ముంబై: ఇటీవల కళాశాల క్యాంపస్ ఆవరణలో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ నిలిచిన ముంబైలోని ఓకళాశాల తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కళాశాలకు టీషర్ట్స్, చిరిగిన జీన్స్‌తో రావడాన్ని నిషేధించింది. కొత్త డ్రెస్ కోడ్‌ను విధించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
టీవలే కళాశాలలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కళాశాలకు వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది. ముంబైలో ఈ సొసైటీ నిర్వహిస్తోన్న ఎన్‌జీ ఆచార్య , డీకే మరాఠే కళాశాలల్లో చిరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా ఫార్మల్, డీసెంట్ దుస్తుల్లో మాత్రమే కళాశాలకు రావాలని ఆదేశించింది.
‘విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నప్పుడు ఫార్మల్, డీసెంట్ దుస్తులు ధరించాలి. వారు హాఫ్ షర్ట్ లేదా ఫుల్ షర్ట్ , ప్యాంటు ధరించవచ్చు. అమ్మాయిలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చు. విద్యార్థులు మతాన్ని లేదా సాంస్కృతిక అసమానతలను చూపించే ఎలాంటి దుస్తులూ ధరించకూడదు. జీన్స్, టీషర్టులు, రివీలింగ్ డ్రెస్సులు, జెర్సీలు ధరించి వస్తే అనుమతించబోము’ అని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసును కళాశాల గేటుకు అంటించింది.
అయితే ఈ నిబంధనలపై పలువురు విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త డ్రెస్ కోడ్ గురించి తమకు తెలియదని, జీన్స్, టీ షర్టులు ధరించి ఉండడంతో కాలేజీలోకి రానివ్వడం లేదని కొందరు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు..
కాగా ఇదే కళాశాల గతంలో తమ ప్రాంగణంలో హిజాబ్, నఖాబ్, బుర్కా, స్టోల్స్, క్యాప్‌లు, బ్యాడ్జీలపై నిషేధం విధించింది, దీనిపై విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే కాలేజీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని న్యాయమూర్తులు ఎఎస్ చందూర్కర్, రాజేష్ పాటిల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment