వెయ్యేళ్ల చరిత్ర.. 31 నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవం | Kanipaka varasiddhi Brahmotsavam Starts from 31st August | Sakshi
Sakshi News home page

వెయ్యేళ్ల చరిత్ర.. 31 నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవం

Published Mon, Aug 29 2022 10:52 AM | Last Updated on Mon, Aug 29 2022 1:34 PM

Kanipaka varasiddhi Brahmotsavam Starts from 31st August - Sakshi

యాదమరి(కాణిపాకం): దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కాణిపాక దేవస్థానం ఒకటి. సత్యప్రమాణాల దేవుడిగా కాణిపాక వినాయకుడికి పేరు. అలాంటి వరసిద్ధి వినాయకస్వామికి ఈనెల 31వ తేదీ (చవితి)నుంచి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇక్కడ ఏటా భాద్రపద శుద్ధ చవితి నుంచి జరిగే ఈ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. తొలి తొమ్మిది రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పదో రోజు నుంచి పన్నెండు రోజులపాటు ప్రత్యేక  బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.  

ఆలయ చరిత్ర
చిత్తూరు జిల్లాలో బాహుదా నదీ తీరంలో వెలసిన గణపయ్యకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. అందులో పెద్దవాడు గుడ్డివాడైతే, మిగతా ఇద్దరు మూగ, చెవిటివారిగా పుట్టారు. కొన్నాళ్లకు ఆ ఊరిని కరువు కమ్మేసింది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమ స్థలంలో ఒక బావిని తవ్వడం  ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్దరాయి అడ్డు వచ్చింది. దాన్ని పెకళించడానికి ప్రయత్నించారు.

ఈ ప్రయత్నంలో రాయికి పార తగిలింది. వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడిందట. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పారు. పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శన మిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం(కాణి) దూరం పారిందట. అలా విహారపురికి కాణి పారకమ్‌ అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది.  

విగ్రహంలోనూ ఎదుగుదల
బావిలో ఉద్భవించిన వినాయకుడి విగ్రహంలోనూ ఎదుగుదల ఉండడం విశేషం. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళతుంగ  చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి.  65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండికవచం, 2000, 2002, 2006, 2007  సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పుడు సరిపోక పోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు.  

సత్యప్రమాణాల దేవుడిగా..
వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్షపడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరమవుతారని నమ్మకం. దీంతోపాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండడం విశేషం. అసెంబ్లీలో నాయకులు సైతం ఆరోపణలు వచ్చిన సమయంలో కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? అంటూ సవాళ్లు విసురుకోవడం గమనార్హం. 

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు 
ఆలయంలో విద్యుత్‌ లైట్లు కటౌట్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రేన్‌ సహాయంతో ఆలయంలోని అలంకార మండపంలో దేవతా మూర్తులను అమర్చారు. ఆలయంలో అలంకార మండపంలో విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఆలయం వెలుపల కటౌట్‌లు ఏర్పాటు చేయడానికి విద్యుత్‌ లైట్ల కటౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement