రమ్య, కృష్ణవేణి, రంజిత
‘పూజారి గారూ... అర్చన చెయ్యండి’ అనే మాట ప్రతి గుడిలో వినపడేదే. కాని తమిళనాడులో ఒక మార్పు జరిగింది. పూజారులుగా స్త్రీలు నియమితులయ్యే ప్రయత్నం మొదలయ్యింది. ‘పూజారమ్మా... అర్చన చెయ్యి’ అనే ఇకపై మాట వినపడనుంది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు అర్చకత్వం కోర్సును ముగించి త్వరలో పూజారులుగా నియమితం కానున్నారు.
‘మహిళలు పైలెట్లుగా, వ్యోమగాములుగా దిగంతాలను ఏలుతున్నప్పుడు దేవుని అర్చనను ఎందుకు చేయకూడదు’ అనే ప్రశ్న తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తింది. అంతేకాదు దానికి సమాధానం కూడా వెతికింది. జవాబును ప్రజల ముందుకు తెచ్చింది. గతంలో ఛాందస దృష్టితో బహిష్టు కారణాన స్త్రీలను ‘అపవిత్రం’ అని తలచి గర్భగుడి ప్రవేశానికి, అర్చనకు దూరంగా ఉంచేవారు.
గ్రామదేవతల అర్చనలో స్త్రీలు చాలా కాలంగా ఉన్నా ఆగమశాస్త్రాలను అనుసరించే దేవాలయాలలో స్త్రీలు అర్చకత్వానికి నిషిద్ధం చేయబడ్డారు. ఇప్పుడు ఆ విధానంలో మార్పును తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. మహిళా అర్చకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వనుంది. అందులో భాగంగా ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సును ముగించి సహాయక అర్చకులుగా శిక్షణ పొందనున్నారు. ఒక సంవత్సరంపాటు ఆలయాల్లో శిక్షణ పొందాక ప్రధాన అర్చకులు కానున్నారు.
అందరూ యోగ్యులే
డి.ఎం.కె నేత కరుణానిధి 2007లో అర్చకత్వానికి అన్ని కులాల వాళ్లు యోగ్యులే అనే సమానత్వ దృష్టితో తమిళనాడులో ఆరు అర్చక ట్రైనింగ్ స్కూళ్లను తెరిచారు. అయితే ఆ కార్యక్రమం అంత సజావుగా సాగలేదు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కులాల వాళ్లు అర్చకత్వం కోర్సు చేసి పూజారులుగా నియమితులు కావచ్చన్న విధానాన్ని ప్రోత్సహించింది. దాంతో గత సంవత్సరం నుంచి చాలామంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు.
అయితే తిరుచిరాపల్లిలోని అర్చక ట్రైనింగ్ స్కూల్‌లో ముగ్గురు మహిళలు ఈ కోర్సులో చేరడంతో కొత్తశకం మొదలైనట్టయ్యింది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సులోని థియరీని విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ హిందూ ధార్మిక మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా సర్టిఫికెట్‌లు పొందారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా ఒక సంవత్సరం పాటు వివిధ ఆలయాల్లో సహాయక అర్చకులుగా పని చేసి తదుపరి అర్చకులుగా నియమితులవుతారు. కోర్సు చదివిన కాలంలో వీరికి 3000 రూపాయల స్టయిపెండ్ లభించింది.
దేవుడు కూడా బిడ్డడే
‘దేవుడు కూడా చంటిబిడ్డలాంటివాడే. గర్భగుడిలో దేవుణ్ణి అతి జాగ్రత్తగా ధూపదీపాలతో, నైవేద్యాలతో చూసుకోవాలి. స్త్రీలుగా మాకు అది చేతనవును’ అంది రమ్య. కడలూరుకు చెందిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగం మాని మరీ అర్చకత్వం కోర్సులో చేరింది. మరో మహిళ కృష్ణవేణి ఇంటర్ వరకూ చదివి ఈ కోర్సు చేసింది. మూడో మహిళ రంజిత బి.ఎస్సీ చదివింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం 22 మంది ఉంటే మేము ముగ్గురమే మహిళలం. కాని గత నెలలో మొదలైన కొత్తబ్యాచ్‌లో 17 మంది అమ్మాయిలు చేరారు. రాబోయే రోజుల్లో ఎంతమంది రానున్నారో ఊహించండి’ అంది రమ్య.
తమిళనాడులో మొదలైన ఈ మార్పును మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయో లేదో ఇప్పటికైతే సమాచారం లేదు. కాని స్త్రీలు దైవాన్ని కొలిచేందుకు ముందుకు వస్తే ఇకపై వారిని ఆపడం అంత సులువు కాకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment