Tamil Nadu govt
-
అమృత హస్తాలు
33 ఏళ్ల సర్వీసు. 10 వేల డెలివరీలు. విలుప్పురం ప్రభుత్వాస్పత్రి నుంచి గత నెలలో రిటైర్ అయిన నర్సు ఖతీజాబీని తమిళనాడు ప్రభుత్వం సత్కరించి మరీ వీడ్కోలు పలికింది.కారణం ఆమె మొత్తం సర్వీసులో ఒక్క శిశువు కూడా కాన్పు సమయంలో మృతి చెందలేదు. ప్రాణం పోసే పని ఎంతటి బాధ్యతాయుతమైనదో ఖతీజాను చూసి తెలుసుకోవాలంటారు సాటి నర్సులు. ఇలాంటి నర్సులే ప్రతిచోటా కావాలి. ‘ఆ రోజుల్లో ప్రయివేటు ఆస్పత్రులు చాలా తక్కువ. ఎంతటి వాళ్లయినా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి రావాల్సిందే. క్షణం తీరిక ఉండేది కాదు’ అని గుర్తు చేసుకుంది 60 ఏళ్ల ఖతీజాబీ. ఆమె గత నెలలోనే విల్లుపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పదవీ విరమణ పొందింది. తమిళనాడు ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణియన్ ప్రత్యేక పురస్కారం అందించి మరీ ఆమెను సత్కరించాడు. ‘అందుకు కారణం నా మొత్తం సర్వీసులో ఒక్క పసికందు కూడా కాన్పు సమయంలో ప్రాణం పోగొట్టుకోకపోవడమే’ అంటుందామె సంతృప్తిగా. ► తల్లి కూడా నర్సే ఖతీజాబీ ఏదో వేరే పని దొరక్క నర్సు కాలేదు. ఆ వృత్తి పట్ల ప్రేమతోనే అయ్యింది. ‘మా అమ్మ జులేఖా కూడా నర్సుగా పని చేసేది. కాని ఆమె కాలంలో కాన్పు సమయాలు చాలా ఘోరంగా ఉండేవి. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడతారనేది చెప్పలేము. నేను ఆమెను చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు సిరంజీలతో ఆడుకున్నాను. అమ్మ వెంట హాస్పిటల్‌కు వెళుతూ హాస్పిటల్ వాసనకు అలవాటు పడ్డాను. 1990లో నేను కూడా నర్సుగా ఉద్యోగం ప్రారంభించాను. అయితే అప్పటికే నాకు పెళ్లయ్యి ఏడు నెలల గర్భిణిగా ఉన్నాను. అలా ఉంటూనే కాన్పులు చేయడం ప్రారంభించాను. నా కాన్పు అయ్యాక కేవలం రెండు నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ డ్యూటీకి హాజరయ్యాను’ అంది ఖతీజా. ► స్త్రీల వేదన 1990లలో మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో 556 మంది శిశువులు మరణించేవారు. నవజాత శిశువుల్లో ప్రతి 1000 మందికి 88 మంది మరణించేవారు. ‘సిజేరియన్ ఆపరేషన్లు చాలామటుకు స్త్రీలను, శిశువులను కాపాడాయి. నేను పని చేసే ఆస్పత్రిలో కేవలం ఒక డాక్టరు, ఇద్దరు నర్సులు ఉండేవాళ్లం. సిజేరియన్ చేసే సామాగ్రి మా దగ్గర ఉండేది కాదు. అందుకే కాన్పు కాంప్లికేట్ అవుతుందని డౌట్ రాగానే జిల్లా (కడలూర్) ఆస్పత్రికి పంపేసేదాన్ని. ఆ తర్వాత కూడా సిజేరియన్‌కు స్త్రీలు భయపడితే ధైర్యం చెప్పేదాన్ని. కానీ ఇవాళ మామూలు నొప్పులు వద్దని స్త్రీలు సిజేరియనే కోరుకుంటున్నారు’ అని తెలిపింది ఖతీజా. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు పెంచడం, స్త్రీల అక్షరాస్యత కోసం శ్రద్ధ పెట్టడం తదితర కారణాల వల్ల ప్రసూతి మరణాలు తగ్గుముఖం పట్టాయని ఖతీజా అంటోంది. ‘ఇవాళ మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో కేవలం 88 మంది పిల్లలే మరణిస్తున్నారు. నవజాత శిశువుల్లో వెయ్యికి 27 మంది మరణిస్తున్నారు’ అందామె. ► ఎంతో సంతృప్తి ‘2008 మార్చి 8 నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు డ్యూటీకి రావడంతోటే ఇద్దరు స్త్రీలు నొప్పులతో ఉన్నారు. వారి కాన్పుకు సాయం చేశాను. రోజులో ఇద్దరు సాధారణమే. కాని ఆ తర్వాత ఆరు మంది వచ్చారు. వారంతా కూడా ఆ రోజే కాన్పు జరిగి పిల్లల్ని కన్నారు. బాగా అలసటగా అనిపించింది. కాని సాయంత్రం డ్యూటీ దిగి వెళుతుంటే ఎనిమిది మంది చంటి పిల్లలు తల్లుల పక్కన పడుకుని కేరుకేరు మంటుంటే ఏడుస్తుంటే చాలా సంతోషం కలిగింది. కాన్పు సమయంలో స్త్రీలు ఎంతో ఆందోళనగా ఉంటారు. వారికి ముందుగా ధైర్యం చెప్పడంపై నేను దృష్టి పెట్టేదాన్ని. బిడ్డను కనే సమయంలో వారు ఎంత బాధ అనుభవించినా బిడ్డ పుట్టి కేర్మన్నాక తప్పనిసరిగా నవ్వు ముఖంతో బిడ్డవైపు చూసేవారు. వారి ఆ నవ్వు నాకు ఎంతో సంతృప్తినిచ్చేది. రిటైరయ్యానన్న మాటేగాని నా మనసు మాత్రం అలాంటి తల్లుల సేవలోనే ఉండమని చెబుతోంది’ అని ముగించింది ఖతీజా. మారిన దృష్టి ‘నేను కాన్పులు చేసిన కొత్తల్లో రెండో సంతానంగా, మూడో సంతానంగా కూడా ఆడపిల్లే పుడితే ఆ తల్లులు అంతులేనంతగా ఏడ్చేవారు. అసలు తండ్రులు చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. ఇవాళ ఆ ధోరణిలో మార్పు వచ్చింది. అమ్మాయిలు పుట్టినా అబ్బాయిలు పుట్టినా కేవలం ఇద్దరు చాలని ఎక్కువమంది అనుకుంటున్నారు. నా మొత్తం సర్వీసులో 50 మంది కవలలకు పురుడు పోశాను. ఒక కాన్పులో ట్రిప్లెట్ పుట్టారు’ అందామె. -
వలస జీవులపై వికృత క్రీడ
అసత్యాల కన్నా అర్ధసత్యాలు ఎక్కువ ప్రమాదం. ఎక్కడో జరిగినదాన్ని మరెక్కడో జరిగినట్టు చూపెట్టి, బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టే ఫేక్ వీడియోల హవా పెరిగాక ఈ ప్రమాదం ఇంకెంతో పెరిగింది. ఉత్తరాది వలస కార్మికులపై తమిళనాట దాడులంటూ సోషల్ మీడియాలో తెగ తిరిగిన ఘటన, దానిపై బిహార్ సహా దేశవ్యాప్తంగా రేగిన రచ్చ అందుకు తాజా నిదర్శనం. తమిళనాడు ప్రభుత్వం, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, వేరెక్కడో జరిగిన ఘటనల దృశ్యాల్ని ఇప్పుడు ఇక్కడ జరిగినట్టు వీడియోల్లో చూపారని నిర్ధారించాల్సి వచ్చింది. బిహార్ సీఎం తొందరపాటుతో హడావిడిగా తమిళనాడుకొచ్చిన బిహార్ ప్రభుత్వాధికారులూ నిజం తెలుసుకొని, సంతృప్తి వ్యక్తం చేయాల్సి వచ్చింది. గతంలో మహారాష్ట్ర, ఢిల్లీల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. మొత్తం మీద ఈ వ్యవహారం ఫేక్ న్యూస్‌ల ముప్పుతో పాటు వలసదారులనే గుర్తింపు తీరని కళంకంగా మారి, హింసా ద్వేషాలను ప్రేరేపిస్తున్న వికృత ధోరణిని చర్చకు పెట్టింది. స్వరాష్ట్రం, వలసపోయిన రాష్ట్రం – రెండింటి ఆర్థికాభివృద్ధిలో అంతర్ రాష్ట్ర వలసలది కీలక పాత్ర. అయితే, దేశంలో వలసలపై ప్రభుత్వ గణాంకాలు సమగ్రంగా లేవు. పాత లెక్కలే ఇప్పటికీ ఆధారం. 2011 జనగణన ప్రకారం మన దేశంలోనే అంతర్గత వలసదార్ల సంఖ్య 45.36 కోట్లు. అంటే దేశ జనాభాలో 37 శాతం మంది. ఇక, 2016 – 17 నాటి ఆర్థిక సర్వే ప్రకారం స్వస్థలం వదిలిపోతున్న మొత్తం వలస శ్రామికుల్లో దాదాపు సగం మంది సాపేక్షంగా తక్కువ అభివృద్ధి చెందిన ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల జనాభాయే. ఈ అభాగ్య సోదరులను గోవా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలు అధికంగా ఆదరిస్తున్నాయి. వెరసి, జీవనోపాధికై వస్తున్న ఉత్తరాది వారిని ఢిల్లీ తర్వాత ఎక్కువగా అక్కున చేర్చుకుంటున్నది దక్షిణ భారతావనే అనుకోవచ్చు. పారిశ్రామిక కేంద్రంగా పేరున్న తమిళనాట 10 లక్షల మందికి పైగా వలస కార్మికులున్నారు. ఇది ఆ రాష్ట్ర కార్మిక విభాగం పక్షాన జరిపిన 2016 సర్వే లెక్క. అధికశాతం మంది బడుగు వేతన జీవులైన నైపుణ్యం లేని శ్రామికులు. ఎక్కువగా బెంగాల్, అస్సామ్, ఒడిశా, బిహార్, జార్ఖండ్‌ల నుంచి వచ్చినవారే. తిరుప్పూర్, ఈరోడ్ లాంటి వస్త్ర కేంద్రాల వృద్ధికి, రాష్ట్ర పురోగతికి వీరు వెన్నెముక. ఈ పరిస్థితుల్లో వలస కార్మికులపై తమిళనాట దాడులంటూ సంబంధం లేని పాత వీడియోలు సోషల్ మీడియాలో తిరగడం తాజా సమస్యకు కారణం. హిందీవారికి వ్యతిరేకంగా తమిళనాట ఏదో జరిగిపోతోందని నమ్మించడానికి ఒక వర్గం వీడియోలను ఆన్లైన్లో తెగతిప్పింది. దాంతో తమిళనాడు ఆ ఘటనలు వేరెక్కడివో, ఎవరెవరి మధ్య జరిగిన ఘటనల తాలూకువో వివరించాల్సి వచ్చింది. నిజం వెల్లడయ్యేలోగా కథ బిహార్ అసెంబ్లీకి ఎక్కింది. నిజం కాళ్ళకు చెప్పులు తొడిగే లోపల అబద్ధం ఊరంతా చుట్టివస్తుందన్నట్టుగా అసత్యప్రచారం దేశం చుట్టింది. అయితే, బీజేపీయేతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఈ తరహా వైరల్ ఫేక్ న్యూస్ వల్ల ఎవరికి, ఏ ప్రయోజనం ఉందనే అనుమానాలూ పైకి వచ్చాయి. సాక్షాత్తూ తమిళనాడు సీఎం సైతం ఘర్షణలు రేపి, తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రకోణం గురించి ప్రస్తావించడం గమనార్హం. వాస్తవానికి ఏ రాష్ట్రం, ఏ భాషకు చెందినవారినైనా స్థానికులుగా కలుపుకొనే ఆత్మీయ, ఆతిథేయ సంస్కృతి దక్షిణాదిన, అందులోనూ తమిళనాట తరతరాలుగా ఉన్నదే. శాంతిభద్రతల పరిరక్షణలో అక్కడి పోలీసు యంత్రాంగం పేరున్నదే. అక్కడే ఇలా జరిగిందంటే – ఇతర రాష్ట్రాలకిది మేలు కొలుపు. కొందరి తుంటరితనం, స్వార్థ రాజకీయాలు సోదర భారతీయుల మధ్య విభజన గీతలు గీస్తే అది పెను ప్రమాదం. ఐకమత్యం, సౌభ్రాతృత్వాలకు గొడ్డలిపెట్టయ్యే ఏ వికృత ధోరణినీ ఎవరూ సహించకూడదు. సహకరించకూడదు. హోలీకని రద్దీ రైళ్ళలో స్వరాష్ట్రాలకు తరలివెళ్ళిన వలస కార్మికుల్లో ఎందరు తిరిగొస్తారనేది ఇప్పుడు తమిళనాట హోటళ్ళ నుంచి పరిశ్రమల వరకు అన్నిటి ఆందోళన. ఏ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో నైనా అంతర్ రాష్ట్ర వలస కార్మికుల వాటా అవిస్మరణీయం. వారికి సౌకర్యాలు, సురక్షిత వాతావ రణం కల్పించడం కీలకమంటున్నది అందుకే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాలకు కానీ పార్లమెంట్ ‘అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం–1979’ చేయలేదు. అయినా ఇప్పటికీ వారి పరిస్థితి పూర్తిగా మారలేదు. వారి స్థితిగతులపై విస్తృత సర్వేలు జరపాలి. కేరళ నమూనా సర్వేలు అందుకు ఆదర్శం. సర్వేల సమాచారంతో సొంత, వలస రాష్ట్రాల్లో మెరుగైన విధానాలు చేపట్టవచ్చు. వలసదార్ల వల్ల స్థానికులకు ఉద్యోగాలు పోతున్నాయనీ, మురికివాడలు, నేరాలు పెరుగుతున్నాయనీ రాజకీయ స్వార్థంతో పేలడం తేలిక. ఇలా ‘బయటివార’నే ముద్ర వేసి స్థానికుల్ని రెచ్చగొడితే, తాత్కాలిక లబ్ధి ఉంటుందేమో కానీ, శాశ్వత నష్టం తథ్యం. భారత పౌరులెవరైనా దేశ భూభాగంలో ఎక్కడికైనా ఉపాధికై స్వేచ్ఛగా వెళ్ళవచ్చు, స్థిరపడవచ్చనేది మన రాజ్యాంగం (ఆర్టికల్ 19) కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ, కరోనా వేళ ‘ఇన్ఫెక్షన్ వాహకులు’ అంటూ కన్న ప్రాంతం, ఉన్న ఊరు వలస కార్మికుల్ని ‘అవాంఛనీయులు’గా చూశారు. వారిపై దాడులూ అనేకసార్లు రికార్డులకెక్కవు. ఈ పరిస్థితుల్లో వలసదార్లు సైతం స్థానికులతో ఏకమయ్యేలా తగిన చర్యలు చేపట్టడం ప్రభుత్వ విధి. అలాగే, సామాజిక న్యాయం, మానవ హక్కులను పరిగణనలోకి తీసుకొని కీలకమైన ఈ శ్రామిక పెట్టుబడిని కాపాడుకొనేలా సమగ్ర, వ్యవస్థీకృత విధానం అవసరం. అప్పుడే తమిళనాట తలెత్తిన తాజా ఫేక్ న్యూస్ రచ్చ లాంటివి నిర్వీర్యమవుతాయి. -
అన్నీ రహస్యాలే.. జయ లలిత కేసులో అసలేం జరిగింది?
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం సహజ మరణం కాదని.. ఆమె మరణం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని జయ అభిమానులు ఆరేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. వివిధ కోణాల్లో ఈ డెత్ మిస్టరీ కేసును పరిశోధించిన జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో వ్యవహారం మొత్తం కొత్త మలుపు తిరిగింది. శశికళ పాత్రపై దర్యాప్తు జరపాల్సిందేనన్న కమిటీ సిఫారసు కొత్త మంటలు రాజేసింది. చదవండి: తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ 2016 సెప్టెంబరు 22న నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపస్మారక స్థితిలో చెన్నయ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, డీ హైడ్రేషన్ లతో ఆసుపత్రిలో చేరారన్నారు కానీ ఎవరూ ఏం చెప్పలేదు. అన్నీ రహస్యంగానే జరిగిపోయాయి. అప్పుడప్పుడు ఒకటో, రెండో విషయాలు తెలిసినా.. అంతా నిగూఢమే. సాధారణ డైట్ తీసుకుంటున్నారని, జయలలిత పరిస్థితి బానే ఉందని రెండు మూడు రోజుల పాటు చెప్పుకొచ్చినా.. తర్వాత విదేశాలకు చికిత్స కోసం తీసుకెళ్తారంటూ ప్రచారం జరిగింది. సెప్టెంబరు 29న ఈ పుకార్లను ఖండించిన అపోలో వైద్యులు జయలలిత కోలుకుంటున్నారని.. వైద్యానికి బాగా స్పందిస్తున్నారని చెప్పారు. రోజుకో మలుపు నవంబరు 13న అంటే ఆసుపత్రిలో చేరిన 50 రోజుల తర్వాత జయలలిత సంతకంతో ఉన్న ఒక లేఖను విడుదల చేశారు. అందులో ఆమె తాను పునర్జన్మ పొందినట్లు పేర్కొనడమే కాదు త్వరలోనే ముఖ్యమంత్రి విధుల్లో నిమగ్నమవుతానని వెల్లడించినట్టు పేర్కొన్నారు. రెండున్నర నెలల పాటు ఆసుపత్రి వర్గాలతో పాటు అన్నాడిఎంకే నేతలు జయలలిత ఆరోగ్యం బానే ఉందని చెబుతూ వచ్చారు. పక్కా స్క్రిప్టింగ్ ప్రజలను ఊరడించడానికన్నట్లు రోజుకో సమాచారాన్ని కొద్దికొద్దిగా విడుదల చేశారు. అమ్మ కోలుకుందని.. అమ్మ పేపర్ చదివిందని.. అమ్మ టిఫిన్ తిందని.. అమ్మ టీవీ చూసిందని.. వెల్లడించారు. నవంబరు 19న జయలలిత వెంటిలేటర్ అవసరం లేకుండానే వైద్యానికి చక్కగా స్పందిస్తున్నారని ప్రకటించారు. 2016 డిసెంబరు 4న ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని త్వరలోనే ఆసుపత్రి నుండి ఇంటికి డిశ్చార్జ్ అవుతారని అన్నాడిఎంకే పార్టీ ప్రకటించింది. చిత్రంగా డిసెంబరు 5న రాత్రి 11గంటల 30 నిముషాలకు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. పుకార్లు షికార్లు ఇన్ని మలుపులు తిరగడంతో తమిళనాట రక రకాల పుకార్లు షికార్లు చేశాయి. జయలలితపై విష ప్రయోగం చేసిందని కొందరు ప్రచారం చేశారు. రోజుల తరబడి స్లో పాయిజన్ ఇచ్చి జయలలితను మట్టుబెట్టారని దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని పార్టీలో జయ విధేయులు ఆరోపణలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. అపోలో వర్గాలు.. ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం అనుమానాలు అలానే ఉండిపోయాయి. ఇంట్లో గొడవ జరిగిందా? జయలలిత ను ఆసుపత్రిలో చేర్చేసరికే ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇంట్లో ఉండగానే జయలలితను అనారోగ్యం పాలు చేసేలా కుట్రలు జరిగాయని పుకార్లు పుట్టాయి. జయలలితకు స్లో పాయిజన్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం శశికళపైనే ఎక్కుపెట్టారు. చెలి నెచ్చెలి జయలలితకు శశికళ తో 30 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే జయలలితను అడ్డు పెట్టుకుని శశికళ కుటుంబం ప్రభుత్వంలో చొచ్చుకుపోయిందని ఆరోపణలు వచ్చాయి. ఓ దశలో జయలలితను ముఖ్యమంత్రి పీఠం నుండి తప్పించడానికి కుట్ర పన్నినట్లు నిఘా బృందాలు ఉప్పందించాయి. ఈ పరిస్థితుల్లో శశికళ కుటుంబాన్ని ఇంటి నుండి సాగనంపారు జయలలిత. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మన్నార్ గుడి మాఫియాకు అడ్డుకట్ట వేశారు. అయితే ఏం జరిగిందో కానీ కొంతకాలం తర్వాత శశికళకు మళ్లీ ఇంట్లో చోటిచ్చారు జయ. అదే జయలలిత కెరీర్ లో అతి పెద్ద తప్పిదమని శశికళను వ్యతిరేకించే వర్గాలు అంటాయి. నివేదికలో ఉన్నవేంటీ? ♦జయలలిత డిసెంబరు 4న మరణిస్తే డిసెంబరు 5న మరణించినట్లు ప్రకటించారని నివేదికలో పేర్కొన్నారు. ♦జయలలితకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటనేదానిపై క్లారిటీ లేదని నివేదికలో పేర్కొన్నారు. ♦వైద్యులు సిఫార్సు చేసిన కొన్ని సర్జరీలు ఎందుకు చేయలేదో అర్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ♦ఆమెకు సరైన వైద్యం అందలేదని కూడా అన్నారు. ♦జయలలిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది లగాయితు ఆమె మరణించే వరకు ఏం జరిగిందో అంతా మిస్టరీగానే ఉంది జయలలిత ఆసుపత్రిలో చేరడానికి ముందు పోయస్ గార్డెన్లో ఓ వ్యక్తితో వాగ్వివాదం జరిగిందని.. ఆ సమయంలో అవతలి వ్యక్తి తోసేయడంతో జయలలిత కిందపడిపోయారని మాజీ స్పీకర్ పాండ్యన్ ఆరోపించారు. శరీరంపై గాట్లేంటీ? జయలలితను ఆసుపత్రిలో చేర్చినపుడు ఆమె బుగ్గపై నాలుగు గాట్లు కనిపించాయి. ఆ గాట్లు ఏంటి? ఏమైనా గాయాలా? గాయాలైతే ఎవరు చేశారు? అన్న అనుమానాలు చక్కర్లు తిరిగాయి. అయితే వైద్యులు మాత్రం తీవ్ర అస్వస్థతకు లోనైనపుడు కొన్ని సందర్భాల్లో బుగ్గలపై అటువంటి గాట్లు ఉంటాయని అన్నారు. అంతలోనే రాజకీయమా? జయలలిత చికిత్స పొందుతున్న సమయంలోనే పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ వరుస భేటీలు నిర్వహించడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇపుడు తాజాగా జయమరణం కేసుపై నివేదిక బహిర్గతం కావడంతో శశికళ భవిష్యత్తు ఏ విధంగా మలుపులు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తమిళ నాట అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ప్రజలకైతే నిజాలు కావాలి. జయలలితను జీవితాంతం ఆదరించిన అభిమానులకు ఏం జరిగిందో తెలియాలి. తమ అభిమాన నాయకురాలి మరణ వార్త వెనుక కుట్ర ఉందంటేనే వారు కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటికైనా నిజాలు బయటకు వస్తేనే వారికి కొంతైనా తృప్తి ఉంటుంది. -
మెరీనాలో కరుణ అంత్యక్రియలకు నో
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలపై సందిగ్దం నెలకొంది. మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాది వెనుక భాగంలో కరుణానిధి అంత్యక్రియలు చేపట్టాలని కుటుంబ సభ్యులు భావించారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు చేపట్టడానికి అనుమతి నిరాకరించింది. గాంధీ మండపం రోడ్డులో అంత్యక్రియలకు ప్రభుత్వం అనుమతించింది. అక్కడ రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు తెలిపింది. దీనిపై డీఎంకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరుణానిధి అంత్యక్రియలను ఎట్టి పరిస్థితుల్లోనూ మెరీనా బీచ్‌లోనే చేపడతామని డీఎంకే ప్రకటించింది. ఇందుకోసం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపింది. మెరీనాలో అనుమతి దొరికే వరకు కరుణ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచాలని డీఎంకే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ కలిగిన డీఎంకే కార్యకర్తలు సంయమనంతో మహానేతకు నివాళులు అర్పించాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. -
ప్రసూతి సెలవులు ఇక 9 నెలలు
చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం 110 నిబంధనల మేరకు సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటనలు చేశారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను పొడిగిస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇది వరకు ఆరు నెలలుగా ఉన్న ఈ సెలవుల్ని తాజాగా తొమ్మిది నెలలకు పొడిగించారు. చెన్నై మహానగరంలో ఇప్పటికే రెండు వందల మినీ బస్సులు రోడ్లపై తిరుగుతుండగా, అదనంగా మరో వంద బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకోనున్నారు. రవాణా సంస్థలో విధినిర్వహణలో మరణించిన 1,600 మంది సిబ్బంది కుటుంబాలకు కారుణ్య నియామక ఉత్తర్వుల జారీకి నిర్ణయించారు. రూ. నాలుగు కోట్ల వ్యయంతో 50 అంబులెన్స్‌ల కొనుగోలు, రూ. ఐదు కోట్లతో పూందమల్లి, తిరువారూర్ ఆర్టీవో కార్యాలయాలకు కొత్త భవనాలను నిర్మించనున్నారు. కాంచీపురం, వేలాంకన్నిలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి ఉన్న ఈ రెండు ప్రాంతాలను రూ. 403 కోట్లను వెచ్చించి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. -
తమిళనాడు సర్కారుకు నోటీసులు
చెన్నై: అన్నదాత ఆత్మహత్యపై తమిళనాడు ప్రభుత్వం, ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్ హెచ్ ఆర్సీ) సోమవారం నోటీసులు జారీ చేసింది. పోలీసులు, ప్రైవేటు ఫైనాన్షియల్ కంపెనీ వేధింపులకు గురిచేయడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న కేసులో నోటీసులిచ్చింది. రెండు వారాల్లోగా విరవరణ ఇవ్వాలని ఆదేశించింది. అరియళూరు జిల్లాలో శుక్రవారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రుణం చెల్లించనందుకు ఫైనాన్స్ కంపెనీ అతడి ట్రాక్టర్ సీజ్ చేసింది. దీంతో మనస్తాపం చెందిన రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొద్దిరోజుల క్రితం తంజావూరు జిల్లాలోనూ ఇలాంటి చర్య ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రూ.1.3 లక్ష రుణం తీసుకున్న రైతు అప్పు చెల్లించకపోవడంతో అతడిని పోలీసులు చితకబాదారు. -
రాజకీయ చట్రంలో ‘రాజీవ్’ హంతకుల విడుదల
చెన్నై : రాజీవ్ హత్య కేసు నిందితుల వ్యవహారం రాజకీయ చట్రంలో కొట్టుమిట్టాడుతోంది. మరోమారు వీరి విడుదల తెర మీదకు రావడంతో చర్చ బయలు దేరింది. చిత్తశుద్ది లేక కేంద్రం కోర్టులోకి బంతిని రాష్ట్ర ప్రభుత్వం నెట్టిందని ప్రతి పక్షాలు విమర్శించే పనిలో పడ్డాయి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులు నళిని, మురుగన్, శాంతన్,పేరరివాలన్, జయశంకర్, రవిచంద్రన్, రాబర్ట్‌లకు ఉరి శిక్ష పడడం, తదుపరి యావజ్జీవంగా మారడం గురించి తెలిసిందే. 24 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వీరిని, ఇక నైనా విడుదల చేయాలంటూ తమిళాభిమాన సంఘాలు, ఈలం మద్ద తు రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే, పాలకులు చెవిన ఆ గళం పడలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నం అవుతుండడంతో రాజకీయ చట్రంలోకి మళ్లీ రాజీవ్ హత్యకేసు నింధితుల విడుదల వ్యవహారం చేరి ఉన్నది. ఇన్నాళ్లు మౌన ముద్ర అనుసరించిన పాలకులు తాజాగా, విడుదల నినాదాన్ని అందుకుని ఉండటం చర్చకు దారి తీసి ఉన్నది. రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదల వ్యవహారంలో కేంద్రం అభిప్రాయాన్ని కోరుతూ లేఖాస్త్రం సంధించి ఉండడం గమనార్హం. ఇది వరకు ఏ చిన్న విషయమైనా సరే సీఎం జయలలిత జోక్యం చేసుకుని కేంద్రానికి లేఖాస్త్రం సందించడం జరుగుతూ వచ్చింది. అయితే, ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్ గళాన్ని అందుకుని, కేంద్రానికి లేఖ పంపించి ఉండటంతో రాజకీయ చదరంగంలోకి మరో మారు విడుదల వ్యవహారాన్ని చేర్చి ఉన్నారన్న విమర్శలు బయలు దేరి ఉన్నది. ఇన్నాళ్లు మౌనం అనుసరించి, ఎన్నికల నోటిఫికేషన్ రోజుల వ్యవధిలో విడుదల కాబోతున్న సమయంలో ఈ నినాదాన్ని ప్రభుత్వం అందుకుని ఉండటం కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమేనన్న విమర్శలు, ఆరోపణలు బయలు దేరి ఉన్నాయి. ప్రభుత్వానికి చిత్త శుద్ది లేక పోగా, తామేదో చిత్తశుద్ధితో ఉన్నట్టు చాటుకునే యత్నంలో భాగంగానే తాజాగా విడుదల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చి ఉన్నారని మండి పడే వాళ్లే ఎక్కువ. ఈ విషయంగా ఎండీఎంకే నేత వైగో పేర్కొంటూ, ఇది ఎన్నికల నాటకంగా వ్యాఖ్యానించారు. విడుదల చేసి ఉంటే, ఎప్పడో చేసి ఉండాలని, ఇప్పుడే కపట నాటకంతో రక్తికట్టించేందుకు సీఎం జయలలిత సిద్ధం అయ్యారని మండి పడ్డారు. బీజేపీ నాయకురాలు వానతీ శ్రీనివాసన్ పేర్కొంటూ, చట్టపరం చిక్కుల్లో ఇరుక్కుని ఉన్న ఈ కేసును కేంద్రం నెత్తిన రుద్ది, లబ్ధిపొందే యత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుందని మండిపడ్డారు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే సీఎం జయలలిత, ఇప్పుడు కొత్త బాణిలో ప్రధాన కార్యదర్శి ద్వారా లేఖాస్త్రం పంపించి ఉండటం గమనించాల్సిన విషయంగా పేర్కొన్నారు. విడుదలలో చిత్త శుద్ది లేక, ఎన్నికల్లో లబ్ధికి ఈ కొత్త నాటకం ఎందుకో అని ప్రశ్నించారు. పీఎంకే నేత రాందాసు పేర్కొంటూ, రాజకీయ శాసనాల చట్టం 161 ఉపయోగించి వారిని విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నా, దాన్ని ప్రయోగించకుండా కొత్త నాటకం రచించి ఉన్న అన్నాడీఎంకేకు ప్రజలు గుణపాఠం నేర్పేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఇక, ఈ విడుదల వ్యవహారం లోక్ సభను సైతం తాకి ఉండడం గమనార్హం. అయితే, రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించడంతో, ఇక్కడున్న కాంగ్రెస్ వాదులు ఇరకాటంలో పడే పరిస్థితి. అదే సమయంలో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నందుకుగాను, విడుదల వ్యవహారం డీఎంకేను సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టినట్టు అయింది. ఇక, రాష్ట్ర ప్రభుత్వం తమ కోర్టులోకి విసిరిన బంతిని చాకచక్యంగా ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నట్టున్నారు. అందుకే కాబోలు ఆ లేఖ పరిశీలనలో ఉన్నట్టు ప్రకటించి కాలం నెట్టుకువచ్చే పనిలో పడ్డట్టున్నారన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరి ఉన్నది. ఇంతకీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయాలని, తనకు ఉన్న అధికారంతో వారిని విడుదల చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని తమిళాభిమాన సంఘాలు, ఈలం మద్దతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
తమిళ తంబీలకు అండగా ప్రభుత్వం
జల్లికట్టు అనుమతి చేజారకుండా చర్యలు కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం జోరుగా సన్నాహాలు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాక ఇప్పటికే జల్లికట్టు అనుమతితో ఫుల్ జోష్‌మీదున్న తమిళ తంబీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారి కలలు సాకారం చేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా జల్లికట్టు అనుమతి చేజారకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. జంతుసంక్షేమ సంఘాలు స్టే తెచ్చేందుకు వీలులేకుండా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్ర ప్రజలు మరింత ఆనందోత్సాహాల మధ్య ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చెన్నై : పోరాడి సాధించుకున్న జల్లికట్టు అనుమతి చేజారిపోకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జంతు సంక్షేమ సంఘాలు స్టే తెచ్చేందుకు వీలులేకుండా సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. పొంగల్ పండుగల్లో కోలాహలంగా సాగే జల్లికట్టు క్రీడపై ఏడాదిన్నర క్రితం స్టే మంజూరైంది. జల్టికట్టు క్రీడ ముసుగులో ఎద్దులతో నాటుసారా తాగిస్తారని, వెంటాడి వేటాడుతూ సాగే క్రీడతో వాటిని హింసిస్తారని పేర్కొంటూ జంతు సంక్షేమ సంఘాలు, మూగజీవుల సానుభూతి పరులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఫలితంగా నిషేధం అమల్లోకి వచ్చింది. తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన జల్లికట్టును జరుపుకోనిదే పొంగల్ పండుగల్లో సందడే ఉండదని భావిస్తారు. జల్లికట్టు నిబంధనలను సడలించి క్రీడా నిర్వహణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు, ప్రజలు ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అన్ని పార్టీలతోపాటు అధికార బీజేపీ నేతల నుంచి సైతం ఒత్తిళ్లు పెరగడంతో కేంద్రం దిగివచ్చింది. షరతులతో కూడిన అనుమతులను జారీచేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండగా జంతుప్రేమికులు మాత్రం మండిపడుతున్నారు. కేంద్ర అనుమతులపై స్టే తీసుకువస్తామనిప్రకటించారు. దీంతో ముందుగానే మేల్కొన్న రాష్ట్రప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో శనివారం కేవీయట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ ప్రకారం జల్లికట్టుపై ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తినా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు. జల్లికట్టుకు అమిత్‌షా: కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ మదురైలో జరిగే జల్లికట్టు క్రీడాపోటీలను తిలకించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా హాజరయ్యే అవకాశం ఉందని, ఎవరెన్ని పిటిషన్లు వేసినా జల్లికట్టు అనుమతులను అడ్డుకోలేరని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు. జల్లికట్టుకు అనుమతులకు కృషి చేసినందుకు అమిత్‌షాకు ఢిల్లీకి వెళ్లి కృతజ్ఞతలు చెప్పి ఆహ్వానించానని తెలిపారు. ఢిల్లీ నుంచి శనివారం చెన్నై చేరుకున్న పొన్కు విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఆయనను సత్కరించారు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జల్లికట్టును అడ్డుకునేందుకు కొన్ని అజ్ఞాతశక్తులు కుట్రపన్నుతున్నట్లు ఆయన ఆరోపించారు. జల్లికట్టు క్రీడల్లో ఎద్దులను హింసించడం, హతమార్చడం వంటి చర్యలకు తావులేదని, నిబంధనలకు అనుగుణంగా జల్లికట్టును జరుపుకుంటే అడ్డుకునే అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. నిషేధం నుంచి జల్లికట్టును శాశ్వతంగా తప్పించేందుకు చట్టపరంగా పోరాడుతామని తెలిపారు. ఈనెల 16,17 తేదీల్లో జరిగే జల్లికట్టు క్రీడలను తిలకించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అలాగే తాను, మరికొందరు కేంద్ర మంత్రులు జల్లికట్టును తిలకించనున్నట్లు చెప్పారు. జోరుగా సన్నాహాలు: ఈనెల 15వ తేదీ నుంచి మూడురోజులపాటు జరిగే జల్లికట్టు క్రీడల నిర్వహణపై జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. అనుమతి లభిస్తుందో లేదోనని అనుమానంతో ఉన్న జల్లికట్టు క్రీడాకారులు శనివారం రంగంలోకి దిగారు. ఎద్దులకు తర్ఫీదు నివ్వడం ప్రారంభించారు. అలాగే మైదానాలను చదును చేస్తున్నారు. ముఖ్యంగా మదురై జిల్లా అలంగానల్లూరు, పాలమేడు, అవనీయాపురం ప్రాంతాల్లో ప్రజలు, ఎద్దును అదుపుచేసే వీరులు గ్రామాల్లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుతున్నారు. జల్లికట్టు కోసమే ప్రత్యేకంగా దక్షిణ జిల్లాలో 500 ఎద్దులను పెంచుతున్నారు. వీటికి పరుగులు తీయడం, ఈతపై శిక్షణ నిస్తున్నారు. 15వ తేదీన అవనీపురం, 16వ తేదీన పాలమేడులో, 17వ తేదీన అలంగానల్లూరులో జల్లికట్టు క్రీడలు నిర్వహిస్తారు. జల్లికట్టు క్రీడా నిర్వహణ కమిటీ శుక్రవారం రాత్రి సమావేశమై ఏర్పాట్లపై చర్చించింది. -
ఇప్పుడు 'ట్రాఫిక్' వంతు
సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం దావా దాఖలు చేసింది. సోమవారం చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ ఈ దావా వేశారు. చెన్నై: సీఎం జయలలితకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా, కథనాలు రాసినా పరువు నష్టం దావా మోత మోగుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రాజకీయ నాయకులు, మీడియాల మీద ఈ దావాలు పెద్ద సంఖ్యలో కోర్టులలో దాఖలు అయ్యాయి. తాజాగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిపై కన్నెర్ర చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల్ని ఆదుకోవడంలో సీఎం జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు బయలు దేరిన సమయంలో ట్రాఫిక్ రామస్వామి వినూత్నంగా ఘాటుగానే స్పందించారు. వాట్సాప్ ద్వారా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. సీఎం జయలలితకు వ్యతిరేకంగా తీవ్రంగా, స్వచ్ఛంద సంస్థలపై అన్నాడీఎంకే వర్గాలు సాగించిన దాడులను ఖండిస్తూ ధూషణలకు దిగారు. చేతిలో ఏదో ఓ వస్తువును పట్టుకుని పదే పదే హెచ్చరించే విధంగా ఘాటుగానే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ వాట్సాప్ వీడియో ప్రతి మొబైల్లోనూ హల్ చల్ చేసిందని చెప్పవచ్చు. ఈ వీడియోను తీవ్రంగా పరిగణించిన రాష్ర్ట ప్రభుత్వం ట్రాఫిక్ రామస్వామిపై కేసు నమోదుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎంఎల్ జగన్ సెషన్స్ కోర్టులో దావా వేశారు. సీఎం జయలలితకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యల్ని సందించడమే కాకుండా, ఆమె పరువుకు భంగం కల్గించే విధంగా ట్రాఫిక్ రామస్వామి వ్యవహరించారని ఆ దావాలో వివరించారు. సెక్షన్ 500, 501 ప్రకారం ట్రాఫిక్ రామస్వామి వ్యవహరించిన తీరు క్రిమినల్ చర్యలతో సమానంగా పేర్కొన్నారు. ఈ దావాపై విచారణ త్వరలో సాగనున్నది. -
మహా పోరుకు రెడీ
జల్లికట్టు కోసం మహాపోరుకు సిద్ధమని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. జల్లికట్టు అనుమతికి డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని సాగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. సాక్షి, చెన్నై : తమిళుల సంప్రదాయ, సాహసక్రీడగా పేరెన్నికగన్న జల్లికట్టుకు ఇటీవల కాలంగా గడ్డు పరిస్థితులు నెలకొంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఎద్దులను హింసకు గురి చేయడమే కాకుండా, ఈ రాక్షసక్రీడతో ప్రాణ నష్టం కూడా పెరుగుతున్నదని జంతు ప్రేమికులు కోర్టుకు ఎక్కారు. కట్టు దిట్టమైన ఆంక్షల నడము సాగుతూ వచ్చిన ఈ జల్లికట్టుకు ఈ ఏడాది పూర్తిగా బ్రేక్ పడింది. కోర్టు నిషేధం విధించడంతో జల్లికట్టు లేని సంక్రాంతిని జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంగా కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ జల్లికట్టుకు అనుమతి తీసుకొస్తానంటూ ప్రగల్భాలు పలకడం మొదలెట్టారు. రానున్న సంక్రాంతి పర్వదినం జల్లికట్టుతో ఆరంభం అవుతుందన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఎద్దుల పెంపకం దారులు జల్లికట్టుకు సిద్ధమవుతున్నారు. అయితే, సంక్రాంతి పర్వదినానికి మరో నాలుగు వారాలు మాత్రమే ఉండడంతో అనుమతి దక్కేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ సమయంలో జల్లి కట్టు అనుమతి నినాదంతో ఉద్యమానికి డీఎంకే దళపతి స్టాలిన్ సిద్ధం అవుతోండడంతో క్రీడా కారులు, నిర్వాహకులు మద్దతు ఇస్తూ, ఏకం అయ్యేందుకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మహాపోరుకు రెడీ :తమిళుల వీరత్వానికి ప్రతీకగా ఉన్న జల్లికట్టుకు అడ్డంకులు సృష్టించింది ఈ అన్నాడీఎంకే ప్రభుత్వమేనని డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్న సమయంలో కట్టుదిట్టమైన ఆంక్షలు, నిబంధనల మేరకు జల్లికట్టు నిర్వహణకు అనుమతులు ఇస్తూ వచ్చామని గుర్తు చేశారు. అయితే, అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి రాగానే, జల్లికట్టుకు బ్రేక్ పడే విధంగా వ్యవహరించారని, చివరకు కోర్టు నిషేధం సైతం విధించిందని పేర్కొన్నారు. అయితే, ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఈ ఏడాది జల్లికట్టుకు దూరంగా సంక్రాంతిని జరుపుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అయితే, రానున్న సంక్రాంతి పర్వదినం రోజున జల్లికట్టుకు అనుమతి ఇచ్చే విధంగా, కోర్టు నిషేధానికి వ్యతిరేకంగా తదుపరి కార్యాచరణకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రయత్నాలు త్వరితగతిన వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ మహా పోరుకు తాను సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. స్వయంగా జల్లికట్టు కోసం ఉద్యమాన్ని సాగించేందుకు రెడీ అవుతానని పేర్కొన్నారు. అధినేత కరుణానిధితో జల్లికట్టు కోసం పోరు బాటను ఉధృతం చేయడానికి తాను వెనుకాడబోనన్నారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన మనకు..మనమే కార్యక్రమంలో సైతం జల్లికట్టుకు అనుమతి ఇప్పించాలని లక్షలాది మంది విజ్ఞప్తులు చేసుకున్నారని వివరించారు. ఈ సంక్రాంతికి జల్లికట్టుకు అనుమతి ఇచ్చే రీతిలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని లేని పక్షంలో మహా పోరుతో తమ నిరసనను తెలియజేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.