్రిలో సేవలు పొందే విధంగా.. రైతు కుటుంబ సభ్యులకూ ఈ ఆస్పత్రి సేవలు అందేలా, ప్రతి సభ్యునికి ప్రత్యేక గుర్తింపు కార్డును జారీ చేయనున్నారు. ఈ కార్డు ఉన్న రైతులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవల్లో రాయితీ పొందే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment