యువతరానికి స్ఫూర్తి ఇస్తున్న మణియమ్మ
భర్త చనిపోయిన దుఃఖం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న రాధామణి, బతుకు మార్గంపై దృష్టి పెట్టింది. వ్యాపారం చేసిన అనుభవం లేదు. ఆర్థిక స్థోమత అంతకంటే లేదు. తనకు తెలిసిన ఏకైక విద్య డ్రైవింగ్. ముప్పై సంవత్సరాల వయసులో భర్త లలాన్ దగ్గర స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుంది రాధామణి.
మొదట్లో ఎంత భయమేసిందో!
అయితే ఆ భయం కొన్ని రోజులే.
ఆ తరువాత భయం స్థానంలో ఇష్టం ఏర్పడింది. స్కూటర్ డ్రైవింగ్‌ను పర్‌ఫెక్ట్‌గా నేర్చుకుంది.
కేరళలోని తొప్పుంపేడి పట్టణానికి చెందిన రాధ స్కూటర్ డ్రైవింగ్ దగ్గర మాత్రమే ఆగిపోలేదు. కారు, బస్, లారీ, ట్రాక్టర్, ఆటో–రిక్షా, క్రెన్, రోడ్ రోలర్ అండ్ జేసిబి, కంటేనర్ ట్రక్...ఇలా 11 వాహనాలను నడపడంలో లైసెన్స్ తీసుకుంది.
కేరళలో హెవీ వెహికిల్ లైసెన్స్ తీసుకున్న తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది రాధామణి.
కొన్ని సంవత్సరాల క్రితం...
తొప్పుంపేడి నుంచి చెర్తాలం వరకు రాధామణి బస్సు నడిపినప్పుడు, ప్రజలు పరుగెత్తుకుంటూ వచ్చి చూశారు.
‘నా దృష్టిలో ఒక కొత్త వాహనం నేర్చుకోవడం అంటే, కొత్త బడిలో చేరడం లాంటిది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. దీనికి ఏకైక కారణం డ్రైవింగ్ అని చెబుతుంటాను’ అంటుంది 71 సంవత్సరాల రాధామణి.
ఆమెను అందరూ ‘మణియమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
తన పిల్లలతో కలిసి తొప్పుంపేడిలో మొదలు పెట్టిన డ్రైవింగ్ స్కూల్‌కు అనూహ్యమైన ఆదరణ ఏర్పడింది.
కాలేజి స్టూడెంట్ రీతిక ఇలా అంటుంది...
‘గతంలో డ్రైవింగ్‌పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కాలేజీలో చేరిన తరువాత మాత్రం బండి నేర్చుకోవడం తప్పనిసరి అనిపించింది. వెంటనే మణియమ్మ డ్రైవింగ్ స్కూల్ గుర్తొచ్చి చేరిపోయాను. అమ్మాయిలు ఇక్కడ సేఫ్టీగా ఫీలవుతారు. మణియమ్మ దగ్గరికి వెళితే డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపించదు. బామ్మ దగ్గరకు వెళ్లినట్లు అనిపిస్తుంది. చాలా సరదాగా ఆమె డ్రైవింగ్ నేర్పిస్తుంది. ఇప్పుడు నేను టూవీలర్స్ మాత్రమే కాదు కారు కూడా నడుపుతున్నాను’
మణియమ్మ భర్త కోచిలో ‘ఏ టు జెడ్’ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపేవాడు. ఆయన చనిపోయిన తరువాత ఆ స్కూల్ మూతపడింది. అయితే ఇప్పుడు తొప్పుంపేడిలోని ‘డ్రైవింగ్ స్కూల్’లో అడుగడుగునా భర్తను చూసుకుంటుంది మణియమ్మ!
Comments
Please login to add a commentAdd a comment