Ganesh Chaturthi 2022
-
ఇర్వింగ్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు!
అమెరికా వినాయక చవితి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. డల్లాస్ ఇర్వింగ్ సిటీ రివర్ సైడ్ విలేజ్ కమ్యూనిటీలో భక్తులు వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ సభ్యులు నిర్వహించిన ఆరు రోజుల వేడుకల్లో నిత్య పూజలతో, భక్తిశ్రద్ధలతో, మండపంలో రోజుకో అలంకరణతో, పిల్లలు పెద్దల ఆటపాటలతో వేదిక కళకళలాడింది. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎప్పటిలాగా నిర్వహించే వేలం పాట ఈ ఏడాది సైతం జరిగింది. ఈ వేలం పాటులో లడ్డు ధర రూ.13 లక్షలకు పైగా పలికింది. పండుగ ఐదవ రోజు బంతి భోజనాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేకంగా నిలిచాయి. తెలుగు సంప్రదాయమైన పంచె కట్టుతో ఉత్సవాల్లో పాల్గొన్న నిర్వాహకులు 300మందికి పైగా అన్నదానం చేశారు. చివరి రోజైన నిమజ్జనం రోజు వినాయకుడి ముందు హోలీ, దాండియా ఆడి వీడ్కోలు పలికారు. -
రూ.కోటితో విఘ్నేశ్వరుడు ధగధగ
సాక్షి, నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వాసవి మార్కెట్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు కోటి రూపాయల కరెన్సీ నోట్లతో భక్తులకు దర్శనమిచ్చారు. వాసవి మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితికి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రోజుకొక అలంకరణతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం గణనాథుడితో పాటు మండపాన్ని సైతం కరెన్సీ నోట్లతో అలంకరించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చదవండి: (చరిత్రలో తొలిసారి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం) -
గటు దిక్కు బోవద్దు గన్పతీ!
కైలాసం. శంకరుడు కండ్లు మూస్కోని తపస్సు జేస్తున్నడు. పార్వతి వొంట జేస్తున్నది. అదువరదాక ఎల్కలతోని దాగుడు మూతలాడుకొన్న గన్పతి గామె తాన్కి వొచ్చిండు. ‘‘అమ్మా’’ అని బిల్సిండు. ‘‘ఏంది బిడ్డా! ఆకలైతున్నదా? ఏమన్న బెట్టాల్నా?’’ అని పార్వతి అడిగింది. ‘‘ఏమొద్దమ్మా! చవ్తి పండ్గ దినాలు గదా. ఒకసారి పట్నం బోయొస్తనే.’’ ‘‘యాడికి బోవొద్దురా కొడ్కా! వొద్దు వొద్దంటె పోయిన యాడాది పట్నం బోయినవు. ఇగొస్తడు, అగొస్తడనుకుంట ఎంతగనం ఎందురుజూసినా నువ్వు రాలేదు. మేమంత పరేశానైతిమి. లెంకంగ లెంకంగ ఆకర్కి మూతదెర్సిన మ్యాన్హోల్ల బడ్డ నువ్వు గండ్లబడ్డవు.’’ ‘‘గీపారి గట్లగాదమ్మా.’’ ‘‘గిప్పుడు వానకాలం నడుస్తున్నది. వాన బడ్డదా అంటె పట్నం తొవ్వలల్ల యాడ ఏమున్నదో ఎర్కగాదు.’’ ‘‘వాన కాలం నడుస్తున్నా దినాం వానగొట్టదమ్మా!’’ ‘‘ఎంత జెప్పినా ఇనవైతివి. పోయిరా! జెర పైలం.’’ గన్పతి కైలాసంలకెల్లి ఎల్లిండు. మెల్లగ మబ్బుల పంటి నడ్సుకుంట పట్నం దిక్కు రాబట్టిండు. నడ్మల పట్నంకెల్లి వైకుంటం బోతున్న నారదుడు గాయినకు ఎదురొచ్చిండు. ‘‘నారాయణ, నారాయణ, యాడ్‌కి బోతున్నవు గన్పతీ’’ అని నారదుడడిగిండు. ‘‘పట్నం బోతున్న. గాడ పతొక్క వాడ కట్టుల నా బొమ్మలు బెడ్తరు. గవన్ని ఒక్క తీర్గనే ఉండయి. తీరు తీర్లుంటయి. గంతేగాకుంట ఉండ్రాల్లు, పండ్లు, బచ్చాలు, పాసెం, పులిగొర అసుంటియి నాకు బెడ్తరు.’’ ‘‘తప్పి జారి గవి దినేవు!’’ ‘‘ఎందుకు దినొద్దు?’’ ‘‘ఎవలు జేసినయి ఎట్లుంటయో! మొన్న బాసర ఐఐటీ పోరగాల్లు హాస్టల్ల తిన్నంక కడ్పునొస్తున్నదని మొత్తుకున్నరు. కొంతమంది దవకాన్ల షరీకయ్యిండ్రు. పదేండ్ల కిందట రౌతుల్లెక్క ఉన్న ఉండ్రాల్లు దింటుంటె నీ రొండు దంతాలల్ల ఒకటిర్గలేదా? గదంత యాదిమర్సినవా? గింత జెప్పినా తినకుంటె బేచైనైత దనుకుంటే నీ ఇష్టం.’’ ‘‘నువ్వు గింతగనం జెప్పినంక ఎందుకు తింట నారదా?’’ ‘‘పట్నం బోతె బోయినవు గని తప్పి జారి మునుగోడు బోకు గన్పతీ.’’ ‘‘ఎందుకు బోవద్దు నారదా!’’ ‘‘గాడ్కి బోతివా అంటె కాంగ్రెస్ వినాయకునివా అని ఒకడు అడ్గుతడు. బీజేపీ వినాకునివా అని ఒకడు అడ్గితె, టీఆర్ఎస్ వినాయకునివా అని ఇంకొకడు అడ్గుతడు.’’ ‘‘చాక్ పీస్‌ల గన్పతి, గవ్వల గన్పతి, ముత్యాల గన్పతి అసువంటి తీరు తీర్ల గన్పతులను జూసిన. నువ్వు జెప్పిన గన్పతులేంది నారదా?’’ ‘‘మునుగోడుల బైఎలచ్చన్లొచ్చినై. మూడు పార్టీలు పైసలిచ్చి గన్పతులు బెట్టిపిచ్చినయి. కాంగ్రెస్ వినాయకుడు చెయ్యి సూబెడ్తడు. టీఆర్ఎస్ వినాయకుడు మోటర్ల గూసుంటె, బీజేపీ వినాయకుడు తామరపువ్వులుంటడు.’’ ‘‘మునుగోడుల బై ఎలచ్చన్లు ఎందుకొచ్చినయి నారదా?’’ ‘‘రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేసిండు. కాంగ్రెస్లకెల్లి బీజేపీలకు దుంకిండు.’’ ‘‘గాయిన రాజినామ ఎందుకు జేసిండు.’’ ‘‘అడిగితె నియోజక వర్గం అభివృద్ధి కోసమన్నడు.’’ ‘‘గాయిన జెప్పిన దాంట్ల నిజమేమన్న ఉన్నదా?’’ ‘‘ఉన్నది. ఎట్లంటవా ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేస్తే హుజూర్నగర్ల బై ఎలచ్చన్లు అయినయి. గప్పుడు టీఆర్ఎస్ సర్కార్ ఒక్క గా నియోజక వర్గంలనే గొర్లను పంచింది. కొత్తగ దలిత బందు పద్కం బెట్టి ఒకొక్క దలిత కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇచ్చింది.’’ ‘‘మునుగోడుల గుడ్క గట్లే జేస్తదా?’’ ‘‘చేస్తది. మా వూరుకు తొవ్వ లేదు. తొవ్వ ఏపిచ్చినోల్లకే ఓట్లేస్తం అని ఏ వూరోల్లన్న అంటే టీఆర్ఎస్ సర్కార్ తొవ్వ ఏపిస్తది. సూసిండ్రా నేను ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జెయ్యబట్కె మీ వూరికి తొవ్వ వొచ్చిందని రాజగోపాల్ రెడ్డి అంటడు.’’ ‘‘బై ఎలచ్చన్ల కర్సంత జెనం నెత్తిమీదనే బడ్తది గదా.’’ ‘‘అవ్. కొత్త పన్నులేస్తరు. మునుగోడుల కొత్త దుక్నాలు బడ్డయి. గవ్విట్ల సర్పంచులను, గల్లి లీడర్లను అమ్ముతున్నరు. పది వేల రూపాయల వొంతున ఓట్లు గొనెతందుకు పార్టీలు రడీగున్నయి.’’ ‘‘వామ్మో!’’ ‘‘యాడాది కొక్కపారి చవ్తి పండ్గొస్తది. గదే తీర్గ అయిదేండ్ల కొక్కపారి, ఒక్కోపారి అంతకన్న ముందుగాలే ఓట్ల పండ్గొస్తది. ‘జై గణేశ, జై గణేశ, జై గణేశ దేవా’ అన్కుంట జెనం నీకు పూజలు జేస్తరు. ఉండ్రాల్లు బెడ్తరు. మీరే మా దేవుల్లనుకుంట లీడర్లు జెనాలకు బిర్యాని బెడ్తరు. మందు తాపిస్తరు. తొమ్మిది దినాలైనంక నిన్ను నీల్లల్ల ముంచుతరు. ఎమ్మెల్యే కుర్సిలు దొర్కినంక లీడర్లు దినాం జెనాలను నిండ ముంచుతరు’’ అని నారదుడు అన్నడు. ‘‘నువ్వు గిదంత జెప్పినంక నాకు పట్నం పోబుద్ది అయితలేదు నారదా!’’ అన్కుంట గన్పతి కైలాసం దిక్కు బోయిండు. ‘‘నారాయణ, నారాయణ’’ అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
కళ్లన్నీ.. కాళ్లన్నీ సాగర తీరం వైపే.. నిమజ్జన రూట్‌మ్యాప్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఇంకొద్ది క్షణాల్లో ఉద్విగ్న ఘట్టానికి తెర లేవనుంది. మహా యజ్ఞానికి ముహూర్తం పడనుంది. గణేష్ సామూహిక ఊరేగింపులు, నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది. కళ్లన్నీ.. కాళ్లన్నీ సాగర తీరం వైపు కదలనున్నాయి. దాదాపు 24,132 మంది పోలీసులు, 122 ప్లటూన్ల సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజాము లోపు నిమజ్జనాలు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించారు. నిమజ్జన ఊరేగింపులు ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శుక్రవారం నుంచి 24 గంటల పాటు నగరంలో మద్యం విక్రయాలు నిషేధించారు. ►శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ, సీఏఆర్, సీఎస్‌డబ్ల్యూ, హోంగార్డ్స్, ఇతర జిల్లాల అధికారులు, ఏపీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ, ఏఆర్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీసు ఫోర్స్ బందోబస్తులో ఉంటాయి. 120 బృందాలను షీ–టీమ్స్ రంగంలోకి దింపింది. ►బాలాపూర్– హుస్సేన్‌సాగర్ మధ్య 18.9 కి.మీ మేర ప్రధాన శోభాయాత్ర మార్గం ఉంది. ఇది 11 పోలీసుస్టేషన్ల పరిధిల మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో మొత్తం 261 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. నగర వ్యాప్తంగా 739 అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ►పాతబస్తీలోని సర్దార్ మహల్లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కమిషనరేట్, ఎన్టీఆర్ మార్గ్, గాంధీనగర్ ఔట్‌పోస్ట్ వద్ద మరో మూడింటిని ఏర్పాటు చేశారు. నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు నిషేధించారు. ఖైరతాబాద్ బడా గణేషుడి వద్ద, ఆ చుట్టుపక్కల కలిపి 53 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 2.5 కి.మీ మేర జరిగే ఈ ఊరేగింపుపై నిఘా ఉంచడానికి అదనంగా మరో 24 కెమెరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ►ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్‌సాగర్‌లోనే మూడు కమిషనరేట్లలో అనేక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో దాని చుట్టూ అందుబాటులో ఉన్న 66 సీసీ కెమెరాలకు తోడు అదనంగా అవసరమైన ప్రాంతాల్లో 27 ఏర్పాటు చేస్తున్నారు. 500 మీటర్ల పరిధిలో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్‌తో పని చేసే 10 మెగా పిక్సల్ కెమెరాలు ట్యాంక్‌బండ్ చుట్టూ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ.. ఎంఎంటీఎస్.. మెట్రో సేవలు హుస్సేన్‌సాగర్ వద్ద నిర్వహించనున్న నిమజ్జన వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 565 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. శనివారం తెల్లవారు జాము వరకు బస్సులు నడుస్తాయి. శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. ఇబ్బందులు రానీయొద్దు: మేయర్ నిమజ్జనం సందర్భంగా కొలనుల వద్ద తాగునీటి వసతితో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండాలని, వ్యర్థాలు పోగవకుండా పారిశుద్ధ్యం సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లకు నగర మేయర్ విజయలక్ష్మి సూచించారు. నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెకిలి చేష్టలు వద్దు శోభా యాత్రలో అమ్మాయిలు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు. అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలకు అరదండాలు తప్పవు. వాటర్ ప్యాకెట్లు చింపి మహిళల మీద చల్లడం, పేపరు ముక్కలను వేయటం, పూలు చల్లడం వంటివి చేస్తూ ఇబ్బందులకు గురి చేయొద్దు. అనుమతి లేకుండా మహిళల ఫొటోలు, వీడియోలు తీయటం చేయకూడదు. పోకిరీల వెకిలి చేష్టలను సీసీ కెమెరాలలో రికార్డ్ చేసి, ఆధారాలతో సహా న్యాయస్థానంలో హాజరుపరుస్తాం. – రాచకొండ షీ టీమ్స్ డీసీపీ ఎస్కే సలీమా 196 తాగునీటి శిబిరాలు భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి 196 నీటి క్యాంపులను ఏర్పాటు చేసింది. శోభాయాత్ర జరగనున్న ప్రధాన మార్గాలు, ట్యాంక్ బండ్ పరిసరాలు, నిమజ్జన కొలనుల వద్ద ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మొత్తంగా 30.72 లక్షల నీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో తాగునీటిని అందుబాటులో ఉంచినట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటి శిబిరాల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించారు. వినాయకుడికో కోడ్! నిమజ్జన ఊరేగింపుల పర్యవేక్షణకు నగర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 9 వేల విగ్రహాలను చేశారు. పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకున్న గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ గణేష్ నిమజ్జనం సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలకు ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. గురువారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆయన ప్రారంభించారు. నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక లైన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 20, 315 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 7, 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 43 సహా 13 కిలోమీటర్ల ఎల్టీ కేబుల్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100/1912/ 7901530966/ 790153086లను సంప్రదించాలి. డ్రోన్లతో డేగకన్ను గణేష్ నిమజ్జనానికి సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే 35 చెరువుల వద్ద తొలిసారిగా డ్రోన్లు, బాడీవార్న్ కెమెరాలతో అనుక్షణం పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే డయల్ 100 లేదా 94906 17444ను సంప్రదించాలి. -
ఘనంగా గణేష్ నిమజ్జనం (ఫోటోలు)
-
హనుమాన్ వేషాధారణతో డ్యాన్స్.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలడంతో..
లక్నో: చావు ఎప్పుడు ఎవరిని ఎటునుంచి పలకరిస్తుందో చెప్పడం కష్టం. అప్పటి వరకు బాగానే ఉన్నా.. క్షణకాలంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో హఠాన్మారణాలు ఎక్కువైపోయాయి. కళ్లముందేనవ్వుతూ కనిపించిన వారు ఉన్నట్టుండి ఊపిరి వదులుతున్నారు. కొన్నిసార్లు ఊహించని రీతిలో మృత్యువు మనిషిని తీసుకెళ్లి పోతుంది. తాజాగా గణేష్ ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన చేస్తూ ఓ కళాకారుడు ఉన్నట్టుండి ప్రాణాలు విడిచాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా మెయిన్‌పురి కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రవి శర్మ అనేక కళాకారుడు హనుమంతుని వేషధారణలో గణేష్ మండపం వద్ద లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తన హుషారైన నటనతో అక్కడున్న పిల్లల్ని, పెద్దల్ని అలరించాడు. రవి శర్మ ప్రదర్శన చూసి అక్కడున్నవారంతా అతనిలో ఉత్సాహాన్ని నింపారు. చదవండి: మోదీ ఫొటోలు కనిపించాలా?.. నిర్మలా సీతారామన్‌గారూ ఇదిగో! అయితే స్టేజ్‌పై ప్రదర్శన చేస్తుండగా మధ్యలోనే రవి శర్మ ఉన్నట్టుండి కుప్పకూలి కిందపడిపోయాడు. ఏమైందో తెలుసుకునేందుకు అక్కడున్న వారికి కాస్తా సమయం పట్టింది. ఎంతకీ రవి శర్మ లేవకపోవడంతో అనుమానం వచ్చి అతన్ని లేపగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. దీంతో వెంటనే అతన్ని మెయిన్‌పురి జిల్లా అసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. #मैनपुरी गणेश मूर्ति पंडाल में युवक नाचते समय बेहोश होकर गिरा हनुमान जी का रूप धर नाच रहा था युवक जिला अस्पताल में डॉक्टरों ने मृत घोषित किया मैनपुरी सदर कोतवाली के मोहल्ला बंशीगोहरा का मामला@mainpuripolice #HanumanJi #GaneshUtsav #network10 #ekdarpan pic.twitter.com/clHPTZSWm4 — Network10 (@Network10Update) September 4, 2022 -
కోటీ 65 లక్షల కరెన్సీ నోట్లతో గణనాథుడి అలంకరణ
గుంటూరులోని ఆర్.అగ్రహారం శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ దశావతార గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గణనాథుడిని కోటీ అరవై ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. శ్రీలక్ష్మీగణపతికి భక్తులు పూజలు నిర్వహించారు. గుంటూరులోని 21వ డివిజన్ కార్పొరేటర్ కె.గురవయ్య ఆధ్వర్యంలో కేవీపీ కాలనీ 1/10వ లైనులో 16వ వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా గణనాథుడిని రూ. 44,44,444 విలువైన కరెన్సీ నోట్లతో సుందరంగా అలకరించారు. – నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) రూ.కోటిన్నర కరెన్సీతో విఘ్నేశ్వరుడికి అభిషేకం ఖిలా వరంగల్: కోటిన్నర రూపాయలతో విఘ్నేశ్వరుడికి శుక్రవారం రాత్రి అభిషేకం నిర్వహించారు వరంగల్ శివనగర్‌లోని వాసవి కాలనీవాసులు. 108 మంది ఇచ్చిన 1,43,11,116 రూపాయల్లో కొన్నింటిని దండలు చేసి మారేడు చెట్టుకు ఉయ్యాల ఊగుతున్న విఘ్నేశ్వరునికి అలంకరించారు. మిగిలిన నోట్ల కట్టలను గణేషుడి ముందుంచి లక్ష్మీపూజ నిర్వహించారు. (క్లిక్: 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు) -
Chinnaswamy Rajendran: ఇక్కడ దొరికే సంతోషం ఎక్కడా దొరకదు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని ప్రతి యేటా వివిధ రూపాల్లో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. ఆయనకు 18 ఏళ్లు ఉన్నప్పుడే మహాగణపతిని రూపుదిద్దారు. నూతన యవ్వనంలో ఉన్న పిల్లోడు గణపతి ప్రతిమను ఇంత బాగా తయారు చేశాడా? అని అంతా వేనోళ్ల పొగిడారు. ఇప్పటివరకు తయారు చేసినవాటిలో ఎలుక రథంపై ఉన్న గణేష్ విగ్రహమే తనకు అత్యంత ఆనందాన్నిచ్చిందంటున్నారు. 1978 నుంచి ఖైరతాబాద్ మహా గణపతిని తయారు చేస్తూ వస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్.. ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. మహాగణపతి తయారీ అవకాశం మీకెలా దక్కింది? 1978లో రిజర్వ్‌బ్యాంక్‌లో ఉద్యోగి ఏసుపాదం నా వద్దకు వచ్చి ఖైరతాబాద్‌లో శంకరయ్య ఆధ్వర్యంలో వినాయకుడిని 14 అడుగుల ఎత్తులో తయారు చేయాలని తీసుకువెళ్లారు. నాకు అప్పుడు 18 ఏళ్లు. ఇంత చిన్న పిల్లోడు విగ్రహం ఎలా తయారు చేస్తాడు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశా. తొలిసారిగా ఖైరతాబాద్‌లో ఆరు బయట స్టేజీ వేసి విష్ణు అవతారంలో వినాయక విగ్రహాన్ని రూపొందించాను. ఆ తర్వాత నాట్య వినాయకుడు, 1980లో పంచముఖ వినాయకుడిని శారదా స్టూడియోలో చేసి ఇక్కడకు తీసుకువచ్చాం. 1982లో ఎలుక రథంతో ఖైరతాబాద్ మంటపంలో వీలు ఉండే స్టాండ్‌లో కర్రలతో తయారు చేశాం. అప్పుడు సాగర సంగమం సినిమా షూటింగ్లో భాగంగా కమల్‌హాసన్‌తో ఇక్కడే ఓ పాటను రికార్డింగ్ చేశారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా విరామం ఇచ్చారా? 1983లో అనివార్య కారణాలతో రాలేకపోయాను. అప్పుడు ఆర్టిస్టు బ్రహ్మం 25 అడుగులతో వెల్డింగ్‌తో వినాయకుడిని తయారు చేశారు. చివర్లో మళ్లీ 10 రోజులు నేను వచ్చి తుది మెరుగులు దిద్దాను. 1993 నుంచి 1999 వరకు 7 ఏళ్లపాటు ఖైరతాబాద్ మహాగణతికి శిల్పిగా వ్యవహరించలేదు. 2000 నుంచి 2005 వరకు కమిటీ వాళ్లు ఇచ్చిన డ్రాయింగ్ మేరకు విగ్రహ తయారీ జరిగేది. 2006 నుంచి దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ పంచాగం చూసి నామకరణం, ఆకారం ఎలా ఉండాలో సూచించేవారు అదే విధంగా ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం. నామకరణం పెట్టిన తర్వాత మహాగణపతికి పేరు ప్రతిష్ఠలు పెరిగాయి. మీకు అత్యంత ఆనందాన్నిచ్చిన గణపతి? 1982లో ఎలుక రథంపై చేసిన వినాయకుడు బాగా సంతోషం కలిగింది. ఆ తర్వాత విశ్వరూప వినాయకుడు, మత్స్య వినాయకుడి రూపంలో చేసినవి నాకెంతో సంతృప్తినిచ్చాయి. ప్రతిసారి నాలోని శక్తినంతా కూడదీసుకుని తయారు చేస్తూ వస్తున్నా. విగ్రహ తయారీ సమయంలో ఎలాంటి అనుభూతి పొందుతారు? 2003లో యాదాద్రి సురేంద్రపురిలో పని చేస్తుండంతో నేను ఆ ఏడాది విగ్రహం తయారు చేయలేనని చెప్పాను. తర్వాత నేను టూ వీలర్‌పై వెళ్తుండగా పెద్ద ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో నా బండి పూర్తిగా ధ్వంసమైనా నాకేమీ కాలేదు. అప్పుడు నా మదిలో మెదిలింది ఖైరతాబాద్ మహాగణపతే. దాంతో ఆ సంవత్సరం కూడా నేను శిల్పిగా వ్యవహరించి వినాయకుడిని పూర్తి చేశా. నేను బతికి ఉన్నంత కాలం మహాగణపతి తయారీలో ముందుంటాను. మీ స్వగ్రామంలో మీకెలాంటి గుర్తింపు ఉంది? మా సొంతూరు తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పుదువేటైకుడి. తల్లిదండ్రులు చిన్నస్వామి, మరుదాయి. నేను రెండో సంతానం. చిన్నస్వామి రాజేంద్రన్ అని పేరు పెట్టారు. ఖైరతాబాద్ వినాయకుడిని చేసినప్పటి నుంచి నాతో పాటు నా కుటుంబానికి మంచి గుర్తింపు వచ్చింది. ఎక్కడకు వెళ్లినా ఖైరతాబాద్ విగ్రహ తయారీ శిల్పిగా గుర్తింపు వచ్చింది. మీ వ్యక్తిగత జీవితం గురించి వివరిస్తారా? ఖైరతాబాద్ మహాగణపతికి శిల్పిగా వ్యవహరిస్తున్నప్పటి నుంచి నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా ఉంది. 68వ సంవత్సరంలో కూడా 50 అడుగులపై గోవా కట్టెలు ఎక్కి పని చేస్తున్నానంటే అన్నీ మహాగణపతి దీవెనలే. నా భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు మోహన్‌కృష్ణ, కూతురు మాలతి ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా ఉంటారు. అన్ని వేళలా సహాయ సహకారాలు అందజేస్తారు. నగరంతో మీకున్న అనుబంధం? హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉత్సవాలకు హాజరు కావడం నాకెంతో సంతోషాన్నిస్తుంది. ఇక్కడ దొరికే సంతోషం ఎక్కడా దొరకదు. అందరి అభిమానం మరువలేను. ఈ ఏడాది మట్టి వినాయకుడి తయారీపై మీ ఫీలింగ్? మట్టి వినాయకుడిని చేయాలనేది గత 10 ఏళ్లుగా నా కోరిక. గత సంవత్సరం ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్‌తో.. మట్టి విగ్రహాన్ని తయారు చేస్తానని చెప్పాను. విగ్రహం తయారు చేస్తున్నప్పుడు వర్షం అడ్డంకిగా మారినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా నిర్విఘ్నంగా పూర్తి చేశా. అంతా ఆ మహాగణపతి చల్లని చూపులే కారణం. (క్లిక్: ఖైరతాబాద్‌లో కొలువు దీరిన మహా గణపతి) -
పీయూష్ గోయల్ ఇంట్లో ప్రధాని మోదీ సందడి, గణపయ్యకు ‘హారతి’
సాక్షి, న్యూఢిల్లీ: వినాయక చవితి ఉత్సవాలు బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 9 రోజులపాటు గణపయ్య పూజలు అందుకోనున్నారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీలోని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నివాసానికి వెళ్లారు. అక్కడ తొలిరోజు గౌరీ తనయుడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గణేష్ చతుర్థి సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా దేశ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతంలోని ఓ శ్లోకాన్ని సైతం ఆయన షేర్ చేశారు. రాష్ట్రపతి శుభాకాంక్షలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాక్షించారు. జ్ఞానానికి ప్రతీక అయిన మంగళమూర్తి గణేషుడు అందరికీ మంచి చేయాలని కోరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘గణపతిబప్పా మోరియా’ అంటూ ట్వీట్ చేశారు. ఆగస్టు 31 మొదలైన లంబోదరుడి ఉత్సవాలు సెప్టెంబర్ 9న ముగియనున్నాయి. గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షల నడుమ కొనసాగిన గణనాథుడి వేడుకలు ఈసారి పునర్వైభవం సంతరించుకోనున్నాయి. (చదవండి: కిడ్నాప్ కేసులో ఆరోపణలు.. శాఖ మార్చిన కాసేపటికే బిహార్ మంత్రి రాజీనామా) -
గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి!
సాక్షి, ఆదిలాబాద్: గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా వారం ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకొనే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆగస్టు 31న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించడంతో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నవరాత్రులు సజావుగా జరిగేందుకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని గణేశ్ ఉత్సవ కమిటీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు, విద్యుత్ అధికారులు పలు సూచనలు చేశారు. పోలీస్‌శాఖ సూచనలు.. ► గణేశ్ మండపాలను ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేయరాదు. ►మండపాల వద్ద మద్యం సేవించరాదు. జూదం ఆడరాదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు. ►మండపం వద్ద కనీసం ముగ్గురు వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ప్రతి రోజు వలంటీర్ల పేర్లను నమోదు చేసి సంతకం తీసుకోవాలి. ►మండపాలను గాలి, వానకు కూలిపోకుండా పకడ్బందీగా నిర్మించాలి. రద్దీగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు ఏర్పా టు చేయాలి. వలంటీర్లు భక్తులను తనిఖీ చేశాకే మండపం వద్దకు పంపాలి. ►మండపంలోకి ఎలాంటి మండే పదార్థాలు లేదా పటాకులు ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూనెతో వెలిగించే దీపాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ►మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా వీడియో కెమెరాలు, సీసీటీటీలు ఏర్పాటు చేసుకోవాలి. ►రాత్రి వేళ మండపంలోకి పశువులు, కుక్కలు చొరబడకుండా అడ్డుగా కంచె ఏర్పాటు చేసుకోవాలి. ►ఆగస్టు 31న ఉదయం 6గంటల నుంచి సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై క్రాకర్లు కాల్చడం, పేల్చడం నిషేధం. ►సౌండ్ బాక్స్‌లను స్థానిక డీఎస్పీ అనుమతి లేకుండా ఉపయోగించరాదు. మండపం వద్ద ఒక బాక్స్ టైపు స్పీకర్ మండప ప్రాంగణంలో మాత్రమే ఇన్స్టాల్ చేయబడాలి. ►శబ్ధ స్థాయిలను అనుమతించదగిన ప రిమితుల్లోనే ఉంచాలి. భారత సర్వోన్న త న్యాయస్థానం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్స్పీకర్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు. ►మండపాల వద్ద ఎలాంటి అసభ్యకరమైన పాటలు, ప్రకటనలు చేయకుండా భక్తి పాటలను మాత్రమే ప్లే చేయాలి. ►ఏదైన సమాచారం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలి. విద్యుత్‌శాఖ సూచనలు.. ►వినాయక నవరాత్రులను పురస్కరించుకుని మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. మండపాల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే విద్యుత్ తీగలతో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పూర్తిగా నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో షార్ట్ సర్క్యూట్లు, విద్యుత్ షాక్‌లు తగిలితే ఆస్తి, ప్రాణనష్టం జరిగే ప్రమాదముందంటున్నారు. ►మండపాల విద్యుద్దీకరణ పనులు లైసెన్స్డ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ ద్వారా మాత్రమే చేపట్టాలి. ►విద్యుత్ సరఫరా కోసం ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్‌గా అమర్చుకోవాలి. లైన్ల నుంచి వచ్చే వైర్ల నుంచి మండపానికి సరఫరా అయ్యే చోట ఈ బ్రేకర్‌ను అమర్చుకోవాలి. ►మండపానికి విద్యుత్ అందించే వైర్లు 2.5 చదరపు మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండరాదు. ► ప్రతి సర్క్యూట్‌పై 800 వాట్ల కంటే అధిక లోడ్ వేయరాదు. ►వరుస విద్యుద్దీపాల కోసం సిల్క్‌వైర్లను వాడడం మంచిదికాదు. దీని వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదముంటుంది. ►ప్రతి సర్క్యూట్‌కు ప్రత్యేకించి న్యూట్రల్ ఎర్త్‌వైర్‌ను తీసుకోవాలి. ►మండపాల వద్ద ఎర్తింగ్ గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. 25 ఎంఎం డయామీటర్, 3 మీటర్ల లోతైన గుంత తీసి ఎర్తింగ్ పైప్‌ను అమర్చుకోవాలి. ►మండపాల్లో విద్యుత్ ఎలక్ట్రిక్ హీటర్లు, ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను వాడరాదు. ►ప్రతి మండపం వద్ద 5 కేజీల కార్బన్డయాక్సైడ్ నిండి ఉన్న అగ్నిమాపక సిలిండర్లను అమర్చుకోవాలి. 2 బకెట్లలో ఇసుకను నింపి పెట్టుకోవడం మంచిది. -
మరోసారి భారతీయుల మనసులు కొల్లగొట్టిన వార్నర్ భాయ్..!
David Warner: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి భారతీయుల మనసులను కొల్లగొట్టేశాడు. గణేష్ చతుర్థి నాడు వినూత్నమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాడు. గణనాథుడి ముందు చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లు డిజైన్ చేసిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. అక్కడ ఉన్న నా స్నేహితులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానని కామెంట్ జోడించాడు. వార్నర్ చేసిన ఈ పోస్ట్‌కు భారతీయుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. గతంలో సినిమా పాటలకు డ్యాన్స్ వేయడం, పాపులర్ డైలాగ్స్‌కు మీమ్స్ చెప్పడం లాంటివి చేసి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న వార్నర్ భాయ్.. తాజాగా చర్యతో భారతీయులకు మరింత చేరువయ్యాడు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) ఐపీఎల్ ద్వారా తెలుగు ప్రజలతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న వార్నీ.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా ఆ బంధాన్ని మరింత బలపర్చుకున్నాడు. వార్నర్ పోస్ట్‌కు తెలుగు ప్రజల నుంచి అధికమైన రెస్పాన్స్ వస్తుండటమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే, వార్నర్ ప్రస్తుతం స్వదేశంలో జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు. ఇవాళ జరిగిన రెండో వన్డేలో అతను 2 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. పర్యాటక జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తొలి వన్డేలో వార్నర్ అర్ధసెంచరీతో మెరిశాడు. చదవండి: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్ -
Ganesh Chaturthi: వినాయకుడి ప్రతిమను పెట్టే చోట ఇలా అలంకరిస్తే..
Ganesh Chaturthi- Decoration Ideas: వినాయక చవితికి గణేష్ మూర్తిని పెట్టే చోట, ప్రతిమకు వెనుకవైపు మండపంలా అనిపించే అలంకరణ ఎలా ఉండాలో ఇప్పటికే ఓ ఆలోచన చేసి ఉంటారు. వాటిలో గ్రాండ్‌గా కనిపించేవే కాదు, సింపుల్‌గానూ, సూపర్బ్గానూ అనిపించే అలంకరణలూ ఉన్నాయి. పూల దారాలు.. పువ్వుల దండలు నాలుగు లైన్లుగా అమర్చి సెట్ చేసినా చాలు అలంకరణకు ఒక రూపం వస్తుంది. అయితే, వీటికి ఏ విధమైన పూలు వాడాలో కూడా తెలిసి ఉండాలి. బయటి మండపాల్లో అయితే పెద్ద పెద్ద దండలతో అలంకరిస్తారు. ఇంట్లో చిన్న ప్లేస్ ఉంటుంది కాబట్టి కార్నర్ ఏరియాను ఎంచుకోవాలి. త్వరగా వాడిపోనివి, బరువు లేని పూలను వాడడం ఉత్తమం. హ్యాంగింగ్స్ కాగితాలను తామర, గులాబీ రూపు వచ్చేలా కత్తిరించాలి. దారానికి సెట్ చేస్తూ, మధ్య మధ్య పూసలతో అలంకరించవచ్చు. రెండు నుంచి ఎన్ని వరుసలైనా డిజైన్ చేసుకోవచ్చు. గట్టి అట్టముక్కలతో చేసిన ఈ హ్యాంగింగ్స్ ఆన్లైన్ లేదా మార్కెట్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. బ్యాక్ డ్రాప్ అలంకరణలో వీటిని ఎంచుకోవచ్చు. బ్రాస్ బెల్స్ ఇవి కొంచెం ఖరీదు ఎక్కువ. కానీ, ఎప్పుడైనా హస్తకళల ఎగ్జిబిషన్స్, ఏదైనా ప్రత్యేక సందర్శనీయ స్థలాలకు వెళ్లినప్పుడు ఇలాంటి బ్రాస్ హ్యాంగింగ్స్‌ను కొనుగోలు చేయొచ్చు. దేవతా మూర్తులు, చిహ్నాలతో ఉన్న హ్యాంగర్స్‌ను బ్యాక్ డ్రాప్ అలంకరణలో ఉపయోగిస్తే ఆధ్యాత్మిక భావన వెల్లివిరుస్తుంది. మిర్రర్ వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన స్టార్ షేప్ క్లాత్స్, ప్యాచ్ వర్క్, అద్దాలతో కుట్టిన హ్యాంగర్స్ ప్రత్యేక కళతో ఆకట్టుకుంటాయి. వీటిని కూడా బ్యాక్ డ్రాప్ అలంకరణకు వాడవచ్చు. కళాత్మకమైన ఇలాంటి అలంకరణ కావాలనుకుంటే రాజస్థానీ, గుజరాతీ ట్రైబల్ ఎంబ్రాయిడరీతో దొరికే హ్యాంగింగ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి సొంతంగానూ తయారుచేసుకోవచ్చు. ముగ్గుల అలంకరణ ఒక ప్లెయిన్ క్లాత్ లేదా రంగు పేపర్‌పైన మెలికల ముగ్గు (కోలమ్)ను డిజైన్ చేసుకుని, బ్యాక్ డ్రాప్‌గా వాడితే చాలు ఏ ఇతర అలంకరణ అక్కర్లేదనిపిస్తుంది. ఈ ముగ్గు కనిపించేలా పువ్వుల దండ వేలాడదీస్తే వ్రతం, వేడుక చేసే స్థలం అందంగా మారిపోతుంది. ఇలాంటి అలంకరణలో చూపే ఏ చిన్న సృజనాత్మకతైనా చూపరులను మళ్ళీ మళ్లీ వెనక్కి తిరిగి చూసేలా చేస్తుంది. చదవండి: Ganesh Chaturthi- Palavelli: వినాయక చవితి.. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే! Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ.. పూర్తి పూజా విధానం -
ఆనంద్ మహీంద్ర వీడియో వైరల్: లాస్ట్ ట్విస్ట్ ఏదైతో ఉందో..
సాక్షి,ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్ర ఏ సందర్భాన్నీ వదులుకోరు. తన బ్రాండ్ ప్రమోషన్ కైనా, తన ఫాలోవర్స్‌లో ఆలోచనలు రేకెత్తించడానికి, లేదా ఎంటర్టైన్ చేయడానికైనా ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా గణేశ్ చతుర్థి సందర్భంగా ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. (పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ) ‘గణేష్ చతుర్థి కీ ఏ ఏక్ కహానీ...భారత్ కి ఏక్ కహానీ’ అంటూ ఒక అద్భుతమైన వీడియోను పోస్ట్ చేశారు. వినాయక చవితిపండుగ సందర్భంగా విఘ్ననాయకుడితో దేశంలో సగటు జీవి జీవితం అల్లుకుపోయిన తీరు, ప్రేమ, ఉద్వేగాలు ఈ వీడియోలో చాలా హృద్యంగా మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఇందులో గణేశుడికి కూడా సీట్ బెల్ట్ వేయడం ట్వీపుల్ను బాగా ఆకట్టుకుంటోంది. (Vivo Y35: స్లిమ్ ఫోన్ ‘వై35’ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?) ఈ వీడియోను..సారీ...ఈ యాడ్‌ను లాస్ట్ వరకు చూస్తే మరింత కిక్కు వస్తుంది. ముఖ్యంగా కోవిడ్ తరువాత దేశవ్యాప్తంగా ప్రజలు చాలా ఉత్సాహంగా ఈ ఏడాది గణపతి చతుర్థిని జరుపుకోనున్నారు. పనిలో పనిగా ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన మరో వీడియోను కూడా చూసి తరించండి. गणेश चतुर्थी की एक कहानी…भारत की एक कहानी… pic.twitter.com/ExXMwsZq9z — anand mahindra (@anandmahindra) August 31, 2022 He’s unstoppable. May his Force be with you. Have a blessed #GaneshChaturthi pic.twitter.com/fGOFy0VrML — anand mahindra (@anandmahindra) August 31, 2022 -
తగ్గేదేలే.. బన్నీ, ఎన్టీఆర్, చరణ్, యశ్ గెటప్‌లలో గణేషుడు
దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ శోభ కనిపిస్తోంది. నవరాత్రోత్సవాలు జరిపేందుకు ప్రతివీధిలోనూ మండపాలు ముస్తాబయ్యాయి. వినాయక చవితి సంబరాలతో నగరాలన్నీ సందడిగా మారాయి.. ఏ గల్లీలో అడుగు పెట్టినా గణనాథుని రూపాలే దర్శనమిస్తున్నాయి. ప్రతిచోటా రకరకాల రూపాల్లో వినాయక ప్రతిమలు మండపాల్లో కొలువుదీరాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో డిఫరెంట్ గణేష్ రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వినాయక విగ్రహాల మీద సినిమాల ప్రభావం కూడా చాలానే ఉంది. గత కొన్నేళ్లుగా సినిమాలోని హీరోలు, వారు పోషించిన పాత్రల రూపంలో వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా కొందరి హీరోల రూపంలో ప్రతిష్టించారు. తాజాగా ఓచోట పుష్పలో అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నట్లు విగ్రహాన్ని రూపొందించారు. మరోచోట ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ సినిమా క్లైమాక్స్‌లో పరుగెడుతూ ఉన్నటువంటి, బాణాన్ని ఎక్కుపెడుతున్న గెటప్‌లో ఉన్నాడు గణేషుడు.. అలాగే ఎన్టీఆర్ భీం రూపంలో..కేజీఎఫ్‌లో యశ్ రూపంలో విఘ్నేశుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఇక బన్నీ, ఎన్టీఆర్, చరణ్, యశ్ ఫ్యాన్స్ వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక సాధారణ జనాలు సైతం ఆ విగ్రహాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వెరైటీ వినాయకుడి విగ్రహాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. PushparAAj...Thaggedhe Le 🔥 Allu Arjun Film roles & Ganesh Idols Never Ending Festival VIBE!! 🔥🔥🤩 This time In Pushpa Raj Avatar 🌟🔥#GaneshChaturthi #PushpaTheRule #AlluArjun pic.twitter.com/YuCYEAziMV — Trinadh❤️AADHF🪓 (@TrinadhAADHF) August 30, 2022 -
ఈ మాత్రం జాగ్రత్తలు పాటించకుంటే ముందే నిమజ్జనం అవుతాం స్వామీ!
ఈ మాత్రం జాగ్రత్తలు పాటించకుంటే ముందే నిమజ్జనం అవుతాం స్వామీ! -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా చలువ పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసి గణనాథుని ప్రతిష్టించిన భక్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి జోగిరమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి గణేషుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. చదవండి: వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి? కాగా, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు. -
Ganesh Chaturthi 2022: వినాయకుడి 8 అవతారాలు.. వాటి చరిత్ర ఇదే
వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు.. ఆయన రూపు, స్వభావం వెనుక లోతైన అర్థం ఉందని వేదాంతులు చెబుతుంటారు. గణేశుని ఆరాధనతో ఈ సంసారం నుంచి సులభంగా విముక్తి పొందవచ్చని సూచిస్తుంటారు. అందుకే గణేశుడే ప్రముఖంగా ఆరాధించబడే గాణపత్యం అనే శాఖ కూడా ఉంది.వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. ఆ ఎనిమిది వివరాలను, గణనాథుని మహిమలను తెలుసుకుని ఆ వినాయకుని సేవించి తరిద్దాం. వక్రతుండుడు పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోయి దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్య ఉండదు. ఏకదంతుడు చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే ç్ఛౌలితం దక్కుతుందన్నాడు. లోకాధి పత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండాపోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. మహోదరుడు శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంత కాలమైనా ఆయన ఆ తపస్సుని వీడకపోవడంతో పార్వతి కంగారుపడి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చి ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడి రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబో దరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. గజాననుడు కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసు కున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచి స్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాకతప్పవు. లంబోదరుడు దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించగా విష్ణువు తన నిజరూపంలోకి రావడంతో శివుడు భంగపడి క్రోధితుడయి క్రోధాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు.క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడగా హర్షం,శోకం అనేసంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. వికటుడు పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతట ఆ రుషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షం అయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒకోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్నిఎదుర్కోవచ్చుననీ వికటుని వృత్తాంతం తెలియచేస్తోంది. విఘ్నరాజు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటి వరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విç్ఛ్నౌురాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకొన్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కల విç్ఛ్నౌూలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి. ధూమ్రవర్ణుడు అరిషడ్వార్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు. ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతుని ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. ‘నేను’ అనే అహంకారాన్ని పక్కనపెట్టి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ పరులకు ఉపకారం చేస్తూ దైవ చింతనతో దైవాన్ని వెతుకుతూ మోక్షంకోసం సాధన చేయడమే దీని సారాంశం. -
Palavelli: వినాయక చవితి.. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే!
గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న సామగ్రితో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి సంబారాలే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు. పండగ సజావుగా సాగిపోయినట్లే ! గణానాతాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నూతి భిస్సీద సాధనమ్ గణపతి అంటే జ్ఞాన, మోక్షప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖా విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకలశాస్త్రాలూ ఆయనను పరబ్రహ్మస్వరూపంగానూ, భవిష్యద్బ్రహ్మగానూ పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్నసంహారకుడు. ఆయనను స్తుతిస్తే సర్వవిఘ్నాలూ ఉపశమిస్తాయి. భక్త సులభుడు గణనాథుడు అంతేకాదు ఆయన భక్త సులభుడు కూడా. బంకమట్టిని తెచ్చి దానికి గణపతి రూపు కల్పించి, ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం గరికతోటీ, రకరకాల ఆకులు, పూవులతోటీ పూజించి, ఉండ్రాళ్లూ, పళ్లూ, పానకం, వడపప్పు, కుడుములు నివేదించి, అపరాధ క్షమాపణగా ఐదు గుంజిళ్లు తీస్తేచాలు – మన కోర్కెలన్నింటినీ తీర్చే మహా దయామూర్తి. గణం అంటే సమూహం అని అర్థం. ఈ సృష్టి యావత్తూ గణాలమయం. అనేకమైన గణాలతో కూడిన మహాగణం. ఈ విశ్వం, మనుష్యగణం, వృక్షగణం, గ్రహగణం– మళ్లీ ఇందులో వివిధ ధర్మాలను అనుసరించి మరెన్నో గణాలు– ఈ గణాలన్నింటిలో నూ అంతర్యామిగా వుంటూ, సృష్టిని శాసించే పరమేశ్వరుడు గణపతి. సమస్త యోగాలకు గణపతియే మూలాధారం. సమస్త విశ్వానికి ఆధారశక్తి గణపతి. ఇంద్రుడు, భగీర థుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దమయంతి, సాంబుడు, ధర్మరాజు మొదలయిన వారు గణపతిని ఆరాధించినట్లు ఐతిహ్యాలున్నాయి. దేవతలకే పూజనీయుడైన గణపతి మనందరికీ కూడా ఆరాధనీయుడు కాబట్టి ఆయన ఆవిర్భవించిన వినాయక చవితినాడు ఎవరి శక్తికి తగ్గట్టు వారు పూజించి ఆయన కృపాకటాక్షాలతో విఘ్నాలను తొలగించుకుని సకల సంపదలనూ పొందవలసిందిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే... పాలవెల్లి అలంకరణమే ఒక చక్కని అనుభూతి. మొక్కజొన్న పొత్తులు, వెలగ, కమల మొదలైన పళ్ళు, కాయలు పాలవెల్లి నుండి వ్రేలాడదీసి, మామిడి తోరణాలు, చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి సర్వసస్యాధిదేవునిగా సర్వ లోకేశ్వరునిగా వినాయకుని పూజిస్తారు. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే... గణపతి అంటే గణాలకు అధిపతి , తొలిపూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అన్నమాట.. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా భావించవచ్చు. పాలవెల్లి అంటే పాలపుంతే అని మరి అందులో నక్షత్రాలు ఏవి! అందుకే వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, మారేడు, దానిమ్మలాంటి పండ్లనీ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట. ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా! పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లిని అమర్చుతారు. – డి.వి.ఆర్. చదవండి: Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ.. పూర్తి పూజా విధానం -
ఖైరతాబాద్‌లో కొలువు దీరిన మహా గణపతి
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్‌లో మహాగణపతి కొలువుదీరాడు. ఉదయం 9.30 గంటలకు నిర్వహించిన మహాగణపతి తొలి పూజకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, ఉపాధ్యక్షుడు నాగేష్ హాజరయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా మట్టితో 50 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల కోసం నగరం శోభాయమానమైంది. వినాయక చవితి వేడుకలకు మండపాలు అందంగా ముస్తాబయ్యాయి. మహానగరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మరోవైపు వినాయక విగ్రహాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ప్రధాన రహ దారులకు ఇరువైపులా అమ్మకాలతో సందడి నెలకొంది. పర్యావరణహిత మట్టి ప్రతిమల పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ లాంటి ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే లక్షలాది విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశాయి. గణపతి వేడుకలకు భారీ ఏర్పాట్లు బన్సీలాల్‌పేట్: గణేష్ నవరాత్రోత్సవాలు నగరంలో బ్రహ్మాండంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో మంగళవారం గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై పోలీసు, జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్అండ్బీ, విద్యుత్తు విభాగాల ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర్ ప్రజలు గణేష్ పండుగ వేడుకలు భక్తిప్రపత్తుల మధ్య అత్యంత ఘనంగా జరపుకోడానికి వీలుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. నగరంలో సుమారు 35 నుంచి 40 వేల వరకు గణేష్ మండపాలను ఏర్పాటు చేశారన్నారు. మండపాల వద్ద నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 9 శుక్రవారం గణేష్ నిమజ్జనోత్సవం జరగనుందన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోష్, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శీలం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వెండితెరపై వినాయక విన్యాసాలు.. ఈ సినిమాలపై ఓ లుక్కేయండి
వినాయకుడు.. విఘ్నాధిపతి.. గణనాథుడు.. బొజ్జ గణపయ్య.. ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో స్వామిని కొలిచినా సకల విఘ్నాలు తొలగి జయం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి వినాయకుడికి తెలుగు సినిమాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంది. విఘ్నేశ్వరుడి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చి, విజయాలు సాధించాయి. మరెన్నో చిత్రాల్లో స్వామిని కీర్తిస్తూ వచ్చిన సన్నివేశాలు, పాటలు కూడా ప్రేక్షకులను అలరించాయి. గణనాథుడి నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు, పాటలపై ఓ లుక్కేద్దాం.. వినాయక చవితి వినాయక చవితి రోజున వినాయక వ్రత కథ చదువుకుని, పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఈ కథ ఆధారంగా సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించిన చిత్రం ‘వినాయక చవితి’. ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల తదితరులు నటించారు. కె. గోపాలరావు నిర్మించిన ఈ సినిమా 1957 ఆగస్టు 22న విడుదలైంది. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే.. వినాయక చవితి నాడు శ్రీకృష్ణుడు పాలలో చంద్రుణ్ణి చూడటంవల్ల సత్రాజిత్తు సంపాదించిన శమంతకమణిని అపహరించాడన్న అపఖ్యాతి మూటగట్టుకుంటాడు. ఆ తర్వాత వినాయక వ్రతం ఆచరించి, నిర్దోషిగా తనను తాను నిరూపించుకుని బయటపడతాడు. అందరూ చవితి నాడు వినాయక వ్రతం ఆచరిస్తే, ఆ గజానుని ఆశీస్సులతో ఎలాంటి నీలాప నిందలపాలు కాకుండా ఉంటారనే కథతో ‘వినాయక చవితి’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం విడుదలై 65 ఏళ్లు అయింది. భూ కైలాస్ పరమశివుని భక్తుడైన రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. ఆత్మలింగం సాధించి, అమరత్వం పొందాలన్నది రావణాసురుడి కోరిక. ఆయన తపస్సును మెచ్చుకున్న శివుడు ఆత్మలింగం ఇస్తూ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని షరతు విధిస్తాడు. రావణాసురుడికి అమరత్వం వస్తే భూ మండలాన్ని సర్వనాశనం చేస్తాడని భావించిన నారదుడు ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని వినాయకుణ్ణి ప్రార్థిస్తాడు. రావణాసురుడు సంధ్యా వందనం చేసే సమయంలో శివుడి ఆత్మలింగం రావణుడి పాలు కాకుండా చేస్తాడు వినాయకుడు. చివరకు ఆత్మార్పణకు సిద్ధపడిన రావణాసురుణ్ణి కైలాసపతి కరుణించి, ఆ ప్రదేశం ‘భూకైలాసం’గా మారుతుందని చెప్పి అనుగ్రహించడంతో కథ ముగుస్తుంది. ఎన్టీఆర్ రావణునిగా, ఏఎన్నార్ నారదుడిగా నటించిన ‘భూ కైలాస్’ చిత్రకథ ఇది. కె. శంకర్ దర్శకత్వంలో ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ సినిమా 1958 మార్చి 20న రిలీజైంది. శ్రీ వినాయక విజయం వినాయకుడి జీవిత చరిత్రపై తెలుగులో పూర్తి స్థాయిలో వచ్చిన చిత్రం ‘శ్రీ వినాయక విజయం’. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, వాణిశ్రీ శివపార్వతులుగా నటించారు. శివదీక్షా వ్రతాన్ని ఆచరించడానికి పూనుకుని స్నానమాచరించబోతూ పిండితో ఒక బాలుని బొమ్మ తయారు చేసి, దానికి ప్రాణం పోసి, కాపలాగా ఉంచుతుంది పార్వతీదేవి. అప్పుడు వచ్చిన శివుణ్ణి లోనికి అనుమతించడు ఆ బాలుడు. ఆగ్రహించి బాలుని శిరస్సు ఖండిస్తాడు శివుడు. దీంతో పార్వతి తన బిడ్డను ఎలాగైనా బతికించమని శివుణ్ణి కోరుతుంది. ఆ బాలునికి ఏనుగు తలను అమర్చి ప్రాణం పోస్తాడు శివుడు. ఆ బాలుడు మూషికాసురున్ని సంహరించిన తీరు, మూషికాసురుని జన్మ వృత్తాంతం వంటి ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపించారు. 1979 డిసెంబరు 22న ఈ చిత్రం విడుదలైంది. జై జై గణేశా... తెలుగు సినిమాల్లో గణనాథుణ్ణి కీర్తిస్తూ ఎన్నో పాటలు వచ్చాయి. ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ అనే పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలో సాగుతుంది. వెంకటేష్ నటించిన ‘కూలీ నెంబర్ 1’ సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా..’ పాట ఇప్పటికీ ప్రతి వినాయక మండపంలో వినిపిస్తూ ఉంటుంది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘జై చిరంజీవ’ సినిమాలో ‘జై జై గణేశా.. జై కొడత గణేశా..’ పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ ‘డిక్టేటర్’ మూవీలోని ‘గం గం గణేశా..’ అనే పాట కూడా ఆకట్టుకుంది. ‘దేవుళ్లు’ సినిమాలోని ‘జయ జయ శుభకర వినాయక..’ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు. మహేశ్‌బాబు ‘పోకిరి’ సినిమాలోని జగడమే పాటలో ‘గణపతి బప్పా మోరియా..’ అంటూ వచ్చే బిట్ సూపర్‌గా ఉంటుంది. రామ్ ‘గణేష్’ మూవీలో వినాయకుడిపై ఒక పాట ఉంది. ‘దేవదాస్’ సినిమాలో నాగార్జున, నాని వినాయకుణ్ణి కీర్తిస్తూ పాడే పాట పాపులర్ అయింది. నాని ‘భలే భలే మగాడివోయ్’, రవితేజ ‘పవర్’ సినిమాల్లో వినాయక చవితి ప్రస్తావన ఉంది. ఇవే కాదు.. మరికొన్ని సినిమాల్లోనూ గణేశుణ్ణి కీర్తిస్తూ పాటలున్నాయి. -
వినాయక చవితి.. పిల్లల పండగ
మనిషి జీవితం అనుభవాల పుట్ట. అనుభవాలకంటేే అనుభూతులేే బాగుంటాాయి. అంటేే ఏ విషయమైనా అది అనుభవించేేటప్పటి కంటేే అవి గుర్తు తెచ్చుకున్నప్పుడే ఎక్కువ ఆనందిస్తామనిపిస్తుంది. అందుకే కొంత వయసొచ్చాక మనం చేసే కొన్ని పనులు.. గతించిన మధుర జ్ఞాపకాలని మళ్లీ పునరుజ్జీవం చేసేందుకు.. తద్వారా మళ్లీ అలాంటి ఆనందం పొందేందుకూ చేసే ప్రయత్నాలు అనిపిస్తుంది. అయితే ఒకప్పుడు పొందిన ఆనందానుభూతి మళ్లీ కలుగుతుందా అంటే అనుమానాస్పదమే.. చాలా సార్లు ఆశాభంగమే మిగులుతుంది. నా చిన్నప్పుడు మా తాతగారింటి దగ్గరలో తామరలు.. కలువలతో నిండిన చెరువు వుండేది. మా ఇంటి దగ్గర బయలు దేరి తాతగారుండే వీథి మలుపు తిరుగుతూనే,తామరపూల సువాసనను మోసుకొచ్చే చల్లని గాలి మేను తాకేది, ఆ దారిని వెళ్లినప్పుడల్లా, ఆ అనుభూతి కోసం వెదుక్కునే దానిని. ఎప్పుడో ఒకసారి మాత్రమే అది దక్కేది. ఆ తర్వాతర్వాత.. కలువలూ, తామరలూ పోయి ఉత్త చెరువుగా మారింది. చేపల పెంపకానికి ఇప్పుడదీ లేదు.. పిచ్చి మొక్కలు పెరిగి పెద్దగుంటలా మిగిలింది. కానీ నాలో ఆ చిన్ననాటి జ్ఞాపకం పదిలంగానే వుంది. అలాగే మొట్టమొదటి సారి అరవిచ్చిన జాజులనో, మల్లెలనో.. అరచేతిలో తీసుకున్నపుడు చుట్టుముట్టిన వాటి సన్నని పరిమళం ఎన్నటికీ మరువదు మనసు. ఇప్పుడు వాటిని చేతిలోకి తీసుకున్నా పరిమళించేది ఆనాటి జ్ఞాపకాలే . కొంత పెద్దయిన తర్వాత పండగలంటే ఉత్సాహం పోతుంది. నిరాసక్తంగా అనిపిస్తుంది. అందరికీ అంతేనేమో అనుకుంటా. కానీ వినాయక చవితి మాత్రం ఎందుకో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రతి వినాయక చవితి పండగకు నా చిన్ననాటి జ్ఞాపకాలు పునరుజ్జీవితమవుతూ వుంటాయి. ఆ రోజు పొద్దున్నే"ఇవాళ పండగ లేలే "అంటూ అమ్మ నిద్ర లేపంగానే,బయటకు వచ్చి చూస్తే ఆకాశం నీలంగా చల్లగా హాయిగా అనిపించేది. గబా గబా మొహం కడిగేసి.. పత్రి కోసం పిల్లలందరం కలిసి సంచులు తీసుకుని బయలు దేరే వాళ్లం,(ఇప్పటిలాగా పత్రి కట్టలు కొనే వాళ్లం కాదు) సరే వేణు గోపాల స్వామి గుడి దగ్గరకు వచ్చే సరికి గుడి గోడల మీద, గుడి ఆవరణలోనూ అంతా కోలాహలంగా అరుస్తూ పిల్ల మూకలు.. "అరేయ్ గన్నేరు పూలు కొయ్యండ్రా అంటూనో,జమ్మి కొమ్మలు తెంపండిరా అంటూనో, మారేడు దళాలు కూడా కావాలోయ్ అంటూనో " పిల్లలు అరుస్తుంటే కొంతమంది చెట్లెక్కలేని పెద్దలు కింద నిలబడి "బాబూ నాకో రెండు రెమ్మలు ఇటు పడెయ్యి నాయనా" అంటుండే వారు.మేము గుళ్లో పత్రి సేకరించాక.. ఆ ఆవరణ అంతా పెరిగిన టపాకాయల మొక్కల నుండీ సన్నగా బారుగా వుండే కాయలు కోసి అక్కడవుండే నూతిలో వేసి అవి ఠప్ ఠప్ మని మోగుతుంటే చప్పట్లు కొట్టి నవ్వుకునే వాళ్లం. ఇక అక్కడ నుండీ చెరువు దగ్గర కొచ్చేటప్పటికి ఈత వచ్చిన పిల్లలు ,అప్పటికే చెరువులో ఈదుతూ కలువలూ తామరలూ తెంపుతూ వుండేవాళ్లు ,ఈతరాని నా లాంటి పిల్లలు ఒడ్డు నుండి "నాకా తెల్లకలువ తెచ్చిపెట్టవా అనీ,ఆ ఎర్ర కలవ మొగ్గ చేతి కందేంత దూరంలో వుందనీ,ఆ తెల్ల తామర దగ్గరలోనే వుందనీ" కేకలు వేస్తూ సందడి చేస్తూ వుండే వాళ్లం. అలా చెరువు దగ్గరనుండీ బయలు దేరి,డొంక దారి పట్టేటప్పటికి, అప్పటికే అక్కడ పిల్లలనిపూచిన,కాసిన చెట్లుండేవి,"అదుగో ఆ వెలగ కొమ్మ కాయతో సహా కొయ్యాలి"అని కింద నుండి ఎవరో కేకేసే వారు(వెలగచెట్టు నిలువుగా చాలా ఎత్తులో వుంటుంది, ఎక్కడం చాలా కష్టం) "మామిడి రెమ్మలు మాకూ నాలుగందుకో" అనే వారింకొకరు, "మాష్టారూ ఉత్తరేణి అంటే ఇదేనా?దూర్వార అంటే ఈ గరిక పోచలేనా? అరె జిల్లేడు కొమ్మలతో జాగ్రత్త పాలు కంట్లో పడితేకళ్లు పోతాయి" ఇలాంటి సలహాలతో, సహాయాలతో ఎలాగో మోపెడు పత్రితో ఇల్లు జేరేటప్పటికి ఉదయం పది గంటలయ్యేది. అప్పటికే అమ్మ పూజకన్నీ సిధ్ధం చేసి వుంచేది,ఈ లోగా వీథిలో ఎవరో "వినాయకుళ్లోయ్ "అంటూ మట్టి వినాయకుళ్లమ్మొచ్చేవారు,ఇంట్లో పెద్ద బొమ్మలొకటో రెండో వున్నా తప్పని సరిగా ఆ మట్టి వినాయకుణ్ణి ప్రతి సంవత్సరం కొనాల్సిందే. "తొందరగా స్నానాలు చేసి అక్కడ పెట్టిన పట్టుబట్టలు కట్టుకోండర్రా "అని అమ్మ పెట్టే కేకతో స్నానం ముగించి.. చదువుకునే క్లాస్ పుస్తకాలలో పసుపుతో శ్రీ రాసి బొట్లు బెట్టి దేవుడు ముందు పెట్టే వాళ్లం. అలా చేస్తే బాగా చదువు వస్తుందని చెప్పేవాళ్లు. పుస్తకాలు చదవకుండానే చదువెలా వస్తుందనే సందేహాలూ, ప్రశ్నలూ లేనే లేవు చెప్పింది చేసెయ్యడమే. అమ్మ పిండివంటలు తయారు చేస్తూ వుండేది పూజ మేమే మొదలు పెట్ఠేవాళ్లం "వినాయక వ్రత కల్పం "పుస్తకం సహాయంతో,సగం పూజ అయ్యే సరికి వినాయకుడి వాహనం సంగతేమో కానీ మాకే కడుపుల్లో ఎలకలు పరిగెత్తుతూ వుండేవి,అయినా సరే పట్టుదలగా ,అమ్మ అరటి పండు కాస్త నోట్టో వేసుకోవచ్చే అన్నా సరే నిష్ఠగా పూజ చేశారనిపించుకోవాలని,చివరి వరకూ పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా పూజ ముగించే వాళ్లం. ఇక భోజనం చేసిన దగ్గర నుండి ఇంకో పెద్ద పనుండేది. అది ఇరుగు పొరుగుల ఇళ్లకెళ్లి వాళ్ల వినాయకుణ్ణి చూసి రావడం. అప్పట్లో మాకు ఇలా వీథుల్లో పెద్ద పెద్ద వినాయకుళ్లని నిలబెట్టడం.. వారం రోజులపాటు మైకుల్లో మెదడు బయటకు వచ్చే పాటలు పెట్టి ఊదర కొట్టడం ఉండేవి కావు. ఎవరిళ్లల్లో వాళ్లు పూజ చేసుకోవడం, స్నేహితుల ఇళ్లకెళ్లి వాళ్ల దేవుణ్ణి చూసి, మా పిండి వంటలు వాళ్లూ వాళ్ల పిండి వంటలు మేమూ మెక్కడం, మూడో రోజో అయిదో రోజో దేవుణ్ణి మొక్కల్లో పెట్టడమో ,చెరువులో కలపడమో ఇంతే.. ఎప్పుడు బయలు దేరిందో ఈ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టే సంస్కృతి ? నాకు తెలిసి ఇది మనది కాదు. ఇప్పుడు పండగ రోజు పొద్దున్నే పత్రి కోసం వెళ్లే పిల్లలెవరూ కనబడడం లేదు. వేణుగోపాల స్వామి గుడి గోడలు వెలవెల బోతున్నాయి. చెరువులో ఈతకొట్టే పిల్లలూ లేరు. కలువలూ తామరలూ కనుమరుగయ్యాయి. పత్రి కావలసిన వాళ్లకి పదో ఇరవయ్యో పెడితే బజారులో కావలసినంత పత్రి, కలువలు తామరలూ కూడా అమ్మకానికి దొరుకుతాయి. వీథి వీథినా పెద్ద పెద్ద వినాయకుళ్లు కొలువుదీరి వుంటున్నారు. ఒక వీథిని మించి ఇంకో వీథి పోటీ పడుతున్నాయి. నిమజ్జనాల రోజయితే, చెప్పే పనే లేదు పెద్ద పేద్ద మైకులతో,టపాసుల సందడితో, తూగి పోతూ జనం వేసే చిందులతోవినాయకుణ్ణి సాగనంపే కార్యక్రమం ఒక పెద్ద జాతర లాగ జరుపుతున్నారు. ఈ రోజు నాకు ఎందుకో ,పాపం పుణ్యం తెలియని ,అమాయక మైన అయిదారేళ్ల వయసులో మేము సంబరంగా జరుపుకున్న పండగ గుర్తొస్తోంది. వినాయక చవితి నా దృష్టిలో పిల్లలు సామూహికంగా కలిసి ఆడుకునే ఒక ఆట, అంతే కాదు ఎలక నుండీ ఏనుగు దాకా ప్రకృతి లో ఒక భాగమే, అవి కూడా పూజ్యనీయాలే అని చెప్పే పండగ అందుకే నాకు వినాయక చవితి ఇష్టమైన పండగ. - భార్గవి -
గణేశ్ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము
వినాయక చతుర్థి వచ్చిందంటే చాలు ప్రతీ ఇంటిలో తొమ్మిది రోజుల పండగే. వినాయక చవితి అంటే పండగే కాదు., ఆరోగ్య జీవనాన్ని ప్రతిబింభించే సంస్కృతి కూడా..! చవితి రోజున దాదాపు 15 రకాల వనమూలికలతో పూజను చేయడం ఆనవాయితీ. అంతేకాదు గణేషునికి ప్రసాదంగా అందించే కుడుములు, ఉండ్రాళ్లు కూడా ఆరోగ్య ప్రధాయిని. విభిన్న ప్రాంతాలకు, సంస్కృతులకు చెందిన కుడుములు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయని న్యూట్రీషనర్స్, ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ కుడుములు విభిన్న పేర్లతో విభిన్న రాకాలుగా ఉన్నప్పటికీ కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన కుడుములను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కొంకణ్‌లో బయట రవ్వ కోటింగ్ ఇచ్చి తయారు చేసేవి ములిక్గా ప్రసిద్ది, మోదక్గా పేర్కొనే సంప్రదాయ కుడుములను అరటిపళ్లతో తయారు చేస్తారు. అలాగే కేరళలో మినప్పప్పు, స్పైసెస్తో సాల్టీ స్టీమ్డ్ వెర్షన్‌గా ఉప్పు కొజుకత్తై పేరిట వండి సమర్పిస్తారు. తెలంగాణాలో ఉండ్రాళ్లు, చలివిడి, వడపప్పు వంటి రకాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. హోమ్‌ఫుడ్స్ విక్రయించే చోట ప్రతి సంవత్సరం ఈ ఉండ్రాళ్లలో విభిన్న వెర్షన్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ బాదములు, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా జత చేస్తున్నారు. గోల్డ్‌డ్రాప్ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ ‘‘బాల గణేషుని కథలో మోదక్ (కుడుములు) పట్ల ఆయన అభిరుచిని గురించి ప్రతి ఇంటిలోనూ, ప్రతి సంవత్సరం కథల రూపంలో చెబుతూనే ఉంటారు. అందువల్లే అవి వయసులకు అతీతంగా ఆకట్టుకుంటున్నాయి ’’ అని అన్నారు. పుష్కలంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్... సాధారణంగా కుడుములను బియ్యం పిండి, శకగపప్పు, మినప్పప్పుతో తయారు చేస్తారు. ఈ మిశ్రమంతో శరీరానికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా అందుతాయి. ఈ కుడుముల్లోని కొబ్బరి–బెల్లం చూర్ణం అధిక మొత్తంలో కాల్షియంను అందిస్తాయి. కుడుములను స్వీట్, హాట్ రెండు రకాలుగానూ చేసుకోవచ్చు. బియ్యపు పిండితో పాటు మిల్లెట్స్, రాగి పిండితో చేసిన కుడుములు అధిక విటమిన్లు, ఫైబర్ అందిస్తాయి. వీటికి చూర్ణంలో భాగంగా కొత్తిమీర, ఆకుకూరలు, కరివేపాకు పొడి, ముద్దగా చేసిన ఆకుకూరపప్పు, డ్రై కర్రీలను వాడుకోవచ్చు. ఈ కుడుములను పిండితో చేస్తాం కాబట్టి కొద్ది రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి మూడు రోజుల వరకు తినవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ప్రాచుర్యం పొందుతున్న మోమోస్ ఓ రకంగా కుడుముల లా తయారైనవే. అయితే వాటికన్నా ఇవి ఆరోగ్యకరం. మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతున్న ఆరోగ్య నియమాలు ఎంతో విశిష్టమైనవి. ప్రతీ పండుగకు విభిన్నమైన ఆహార పదార్థాలు, ప్రసాదాలు ఉంటాయి. శరీరానికి అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందడానికి ఈ తయారీ విధానం ఉపయోడపడుతుంది. అంతేకాకుండా కొత్త రుచులను అందిస్తాయి. చిన్న పిల్లలు, పెద్దవారు ఎవరైనా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. –జానకి,న్యూట్రీషనిస్ట్ -
Ganesh Chaturthi Recipes: రవ్వలడ్డు తయారీ విధానం
కావలసినవి: బొంబాయి రవ్వ – 2 కప్పులు, పంచదార – 2 కప్పులు, పచ్చికొబ్బరి – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు, జీడిపప్పు – తగినన్ని, కిస్మిస్ – తగినన్ని, ఏలకులపొడి – అర టీ స్పూను, నీళ్ళు – 2 టీ స్పూన్లు. తయారి విధానం: రవ్వని వేయించి పక్కనుంచుకోవాలి. నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. అడుగు మందంగా వున్న పాత్రలో పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, ఏలకులపొడి పాకంలో కలుపుకుంటే తియ్యతియ్యటి రవ్వలడ్డు రెడీ. -
Ganesh Chaturthi Recipes: సున్నుండల తయారీ విధానం
కావలసిన పదార్థాలు : మినపప్పు – 2 కప్పులు, పంచదార పొడి – 2 కప్పులు, నెయ్యి – 1 కప్పు, యాలకలపొడి – 1/2 టీ స్పూన్ తయారు చేసే విధానం : మినపప్పు దోరగా వేయించుకొని చల్లారిన తరువాత పొడి చేసుకొని నెయ్యి వేడిచేసి పంచదారపొడి, మినప్పిండీ, యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి. -
Ganesh Chaturthi Recipes: చిట్టి ముత్యాల లడ్డు తయారీ విధానం
కావలసిన పదార్థాలు శనగపిండి – 2 కప్పులు యాలకులపొడి – 1 టీ స్పూన్ లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు పంచదార – 2 1/2 కప్పులు ఆరెంజ్ కలర్ – చిటికెడు రిఫైండ్ నూనె – వేయించటానికి తగినంత తయారు చేసే విధానం : ►శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్ కలర్ మరియు ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో దోరగా వేయించు కోండి. ►మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న బూందీని పాకంలో సుమారు ఒక గంటసేపు ఉంచి యాలకుల పొడి, కలిపి లడ్డుగా చుట్టుకోండి