వయసు అరవై దాటిందంటే చాలు ‘ఇంకా ఏం పనులు చేస్తావు, విశ్రాంతి తీసుకో..’ అనే సలహాలు ఇస్తుంటారు. కొందరు ఆ సలహాలను కూడా సవాళ్లుగా తీసుకుంటారు. కొన్ని అభిరుచులను జీవితకాల సాధనగా మార్చుకుంటారు. ఈ మాటలను నిజం చేస్తోంది 71 ఏళ్ల రాధామణి. ఇప్పటివరకు 11 హెవీ వాహనాల లైసెన్స్‌లను పొంది మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందరూ మణి అమ్మ అని పిలుచుకునే రాధామణి కేరళవాసి. సాధనమున ఏవైనా సమకూరుతాయి అని నిరూపిస్తున్న రాధామణి ఇప్పుడు ఇంజినీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ ఈ రంగంలో ఎదగడానికి చేస్తున్న కృషి అందరికీ ఓ స్ఫూర్తి మంత్రం.
1984లో కేరళలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన రాధామణి ఇప్పటికీ ‘వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు’ అని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా చూపుతుంది.
స్కూటర్ నుంచి జేసీబీ వరకు
సాధారణంగా మహిళలు స్కూటర్, కార్ డ్రైవింగ్‌తో సరిపెట్టేస్తారు. రాధామణి మాత్రం అంతటితో ఆగలేదు. డ్రైవింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి ప్రోత్సాహాన్నిచ్చిన భర్తను గర్తుచేసుకుంటూ ‘‘1981లో మొదటిసారి ఓ అంబాసిడర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లలోపు ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాను. ఆ విధంగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా కూడా గుర్తుంపు పొందాను. ఎ టు జెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్‌మెంట్ అనే డ్రైనింగ్ స్కూల్‌నుప్రారంభించాను’ అని వివరిస్తుంది. ఈ వెంచర్‌ను రాధామణి భర్త పదేళ్లకు ముందుగానే ప్రారంభించాడు. అక్కడ నుంచే ఈ జంట డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ రాధామణి పేరుతో లైసెన్స్ పొందడానికి స్కూల్ రిజిస్టర్ చేయడానికి కష్టంగా మారింది. దీంతో రాధామణి హెవీ డ్రైనింగ్ లైసెన్స్‌లు పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్నేళ్ల న్యాయ ΄ోరాటం తర్వాత ఈ జంట కేరళలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లెర్నింగ్ స్కూల్‌ను రాధామణి పేరుతో రిజిస్టర్ చేయగలిగారు.
సంకల్పంతో నిలబెట్టింది..
రాధామణి భర్త 2004లో మరణించాడు. ఆ తర్వాత ఈ వెంచర్ మరింతప్రాముఖ్యతను నింపుకుంది. మణి అమ్మ సంకల్పం ఆ ట్రైనింగ్ స్కూల్‌ను నిలబెట్టడం ఒక్కటే కాదు, దానిని ఒక సంస్థగా మార్చేందుకు కృషి చేయడం కూడా! అందుకే ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ రంగమైనా హెవీ డ్రైవింగ్ అంటే ముందు పురుషులే గుర్తుకు వస్తారు. అలాంటి ఆలోచనకు తావు ఇవ్వకుండా, వయసు నింబధనలను కూడా ధిక్కరిస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్‌ను రాధామణి నడుపుతోంది. అందుకు మరింతగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజనీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
రికార్డ్‌ల చక్రం
ఆమె అద్భుతమైన నైపుణ్యాలు, అంకితభావాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ‘ఇన్సి ్పరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది సంస్థ. రాధామణి అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుతోంది. అక్కడ ఆమె తన డ్రైవింగ్ అనుభవాలను పంచుకుంటుంది. వయసు లేదా జెండర్‌తో సంబంధం లేకుండా కలలను పండించుకునేందుకు తగిర ప్రేరణను ఇస్తోంది రాధామణి.
సోషల్ మీడియాలో..
రాధామణి ఇన్‌స్టాగ్రామ్ పేజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జేసీబీలు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లు, ఫెరారీలు, పడవలు, ట్యాంకర్లు, జిప్సీ, పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ప్రతి వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న 19కె ఫాలోవర్లు మణి అమ్మను ప్రశంసిస్తుంటారు. ఎంతోమంది చేత సత్కారం పొందుతుంటారు. చాలా మంది మహిళలకు హెవీ డ్రైవింగ్ పరికరాల గురించి చెప్పడం, నేర్పడం చూడచ్చు. రాధామణి అమ్మ అంటే ఆవేశం, పట్టుదల, శక్తికి నిదర్శనం. ఆమె కేవలం రోడ్డుపైనే కాదు అడ్డంకులను ఛేదించి చక్రాన్ని చేరుకోవడానికి తగిన స్ఫూర్తిని ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment