Ganesh Chaturthi 2022: Significance Of Vigneshwara Kalyanam In Telugu - Sakshi
Sakshi News home page

Vigneshwara Kalyanam: విఘ్నేశ్వరుని కళ్యాణం.. వినాయకుడి పెళ్ళి కథ ఆంతర్యం ఇదే!

Published Tue, Aug 30 2022 4:31 PM | Last Updated on Tue, Aug 30 2022 7:53 PM

Ganesh Chaturthi 2022: Significance Of Vigneshwara Kalyanam - Sakshi

వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రశయా నంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభించాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో  సృష్టులు చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు.

అప్పుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికం వచ్చిందని, కాబట్టి గణేశ అర్చనం చేయమని నారదుడు బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకుని కోసం కఠోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన వినాయకుడు బ్రహ్మ అంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు.

అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమంగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవన వతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు.

ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరిం చాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతు న్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు.

అతని అంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు ‘‘నారదా! మా మధ్య కలహం వస్తుందని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధులు ఎవరోకాదు, నా అంతరంగిక శక్తులైన జ్ఙానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం.
నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్‌ మానవుడు సిద్ధి బుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు. ఇది వినాయకుడి పెళ్ళి కథ అంతర్యం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement