తమిళ తంబీలకు అండగా ప్రభుత్వం
జల్లికట్టు అనుమతి చేజారకుండా చర్యలు
కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం
జోరుగా సన్నాహాలు
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాక
ఇప్పటికే జల్లికట్టు అనుమతితో ఫుల్ జోష్‌మీదున్న తమిళ తంబీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారి కలలు సాకారం చేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా జల్లికట్టు అనుమతి చేజారకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. జంతుసంక్షేమ సంఘాలు స్టే తెచ్చేందుకు వీలులేకుండా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్ర ప్రజలు మరింత ఆనందోత్సాహాల మధ్య ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
చెన్నై : పోరాడి సాధించుకున్న జల్లికట్టు అనుమతి చేజారిపోకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జంతు సంక్షేమ సంఘాలు స్టే తెచ్చేందుకు వీలులేకుండా సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. పొంగల్ పండుగల్లో కోలాహలంగా సాగే జల్లికట్టు క్రీడపై ఏడాదిన్నర క్రితం స్టే మంజూరైంది. జల్టికట్టు క్రీడ ముసుగులో ఎద్దులతో నాటుసారా తాగిస్తారని, వెంటాడి వేటాడుతూ సాగే క్రీడతో వాటిని హింసిస్తారని పేర్కొంటూ జంతు సంక్షేమ సంఘాలు, మూగజీవుల సానుభూతి పరులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఫలితంగా నిషేధం అమల్లోకి వచ్చింది.
తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన జల్లికట్టును జరుపుకోనిదే పొంగల్ పండుగల్లో సందడే ఉండదని భావిస్తారు. జల్లికట్టు నిబంధనలను సడలించి క్రీడా నిర్వహణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు, ప్రజలు ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అన్ని పార్టీలతోపాటు అధికార బీజేపీ నేతల నుంచి సైతం ఒత్తిళ్లు పెరగడంతో కేంద్రం దిగివచ్చింది.
షరతులతో కూడిన అనుమతులను జారీచేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండగా జంతుప్రేమికులు మాత్రం మండిపడుతున్నారు. కేంద్ర అనుమతులపై స్టే తీసుకువస్తామనిప్రకటించారు. దీంతో ముందుగానే మేల్కొన్న రాష్ట్రప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో శనివారం కేవీయట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ ప్రకారం జల్లికట్టుపై ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తినా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు.
జల్లికట్టుకు అమిత్‌షా: కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్
మదురైలో జరిగే జల్లికట్టు క్రీడాపోటీలను తిలకించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా హాజరయ్యే అవకాశం ఉందని, ఎవరెన్ని పిటిషన్లు వేసినా జల్లికట్టు అనుమతులను అడ్డుకోలేరని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు. జల్లికట్టుకు అనుమతులకు కృషి చేసినందుకు అమిత్‌షాకు ఢిల్లీకి వెళ్లి కృతజ్ఞతలు చెప్పి ఆహ్వానించానని తెలిపారు. ఢిల్లీ నుంచి శనివారం చెన్నై చేరుకున్న పొన్‌కు విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
పార్టీ కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఆయనను సత్కరించారు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జల్లికట్టును అడ్డుకునేందుకు కొన్ని అజ్ఞాతశక్తులు కుట్రపన్నుతున్నట్లు ఆయన ఆరోపించారు. జల్లికట్టు క్రీడల్లో ఎద్దులను హింసించడం, హతమార్చడం వంటి చర్యలకు తావులేదని, నిబంధనలకు అనుగుణంగా జల్లికట్టును జరుపుకుంటే అడ్డుకునే అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
నిషేధం నుంచి జల్లికట్టును శాశ్వతంగా తప్పించేందుకు చట్టపరంగా పోరాడుతామని తెలిపారు. ఈనెల 16,17 తేదీల్లో జరిగే జల్లికట్టు క్రీడలను తిలకించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అలాగే తాను, మరికొందరు కేంద్ర మంత్రులు జల్లికట్టును తిలకించనున్నట్లు చెప్పారు.
జోరుగా సన్నాహాలు:
ఈనెల 15వ తేదీ నుంచి మూడురోజులపాటు జరిగే జల్లికట్టు క్రీడల నిర్వహణపై జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. అనుమతి లభిస్తుందో లేదోనని అనుమానంతో ఉన్న జల్లికట్టు క్రీడాకారులు శనివారం రంగంలోకి దిగారు. ఎద్దులకు తర్ఫీదు నివ్వడం ప్రారంభించారు. అలాగే మైదానాలను చదును చేస్తున్నారు. ముఖ్యంగా మదురై జిల్లా అలంగానల్లూరు, పాలమేడు, అవనీయాపురం ప్రాంతాల్లో ప్రజలు, ఎద్దును అదుపుచేసే వీరులు గ్రామాల్లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుతున్నారు.
జల్లికట్టు కోసమే ప్రత్యేకంగా దక్షిణ జిల్లాలో 500 ఎద్దులను పెంచుతున్నారు. వీటికి పరుగులు తీయడం, ఈతపై శిక్షణ నిస్తున్నారు. 15వ తేదీన అవనీపురం, 16వ తేదీన పాలమేడులో, 17వ తేదీన అలంగానల్లూరులో జల్లికట్టు క్రీడలు నిర్వహిస్తారు. జల్లికట్టు క్రీడా నిర్వహణ కమిటీ శుక్రవారం రాత్రి సమావేశమై ఏర్పాట్లపై చర్చించింది.