heavy vehicles
-
71 ఏళ్ల వయసులో అన్ని డ్రైవింగ్ లైసెన్స్‌ల..!
భారీ వాహనాలను అలవోకగా డ్రైవ్ చేస్తున్న ఈ బామ్మను చూసి వామ్మో..! అనాల్సిందే. చాలా చాకచక్యంగా నడిపేస్తోంది. అంతేకాదు హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌ని కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది కూడా. అలాంటి వాహనాలను నడపడం కేవలం మగవాళ్లు మాత్రమే చేయగలరన్న మూసధోరణిని మూలనపడేసింది. సామర్థ్యం ఉంటే ఎవ్వరైనా.. చేయగలరని చేసి చూపించింది ఈ సూపర్ బామ్మ..!. ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..మణి అమ్మగా పిలచే రాధామణి అమ్మ..కేరళకు చెందిన 71 ఏళ్ల మహిళ. తన అద్భతమైన డ్రైవింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె జేసీబీలు దగ్గర నంచి క్రేన్ల వంటి భారీ వాహనాల వరకు ప్రతీది ఈజీగా నడిపేస్తుంది. అంతేకాదండోయే ఏకంగా విభిన్న హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్‌ల 11 పొందిందట. తాను ఈ హెవీ వెహికల్స్‌ని ఇంత అలవోకగా నడపడానికి కారణం.. తన భర్తదే క్రెడిట్ అంటోంది. మహిళలు అస్సలు డ్రైవింగ్ నేర్చకోవడానికి ముందుకురాని కాలంలో ఆమె తన భర్త అండదండలతో భారీ వాహనాలను డ్రైవ్ చేయడం నేర్చుకుంది. అలా ఆమె 1981లో ఫోర్ వీలర్ లైసెన్స్ పొందింది. ఆ తర్వాత 1984లో హెవీ వెహికల్ లైసెన్స్ పొందింది. ఆ టైంలో కేరళలో మహిళలు హెవీ వెహికల్ లైసెన్స్ పొందడంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. అంతేగాదు తాను ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌ని ఎలా స్థాపించారో కూడా వివరించారు. 2004లో భర్త మరణంతో రాధమణి ఈ రంగంలో పలు అడ్డంకులను ఎదుర్కొంది. అయిన ప్పటికీ పట్టుదలతో డ్రైవింగ్ స్కూల్ భాద్యతలు చేపట్టి డ్రైవింగ్ కమ్యూనిటీ లీడర్ స్థాయికి ఎదిగింది. మొదట్లో అది ఏ2Z డ్రైవింగ్ స్కూల్ ఆ తర్వాత కాలక్రమేణ ఏ2Z ఇన్స్టిట్యూట్గా మారింది. ఇక్కడ మణి అమ్మ..అన్ని రకాల భారీ పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలో శిక్షణ ఇస్తుంది. ఈ వయసులో కూడా ఆమె చదువు కొనసాగిస్తోంది. ఆమె ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేస్తోంది. అంతేగాదు తాను మొదట్లో భారీ వాహనాల డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడూ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో గర్తు చేసుకున్నారు. ఆ టైంలో డ్రైవింగ్ నేర్చకోవడం ఓ సవాలుగా ఉండేదన్నారు మణి అమ్మ. అంతేగాదు చిన్న వాహనాల కంటే భారీ వాహనాల నడపటమే సులభమని ఆమె నొక్కిచెబుతున్నారు. తాను ఎన్ని ఆటంకాల ఎదురైనా అంకితభావంతో వేర్వేరు భారీ వాహనాల 11 లైసెన్స్‌లు పొందినట్లు చెప్పుకొచ్చారు. నేర్చుకోవాలన్న అభిరుచి ఉన్నవాళ్లకి వయోభేదం పెద్ద సమస్య కాదంటున్నారు. అలాగే డ్రైవింగ్ అనేది ఏ ఒక్క లింగానికో పరిమితం కాదని రాధామణి నొక్కి చెబుతున్నారు. నిజంగా రాధామణి గ్రేట్ కదూ. మన అమ్మమల కాలంలోనే ఆమె ఇంత అలవోకగా నేర్చుకోవడమే గాక ఇతరులకు మెళ్లకువలు నేర్పిస్తున్నారు. పైగా మహిళలు ఈ రంగంలోకి ధైర్యంగా రావొచ్చు, సంకోచించాల్సిన పని లేదంటన్నారు రాధామణి.(చదవండి: ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..) -
డ్రైవింగ్ మణి @ 71
వయసు అరవై దాటిందంటే చాలు ‘ఇంకా ఏం పనులు చేస్తావు, విశ్రాంతి తీసుకో..’ అనే సలహాలు ఇస్తుంటారు. కొందరు ఆ సలహాలను కూడా సవాళ్లుగా తీసుకుంటారు. కొన్ని అభిరుచులను జీవితకాల సాధనగా మార్చుకుంటారు. ఈ మాటలను నిజం చేస్తోంది 71 ఏళ్ల రాధామణి. ఇప్పటివరకు 11 హెవీ వాహనాల లైసెన్స్‌లను పొంది మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందరూ మణి అమ్మ అని పిలుచుకునే రాధామణి కేరళవాసి. సాధనమున ఏవైనా సమకూరుతాయి అని నిరూపిస్తున్న రాధామణి ఇప్పుడు ఇంజినీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ ఈ రంగంలో ఎదగడానికి చేస్తున్న కృషి అందరికీ ఓ స్ఫూర్తి మంత్రం. 1984లో కేరళలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన రాధామణి ఇప్పటికీ ‘వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు’ అని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా చూపుతుంది. స్కూటర్ నుంచి జేసీబీ వరకు సాధారణంగా మహిళలు స్కూటర్, కార్ డ్రైవింగ్‌తో సరిపెట్టేస్తారు. రాధామణి మాత్రం అంతటితో ఆగలేదు. డ్రైవింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి ప్రోత్సాహాన్నిచ్చిన భర్తను గర్తుచేసుకుంటూ ‘‘1981లో మొదటిసారి ఓ అంబాసిడర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లలోపు ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాను. ఆ విధంగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా కూడా గుర్తుంపు పొందాను. ఎ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైనింగ్ స్కూల్నుప్రారంభించాను’ అని వివరిస్తుంది. ఈ వెంచర్‌ను రాధామణి భర్త పదేళ్లకు ముందుగానే ప్రారంభించాడు. అక్కడ నుంచే ఈ జంట డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ రాధామణి పేరుతో లైసెన్స్ పొందడానికి స్కూల్ రిజిస్టర్ చేయడానికి కష్టంగా మారింది. దీంతో రాధామణి హెవీ డ్రైనింగ్ లైసెన్స్‌లు పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్నేళ్ల న్యాయ ΄ోరాటం తర్వాత ఈ జంట కేరళలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లెర్నింగ్ స్కూల్‌ను రాధామణి పేరుతో రిజిస్టర్ చేయగలిగారు. సంకల్పంతో నిలబెట్టింది.. రాధామణి భర్త 2004లో మరణించాడు. ఆ తర్వాత ఈ వెంచర్ మరింతప్రాముఖ్యతను నింపుకుంది. మణి అమ్మ సంకల్పం ఆ ట్రైనింగ్ స్కూల్‌ను నిలబెట్టడం ఒక్కటే కాదు, దానిని ఒక సంస్థగా మార్చేందుకు కృషి చేయడం కూడా! అందుకే ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ రంగమైనా హెవీ డ్రైవింగ్ అంటే ముందు పురుషులే గుర్తుకు వస్తారు. అలాంటి ఆలోచనకు తావు ఇవ్వకుండా, వయసు నింబధనలను కూడా ధిక్కరిస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్‌ను రాధామణి నడుపుతోంది. అందుకు మరింతగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజనీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రికార్డ్ల చక్రం ఆమె అద్భుతమైన నైపుణ్యాలు, అంకితభావాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ‘ఇన్సి ్పరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది సంస్థ. రాధామణి అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుతోంది. అక్కడ ఆమె తన డ్రైవింగ్ అనుభవాలను పంచుకుంటుంది. వయసు లేదా జెండర్‌తో సంబంధం లేకుండా కలలను పండించుకునేందుకు తగిర ప్రేరణను ఇస్తోంది రాధామణి. సోషల్ మీడియాలో.. రాధామణి ఇన్స్టాగ్రామ్ పేజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జేసీబీలు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లు, ఫెరారీలు, పడవలు, ట్యాంకర్లు, జిప్సీ, పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ప్రతి వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న 19కె ఫాలోవర్లు మణి అమ్మను ప్రశంసిస్తుంటారు. ఎంతోమంది చేత సత్కారం పొందుతుంటారు. చాలా మంది మహిళలకు హెవీ డ్రైవింగ్ పరికరాల గురించి చెప్పడం, నేర్పడం చూడచ్చు. రాధామణి అమ్మ అంటే ఆవేశం, పట్టుదల, శక్తికి నిదర్శనం. ఆమె కేవలం రోడ్డుపైనే కాదు అడ్డంకులను ఛేదించి చక్రాన్ని చేరుకోవడానికి తగిన స్ఫూర్తిని ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. -
Hyderabad: సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోకి భారీ వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధిస్తూ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ♦ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన కమర్షియల్ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు. ♦లోకల్ లారీలతో పాటు నిర్మాణ సామాగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. ♦ డీసీఎం, ఐచర్, స్వరాజ్ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువుతో కూడినవి) మధ్యా హ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే తిరగాలి. ♦ ప్రైవేట్ బస్సులు కేవలం రాత్రి 10 నుంచి ఉ. 8 గంటల మధ్యనే నగరంలో ప్రయాణించాలి. ♦ అత్యంత నెమ్మదిగా నడిచే కేటగిరీకి చెందిన చేతితో తోసే బళ్లు, వివిధ రకాలైన జంతువులు లాగే బళ్లు, సైకిల్ రిక్షాలు, ట్రాక్టర్లు తదితరాల సంచారాన్ని నగరంలోని కీలకమైన 61 టూర్లలో నిషేధించారు. ♦ భవన నిర్మాణ, కూలి్చవేత వ్యర్థాలను తరలించే వాహనాల్లో 2 నుంచి 6 టన్నుల మధ్య బరువు కలిగినవి ఉ. 11.30 నుంచి సాయంత్రం 5, రా త్రి 10 నుంచి ఉదయం 9 మధ్య సంచరించాలి. ♦ వీటిలో 10 టన్నులు అంతకంటే ఎక్కువ బరువుతో కూడిన వాహనాలు కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. -
ఏటీఎస్‌లలో ఫిట్నెస్ పరీక్షల గడువు పెంపు
న్యూఢిల్లీ: భారీ సరుకు వాహనాలు, ప్రయాణికుల కోసం ఉపయోగించే భారీ వాహనాలకు నమోదిత ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) ద్వారా తప్పనిసరి ఫిట్నెస్ పరీక్ష తేదీని ప్రభుత్వం 18 నెలల పాటు పొడిగించింది. ఈ నిబంధన 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుందని రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ మినిస్ట్రీ వెల్లడించింది. వాస్తవానికి ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. మధ్యస్థాయి, తేలికపాటి సరుకు రవాణా వాహనాలు, మధ్యస్థాయి ప్యాసింజర్ వెహికిల్స్‌కు 2024 జూన్ 1 నుంచి తప్పనిసరి చేయాలని గతంలో నిర్ణయించారు. తాజా ప్రకటన ప్రకారం ఈ వాహనాలకు అన్నిటికీ సామర్థ్య పరీక్షలు 2024 అక్టోబర్ 1 నుంచి ఏటీఎస్ ద్వారా తప్పనిసరిగా జరపాల్సి ఉంటుంది. రవాణాయేతర వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో (వాహనం కొన్న 15 ఏళ్లకు) ఫిట్నెస్ పరీక్షలు చేపడతారు. -
‘లైనే కదా అని దాటితే.. జరిమానా మోత
సాక్షి, అమరావతి: ‘లైనే కదా అని దాటితే.. జరిమానా మోత మోగుతుంది..’ అంటోంది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ). హైవేలపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. హైవేలతోపాటు రాష్ట్ర ప్రధాన రహదారులపై కూడా ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మార్కింగ్ లైన్లు దాటి వాహనాలు ప్రయాణిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో హైవేలపై భారీ వాహనాలు మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణించడంతో సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో 8,200 మంది దుర్మరణం చెందారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ప్రధానంగా భారీ వాహనాలు మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణిస్తుండటం ప్రమాదాలకు దారితీస్తోందని గుర్తించారు. మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణించే వాహనాలపై ఎన్హెచ్ఏఐ భారీ జరిమానాలను ఖరారుచేసింది. భారీ వాహనాలు కచ్చితంగా హైవేలపై ఎడమలైన్‌లోనే ప్రయాణించాలి. ముందు నెమ్మదిగా వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయాల్సి వస్తే తప్ప లైన్ దాటడానికి వీల్లేదు. అలా ఓవర్టేక్ చేసిన వెంటనే మళ్లీ ఎడమవైపు లైన్లోకి వచ్చేయాలి. అలాకాకుండా ఒక 200 మీటర్లకు మించి ఎడమవైపు లైన్‌ను దాటి ప్రయాంచే భారీ వాహనాలపై తొలిసారి రూ.500 జరిమానా విధిస్తారు. అదే వాహనం తరువాత లైన్ క్రాస్‌చేస్తే ప్రతిసారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తారు. నిబంధనలు పాటించాలి భారీ వాహనాలు కచ్చితంగా నిబంధనలను పాటించేలా హైవే పెట్రోలింగ్ అధికారులు కన్నేసి ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించిన వాహనాలతోపాటు హైవేలపై ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, టోల్గేట్ల వద్ద సీసీ కెమెరాల పుటేజీలను తరచూ పరిశీలించి నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై జరిమానాలు విధిస్తారు. రాష్ట్ర రహదారులపైన కూడా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని కేంద్ర రవాణాశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందుకుగాను రాష్ట్ర ప్రధాన రహదారులపై వాహనచోదకులకు మార్గనిర్దేశం చేసేలా సైన్ బోర్డులు, లైన్ మార్కింగులు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త జరిమానాల విధానం అమలు చేయాలని చెప్పింది. ఈ లోపు రాష్ట్ర ప్రధాన రహదారులపై సైన్ బోర్డులు, లైన్ మార్కింగ్‌లు పూర్తిచేయాలని సూచించింది. -
వాహనదారులకు అలర్ట్: ఆ హైవేపై భారీ వాహనాలకు నిషేధం
సాక్షి, ముంబై: గణేశోత్సవాలు సమీపించడంతో కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ముంబై–గోవా జాతీయ రహదారి–66పై రాయ్‌గఢ్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు వివిధ ఏర్పాట్లు పూర్తి చేశారు. ముంబై, థానే సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు, జిల్లాల నుంచి కొంకణ్‌లోని స్వగ్రామాలకు బయల్దేరిన భక్తులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా రహదారి వెంబడి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రతకు ప్రధానపీట వేస్తూ అదనపు పోలీసు బలగాలతోపాటు హోం గార్డుల సాయం కూడా తీసుకున్నారు. ఇదివరకే ముంబై–గోవా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గణేశోత్సవాలు ముగిసే వరకు ట్రక్కులు, కంటైనర్లు, ట్యాంకర్లు, ట్రేలర్లు లాంటి భారీ వాహనాలకు నిషేధం విధించారు. ఇందులో కూరగాయలు, పప్పు దినుసులు, ఇతర నిత్యావసర సరుకులుచేసే వాహనాలకు మినహాయింపునిచ్చారు. దీన్నిబట్టి ముంబై–గోవా జాతీయ రహదారిపై ఏ స్థాయిలో వాహనాల రద్దీ ఉంటుందో ఇట్టే అర్థమైతోంది. 3,500 ప్రత్యేక బస్సులు కొంకణ్ రీజియన్‌లో ఏటా గణేశోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు ప్రతీ ఇంటిలో గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తారు. దీంతో ఉద్యోగ, వ్యాపార రీత్యా రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ స్థిరపడిన వారు గణేశోత్సవాలకు స్వగ్రామానికి చేరుకుంటారు. దీంతో ముంబై–గోవా జాతీయ రహదారి ఉత్సవాలు ముగిసేవరకు రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా గణేశోత్సవాలకు కొంకణ్, సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. వీటితోపాటు ఎమ్మెస్సార్టీసీ కూడా ఏటా 3,500 పైగా ప్రత్యేక బస్సులు వివిధ బస్ డిపోల నుంచి నడుపుతుంది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, కార్లు, జీపులు, ఇతర పికప్ వాహనాలు నడుస్తాయి. అయినప్పటికీ రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఎటూ సరిపోవు. ఇప్పటికే ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో దాదాపు 1.5 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. వినాయక చవితి ఇంకా రెండ్రోజులే ఉండటంతో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని అంటున్నారు. కొంకణ్, సెంట్రల్ రైల్వే రీజియన్లు సంయుక్తంగా నడుపుతున్న 60–70 ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ ఫుల్ అయ్యాయి. వెయిటింగ్ లిస్టు 600–700 వరకు చేరుకుంది. దీన్ని బట్టి గణేశోత్సవాలకు ఏ స్థాయిలో ప్రజలు స్వగ్రామాలకు బయల్దేరుతారో స్పష్టమవుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా గణేశోత్సవాలు సాదాసీదాగా నిర్వహించారు. ఎక్కడున్నవారు అక్కడే ఉండిపోయారు. దీంతో స్వగ్రామాలలో జరిగే ఉత్సవాలకు అనేకమంది హాజరు కాలేకపోయారు. కానీ ఈసారి బీజేపీ ప్రభుత్వం ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో స్వగ్రామాలకు బయల్దేరే వారి సంఖ్య రెట్టింపు అయింది. జాతీయ రహదారిపై పూర్తయిన ఏర్పాట్లు రాయ్‌గడ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశోక్ దుభే నేతృత్వంలో ముంబై–గోవా నేషనల్ హై వే–66పై ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. గణేశోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి అవి ముగిసేవారు అంటే సెప్టెంబరు 9 వ తేదీ వరకు ఏకంగా 80% పోలీసులను ఈ రహదారిపై నియమించారు. ఖార్పాడా నుంచి పోలాద్పూర్ వరకు పది ప్రత్యేక పోలీసు సహాయ కేంద్రాలను నియమించారు. ఖార్పాడ నుంచి కశేలీ ఘాట్ సెక్షన్లో ఓ అప్పర్ సూపరింటెండెంట్, ఐదుగురు ఉప విభాగ అధికారులు, 11 మంది పోలీసు ఇన్స్పెక్టర్లు, 27 సబ్ ఇన్స్పెక్టర్లు, 225 కానిస్టేబుళ్లను నియమించారు. హోం గార్డు బృందాల సాయం కూడా తీసుకుంటున్నారు. ఘాట్ సెక్షన్లో ట్రాఫిక్ జామ్ కాకుండా 24 గంటలు వాకిటాకీల సాయంతో అప్రమత్తంగా ఉంటారు. ప్రమాదానికి గురైన వాహనాలను లేదా మరమ్మతుల నిమిత్తం రోడ్డుపై నిలిచిపోయిన వాహనాల వల్ల ట్రాఫిక్ స్తంభించకుండా ఉండేందుకు అక్కడక్కడా 18 హైడ్రాలిక్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. వీటి సాయంతో ఆగిపోయిన వాహనాలను రోడ్డు పక్కకు నెట్టేస్తారు. అదేవిధంగా 30 చోట్ల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే గాయపడిన ప్రయాణికులకు వెంటనే ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు పన్వేల్, పేణ్, మాణ్గావ్, మహాడ్, పోలాద్పూర్ తదితర ఉప జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వైద్య బృందాలను నియమించారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించేందుకు 14 అంబులెన్స్‌లు కూడా ఉంచారు. ప్రమాదాలను నివారించేందుకు రాయ్‌గఢ్ జిల్లా పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలు (వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణంలో కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.).... ►రాంగ్ సైడ్‌లో, వేగంగా వాహనాలు నడపకూడదు. ►సామర్థ్యానికి మించి ప్రయాణికులను చేరవేయరాదు. ►రోడ్డుకు ఇరువైపులా హెచ్చరికల బోర్డులను, ప్రమాదకర మలుపులను పరిశీలిస్తూ వాహనాలను నడపాలి. ►వాహనం నడుపుతున్న వారు అలసిపోయినా లేదా అలసట, నిద్ర వచ్చినా వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపివేసి విశ్రాంతి తీసుకోవాలి. ►సాధ్యమైనంత వరకు రాత్రి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి ►ముంబై–గోవా జాతీయ రహాదారిపై రద్దీని నియంత్రించేందుకు అందరూ ఒకే మార్గంలో వెళ్లకుండా ప్రత్యామ్నాయ రోడ్లను కూడా వినియోగించాలి. ►పార్కింగ్ చేయడానికి తగినంత స్థలం ఉన్న చోటే వాహనాలను ఆపండి. రోడ్డుపై లేదా రోడ్డుకు ఆనుకుని పార్కింగ్ చేయవద్దు ►డాబాలు, హోటళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయే విధంగా వాహనాలు నిలుపకూడదు. ►అత్యవసర సమయంలో పోలీసులు, సహాయక బృందాల సాయం తీసుకోవాలి. -
హైదరాబాద్: చలో అంటే చల్తా నై!
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని సమయంలో నగరంలోని రహదారులపైకి దూసుకువస్తున్న భారీ వాహనాలు, డీసీఎంల కారణంగానూ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇలా వస్తున్న వాహనాలకు చలాన్ విధించడంతో సరిపెట్టారు. ఇకపై వీటిని ఆంక్షలున్న సమయం ముగిసే వరకు ఆపేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు బేఖాతరు.. ►అనుమతి పొందినవి మినహా నగరంలోకి భారీ వాహనాలు, లారీలు, డీసీఎంల ప్రవేశంపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల మధ్యలోనే ఇవి నగరంలో సంచరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తున్న నిర్వాహకులు, డ్రైవర్లు ఎప్పుడుపడితే అప్పుడు దూసుకువచ్చేస్తున్నారు. ఈ ఉల్లంఘనపై ‘నో ఎంట్రీ’ కేసులు రాస్తున్న ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. ఏటా 30 వేల నుంచి 50 వేల వరకు ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. చదవండి: ప్రియుడితో పిజ్జాహట్‌కు.. మొదటి భార్యతో కలసి వీడియో రికార్డింగ్ ►ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అనుమతి లేని వేళలో నగరంలోని ప్రవేశించేసి ఓసారి చలాన్ వేయించుకుంటున్నారు. దీన్ని చూపిస్తూ ఆ రోజంతా సిటీలో విహరించేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ప్రతి జంక్షన్‌లోనూ జరిమానా విధించే అవకాశం ఉన్నా.. ఇప్పటి వరకు మానవతా దృక్పథంతో పోలీసులు అలా చేయలేదు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న కొన్ని కంపెనీలు తమ వాహనాలను నో ఎంట్రీ సమయంలోనూ తిప్పేస్తున్నాయి. రోజుకు ఒక చలాన్ చొప్పున చెల్లిస్తూ తమ పని కానిచ్చుకుంటున్నాయి. వీటి వల్ల ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతూ ఇతర వాహనచోదకులు ఇబ్బందులు పడటంతో పాటు కొన్నిసార్లు ప్రమాదాలూ జరుగుతున్నాయి. పెద్ద ప్రహసనమే.. వీటిని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆయా వాహనాలు కనిపించిన వెంటనే ఆపి చలాన్ వేయడంతో పాటు నిషేధిత సమయం ముగిసే వరకు అనువైన ప్రాంతంలో ఆపేయాలని నిర్ణయించారు. మరోపక్క ఇలాంటి ‘నో ఎంట్రీ వాహనాలను’ స్వాధీనం చేసుకునే ఆస్కారం సైతం పోలీసులకు ఉంది. అయితే దీని వెనక పెద్ద ప్రహసనమే ఉంటోంది. రహదారిలో ఓ ప్రాంతంలో ఇలాంటి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడే ఉంచడం సాధ్యం కాదు. దాని డ్రైవర్‌ను పంపేసినా మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ పోలీసుస్టేషన్కో, గోషామహల్ స్టేడియానికో తరలించాలి. ఆపై సదరు డ్రైవర్/యజమాని జరిమానా చెల్లించి వచ్చి తీసుకువెళ్లే వరకు దాన్ని భద్రపరచాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మించి అనుమతి లేని సమయంలో వచ్చిన భారీ వాహనంలో నిత్యావసర, అత్యవసర, సున్నిత వస్తువులు ఉంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. భారీ శబ్దాలతో నరకం.. ►నో ఎంట్రీ సమయంలో వస్తున్న భారీ వాహనాల్లో డీసీఎంలే ఎక్కువ. ప్రమాదాల్లోనూ వీటిది పెద్ద స్థానమే. మరోపక్క రాత్రి అయిందంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులతో నిండిపోతున్నాయి. అడ్డదిడ్డంగా నడిచే ఈ వాహనాలు, అడ్డగోలుగా పార్కింగ్స్, భయానకమైన శబ్దాలు చేసే హారన్లు తోటి వాహనచోదకులతో పాటు నగర వాసులకూ నరకాన్ని చూపిస్తున్నాయి. ►రాత్రి 10 గంటల లోపు ప్రైవేట్ బస్సులు సిటీలోకి రావడానికి అనుమతి లేదు. రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనలు బేఖాతరు చేయడం, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పార్కింగ్ చేయడం పరిపాటగా మారింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆయా వాహనాలకు నిర్దిష్ట విధానం రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ సమస్య తీరాలంటే ప్రయాణికుల్ని ఎక్కించుకోవడానికి, దింపడానికి ఈ వాహనాల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసుస్టేషన్ల వారీగా గుర్తించి ఏర్పాట్లు చేస్తేనే ఈ బస్సుల హడావుడికి చెక్ చెప్పవచ్చనే వాదన వినిపిస్తోంది. -
డీజిల్ కోసం వాహనాల అపహరణ
భవానీపురం(విజయవాడ పశ్చిమ): భారీ వాహనాల్లోని డీజిల్ దొంగిలించేందుకు ఏకంగా ఆరు లారీలు, ఒక కాలేజీ బస్‌ను చోరీ చేసిన నిందితుడిని, డీజిల్ కొనుగోలు చేసే వ్యక్తిని విజయవాడ భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం భవానీపురం ఐరన్ యార్డ్‌లోని ఒక లారీని ఎత్తుకుపోగా..దానికి ఏర్పాటు చేసిన జీపీఎస్ ద్వారా డీజిల్ అమ్ముతున్న దొంగ గుట్టు రట్టయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన వరుస లారీ దొంగతనాలపై భవానీపురం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. భవానీపురంలో నివసించే ఆటో డ్రైవర్ వెంకటరెడ్డి హాల్టింగ్ డ్రైవర్‌గా లారీ, బస్, కారు తోలేవాడు. మద్యం ఇతర దుర్వ్యసనాలకు బానిస అయిన అతను దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. తద్వారా వచ్చే డబ్బుతో జల్సా చేయడం మొదలు పెట్టాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అతన్ని దూరంగా పెట్టారు. ఈ క్రమంలోనే భవానీపురంలోని లారీ స్టాండ్‌పై పూర్తి అవగాహన ఉన్న అతను గత నెల 15వ తేదీ తరువాత స్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న లారీని ఎత్తుకు పోయాడు. రెండు మూడు రోజులు గడిచిన తరువాత మరో లారీ, ఆ తరువాత మరో లారీ చోరీ చేశాడు. ఈ దొంగతనాలన్నీ పట్టపగలే జరగడం గమనార్హం. అదే విధంగా లారీ స్టాండ్‌కు కూతవేటు దూరంలో పార్క్ చేసి ఉంచిన ఎన్ఆర్ఐ కాలేజీ బస్‌ను ఎత్తుకు పోయాడు. వరుస దొంగతనాలతో స్టాండ్‌లో అలజడి మొదలు కావడంతో ఇక అక్కడ క్షేమం కాదనుకున్నాడో ఏమో డీజిల్ దొంగ భవానీపురం ఐరన్ యార్డ్‌పై దృష్టి పెట్టి, మూడు లారీలను చోరీ చేశాడు. అందులో యార్డ్‌లో సాయినాథ్ ట్రాన్స్పోర్ట్కు చెందిన పార్శిల్ లారీ ఒకటి. దానిని ఎత్తుకుపోవడంతో సంబంధిత వ్యక్తులు అప్రమత్తమయ్యారు. ఆ లారీకి ఉన్న జీపీఎస్ ద్వారా లారీ గన్నవరం మండలం ముస్తాబాదలోని ఒక రేకుల షెడ్ ముందు ఉండటాన్ని గుర్తించారు. లోపలకు వెళ్లి చూడగా దొంగిలించిన డీజిల్‌ను కొనుగోలు చేసే వ్యక్తి దొరికాడు. అతన్ని నిలదీయటంతో డీజిల్ దొంగ పట్టుబడ్డాడు. ఇద్దర్నీ పట్టుకుని గన్నవరం పోలీసులకు అప్పగించారు. చోరీకి గురైన లారీల్లో ఒకటి గన్నవరం మండలం కేసరపల్లి రోడ్డు మీద, మరో రెండు రామవరప్పాడు బైపాస్‌లో, ఎన్ఆర్ఐ కాలేజీ బస్ విద్యాధరపురం రామరాజ్యనగర్ రైలు కట్ట వద్ద దొరికాయి. ఈ ఘటనకు సంబంధించి భవానీపురం పీఎస్‌లో శనివారం కేసు నమోదైంది. -
కనకదుర్గ ఫ్లైవోవర్‌పై భారీ వాహనాల నిషేధం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కనకదుర్గ ఫ్లైవోవర్‌పై పగటి వేళల్లో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే.. చిన్నకార్లు, ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సిలెండర్ల వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. అక్టోబర్ 16న కనకదుర్గ ఫ్లైవోవర్ ప్రారంభమైన విషయం విదితమే. ప్రైవేటు బస్సులు స్వాతి సెంటర్ మీదుగా కొండ తిరిగి రావాల్సిందేనని, రాత్రి 11 గంటల తరువాత లారీలు భారీ వాహనాలను అనుమతిస్తామని అధికారులు వివరించారు. -
నో ఎంట్రీ..
నిడదవోలు : మండలంలోని సమిశ్రగూడెం గ్రామంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై బ్రిటీష్ హయాంలో 1932లో నిర్మించిన పురాతన వంతెనపై భారీ వాహనాల రాకపోకలపై అధికారులు నిషేధం విధించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి భారీ వామనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆర్అండ్బీ ఏఈ డి.నందకిశోర్ తెలిపారు. భారీ లోడు వాహనాలు వెళ్తే వంతెన కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని ఇటీవల హైదారాబాద్ నుంచి స్రైయోరంట్ సంస్థకు చెందిన నలుగురు బృదం సభ్యులు నివేదికలు అందించారు. నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఆర్‌అంబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. పురాతన వంతెనపై 10 టన్నులకు మించి లోడు వాహనాలను పూర్తిగా నిషేధించారు. వంతెనపై గంటకు 15 కిలోమీటర్లకు మించి ఎటువంటి వాహనాలు వెళ్లరాదని హెచ్చరించారు. వంతెన ముఖద్వారంలో 10 అడుగుల దూరంలో ఐరన్ గడ్డర్( స్టాపర్)ల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా నిడదవోలు పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ముఖద్వారంలో ఐరన్ స్టాపర్లను ఏర్పాటు చేయనున్నారు. వాహనాల దారి మళ్లింపు ఇలా... నిడదవోలు మండలం సమిశ్రగూడెం వంతెన వద్ద ఇరుకు, భారీ వాహనాలు నిషేధించడంతో పాటు బరువు 10 టన్నులు, వేగ పరిమితి గంటకు 15 కిలోమీటర్లు మాత్రమేనని హెచ్చరిక బోర్డులను ఆర్అండ్బీ అధికారులు ఏర్పాటు చేశారు. అదే విధంగా కొవ్వూరు మండలం పంగిడి, తాడేపల్లిగూడెం మండలం ప్రత్తిపాడు జంక్షన్లో నిడదవోలు వైపుగా భారీ వాహనాలు రాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రాజమండ్రి, కొవ్వూరు నుంచి తాడేపల్లిగూడెం వైపుగా వెళ్లే వాహనాలు సమిశ్రగూడెం వంతెన ఎడమ వైపు నుంచి డి,ముప్పవరం, కానూరు, పెరవలి, తణుకు మీదుగా మళ్లిస్తారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రికి వెళ్లాల్సిన భారీ వాహనాలు ప్రత్తిపాడు నుంచి తణుకు, రావులపాలెం మీదుగా రాజమండ్రి చేరుకోవచ్చును. -
స్పెషల్ డ్రైవ్ తగ్గింది.. డ్రంక్ పెరిగింది
జమ్మలమడుగు: మద్యం సేవించి వాహనం నడపడమే నేరం.. ఇక మద్యం మత్తులో వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదం చేసి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటే అది మరింత పెద్ద నేరమవుతుంది. అలాంటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ నియంత్రణ పేరుతో ద్విచక్రవాహన దారులను ముప్పు తిప్పలు పెట్టే పోలీసులు లారీలు తదితర భారీ వాహనాల డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ద్విచక్రవాహనదారులకు ఆర్సీ, లైసెన్సు లేవంటూ వందలాది రూపాయల జరిమానా విధించే పోలీసులు లారీ డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నా వారిపై చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాల్లో మరణించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. గత గురువారం రాత్రి జమ్మలమడుగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ శ్రీనివాసులు మద్యం తాగి వాహనాన్ని నడపడంతోనే వేగంగా వచ్చి వెనుకవైపు నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ముగ్గురు రాజస్థాన్ యువకుల మృతికి కారకుడయ్యాడని తెలుస్తోంది. ద్విచక్రవాహనదారులు సరైన మార్గంలో వెళ్లడమే గాక, వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్‌పెట్టుకుని వాహనం నడుపుతున్నా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడాల్సి వచ్చింది. లారీలు మద్యం దుకాణాల వద్ద నిలబడి.. లారీ డ్రైవర్లు మద్యం దుకాణాల వద్ద వాహనాలను నిలిపి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని తెలిసినా వారి జోలికి పోలీసులు వెళ్లలేని పరిస్థితి ఉంది. అయితే కేసులు అవసరమైనప్పుడు మద్యం దుకాణం వద్దే బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్ పట్టుకుని నిలబడే పోలీసులు ద్విచక్రవాహనదారులకు చమటలు పట్టిస్తున్నారు. అదే భారీ వాహన డ్రైవర్ మద్యం మత్తులో ఉంటే ఎంత భారీ నష్టం జరుగుతుందో తెలిసి కూడా పోలీసులు వారి గురించి పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాదిలో ఘోర ప్రమాదం.. జమ్మలమడుగు సమీపంలో గత గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఈ ఏడాదిలో ఘోర రోడ్డు ప్రమాదంగా చెప్పుకోవచ్చు. 2017 జనవరిలో పట్టణంలో మద్యం తాగి వాహనం నడుపుతూ డివైడర్లకు ఢీకొని ముగ్గురు యువకులు మరణించారు. ఈ సంఘటన తర్వాత ప్రమాదంలో ఒకే సారి ముగ్గురు వ్యక్తులు మరణించడం ఈ ఏడాది ఇదే తొలి సంఘటన. దానితో పాటు గతేడాది మే నెలలో ట్యాంకర్ డ్రైవర్ ఆర్టీసీ బస్సును ఓవర్ టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొని ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు బలిగొన్నాడు. నియోజకవర్గంలో ఎక్కువగా లారీ ఇతర వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరిగినట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. లారీ డ్రైవర్లకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలి.. పట్టణంలో నుంచి ఇటివల కాలంలో భారీగా లారీలు వెళుతున్నాయి. డ్రైవర్లు మద్యంషాపుల వద్ద వాహనాలను నిలిపి మద్యం సేవించి వెళుతున్నారు. దీని వల్ల రోడ్లపై వెళ్లే వారు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. – భూతమాపురం సుబ్బారావు, న్యాయవాది, జమ్మలమడుగు -
కృష్ణానదిలో రవాణా పంట్ ట్రైల్‌రన్
ఇబ్రహీంపట్నం: రాజధాని నిర్మాణానికి ముడి సరకులు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన జలరవాణా పంట్‌కు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహించారు. సుమారు 700 టన్నుల బరువు మోయగల సామర్థ్యమున్న పంట్‌పై 40 టన్నుల బరువుండే ఆరు భారీ వాహనాలను ఎక్కించి ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి లింగాయపాలెం రేవు వరకు నడిపారు. 240 టన్నులకే నదిలో అక్కడక్కడ భూగర్భం తగలడంతో నదిలో డ్రెడ్జింగ్ చేపట్టాలని నిర్వాహకులు గుర్తించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇనుము, సిమెంట్, కంకర, ఇతర సామగ్రిని అమరావతి ప్రాంతానికి తరలించాలంటే విజయవాడ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. దుర్గ గుడి ప్లైఓవర్ నిర్మాణంతో రాత్రివేళల్లో మాత్రమే రవాణా వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెర్రీలో ఏర్పాటు చేసిన పంట్తో ఒకేసారి 15 నుంచి 20 భారీ వాహనాలు గుంటూరు జిల్లా వైపు వెళ్లేందుకు మార్గం సుగుమం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు విజయవాడకు రాకుండానే గుంటూరు జిల్లా చేరుకోవచ్చు. స్థానికుల అభ్యంతరం జాతీయ రహదారి నుంచి ఫెర్రీకి భారీ వాహనాలు వెళ్తుండడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీకి వెళ్లే రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. అక్కడినుంచి పట్టిసీమ కాలువ వెంట ఉన్న రహదారి ఇప్పటికే నాణ్యత కోల్పోయిందని, అందువల్ల భారీ వాహనాలను ఎలా అనుమతిస్తారని స్థానికులు మండిపడుతున్నారు. -
ప్రవేశం.. ప్రమాదభరితం..
► ఇరుకు రోడ్డు.. ►మధ్యలోనే నిలిచిపోయిన వెడల్పు పనులు ►జిల్లాకేంద్రం ప్రవేశ రహదారి దుస్థితి.. నిర్మల్‌రూరల్ : అసలే ఇరుకైన రోడ్డు.. ఆపై ఇరువైపులా పదుల సంఖ్యలో భారీ వాహనాలతో జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే ప్రధాన రహదా రి ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు వెడల్పు పనులు చే పట్టినా మధ్యలోనే నిలిపివేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కడ్తాల్ ఎక్స్ రోడ్డు నుంచి జిల్లాకేంద్రం వరకు 44 నంబర్ జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ మా ర్గంలో సగటున రెండురోజులకు ఒక ప్రమాదం జరుగుతోంది. ఇటీవలే ఓ ప్రముఖ దంత వైద్యుడు రోడ్డుప్రమాదంలో ఇక్కడే మృత్యువాత పడ్డారు. ఇరుకుగా ఉండటంతో పాటు ప్రమాదకరంగా మూలమలుపులూ ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో నిత్యం ఏదో ఒకచోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. పనులు ప్రారంభించినా.. జిల్లాకేంద్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారికి కడ్తాల్ ఎక్స్‌రోడ్డు నుంచి బైపాస్ వేసి పట్టణం బయట నుంచి మళ్లించారు. దీంతో కడ్తాల్ ఎక్స్‌రోడ్డు నుంచి పట్టణం వరకు గల పాత జాతీయ రహదారిని మాత్రం అలాగే వదిలేశారు. అనంతరం స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చొరువ తీసుకుని రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. ఈమార్గంలోని కల్వర్టు వెడల్పు పనులు పూర్తిచేశారు. కానీ రోడ్డు విస్తరణ పనులు మాత్రం చేపట్టడం లేదు. ప్రమాదాలకు కేరాఫ్.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి జిల్లాకేంద్రంలోకి ప్రవేశించి మార్గం ప్రమాదకరంగా మారింది. ఈమార్గంలో సోఫినగర్ దర్గా వద్ద, కంచెరోని చెరువు కట్ట, శ్యాంగఢ్ వద్ద మూలమలుపులు అత్యంత ప్రమాకరంగా మారాయి. ఇక కంచెరోని చెరువు కట్ట దాటిన తర్వాత నుంచి శివాజీచౌక్ వరకు అసలే రోడ్డు ఇరుకుగా ఉంటుంది. దీనికి తోడు అన్నట్లుగా ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా భారీ లారీలు, వాహనాలను నిలిపి ఉంచుతున్నారు. ఇక్కడే ఇసుకను డంప్ చేస్తూ విక్రయిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈప్రాంతంలోనే భారీవాహనాలు నిలిపి ఉంచడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా.. ప్రధాన మార్గమైనప్పటికీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగాయి. జిల్లాకేంద్రం వాసులు చాలాసందర్భాల్లో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ రోడ్డును వెంటనే వెడల్పు చేయాలని, జిల్లాకేంద్రంలోకి ప్రవేశించే చోట భారీ వాహనాలు నిలుపకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏమి ‘సేతు’ను స్వామీ!
భారీ వాహనాలతో ఇబ్బందులు పడుతున్నా! కలెక్టర్ ఆపమన్నారు.. మంత్రి చలోచలో అన్నారు ‘‘అయ్యా! గౌరవనీయులైన కలెక్టర్‌గారికి.. నేను గుర్తున్నానా! సారూ! లొల్లలాకులపై నిర్మించిన వంతెనను. కాట¯ŒSదొర కాలంలో పుట్టిన నేను ప్రజలకు విశేష సేవలందించాను. ఎన్నో బరువులు మోసీ..మోసీ చివరికి ఇలా బలహీనపడిపోయాను. గతేడాది ఓ రోజు అటుగా వచ్చిన మీరు నా పరిస్థితిని గమనించి.. నా మీదుగా భారీ వాహనాలు రాకుండా నిషేధించారు. అంతేకాదు నిషేధాజ్ఞలను తెలిపేలా హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయించారు. మీలో స్పందించే గుణం ఉందని ఎంతో సంతోషించాను. కొన్నేళ్లు భూమిపై ఉండొచ్చని ఆశపడ్డాను.తీరా..ఇటీవల లొల్లలాకులను పరిశీలించిన జిల్లా ఇ¯ŒSచార్జి మంత్రి, రాష్ట్ర ఇరిగేష¯ŒS మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నా ఆశలపై నీళ్లు చల్లారు. నా మీదుగా భారీ వాహనాలు తిరగవచ్చనే ఆర్డర్ వేశారు. ఇంకేముంది? భారీ, అతి భారీ వాహనాలు రయ్రయ్ అంటూ వెళుతున్నాయి. రోజూ వందలాది ఇసుకలారీలు అతివేగంగా వెళుతుంటే.. నేను త్వరలోనే కుప్పకూలిపోతానేమోనని భయమేస్తోంది. ఇక నాకు ఈ భూమిపై నూకలు చెల్లినట్టేననిపిస్తోంది. మరోవైపు నా బాధను ఇరిగేష¯ŒS శాఖ వాళ్లు కూడా పట్టించుకోవడం లేదు. ఇసుక రీచ్ నిర్వాహకులతో లాలూచీ పడిపోయారు. యథేచ్ఛగా వాహనాల రాకపోకలకు అనుమతులిచ్చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు, రైతులకు సేవలందించిన నా పరిస్థితిని ఎవ్వరూ పట్టించుకునే వారే లేరా?’’ – ఆత్రేయపురం -
నగరంలోకి భారీ వాహనాలు నిషేధం
కర్నూలు: కర్నూలు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసు అధికారులు దష్టి సారించారు. రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా రోడ్లు విస్తరించకపోవడంతతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భారీ వాహనాలను నగరంలోకి రాకుండా నిషేధం విధించారు. ప్రమాదాల నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోకి ప్రవేశించే భారీ వాహనాలు లారీలు, ట్రాక్టర్లు, సివిల్ సపై ్ల లారీలు, టిప్పర్లు, ఇసుక, రాళ్ల ట్రాక్టర్లు, కమర్షియల్ భారీ వాహనాలపై నిషేధం ప్రకటించినట్లు వెల్లడించారు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలు ప్రవేశిస్తే చట్టప్రకారం రూ.2 వేల జరిమానా విధించి వాహనాన్ని స్వాధీనం చేసుకుని రవాణా శాఖకు అప్పగించనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే నగరంలోకి భారీ వాహనాలను అనుమతిస్తామని, ప్రజలు, వాహన యజమానులు పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
గోదావరి వంతెనపై భారీ వాహనాలకు నిషేధం
దండేపల్లి (ఆదిలాబాద్) : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో దండేపల్లి మండలం గూడెం గోదావరి వంతెన వద్ద గురువారం రాత్రి నుంచి నీటి మట్టం పెరిగింది. పాత లోలెవల్ వంతెనకు సమానంగా నీరు నిలిచింది. వంతెన శిథిలావస్థలో ఉండడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు వంతెనపై గురువారం రాత్రి నుంచి రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయం నుంచి మాత్రం ద్వి, త్రిచక్ర వాహనాలతోపాటు కార్లు, జీపులను అనుమతించారు. భారీ వాహనాలకు అనుమతి నిరాకరించారు. దీంతో గూడెం అటవీ చెక్‌పోస్టు నుంచి లక్సెట్టిపేట ఎన్టీఆర్ చౌరస్తా వరకు లారీలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆర్టీసీ వారు బస్సులను ఇటువైపు గూడెం చెక్‌పోస్టు వరకు, అటు వైపు రాయపట్నం వరకు నడిపిస్తున్నారు. అటు వైపు, ఇటువైపు బస్సుల్లో దిగిన వారందరూ ఆటోల ద్వారా వంతెన దాటుతున్నారు. అయితే గోదావరి నదిపై నిర్మించిన కొత్త వంతెన పనులు నాలుగు రోజుల్లో పూర్తవుతాయని నేషనల్ హైవే జేఈ జగదీశ్వర్ తెలిపారు. -
‘రోడ్ సైడ్’ టై
సిటీబ్యూరో/నల్లకుంట: సువిశాల జాతీయ రహదారుల పైనే కాదు... అంతంతమాత్రంగా ఉండే నగర రోడ్ల పైనా భారీ వాహనాలు దూసుకుపోతున్నాయి. ఫలితంగా తమ ప్రమేయం, నిర్లక్ష్యం లేకుండానే పాదచారులు అశువులు బాస్తున్నారు. శుక్రవారం విద్యానగర్‌లో స్కూలు వ్యాన్ బీభత్సంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఈ కోవకు చెందినదే. ఇలాంటి ఘటనలకు అటు డ్రైవర్లు, ఇటు వాహనాల ఫిట్నెస్ లోపాలే ప్రధాన కారణంగా తేలుతోంది. ‘ఖాళీ’ సమయాల్లోనే... నగరంలో ఈ తరహా ప్రమాదాలన్నీ ‘నాన్-పీక్ అవర్స్’గా పిలిచే రద్దీ లేని వేళల్లోనే చోటు చేసుకుంటున్నాయి. రహదారులు పక్కాగా లేకపోయినా... ఆ సమయాల్లో రోడ్లపై రద్దీ తక్కువగా ఉండటంతో వాహన చోదకులు దూసుకుపోతున్నారు. తాము నడుపుతున్న వాహనం ఫిట్నెస్, తమ సామర్థ్యాలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా హఠాత్తుగా అదుపు తప్పుతున్న వాహనాలు రహదారులపై ఉన్న వారి ప్రాణాలు తోడేస్తున్నాయి. ప్రైవేట్ వాహనాలే కాదు... సుశిక్షుతులైన డ్రైవర్లుగా పరిగణించే వ్యక్తులు నడిపే ఆర్టీసీ బస్సులూ ఈ కోవలోకి చేరుతున్నాయి. ఈనెల 21న తెల్లవారుజామున ఉప్పల్-రామాంతపూర్ ప్రధాన రహదారిపై పారిశుద్ధ్య విధుల్లో ఉన్న కార్మికురాలు కొమరమ్మను ఆర్టీసీ బస్సు బలిగొంది. శుక్రవారం నాటి మెటాడోర్ ప్రమాదమూ ఉదయం 6-7 గంటల మధ్యే జరిగింది. డ్రైవర్ల ‘ఉల్లంఘనలూ’ తోడవుతున్నాయి ఈ తరహా ప్రమాదాలకు డ్రైవర్లు నిబంధనలను బేఖాతరు చేయడమూ ఓ కారణంగా కనిపిస్తోంది. సిటీలోని అనేక ప్రాంతాల్లో... ప్రధానంగా కీలక రహదారులపై, కూడళ్ల వద్ద వేగాన్ని నియంత్రించుకోవాల్సిన డ్రైవర్లు దాన్ని బేఖాతరు చేస్తూ దూసుకుపోతున్నారు. దీంతో హఠాత్తుగా కనిపించే, ఎదురు వచ్చే పాదచారులను తప్పించలేక వారి ఉసురు తీస్తున్నారు. ఇంకొందరు ప్రైవేట్ డ్రైవర్లు ఏకంగా సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రాణాలు బలిగొంటున్నారు. జనవరి 9న సూరారం రాజీవ్ గృహకల్పలో రెండేళ్ల చిన్నారి ధనుష్‌ను ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఆ సమయంలో డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతుండటమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం గమనార్హం. ‘కాల పరిమితి’ నామ్‌కే వాస్తేనే... రహదారులపై సంచరించే వాహనాలకు మోటారు వాహనాల చట్టం కాల పరిమితిని విధించింది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు నిత్యం ఫిట్నెస్ పరీక్షలు చేస్తూ.. సామర్థ్యంతో ఉన్న వాటినే అనుమతించాల్సిన బాధ్యత ఆర్టీఏపై ఉంది. ఈ నిబంధనలు పక్కాగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. విద్యానగర్‌లో వ్యక్తి ప్రాణం తీసిన మెటాడోర్ వ్యాన్ సైతం 1980లలో రోడ్డు ఎక్కింది. అప్పటి నుంచి నిర్విరామంగా ‘పని’ చేస్తూనే ఉండటంతో ఫిట్నెస్ కోల్పోయి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. గత నెల 27న నగరంలోని మూడు ప్రాంతాల్లో భారీ వాహనాలు ‘అదుపు తప్పాయి’. ఉప్పల్, రాజేంద్రనగర్‌లలో లారీలు, బంజారాహిల్స్ ప్రాంతంలో బస్సు దూసుకు వచ్చేయడంతో ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. అనేక మంది క్షతగాత్రులుగా మారడంతో పాటు కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మూడు ఉదంతాల్లో డ్రైవర్లలో ‘ఫిట్నెస్’ లోపమే కారణమని తెలుస్తోంది. ‘రవాణా’ పట్టదా? ఫిట్నెస్ సరిగా లేని వాహనాల్లో పాఠశాలల విద్యార్థులను తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి. లక్కీ కేఫ్ చౌరస్తా వద్ద బ్రేక్‌లు ఫెయిలై... ఓ వ్యక్తిని పొట్టన పెట్టుకున్న వాహనాన్ని రామంతాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన బి.లక్ష్మణ్ నిర్వహిస్తున్నారు. తార్నాకలోని సెయింట్ యాన్స్ పాఠశాలకు నిత్యంవిద్యార్థులను చేరవేస్తుంటాడు. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు కచ్చితంగా పసుపు రంగులో ఉండాలి. ఆ పాఠశాల పేరు, ఫోన్ నంబర్లు వాహనంపై రాసి ఉంచాలి. ఇవేవీ లేకుండానే ఈ వాహనం దూసుకుపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. -
పారదర్శక ట్రక్కులు.. !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : భారీ వాహనాలను ఓవర్టేక్ చేయడం ఎంత కష్టమో తెలియనిది కాదు. ప్రధానంగా ఒకే వరుస గల రహదారిలో (సింగిల్ లేన్) ఏమరుపాటుగా ఉన్నా, ఎదురుగా వస్తున్న వాహన వేగాన్ని అంచనా వేయకపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి ఇలాంటి సమస్యకు కొంతైనా పరిష్కారం చూపేందుకు టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ నడుం బిగించింది. భారీ వాహనానికి ముందువైపు కెమెరాలు, వెనుక వైపు టీవీ తెరను ఏర్పాటు చేసింది. కెమెరాల సహాయంతో వాహనానికి ముందు ఉన్న రోడ్డు, వెళ్తున్న వాహనాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. వెనుక నుంచి వచ్చే వ్యక్తులు ఈ స్క్రీన్ ద్వారా తాము ప్రయాణిస్తున్న రోడ్డును అంచనా వేయొచ్చు. రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ఈ టెక్నాలజీ దోహదం చేస్తుందని శాంసంగ్ అంటోంది. ప్రస్తుతం ఈ ప్రొటోటైప్ టెక్నాలజీని అర్జెంటీనాలో కంపెనీ పరీక్షించింది. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న దేశాల్లో అర్జెంటీనా 5వ స్థానంలో ఉంది. ఈ టెక్నాలజీ అమలయ్యేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలతో కలిసి శాంసంగ్ రంగంలోకి దిగనుంది. -
‘ప్రిన్సెస్’ ఫ్లై ఓవర్ మరమ్మతు పనులు ప్రారంభం
- రూ. 68 లక్షలు కేటాయించిన బీఎంసీ - రెండు దశల్లో ఈ నెల 18 నుంచి 24 వరకు మరమ్మతు పనులు - పనులు పూర్తయ్యే వరకు భారీ వాహనాల ప్రవేశం నిషేధం సాక్షి, ముంబై: మెరిన్లైన్స్ స్టేషన్ సమీపంలో ఉన్న ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లై ఓవర్ మరమ్మతు పనులను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోమవారం నుంచి ప్రారంభించనుంది. ఈ బ్రిడ్జిలోని దాదాపు 36 జాయింట్లకు మరమ్మతు చేపట్టనున్నారు. 50 ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ మరమ్మతులకు రూ.68 లక్షలు వెచ్చించనున్నట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ పనులను రెండు దశల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశ పనులను ఈ నెల 18 నుంచి 24 వరకు, రెండో దశ పనులు 24 నుంచి 31వ తేదీ వరకు చేపట్టనున్నారు. బ్రిడ్జిల విభాగ చీఫ్ ఇంజనీర్ ఎస్.ఓ.కోరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరమ్మతు పనులకు సంబంధించిన అన్ని అనుమతులను ఇదివరకే తీసుకున్నామని, రెండు దశల్లో ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించిన పనులు కూడా ఇదివరకే నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మొదటి దశ పనుల్లో ఎన్.ఎస్.రోడ్, శ్యామల్‌దాస్ గాంధీ మార్గ్ నుంచి ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లై ఓవర్‌కు వచ్చే భారీ వాహనాలకు ఎంట్రీని నిషేధించామని తెలిపారు. శ్యామల్‌దాస్ గాంధీ మార్గ్ నుంచి వచ్చే వాహనాలు ఈ ఫ్లైఓవర్ ఎడమ వైపు నుంచి వెళ్లాలని, లేదా నేరుగా ఎం.కె.రోడ్‌కు చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు. 18వ తేదీ నుంచి బ్రిడ్జి మరమ్మత్తు పనులు పూర్తయ్యేవరకు శ్యామల్ దాస్ గాంధీ మార్గ్ రోడ్డు ఇరు వైపులా వాహనాలు పార్క్ చేయకూడదని అన్నారు. మార్గ్ నుంచి శ్రీ పటన్ జైన్ మండల్‌కు వచ్చే వాహనాలు ఈ ఫ్లై ఓవర్‌పై నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఎన్.ఎస్.రోడ్లో ప్రవేశించి తర్వాత మఫత్‌లాల్ బత్ సిగ్నల్ నుంచి యూ టర్న్ తీసుకొని నేరుగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బ్రిడ్జిల మరమ్మతులు చేయాల్సిందిగా బీఎంసీకి చెందిన స్టాండింగ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (ఎస్టీఏసీ) సిఫార్సు చేసింది. 2009-10 నుంచి బ్రిడ్జిల స్థితి గతులపై అధ్యయనం నిర్వహించింది. 57 బ్రిడ్జిల్లో 34 అపాయకరంగా ఉన్నాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి మరమ్మత్తులు నిర్వహించడం ఇదే తొలిసారి. -
18 నుంచి భారీ వాహనాలకు నో ఎంట్రీ
సాక్షి, ముంబై: వాషి బ్రిడ్జిపై ఈ నెల 18వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. దీనిపై పబ్లిక్ వర్క్స్, ట్రాఫిక్ విభాగాలు సంయుక్తంగా మరమ్మతులు చేపట్టనున్నాయి. ట్రాన్స్పోర్ట్ బస్సులు, అత్యవసర వాహనాలు, లైట్ వెహికిల్స్‌కు ఎటువంటి నిషేధం లేదని అధికారి ఒకరు తెలిపారు. అయితే లైట్ వెహికిల్స్ వారు ఐరోలి-ములుండ్ బ్రిడ్జిని ఉపయోగించడం ద్వారా వాషి బ్రిడ్జిపై వాహనాల రద్దీ కొంత మేర తగ్గుతోందని ట్రాఫిక్ విభాగం సూచించింది. ముంబైలోకి ప్రవేశించే వాహనాల నిమిత్తం ఈ బ్రిడ్జి నార్త్ బౌండ్ దిశను తెరిచి ఉంచుతారని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా నవీముంబై వెళ్లే వాహనాలు పాత వాషి బ్రిడ్జిని ఉపయోగించాల్సి ఉంటుంది. భారీ వాహనాలను ఠాణే-బేలాపూర్ రోడ్, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపైకి మళ్లించనున్నారు. వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు వచ్చే వాహనాలకు, అలాగే పుణే నుంచి వచ్చే భారీ వాహనాలకు సైతం ఈ బ్రిడ్జిపై అనుమతిని ఇవ్వడం లేదు. ఈ వాహనాలు ఠాణే-బేలాపూర్ రోడ్డును ఆశ్రయించాల్సి వస్తుంది. లేదంటే నగరంలోకి ప్రవేశించేందుకు ఐరోలి-ములుండ్ క్రీక్ బ్రిడ్జిను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇదే మాదిరిగా ముంబై నుంచి వచ్చే భారీ వాహనాలు పుణే వెళ్లేందుకు కూడా ఇదే మార్గం మీదుగా వెళ్లాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. -
గణేష్ మహోత్సవం ఎఫెక్ట్
సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాల సమయంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ముంబై-గోవా జాతీయ రహదారిపై భారీ వాహనాలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రజలు ఉత్సవాలు సంతోషంగా జరుపుకుని తిరిగి ముంబైకి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణ శాఖ తెలిపింది. గణేష్ ఉత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై భారీ ట్రక్కులు, ట్రెయిలర్లు, కంటైనర్లు, అయిల్ ట్యాంకర్లు తదితర భారీ వాహనాలను నిషేధించనున్నారు. మళ్లీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. దీన్ని బట్టి ఈ రహదారిపై ప్రయాణికుల రాకపోకలు ఏ స్థాయిలో ఉంటాయో ఇట్టే ఊహించుకోవచ్చు. అయితే పాలు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ సిలిండర్లు, మెడికల్ ఆక్సిజన్, కూరగాయలు, నిత్యావసర సరుకులు తరలించే భారీ వాహనాలకు మినహాయింపు నిచ్చినట్లు ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. ముంబై-గోవా రహదారిపై సాధారణ రోజుల్లోనే విపరీతంగా వాహనాల రద్దీ ఉంటుంది. గణేష్ ఉత్సవాలకు ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఇప్పటికే రెగ్యూలర్ సర్వీస్‌లతో పాటు ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సుల బుకింగులు ఫుల్ అయ్యాయి. ఇక జీపు, కార్లు, టాటా సుమోలు, క్వాలిస్, బస్సు లాంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం మిగిలిపోయింది. ఉత్సవాలకు మూడు రోజుల ముందు నుంచి ముంబై-గోవా రహదారిపై ప్రయాణికులను చేరవేసే వాహనాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఎక్కువే ఉంటుంది. దీన్ని దష్టిలో ఉంచుకుని ఏటా ఉత్సవాలకు ముందు, ముగిసిన తరువాత కొన్ని నిర్ధేశించిన రోజుల్లో భారీ వాహనాలకు నిషేధం విధిస్తారు. గతంలో ఉత్సవాల సమయంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రాణ, ఆస్తి నష్టం కూడా చాలా జరిగింది. రోడ్డు ప్రమాదాలవల్ల రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. దీంతో మిగతా వారు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. వీరి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని గత పదేళ్ల నుంచి ఉత్సవాల సమయంలో ఆర్టీఓ అధికారులు ఈ రహదారిపై భారీ వాహనాలను నిషేధిస్తూ వస్తున్నారు. -
స్కానియా మెట్రోలింక్ కోచ్‌లు
కొరుక్కుపేట: హెవీ వెహికల్స్, ట్రావెల్ బస్సులను తయూరు చేయడంలో పేరుపొందిన స్కానియా మెట్రోలింక్ కోచ్‌లను అందుబాటులోకి తెచ్చిం ది. మొదటగా ప్రవేశపెట్టిన స్కానియా మెట్రోలింక్ కోచ్‌ను చెన్నైలోని పర్వీన్ ట్రావెల్స్‌కు అందజేసినట్లు స్కానియా ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ ఆండర్స్ గ్రుండ్ స్టోమర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో స్కానియా మెట్రోలింగ్ కోచ్‌ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆండర్స్ మాట్లాడుతూ, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణికుల భద్రత ప్రధానంగా చేసుకుని అల్ట్రా లగ్జరీ ఫ్యూచర్లు, సౌకర్యం, సేఫ్టీ ప్రొవిజన్‌తో ఈ కోచ్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేశామన్నారు. ఫ్యూయల్ ఎఫిషియన్సీతో కూడిన ఈ హైవే బస్సులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. చెన్నై - కొచ్చి మధ్య నడుపుతున్న పర్వీన్ ట్రావెల్స్‌కు ఐఎస్వో గుర్తింపు పొందటం సంతోషంగా ఉందన్నారు. మొదటగా తాము ప్రవేశపెట్టిన స్కానియా మెట్రోలింక్ కోచ్‌లను పర్వీన్ ట్రావెల్స్‌కు అందించటం ఆనందంగా ఉందన్నారు. ఈ బస్సు 85 కిలోమీటర్ల వేగంతో చేరవలసిన గమ్యస్థానానికి నిర్ణీత సమయంలోపే వెళ్లే సౌకర్యం ఉందని అన్నారు. ఆరు ఎమర్జెన్సీ డోర్లు, మానిటర్ డ్రైవర్ మూమెంట్స్, ప్రయాణికులకు సేఫ్టీ వీడియోలు తదితర సౌకర్యాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కానియా కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ సేల్స్ డెరైక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘శివారు’లో భారీ వాహనాలపై ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీ వాహనాలపై డిసెంబర్ ఒకటి నుంచి ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వాహనాలపై జరిమానా విధింపు, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం తదితర చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. శివారు ప్రాంతాలు రోజురోజుకూ విస్తరించడంతో పాటు వ్యాపార, విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు తదితర వాణిజ్య సంస్థలు కోకొల్లలుగా వెలియడంతో రహదారులపై ట్రాఫిక్ పెరిగింది. ఫలితంగా ట్రాఫిక్ రద్దీకి తోడు ప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది. ఈ ప్రమాదాలకు కారణాలను అన్వేషించగా భారీ వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్‌తో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తేలింది. దీంతో భారీ వాహనాల (లారీ, లారీటిప్పర్, రెడీమిక్సింగ్ ట్రాక్, కంటైనర్, బోర్వెల్ మెషిన్, జేసీబీ, డీసీఎంలు, వాటర్ ట్యాంకర్లు, ట్రాక్టర్లు)పై ఆంక్షలు విధించినట్లు కమిషనర్ ప్రకటించారు. వీటిప్రకారం భారీ వాహనాలు ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి రాత్రి 11.00 నుంచి ఉదయం 7 గంటల వరకు కింద సూచించిన రహదారుల గుండా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇతర సమయంలో వెళితే జరిమానా విధించడం లేదా వాహనం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాలలో 24 గంటలు వెళ్లేలా మార్గాలను సూచించారు. నిర్ణీత వేళల్లో భారీ వాహనాలను అనుమతించిన మార్గాలివీ... =నారాయణ మ్మ కళాశాల నుంచి నలగండ్ల జంక్షన్‌కు వెళ్లే భారీ వాహనాలు ఖాజాగూడ జంక్షన్, గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్ల మీదుగా వెళ్లాలి. =ఖాజాగూడ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనాలు నానక్‌రామ్‌గూడ రోటరీ మీదుగా వెళ్లాలి. =ఐసీఐసీఐ బ్యాంకు జంక్షన్ నుంచి ఐఐఐటీ జంక్షన్ వరకు. =చందానగర్ నాలా - హఫీజ్‌పేట జంక్షన్- మియాపూర్- మూసాపేట జంక్షన్- భరత్‌నగర్ -ఎర్రగడ్డ =మియాపూర్ జంక్షన్ నుంచి బీకే ఎన్క్లేవ్, హెచ్ఎంటీ మక్తా గ్రాగం వరకు =బహదూర్‌పల్లి టి జంక్షన్- సూరారం-షాపూర్‌నగర్-గుడెన్మెంట్-నర్సాపూర్ జంక్షన్ =బాలనగర్ టి జంక్షన్ - ఫతేనగర్ ఫ్లైవర్ - లైట్ సన్ కేఫ్- బల్కంపేట =హబ్సిగూడ నుంచి నాచారం జంక్షన్ వరకు =ఉప్పల్ జంక్షన్ నుంచి రామంతాపూర్ వరకు =ఉప్పల్ జంక్షన్ నుంచి ఫిర్జాదీగూడ కమాన్ వరకు =ఉప్పల్ జంక్షన్- కామినేని ఆసుపత్రి-ఎల్బీనగర్- బైరామల్‌గూడ- మందమల్లమ్మ - లక్ష్మీగార్డెన్ =బైరామల్‌గూడ- సాగర్ రింగ్‌రోడ్డు- హస్తినాపూర్- బీయన్రెడ్డినగర్ =ఎల్బీనగర్ జంక్షన్- హుడా కాంప్లెక్స్- వీవీనగర్ - దిల్సుఖ్నగర్ =బైరామల్‌గూడ - కర్మన్‌ఘాట్ - గ్రీన్‌పార్క్ కాలనీ =బైరామల్‌గూడ -సాగర్‌రింగ్‌రోడ్డు- చింతల్‌కుంట చెక్‌పోస్టు =ఎల్బీనగర్ జంక్షన్-చింతల్‌కుంట- పనామా- సుష్మా థియేటర్ =అత్తాపూర్ -ఉప్పరపల్లి- ఇంద్రారెడ్డి విగ్రహం- శివరాంపల్లి-అరాంఘర్ ఈ రహదారులపై 24 గంటలూ వెళ్లొచ్చు... =హయత్‌నగర్ - కుంట్లూర్-రాజీవ్ గృహకల్ప-గౌరెల్లి- సద్దుపల్లి =అబ్దుల్లాపూర్‌మెట్-కవాడిపల్లి-తారామతిపేట్- సద్దుపల్లి =మల్లాపూర్-యన్ఎఫ్సీ- ఈసీఐఎల్ చౌరస్తా-చక్రిపురం-రాంపల్లి-ఘట్కేసర్ =ఘట్కేసర్ నుంచి కీసర వరకు =ఘట్కేసర్ నుంచి నాగారం వరకు =ఘట్కేసర్ నుంచి వరంగల్‌రోడ్డు వరకు =శామీర్‌పేట్-దొంగలమైసమ్మ- తిమ్మాయిపల్లి- యాదగిరిపల్లి జంక్షన్-కీసర-బోగారం-కొండాపూర్- ఘట్కేసర్ =పిసల్‌బండ- కంచన్‌బాగ్-బాలాపూర్ చౌరస్తా =బాలాపూర్ -మీర్‌పేట-నాగార్జునా హిల్స్-బీడీరెడ్డి గార్డెన్- బడంగ్‌పేట =నల్లగండ్ల జంక్షన్-కనుకుంట- లింగంపల్లి రైతు బజార్ =గౌలిదొడ్డి -గోపన్‌పల్లి తండ- నల్లగండ్ల జంక్షన్ =చర్చి ఘాజిల్లాపూర్- దిండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ-బహదూర్‌పల్లి టి జంక్షన్ -
దిగ్బంధం విజయవంతం
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిర రహదారుల దిగ్బంధం రెండోరోజు గురువారం విజయవంతమైంది. సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారులను దిగ్బంధించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీశ్రేణులు బుధ, గురువారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. రహదారులను దిగ్బంధించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్నగర్ జాతీయరహదారిపై రోడ్డును దిగ్బంధించారు. దీంతో పెద్దఎత్తున వాహనాలు అక్కడికక్కడే నిలచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించింది. నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కనుపర్తిపాడు జాతీయరహదారి వద్ద ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ స్తంభించింది. వైఎస్సార్సీపీ కోవూరు, ఇందుకూరుపేట మండల కన్వీనర్లు ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, మావూలూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కోవూరులో జాతీయరహదారిని దిగ్బంధించారు. భారీగా వాహనాలు నిలిచాయి. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో పొదలకూరు-సోమశిల మార్గాన్ని పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంతో దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. కావలిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్టీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు గురువారం ఉదయం 5 నుంచి 7.30 వరకు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కావలి రెండో పట్టణ ఎస్సై అన్వర్‌బాషా పోలీసు సిబ్బందితో వచ్చి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో సహా 30 మందిని అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వాహనం దగదర్తి మండల ఉలవపాళ్ల జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ దిగ్బంధంలో చిక్కుకుంది. గూడూరులో పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు నేదురమల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల కూడలిలో రహదారిని దిగ్బంధిచారు. ఈ సందర్భంగా సమన్వయకర్తలు, కార్యకర్తలు రోడ్డుపైనే మొక్కజొన్న కంకులు తిని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఉదయగిరి బస్టాండ్‌లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించారు. వాహనాల రాకపోకలకు కొంతసేపు ఆటంకం ఏర్పడింది. వింజమూరు, దుత్తలూరులో జరిగిన ఆందోళనల్లో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొన్నారు. వెంకటగిరిలోని అడ్డరోడ్ల కూడలిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో మూడు గంటలపాటు రహదారులు దిగ్బంధించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. నాయుడుపేట-పూతలపట్టు జాతీయరహదారిపై నెలవల సుబ్రమణ్యం రహదారులు దిగ్బంధించారు. తడలో నిర్వహించిన ఆందోళనలో కూడా కిలివేటి సంజీవయ్య, తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు.దిగ్బంధించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్నగర్ జాతీయరహదారిపై రోడ్డును దిగ్బంధించారు. దీంతో పెద్దఎత్తున వాహనాలు అక్కడికక్కడే నిల చిపోయాయి. ట్రాఫిక్ స్తంభించింది. నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కనుపర్తిపాడు జాతీయరహదారి వద్ద ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ స్తంభించింది. వైఎస్సార్సీపీ కోవూరు, ఇందుకూరుపేట మండల కన్వీనర్లు ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, మావూలూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కోవూరులో సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో పొదలకూరు-సోమశిల మార్గాన్ని పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంతో దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ స్తం భించింది. కావలిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్టీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు గురువారం ఉదయం 5 నుంచి 7.30 వరకు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. గూడూరులో పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు నేదురమల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల కూడలిలో రహదారిని దిగ్బంధిచారు. ఉదయగిరి బస్టాండ్‌లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించారు. వాహనాల రాకపోకలకు కొంతసేపు ఆటంకం ఏర్పడింది. వింజమూరు, దుత్తలూరులో జరిగిన ఆందోళనల్లో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొన్నారు. వెంకటగిరిలోని అడ్డరోడ్ల కూడలిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో మూడు గంటలపాటు రహదారులు దిగ్బంధించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. నాయుడుపేట-పూతలపట్టు జాతీయరహదారిపై నెలవల సుబ్రమణ్యం రహదారులు దిగ్బంధించారు. తడలో నిర్వహించిన ఆందోళనలో కూడా కిలివేటి సంజీవయ్య, తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 90 మంది వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.