ప్రవేశం.. ప్రమాదభరితం..
► ఇరుకు రోడ్డు..
►మధ్యలోనే నిలిచిపోయిన వెడల్పు పనులు
►జిల్లాకేంద్రం ప్రవేశ రహదారి దుస్థితి..
నిర్మల్‌రూరల్ : అసలే ఇరుకైన రోడ్డు.. ఆపై ఇరువైపులా పదుల సంఖ్యలో భారీ వాహనాలతో జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే ప్రధాన రహదా రి ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు వెడల్పు పనులు చే పట్టినా మధ్యలోనే నిలిపివేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కడ్తాల్ ఎక్స్ రోడ్డు నుంచి జిల్లాకేంద్రం వరకు 44 నంబర్ జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ మా ర్గంలో సగటున రెండురోజులకు ఒక ప్రమాదం జరుగుతోంది. ఇటీవలే ఓ ప్రముఖ దంత వైద్యుడు రోడ్డుప్రమాదంలో ఇక్కడే మృత్యువాత పడ్డారు. ఇరుకుగా ఉండటంతో పాటు ప్రమాదకరంగా మూలమలుపులూ ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో నిత్యం ఏదో ఒకచోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి.
పనులు ప్రారంభించినా..
జిల్లాకేంద్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారికి కడ్తాల్ ఎక్స్‌రోడ్డు నుంచి బైపాస్ వేసి పట్టణం బయట నుంచి మళ్లించారు. దీంతో కడ్తాల్ ఎక్స్‌రోడ్డు నుంచి పట్టణం వరకు గల పాత జాతీయ రహదారిని మాత్రం అలాగే వదిలేశారు. అనంతరం స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చొరువ తీసుకుని రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. ఈమార్గంలోని కల్వర్టు వెడల్పు పనులు పూర్తిచేశారు. కానీ రోడ్డు విస్తరణ పనులు మాత్రం చేపట్టడం లేదు.
ప్రమాదాలకు కేరాఫ్..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి జిల్లాకేంద్రంలోకి ప్రవేశించి మార్గం ప్రమాదకరంగా మారింది. ఈమార్గంలో సోఫినగర్ దర్గా వద్ద, కంచెరోని చెరువు కట్ట, శ్యాంగఢ్ వద్ద మూలమలుపులు అత్యంత ప్రమాకరంగా మారాయి. ఇక కంచెరోని చెరువు కట్ట దాటిన తర్వాత నుంచి శివాజీచౌక్ వరకు అసలే రోడ్డు ఇరుకుగా ఉంటుంది. దీనికి తోడు అన్నట్లుగా ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా భారీ లారీలు, వాహనాలను నిలిపి ఉంచుతున్నారు. ఇక్కడే ఇసుకను డంప్ చేస్తూ విక్రయిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈప్రాంతంలోనే భారీవాహనాలు నిలిపి ఉంచడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇప్పటికైనా..
ప్రధాన మార్గమైనప్పటికీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగాయి. జిల్లాకేంద్రం వాసులు చాలాసందర్భాల్లో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ రోడ్డును వెంటనే వెడల్పు చేయాలని, జిల్లాకేంద్రంలోకి ప్రవేశించే చోట భారీ వాహనాలు నిలుపకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.