'జల్లికట్టుపై మేమేం చేయలేం..'
న్యూఢిల్లీ: తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ఘనంగా నిర్వహించే సంప్రదాయిక క్రీడ జల్లికట్టును అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేయలేదని, ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోజాలదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కావాలంటే జల్లికట్టును అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేయవచ్చునని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
జల్లికట్టుపై విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో గతంలో నిషేధించిన జల్లికట్టును అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే ఈ జానపద క్రీడలో ఎద్దులు తీవ్ర హింసకు గురవుతాయని, ఈ అనాగరిక క్రీడను అనుమతించడం జంతుహక్కులను కాలరాయడమేనని జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జల్లికట్టుకు బ్రేక్ వేస్తూ సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. స్టేను తాత్కాలికంగా ఎత్తివేయాలని మరో పిటిషన్ వేసినా.. న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు.