33 ఏళ్ల సర్వీసు. 10 వేల డెలివరీలు. విలుప్పురం ప్రభుత్వాస్పత్రి నుంచి గత నెలలో రిటైర్ అయిన నర్సు ఖతీజాబీని తమిళనాడు ప్రభుత్వం సత్కరించి మరీ వీడ్కోలు పలికింది.కారణం ఆమె మొత్తం సర్వీసులో ఒక్క శిశువు కూడా కాన్పు సమయంలో మృతి చెందలేదు. ప్రాణం పోసే పని ఎంతటి బాధ్యతాయుతమైనదో ఖతీజాను చూసి తెలుసుకోవాలంటారు సాటి నర్సులు. ఇలాంటి నర్సులే ప్రతిచోటా కావాలి.
‘ఆ రోజుల్లో ప్రయివేటు ఆస్పత్రులు చాలా తక్కువ. ఎంతటి వాళ్లయినా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి రావాల్సిందే. క్షణం తీరిక ఉండేది కాదు’ అని గుర్తు చేసుకుంది 60 ఏళ్ల ఖతీజాబీ. ఆమె గత నెలలోనే విల్లుపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పదవీ విరమణ పొందింది. తమిళనాడు ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణియన్ ప్రత్యేక పురస్కారం అందించి మరీ ఆమెను సత్కరించాడు. ‘అందుకు కారణం నా మొత్తం సర్వీసులో ఒక్క పసికందు కూడా కాన్పు సమయంలో ప్రాణం పోగొట్టుకోకపోవడమే’ అంటుందామె సంతృప్తిగా.
► తల్లి కూడా నర్సే
ఖతీజాబీ ఏదో వేరే పని దొరక్క నర్సు కాలేదు. ఆ వృత్తి పట్ల ప్రేమతోనే అయ్యింది. ‘మా అమ్మ జులేఖా కూడా నర్సుగా పని చేసేది. కాని ఆమె కాలంలో కాన్పు సమయాలు చాలా ఘోరంగా ఉండేవి. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడతారనేది చెప్పలేము. నేను ఆమెను చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు సిరంజీలతో ఆడుకున్నాను. అమ్మ వెంట హాస్పిటల్‌కు వెళుతూ హాస్పిటల్ వాసనకు అలవాటు పడ్డాను. 1990లో నేను కూడా నర్సుగా ఉద్యోగం ప్రారంభించాను. అయితే అప్పటికే నాకు పెళ్లయ్యి ఏడు నెలల గర్భిణిగా ఉన్నాను. అలా ఉంటూనే కాన్పులు చేయడం ప్రారంభించాను. నా కాన్పు అయ్యాక కేవలం రెండు నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ డ్యూటీకి హాజరయ్యాను’ అంది ఖతీజా.
► స్త్రీల వేదన
1990లలో మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో 556 మంది శిశువులు మరణించేవారు. నవజాత శిశువుల్లో ప్రతి 1000 మందికి 88 మంది మరణించేవారు. ‘సిజేరియన్ ఆపరేషన్లు చాలామటుకు స్త్రీలను, శిశువులను కాపాడాయి. నేను పని చేసే ఆస్పత్రిలో కేవలం ఒక డాక్టరు, ఇద్దరు నర్సులు ఉండేవాళ్లం. సిజేరియన్ చేసే సామాగ్రి మా దగ్గర ఉండేది కాదు. అందుకే కాన్పు కాంప్లికేట్ అవుతుందని డౌట్ రాగానే జిల్లా (కడలూర్) ఆస్పత్రికి పంపేసేదాన్ని. ఆ తర్వాత కూడా సిజేరియన్‌కు స్త్రీలు భయపడితే ధైర్యం చెప్పేదాన్ని. కానీ ఇవాళ మామూలు నొప్పులు వద్దని స్త్రీలు సిజేరియనే కోరుకుంటున్నారు’ అని తెలిపింది ఖతీజా. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు పెంచడం, స్త్రీల అక్షరాస్యత కోసం శ్రద్ధ పెట్టడం తదితర కారణాల వల్ల ప్రసూతి మరణాలు తగ్గుముఖం పట్టాయని ఖతీజా అంటోంది. ‘ఇవాళ మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో కేవలం 88 మంది పిల్లలే మరణిస్తున్నారు. నవజాత శిశువుల్లో వెయ్యికి 27 మంది మరణిస్తున్నారు’ అందామె.
► ఎంతో సంతృప్తి
‘2008 మార్చి 8 నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు డ్యూటీకి రావడంతోటే ఇద్దరు స్త్రీలు నొప్పులతో ఉన్నారు. వారి కాన్పుకు సాయం చేశాను. రోజులో ఇద్దరు సాధారణమే. కాని ఆ తర్వాత ఆరు మంది వచ్చారు. వారంతా కూడా ఆ రోజే కాన్పు జరిగి పిల్లల్ని కన్నారు. బాగా అలసటగా అనిపించింది. కాని సాయంత్రం డ్యూటీ దిగి వెళుతుంటే ఎనిమిది మంది చంటి పిల్లలు తల్లుల పక్కన పడుకుని కేరుకేరు మంటుంటే ఏడుస్తుంటే చాలా సంతోషం కలిగింది. కాన్పు సమయంలో స్త్రీలు ఎంతో ఆందోళనగా ఉంటారు. వారికి ముందుగా ధైర్యం చెప్పడంపై నేను దృష్టి పెట్టేదాన్ని. బిడ్డను కనే సమయంలో వారు ఎంత బాధ అనుభవించినా బిడ్డ పుట్టి కేర్‌మన్నాక తప్పనిసరిగా నవ్వు ముఖంతో బిడ్డవైపు చూసేవారు. వారి ఆ నవ్వు నాకు ఎంతో సంతృప్తినిచ్చేది. రిటైరయ్యానన్న మాటేగాని నా మనసు మాత్రం అలాంటి తల్లుల సేవలోనే ఉండమని చెబుతోంది’ అని ముగించింది ఖతీజా.
మారిన దృష్టి
‘నేను కాన్పులు చేసిన కొత్తల్లో రెండో సంతానంగా, మూడో సంతానంగా కూడా ఆడపిల్లే పుడితే ఆ తల్లులు అంతులేనంతగా ఏడ్చేవారు. అసలు తండ్రులు చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. ఇవాళ ఆ ధోరణిలో మార్పు వచ్చింది. అమ్మాయిలు పుట్టినా అబ్బాయిలు పుట్టినా కేవలం ఇద్దరు చాలని ఎక్కువమంది అనుకుంటున్నారు. నా మొత్తం సర్వీసులో 50 మంది కవలలకు పురుడు పోశాను. ఒక కాన్పులో ట్రిప్లెట్ పుట్టారు’ అందామె.
Comments
Please login to add a commentAdd a comment