సాక్షి, ముంబై: గణేశోత్సవాలు సమీపించడంతో కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ముంబై–గోవా జాతీయ రహదారి–66పై రాయ్‌గఢ్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు వివిధ ఏర్పాట్లు పూర్తి చేశారు. ముంబై, థానే సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు, జిల్లాల నుంచి కొంకణ్‌లోని స్వగ్రామాలకు బయల్దేరిన భక్తులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా రహదారి వెంబడి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భక్తుల భద్రతకు ప్రధానపీట వేస్తూ అదనపు పోలీసు బలగాలతోపాటు హోం గార్డుల సాయం కూడా తీసుకున్నారు. ఇదివరకే ముంబై–గోవా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గణేశోత్సవాలు ముగిసే వరకు ట్రక్కులు, కంటైనర్లు, ట్యాంకర్లు, ట్రేలర్లు లాంటి భారీ వాహనాలకు నిషేధం విధించారు. ఇందులో కూరగాయలు, పప్పు దినుసులు, ఇతర నిత్యావసర సరుకులుచేసే వాహనాలకు మినహాయింపునిచ్చారు. దీన్నిబట్టి ముంబై–గోవా జాతీయ రహదారిపై ఏ స్థాయిలో వాహనాల రద్దీ ఉంటుందో ఇట్టే అర్థమైతోంది.
3,500 ప్రత్యేక బస్సులు
కొంకణ్ రీజియన్‌లో ఏటా గణేశోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు ప్రతీ ఇంటిలో గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తారు. దీంతో ఉద్యోగ, వ్యాపార రీత్యా రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ స్థిరపడిన వారు గణేశోత్సవాలకు స్వగ్రామానికి చేరుకుంటారు. దీంతో ముంబై–గోవా జాతీయ రహదారి ఉత్సవాలు ముగిసేవరకు రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా గణేశోత్సవాలకు కొంకణ్, సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. వీటితోపాటు ఎమ్మెస్సార్టీసీ కూడా ఏటా 3,500 పైగా ప్రత్యేక బస్సులు వివిధ బస్ డిపోల నుంచి నడుపుతుంది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, కార్లు, జీపులు, ఇతర పికప్ వాహనాలు నడుస్తాయి. అయినప్పటికీ రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఎటూ సరిపోవు.
ఇప్పటికే ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో దాదాపు 1.5 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. వినాయక చవితి ఇంకా రెండ్రోజులే ఉండటంతో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని అంటున్నారు. కొంకణ్, సెంట్రల్ రైల్వే రీజియన్లు సంయుక్తంగా నడుపుతున్న 60–70 ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ ఫుల్ అయ్యాయి. వెయిటింగ్ లిస్టు 600–700 వరకు చేరుకుంది. దీన్ని బట్టి గణేశోత్సవాలకు ఏ స్థాయిలో ప్రజలు స్వగ్రామాలకు బయల్దేరుతారో స్పష్టమవుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా గణేశోత్సవాలు సాదాసీదాగా నిర్వహించారు. ఎక్కడున్నవారు అక్కడే ఉండిపోయారు. దీంతో స్వగ్రామాలలో జరిగే ఉత్సవాలకు అనేకమంది హాజరు కాలేకపోయారు. కానీ ఈసారి బీజేపీ ప్రభుత్వం ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో స్వగ్రామాలకు బయల్దేరే వారి సంఖ్య రెట్టింపు అయింది.
జాతీయ రహదారిపై పూర్తయిన ఏర్పాట్లు
రాయ్‌గడ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశోక్ దుభే నేతృత్వంలో ముంబై–గోవా నేషనల్ హై వే–66పై ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. గణేశోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి అవి ముగిసేవారు అంటే సెప్టెంబరు 9 వ తేదీ వరకు ఏకంగా 80% పోలీసులను ఈ రహదారిపై నియమించారు. ఖార్పాడా నుంచి పోలాద్‌పూర్ వరకు పది ప్రత్యేక పోలీసు సహాయ కేంద్రాలను నియమించారు. ఖార్పాడ నుంచి కశేలీ ఘాట్ సెక్షన్‌లో ఓ అప్పర్ సూపరింటెండెంట్, ఐదుగురు ఉప విభాగ అధికారులు, 11 మంది పోలీసు ఇన్‌స్పెక్టర్లు, 27 సబ్ ఇన్‌స్పెక్టర్లు, 225 కానిస్టేబుళ్లను నియమించారు.
హోం గార్డు బృందాల సాయం కూడా తీసుకుంటున్నారు. ఘాట్ సెక్షన్‌లో ట్రాఫిక్ జామ్ కాకుండా 24 గంటలు వాకిటాకీల సాయంతో అప్రమత్తంగా ఉంటారు. ప్రమాదానికి గురైన వాహనాలను లేదా మరమ్మతుల నిమిత్తం రోడ్డుపై నిలిచిపోయిన వాహనాల వల్ల ట్రాఫిక్ స్తంభించకుండా ఉండేందుకు అక్కడక్కడా 18 హైడ్రాలిక్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. వీటి సాయంతో ఆగిపోయిన వాహనాలను రోడ్డు పక్కకు నెట్టేస్తారు. అదేవిధంగా 30 చోట్ల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే గాయపడిన ప్రయాణికులకు వెంటనే ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు పన్వేల్, పేణ్, మాణ్‌గావ్, మహాడ్, పోలాద్‌పూర్ తదితర ఉప జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వైద్య బృందాలను నియమించారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించేందుకు 14 అంబులెన్స్‌లు కూడా ఉంచారు.
ప్రమాదాలను నివారించేందుకు రాయ్‌గఢ్ జిల్లా పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలు
(వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణంలో కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.)....
►రాంగ్ సైడ్‌లో, వేగంగా వాహనాలు నడపకూడదు.
►సామర్థ్యానికి మించి ప్రయాణికులను చేరవేయరాదు.
►రోడ్డుకు ఇరువైపులా హెచ్చరికల బోర్డులను, ప్రమాదకర మలుపులను పరిశీలిస్తూ వాహనాలను నడపాలి.
►వాహనం నడుపుతున్న వారు అలసిపోయినా లేదా అలసట, నిద్ర వచ్చినా వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపివేసి విశ్రాంతి తీసుకోవాలి.
►సాధ్యమైనంత వరకు రాత్రి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి
►ముంబై–గోవా జాతీయ రహాదారిపై రద్దీని నియంత్రించేందుకు అందరూ ఒకే మార్గంలో వెళ్లకుండా ప్రత్యామ్నాయ రోడ్లను కూడా వినియోగించాలి.
►పార్కింగ్ చేయడానికి తగినంత స్థలం ఉన్న చోటే వాహనాలను ఆపండి. రోడ్డుపై లేదా రోడ్డుకు ఆనుకుని పార్కింగ్ చేయవద్దు
►డాబాలు, హోటళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయే విధంగా వాహనాలు నిలుపకూడదు.
►అత్యవసర సమయంలో పోలీసులు, సహాయక బృందాల సాయం తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment