జల్లికట్టుకు కేంద్ర సర్కారు ఓకే!
తమిళనాడుకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది. అక్కడి అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో కోరుతున్న 'జల్లికట్టు' ఆటకు అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. తమిళనాడులో జల్లికట్టుతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడ్ల పందాలకు కూడా అనుమతి ఇచ్చింది. ప్రతియేటా సంప్రదాయంగా నిర్వహించుకునే ఈ ఆటలను ఇక ముందు కూడా నిర్వహించుకోవచ్చని, అయితే అందుకోసం జంతువుల పట్ల క్రూరంగా మాత్రం వ్యవహరించకూడదని నోటిఫికేషన్‌లో తెలిపారు.
జల్లికట్టు విషయంలో.. ఎద్దులను లోపలి నుంచి బయటకు వదిలిన తర్వాత.. వాటిని 15 మీటర్లలోపే అదుపు చేయాలని పరిమితి విధించారు. ఎడ్లబండ్ల రేసులను సరైన ట్రాక్ మీదే నిర్వహించాలని, అవి రెండు కిలోమీటర్లకు మించకూడదని చెప్పారు. ఈ మొత్తం ఆటలను జిల్లా అధికారుల పర్యవేక్షణలోనే నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ జంతువుల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించకూడదని స్పష్టం చేశారు. ఎలుగుబంట్లు, కోతులు, పులులు, చిరుతపులులు, సింహాలు, ఎద్దులకు శిక్షణ ఇచ్చి వాటితో ప్రదర్శనలు చేయించడం మాత్రం కుదరదని ఆ నోటిఫికేషన్‌లో వివరించారు.
జల్లికట్టు.. రెండు వేల ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయమని, అయితే అది ఇప్పుడు సంక్షోభంలో పడిందని తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు. ఇప్పుడు జల్లికట్టును అనుమతిస్తూ ఉత్తర్వులు ఇప్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు చెబుతున్నామని ఆయన తెలిపారు.