భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) భారతీయా అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్.. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తన రాష్ట్రమైన జార్జియాకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను సెనెట్‌కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలా రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు.
24 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, ఎన్నికల భద్రత, టెక్నాలజీతో పాటు పలు రంగాల్లో అశ్విన్ రామస్వామి పని చేశారు. అశ్విన్ రామస్వామి ఎన్నికైతే.. కంప్యూటర్ సైన్స్‌తో పాటు న్యాయవాద డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు.
ఇక.. తన తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికా వచ్చారని అశ్విన్ తెలిపారు. తాను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగిగానని.. తాను హిందువునని తెలిపారు. తనకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉందని.. తాను కాలేజీ సమయంలో సంస్కృతం కూడా నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటానని అశ్విన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment