జల్లికట్టు కోసం మహాపోరుకు
సిద్ధమని డీఎంకే కోశాధికారి
ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
జల్లికట్టు అనుమతికి డిమాండ్ చేస్తూ
ఉద్యమాన్ని సాగించేందుకు
వెనుకాడబోమని హెచ్చరించారు.
సాక్షి, చెన్నై : తమిళుల సంప్రదాయ, సాహసక్రీడగా పేరెన్నికగన్న జల్లికట్టుకు ఇటీవల కాలంగా గడ్డు పరిస్థితులు నెలకొంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఎద్దులను హింసకు గురి చేయడమే కాకుండా, ఈ రాక్షసక్రీడతో ప్రాణ నష్టం కూడా పెరుగుతున్నదని జంతు ప్రేమికులు కోర్టుకు ఎక్కారు. కట్టు దిట్టమైన ఆంక్షల నడము సాగుతూ వచ్చిన ఈ జల్లికట్టుకు ఈ ఏడాది పూర్తిగా బ్రేక్ పడింది. కోర్టు నిషేధం విధించడంతో జల్లికట్టు లేని సంక్రాంతిని జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంగా కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ జల్లికట్టుకు అనుమతి తీసుకొస్తానంటూ ప్రగల్భాలు పలకడం మొదలెట్టారు.
రానున్న సంక్రాంతి పర్వదినం జల్లికట్టుతో ఆరంభం అవుతుందన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఎద్దుల పెంపకం దారులు జల్లికట్టుకు సిద్ధమవుతున్నారు. అయితే, సంక్రాంతి పర్వదినానికి మరో నాలుగు వారాలు మాత్రమే ఉండడంతో అనుమతి దక్కేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ సమయంలో జల్లి కట్టు అనుమతి నినాదంతో ఉద్యమానికి డీఎంకే దళపతి స్టాలిన్ సిద్ధం అవుతోండడంతో క్రీడా కారులు, నిర్వాహకులు మద్దతు ఇస్తూ, ఏకం అయ్యేందుకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
మహాపోరుకు రెడీ :తమిళుల వీరత్వానికి ప్రతీకగా ఉన్న జల్లికట్టుకు అడ్డంకులు సృష్టించింది ఈ అన్నాడీఎంకే ప్రభుత్వమేనని డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్న సమయంలో కట్టుదిట్టమైన ఆంక్షలు, నిబంధనల మేరకు జల్లికట్టు నిర్వహణకు అనుమతులు ఇస్తూ వచ్చామని గుర్తు చేశారు. అయితే, అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి రాగానే, జల్లికట్టుకు బ్రేక్ పడే విధంగా వ్యవహరించారని, చివరకు కోర్టు నిషేధం సైతం విధించిందని పేర్కొన్నారు. అయితే, ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఈ ఏడాది జల్లికట్టుకు దూరంగా సంక్రాంతిని జరుపుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అయితే, రానున్న సంక్రాంతి పర్వదినం రోజున జల్లికట్టుకు అనుమతి ఇచ్చే విధంగా, కోర్టు నిషేధానికి వ్యతిరేకంగా తదుపరి కార్యాచరణకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రయత్నాలు త్వరితగతిన వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ మహా పోరుకు తాను సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
స్వయంగా జల్లికట్టు కోసం ఉద్యమాన్ని సాగించేందుకు రెడీ అవుతానని పేర్కొన్నారు. అధినేత కరుణానిధితో జల్లికట్టు కోసం పోరు బాటను ఉధృతం చేయడానికి తాను వెనుకాడబోనన్నారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన మనకు..మనమే కార్యక్రమంలో సైతం జల్లికట్టుకు అనుమతి ఇప్పించాలని లక్షలాది మంది విజ్ఞప్తులు చేసుకున్నారని వివరించారు. ఈ సంక్రాంతికి జల్లికట్టుకు అనుమతి ఇచ్చే రీతిలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని లేని పక్షంలో మహా పోరుతో తమ నిరసనను తెలియజేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మహా పోరుకు రెడీ
Published Fri, Dec 18 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM
Advertisement
Advertisement