training school
-
డ్రైవింగ్ మణి @ 71
వయసు అరవై దాటిందంటే చాలు ‘ఇంకా ఏం పనులు చేస్తావు, విశ్రాంతి తీసుకో..’ అనే సలహాలు ఇస్తుంటారు. కొందరు ఆ సలహాలను కూడా సవాళ్లుగా తీసుకుంటారు. కొన్ని అభిరుచులను జీవితకాల సాధనగా మార్చుకుంటారు. ఈ మాటలను నిజం చేస్తోంది 71 ఏళ్ల రాధామణి. ఇప్పటివరకు 11 హెవీ వాహనాల లైసెన్స్‌లను పొంది మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందరూ మణి అమ్మ అని పిలుచుకునే రాధామణి కేరళవాసి. సాధనమున ఏవైనా సమకూరుతాయి అని నిరూపిస్తున్న రాధామణి ఇప్పుడు ఇంజినీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ ఈ రంగంలో ఎదగడానికి చేస్తున్న కృషి అందరికీ ఓ స్ఫూర్తి మంత్రం. 1984లో కేరళలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన రాధామణి ఇప్పటికీ ‘వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు’ అని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా చూపుతుంది. స్కూటర్ నుంచి జేసీబీ వరకు సాధారణంగా మహిళలు స్కూటర్, కార్ డ్రైవింగ్‌తో సరిపెట్టేస్తారు. రాధామణి మాత్రం అంతటితో ఆగలేదు. డ్రైవింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి ప్రోత్సాహాన్నిచ్చిన భర్తను గర్తుచేసుకుంటూ ‘‘1981లో మొదటిసారి ఓ అంబాసిడర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లలోపు ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాను. ఆ విధంగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా కూడా గుర్తుంపు పొందాను. ఎ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైనింగ్ స్కూల్నుప్రారంభించాను’ అని వివరిస్తుంది. ఈ వెంచర్‌ను రాధామణి భర్త పదేళ్లకు ముందుగానే ప్రారంభించాడు. అక్కడ నుంచే ఈ జంట డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ రాధామణి పేరుతో లైసెన్స్ పొందడానికి స్కూల్ రిజిస్టర్ చేయడానికి కష్టంగా మారింది. దీంతో రాధామణి హెవీ డ్రైనింగ్ లైసెన్స్‌లు పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్నేళ్ల న్యాయ ΄ోరాటం తర్వాత ఈ జంట కేరళలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లెర్నింగ్ స్కూల్‌ను రాధామణి పేరుతో రిజిస్టర్ చేయగలిగారు. సంకల్పంతో నిలబెట్టింది.. రాధామణి భర్త 2004లో మరణించాడు. ఆ తర్వాత ఈ వెంచర్ మరింతప్రాముఖ్యతను నింపుకుంది. మణి అమ్మ సంకల్పం ఆ ట్రైనింగ్ స్కూల్‌ను నిలబెట్టడం ఒక్కటే కాదు, దానిని ఒక సంస్థగా మార్చేందుకు కృషి చేయడం కూడా! అందుకే ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ రంగమైనా హెవీ డ్రైవింగ్ అంటే ముందు పురుషులే గుర్తుకు వస్తారు. అలాంటి ఆలోచనకు తావు ఇవ్వకుండా, వయసు నింబధనలను కూడా ధిక్కరిస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్‌ను రాధామణి నడుపుతోంది. అందుకు మరింతగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజనీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రికార్డ్ల చక్రం ఆమె అద్భుతమైన నైపుణ్యాలు, అంకితభావాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ‘ఇన్సి ్పరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది సంస్థ. రాధామణి అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుతోంది. అక్కడ ఆమె తన డ్రైవింగ్ అనుభవాలను పంచుకుంటుంది. వయసు లేదా జెండర్‌తో సంబంధం లేకుండా కలలను పండించుకునేందుకు తగిర ప్రేరణను ఇస్తోంది రాధామణి. సోషల్ మీడియాలో.. రాధామణి ఇన్స్టాగ్రామ్ పేజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జేసీబీలు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లు, ఫెరారీలు, పడవలు, ట్యాంకర్లు, జిప్సీ, పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ప్రతి వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న 19కె ఫాలోవర్లు మణి అమ్మను ప్రశంసిస్తుంటారు. ఎంతోమంది చేత సత్కారం పొందుతుంటారు. చాలా మంది మహిళలకు హెవీ డ్రైవింగ్ పరికరాల గురించి చెప్పడం, నేర్పడం చూడచ్చు. రాధామణి అమ్మ అంటే ఆవేశం, పట్టుదల, శక్తికి నిదర్శనం. ఆమె కేవలం రోడ్డుపైనే కాదు అడ్డంకులను ఛేదించి చక్రాన్ని చేరుకోవడానికి తగిన స్ఫూర్తిని ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. -
‘పూజారమ్మా... అర్చన చెయ్యి’.. ఇక అక్కడ ఇదే మాట వినపడుతుంది
‘పూజారి గారూ... అర్చన చెయ్యండి’ అనే మాట ప్రతి గుడిలో వినపడేదే. కాని తమిళనాడులో ఒక మార్పు జరిగింది. పూజారులుగా స్త్రీలు నియమితులయ్యే ప్రయత్నం మొదలయ్యింది. ‘పూజారమ్మా... అర్చన చెయ్యి’ అనే ఇకపై మాట వినపడనుంది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు అర్చకత్వం కోర్సును ముగించి త్వరలో పూజారులుగా నియమితం కానున్నారు. ‘మహిళలు పైలెట్లుగా, వ్యోమగాములుగా దిగంతాలను ఏలుతున్నప్పుడు దేవుని అర్చనను ఎందుకు చేయకూడదు’ అనే ప్రశ్న తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తింది. అంతేకాదు దానికి సమాధానం కూడా వెతికింది. జవాబును ప్రజల ముందుకు తెచ్చింది. గతంలో ఛాందస దృష్టితో బహిష్టు కారణాన స్త్రీలను ‘అపవిత్రం’ అని తలచి గర్భగుడి ప్రవేశానికి, అర్చనకు దూరంగా ఉంచేవారు. గ్రామదేవతల అర్చనలో స్త్రీలు చాలా కాలంగా ఉన్నా ఆగమశాస్త్రాలను అనుసరించే దేవాలయాలలో స్త్రీలు అర్చకత్వానికి నిషిద్ధం చేయబడ్డారు. ఇప్పుడు ఆ విధానంలో మార్పును తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. మహిళా అర్చకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వనుంది. అందులో భాగంగా ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సును ముగించి సహాయక అర్చకులుగా శిక్షణ పొందనున్నారు. ఒక సంవత్సరంపాటు ఆలయాల్లో శిక్షణ పొందాక ప్రధాన అర్చకులు కానున్నారు. అందరూ యోగ్యులే డి.ఎం.కె నేత కరుణానిధి 2007లో అర్చకత్వానికి అన్ని కులాల వాళ్లు యోగ్యులే అనే సమానత్వ దృష్టితో తమిళనాడులో ఆరు అర్చక ట్రైనింగ్ స్కూళ్లను తెరిచారు. అయితే ఆ కార్యక్రమం అంత సజావుగా సాగలేదు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కులాల వాళ్లు అర్చకత్వం కోర్సు చేసి పూజారులుగా నియమితులు కావచ్చన్న విధానాన్ని ప్రోత్సహించింది. దాంతో గత సంవత్సరం నుంచి చాలామంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే తిరుచిరాపల్లిలోని అర్చక ట్రైనింగ్ స్కూల్లో ముగ్గురు మహిళలు ఈ కోర్సులో చేరడంతో కొత్తశకం మొదలైనట్టయ్యింది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సులోని థియరీని విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ హిందూ ధార్మిక మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా సర్టిఫికెట్లు పొందారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా ఒక సంవత్సరం పాటు వివిధ ఆలయాల్లో సహాయక అర్చకులుగా పని చేసి తదుపరి అర్చకులుగా నియమితులవుతారు. కోర్సు చదివిన కాలంలో వీరికి 3000 రూపాయల స్టయిపెండ్ లభించింది. దేవుడు కూడా బిడ్డడే ‘దేవుడు కూడా చంటిబిడ్డలాంటివాడే. గర్భగుడిలో దేవుణ్ణి అతి జాగ్రత్తగా ధూపదీపాలతో, నైవేద్యాలతో చూసుకోవాలి. స్త్రీలుగా మాకు అది చేతనవును’ అంది రమ్య. కడలూరుకు చెందిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగం మాని మరీ అర్చకత్వం కోర్సులో చేరింది. మరో మహిళ కృష్ణవేణి ఇంటర్ వరకూ చదివి ఈ కోర్సు చేసింది. మూడో మహిళ రంజిత బి.ఎస్సీ చదివింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం 22 మంది ఉంటే మేము ముగ్గురమే మహిళలం. కాని గత నెలలో మొదలైన కొత్తబ్యాచ్‌లో 17 మంది అమ్మాయిలు చేరారు. రాబోయే రోజుల్లో ఎంతమంది రానున్నారో ఊహించండి’ అంది రమ్య. తమిళనాడులో మొదలైన ఈ మార్పును మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయో లేదో ఇప్పటికైతే సమాచారం లేదు. కాని స్త్రీలు దైవాన్ని కొలిచేందుకు ముందుకు వస్తే ఇకపై వారిని ఆపడం అంత సులువు కాకపోవచ్చు. -
స్పెషల్ ఎడ్యుకేషన్
టాప్ స్టోరీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్.. వృత్తి బాధ్యతలు ఎంతో ప్రత్యేకం.. పిల్లల పట్ల కేరింగ్ చాలా ముఖ్యం! ఎందుకంటే.. తాము బోధించాల్సిన విద్యార్థులకున్న ప్రత్యేక అవసరాలే అందుకు కారణం. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌కు సంపాదనతోపాటు సేవా సంతృప్తి సొంతమవుతుంది. ఇటీవల కాలంలో సామాజికంగా ప్రాధాన్యత పెరుగుతూ.. కెరీర్ పరంగానూ మంచి అవకాశాలు కల్పిస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్, కెరీర్ అవకాశాలపై విశ్లేషణ.. తోటి పిల్లలతో కలిసి ఆడుతూ,పాడుతూ కేరింతలు కొట్టాల్సిన అయిదారేళ్ల వయసులో.. తమకే తెలియని మానసిక, శారీరక సమస్యలతో అందమైన బాల్యాన్ని కోల్పోయే చిన్నారులు ఎందరో! అలాంటి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి రూపొందించిన కోర్సులే.. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు. ఈ కోర్సుల్లో శిక్షణ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా కెరీర్ ప్రారంభించొచ్చు. స్పెషల్ ఎడ్యుకేటర్స్ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల విషయంలో శారీరకంగా, మానసికంగా కొన్ని వైకల్యాలను గుర్తించారు. అవి.. బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, మానసిక వైకల్యం, మాట్లాడలేకపోవడం (మూగ). స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తిచేసిన వారు ఇలాంటి సమస్యలున్న చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల ఉత్తీర్ణులకు మంచి డిమాండ్ ఉంది. పలు ఇన్స్టిట్యూట్స్ ఆయా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఆర్సీఐ స్పెషల్ ఎడ్యుకేషన్ లక్ష్యం ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఎడ్యుకేషన్ బోధన, శిక్షణ కోసం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ) పేరుతో ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందించే సంస్థలన్నీ ఈ కౌన్సిల్ పర్యవేక్షణలో ఉంటాయి. ఈ కౌన్సిల్ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లు అందించే కోర్సులు, సర్టిఫికెట్లకే జాబ్ మార్కెట్లోనూ గుర్తింపు. ప్రవేశం ఇలా ఆర్సీఐ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్స్ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నాయి. ఆయా ఇన్స్టిట్యూట్స్ నోటిఫికేషన్ ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. సాధారణంగా ప్రతి ఏటా మే, జూన్‌లో ప్రవేశాలు జరుగుతాయి. బ్యాచిలర్ కోర్సులు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్/లెర్నింగ్ డిజేబిలిటీస్/లోకోమోటలర్ అండ్ న్యూరోలాజికల్ డిజార్డర్/మల్టిపుల్ డిజార్డర్/ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్)వంటి కోర్సులున్నాయి. బీఏ బీఈడీ (విజువల్ ఇంపెయిర్మెంట్); బీఎస్సీ (స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్); బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ; బ్యాచిలర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్ వంటి కోర్సులున్నాయి. వీటిలో ప్రవేశించడానికి అర్హత డిగ్రీ. అవకాశాలు పుష్కలం స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ, బీఎస్సీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి కెరీర్ అవకాశాలు పుష్కలం. ఇటు ప్రభుత్వ రంగంలో అటు ప్రైవేటు రంగంలోనూ డిమాండ్ ఉంది. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేశాక నెలకు రూ.15 వేల జీతంతో ప్రైవేటు రంగంలో కెరీర్ ప్రారంభించొచ్చు. వీరికి ప్రభుత్వ విభాగంలో డీఎస్సీలోనూ పోటీ పడే అవకాశముంది. సర్టిఫికెట్ కోర్సులు స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి పలు సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అవి.. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కేర్ గివింగ్. పదో తరగతి, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణులు వీటిల్లో చేరొచ్చు. డిప్లొమా స్థాయి కోర్సులు ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు అర్హతగా డిప్లొమా స్థాయి కోర్సులు ఉన్నాయి. అవి.. డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (విజువల్ ఇంపెయిర్మెంట్), డిప్లామా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ (మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ రిపేర్ అండ్ హియర్ మౌల్డ్ టెక్నాలజీ, డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్మెంట్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(డెఫ్, బ్లైండ్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(సెరిబ్రల్ పాల్సే), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఆటిజం స్పెక్ట్రమ్). పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు పీజీ స్థాయిలో ఎంపీఈడీ, ఎమ్మెస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో పలు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి విజువల్ ఇంపెయిర్మెంట్; హియరింగ్ ఇంపెయిర్మెంట్; మెంటల్ రిటార్డేషన్; ఎంఎస్సీ డిజాబిలిటీ స్టడీస్(ఎర్లీ ఇంటర్వెన్సన్), మాస్టర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, మాస్టర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, మాస్టర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్, ఎంఎస్సీ సైకోసోషల్ రిహాబిలిటేషన్, మాస్టర్ ఇన్ డిజాబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులు వీటిలో ప్రవేశించడానికి అర్హులు. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించి పలు పీజీ డిప్లొమా కోర్సులు సైతం అభ్యసించే వీలుంది. ఇన్స్టిట్యూట్స్ * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ క్యాంపస్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్. * స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెన్సైస్, సికింద్రాబాద్, వైఎస్సార్ కడప జిల్లా, గుంటూరు, తాండూరు. * కాలేజీ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఆంధ్ర మహిళాసభ, ఓయూ క్యాంపస్. * డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ,విశాఖపట్నం. * శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి. * దుర్గాబాయి దేశ్‌ముఖ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఓర్పు, నేర్పు అవసరం స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కెరీర్ పరంగా అవకాశాలు ఖాయం. కానీ ఇదే సమయంలో కేవలం కెరీర్ అవకాశాలను పరిగణించే ఈ కోర్సులు ఎంపిక చేసుకోవాలనుకోవడం సరికాదు. కారణం.. ఈ కోర్సుల్లో శిక్షణ ద్వారా తాము బోధించాల్సిన విద్యార్థులు ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులని గుర్తించాలి. ఓర్పు, నేర్పు ఉన్న వారే స్పెషల్ ఎడ్యుకేషన్ రంగంలో రాణించగలరు. - ప్రొఫెసర్. వి.ఆర్.పి. శైలజ, హెచ్ఓడీ, స్పెషల్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ -
పాఠశాలలో కోతులకు శిక్షణ!
చైనా: ‘ప్రెజెంట్ సార్’.. అంటూ చేయి పెకైత్తుతున్న ఈ కోతి నిజంగానే పాఠశాలలో శిక్షణ తీసుకుంటోంది. ఈ ఏడాదిని మర్కటనామ సంవత్సరంగా ప్రకటించిన చైనా.. ఫిబ్రవరి 8 నుంచి వేడుకలు నిర్వహిస్తుండడంతో అందులో పాల్గొనేందుకు ఈ కోతులు చైనాలోని డాంగ్యుంగ్ జూలోని ఓ పాఠశాలలో ఇలా శిక్షణ పొందుతున్నాయి.