ఇప్పుడు 'ట్రాఫిక్' వంతు
సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం దావా దాఖలు చేసింది. సోమవారం చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాది ఎంఎల్ జగన్ ఈ దావా వేశారు.
చెన్నై: సీఎం జయలలితకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా, కథనాలు రాసినా పరువు నష్టం దావా మోత మోగుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రాజకీయ నాయకులు, మీడియాల మీద ఈ దావాలు పెద్ద సంఖ్యలో కోర్టులలో దాఖలు అయ్యాయి. తాజాగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిపై కన్నెర్ర చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల్ని ఆదుకోవడంలో సీఎం జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు బయలు దేరిన సమయంలో ట్రాఫిక్ రామస్వామి వినూత్నంగా ఘాటుగానే స్పందించారు. వాట్సాప్ ద్వారా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
సీఎం జయలలితకు వ్యతిరేకంగా తీవ్రంగా, స్వచ్ఛంద సంస్థలపై అన్నాడీఎంకే వర్గాలు సాగించిన దాడులను ఖండిస్తూ ధూషణలకు దిగారు. చేతిలో ఏదో ఓ వస్తువును పట్టుకుని పదే పదే హెచ్చరించే విధంగా ఘాటుగానే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ వాట్సాప్ వీడియో ప్రతి మొబైల్‌లోనూ హల్ చల్ చేసిందని చెప్పవచ్చు. ఈ వీడియోను తీవ్రంగా పరిగణించిన రాష్ర్ట ప్రభుత్వం ట్రాఫిక్ రామస్వామిపై కేసు నమోదుకు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా ఉదయం ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎంఎల్ జగన్ సెషన్స్ కోర్టులో దావా వేశారు. సీఎం జయలలితకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యల్ని సందించడమే కాకుండా, ఆమె పరువుకు భంగం కల్గించే విధంగా ట్రాఫిక్ రామస్వామి వ్యవహరించారని ఆ దావాలో వివరించారు. సెక్షన్ 500, 501 ప్రకారం ట్రాఫిక్ రామస్వామి వ్యవహరించిన తీరు క్రిమినల్ చర్యలతో సమానంగా పేర్కొన్నారు. ఈ దావాపై విచారణ త్వరలో సాగనున్నది.