హైదరాబాద్‌: చలో అంటే చల్తా నై!  | Hyderabad Police Strict Action against On No Entry Vehicles | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: చలో అంటే చల్తా నై! 

Published Wed, Jan 19 2022 7:53 AM | Last Updated on Wed, Jan 19 2022 8:18 AM

Hyderabad Police Strict Action against On No Entry Vehicles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనుమతి లేని సమయంలో నగరంలోని రహదారులపైకి దూసుకువస్తున్న భారీ వాహనాలు, డీసీఎంల కారణంగానూ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇలా వస్తున్న వాహనాలకు చలాన్‌ విధించడంతో సరిపెట్టారు. ఇకపై వీటిని ఆంక్షలున్న సమయం ముగిసే వరకు ఆపేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు.  

ఉత్తర్వులు బేఖాతరు.. 
►అనుమతి పొందినవి మినహా నగరంలోకి భారీ వాహనాలు, లారీలు, డీసీఎంల ప్రవేశంపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల మధ్యలోనే ఇవి నగరంలో సంచరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తున్న నిర్వాహకులు, డ్రైవర్లు ఎప్పుడుపడితే అప్పుడు దూసుకువచ్చేస్తున్నారు. ఈ ఉల్లంఘనపై ‘నో ఎంట్రీ’ కేసులు రాస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. ఏటా 30 వేల నుంచి 50 వేల వరకు ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి.
చదవండి: ప్రియుడితో పిజ్జాహట్‌కు.. మొదటి భార్యతో కలసి వీడియో రికార్డింగ్‌ 

►ఆయా వాహనాల డ్రైవర్లు కూడా  అనుమతి లేని వేళలో నగరంలోని ప్రవేశించేసి ఓసారి చలాన్‌ వేయించుకుంటున్నారు. దీన్ని చూపిస్తూ ఆ రోజంతా సిటీలో విహరించేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ప్రతి జంక్షన్‌లోనూ జరిమానా విధించే అవకాశం ఉన్నా.. ఇప్పటి వరకు మానవతా దృక్పథంతో పోలీసులు అలా చేయలేదు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న కొన్ని కంపెనీలు తమ వాహనాలను నో ఎంట్రీ సమయంలోనూ తిప్పేస్తున్నాయి. రోజుకు ఒక చలాన్‌ చొప్పున చెల్లిస్తూ తమ పని కానిచ్చుకుంటున్నాయి. వీటి వల్ల ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడుతూ ఇతర వాహనచోదకులు ఇబ్బందులు పడటంతో పాటు కొన్నిసార్లు ప్రమాదాలూ జరుగుతున్నాయి.  

పెద్ద ప్రహసనమే.. 
వీటిని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆయా వాహనాలు కనిపించిన వెంటనే ఆపి చలాన్‌ వేయడంతో పాటు నిషేధిత సమయం ముగిసే వరకు అనువైన ప్రాంతంలో ఆపేయాలని నిర్ణయించారు. మరోపక్క ఇలాంటి ‘నో ఎంట్రీ వాహనాలను’ స్వాధీనం చేసుకునే ఆస్కారం సైతం పోలీసులకు ఉంది. అయితే దీని వెనక పెద్ద ప్రహసనమే ఉంటోంది. రహదారిలో ఓ ప్రాంతంలో ఇలాంటి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడే ఉంచడం సాధ్యం కాదు. దాని డ్రైవర్‌ను పంపేసినా మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌కో, గోషామహల్‌ స్టేడియానికో తరలించాలి. ఆపై సదరు డ్రైవర్‌/యజమాని జరిమానా చెల్లించి వచ్చి తీసుకువెళ్లే వరకు దాన్ని భద్రపరచాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మించి అనుమతి లేని సమయంలో వచ్చిన భారీ వాహనంలో నిత్యావసర, అత్యవసర, సున్నిత వస్తువులు ఉంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. 

భారీ శబ్దాలతో నరకం.. 
►నో ఎంట్రీ సమయంలో వస్తున్న భారీ వాహనాల్లో డీసీఎంలే ఎక్కువ. ప్రమాదాల్లోనూ వీటిది పెద్ద స్థానమే. మరోపక్క రాత్రి అయిందంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులతో నిండిపోతున్నాయి. అడ్డదిడ్డంగా నడిచే ఈ వాహనాలు, అడ్డగోలుగా పార్కింగ్స్, భయానకమైన శబ్దాలు చేసే హారన్లు తోటి వాహనచోదకులతో పాటు నగర వాసులకూ నరకాన్ని చూపిస్తున్నాయి. 

►రాత్రి 10 గంటల లోపు ప్రైవేట్‌ బస్సులు సిటీలోకి రావడానికి అనుమతి లేదు. రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనలు బేఖాతరు చేయడం, అడ్డదిడ్డంగా డ్రైవ్‌ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పార్కింగ్‌ చేయడం పరిపాటగా మారింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆయా వాహనాలకు నిర్దిష్ట విధానం రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ సమస్య తీరాలంటే ప్రయాణికుల్ని ఎక్కించుకోవడానికి, దింపడానికి ఈ వాహనాల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసుస్టేషన్ల వారీగా గుర్తించి ఏర్పాట్లు చేస్తేనే ఈ బస్సుల హడావుడికి చెక్‌ చెప్పవచ్చనే వాదన 
వినిపిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement