ఇబ్రహీంపట్నం: రాజధాని నిర్మాణానికి ముడి సరకులు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన జలరవాణా పంట్‌కు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహించారు. సుమారు 700 టన్నుల బరువు మోయగల సామర్థ్యమున్న పంట్‌పై 40 టన్నుల బరువుండే ఆరు భారీ వాహనాలను ఎక్కించి ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి లింగాయపాలెం రేవు వరకు నడిపారు. 240 టన్నులకే నదిలో అక్కడక్కడ భూగర్భం తగలడంతో నదిలో డ్రెడ్జింగ్ చేపట్టాలని నిర్వాహకులు గుర్తించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇనుము, సిమెంట్, కంకర, ఇతర సామగ్రిని అమరావతి ప్రాంతానికి తరలించాలంటే విజయవాడ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. దుర్గ గుడి ప్లైఓవర్ నిర్మాణంతో రాత్రివేళల్లో మాత్రమే రవాణా వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెర్రీలో ఏర్పాటు చేసిన పంట్‌తో ఒకేసారి 15 నుంచి 20 భారీ వాహనాలు గుంటూరు జిల్లా వైపు వెళ్లేందుకు మార్గం సుగుమం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు విజయవాడకు రాకుండానే గుంటూరు జిల్లా చేరుకోవచ్చు.
స్థానికుల అభ్యంతరం
జాతీయ రహదారి నుంచి ఫెర్రీకి భారీ వాహనాలు వెళ్తుండడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీకి వెళ్లే రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. అక్కడినుంచి పట్టిసీమ కాలువ వెంట ఉన్న రహదారి ఇప్పటికే నాణ్యత కోల్పోయిందని, అందువల్ల భారీ వాహనాలను ఎలా అనుమతిస్తారని స్థానికులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment