చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం 110 నిబంధనల మేరకు సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటనలు చేశారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను పొడిగిస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇది వరకు ఆరు నెలలుగా ఉన్న ఈ సెలవుల్ని తాజాగా తొమ్మిది నెలలకు పొడిగించారు.
చెన్నై మహానగరంలో ఇప్పటికే రెండు వందల మినీ బస్సులు రోడ్లపై తిరుగుతుండగా, అదనంగా మరో వంద బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకోనున్నారు. రవాణా సంస్థలో విధినిర్వహణలో మరణించిన 1,600 మంది సిబ్బంది కుటుంబాలకు కారుణ్య నియామక ఉత్తర్వుల జారీకి నిర్ణయించారు.
రూ. నాలుగు కోట్ల వ్యయంతో 50 అంబులెన్స్‌ల కొనుగోలు, రూ. ఐదు కోట్లతో పూందమల్లి, తిరువారూర్ ఆర్‌టీవో కార్యాలయాలకు కొత్త భవనాలను నిర్మించనున్నారు. కాంచీపురం, వేలాంకన్నిలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి ఉన్న ఈ రెండు ప్రాంతాలను రూ. 403 కోట్లను వెచ్చించి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు.