సాక్షి, హైదరాబాద్: ఇంకొద్ది క్షణాల్లో ఉద్విగ్న ఘట్టానికి తెర లేవనుంది. మహా యజ్ఞానికి ముహూర్తం పడనుంది. గణేష్ సామూహిక ఊరేగింపులు, నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది. కళ్లన్నీ.. కాళ్లన్నీ సాగర తీరం వైపు కదలనున్నాయి. దాదాపు 24,132 మంది పోలీసులు, 122 ప్లటూన్ల సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజాము లోపు నిమజ్జనాలు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించారు. నిమజ్జన ఊరేగింపులు ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శుక్రవారం నుంచి 24 గంటల పాటు నగరంలో మద్యం విక్రయాలు నిషేధించారు.
►శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ, సీఏఆర్, సీఎస్‌డబ్ల్యూ, హోంగార్డ్స్, ఇతర జిల్లాల అధికారులు, ఏపీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ, ఏఆర్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీసు ఫోర్స్ బందోబస్తులో ఉంటాయి. 120 బృందాలను షీ–టీమ్స్ రంగంలోకి దింపింది.
►బాలాపూర్– హుస్సేన్‌సాగర్ మధ్య 18.9 కి.మీ మేర ప్రధాన శోభాయాత్ర మార్గం ఉంది. ఇది 11 పోలీసుస్టేషన్ల పరిధిల మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో మొత్తం 261 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. నగర వ్యాప్తంగా 739 అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
►పాతబస్తీలోని సర్దార్ మహల్‌లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కమిషనరేట్, ఎన్టీఆర్ మార్గ్, గాంధీనగర్ ఔట్‌పోస్ట్ వద్ద మరో మూడింటిని ఏర్పాటు చేశారు. నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు నిషేధించారు. ఖైరతాబాద్ బడా గణేషుడి వద్ద, ఆ చుట్టుపక్కల కలిపి 53 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 2.5 కి.మీ మేర జరిగే ఈ ఊరేగింపుపై నిఘా ఉంచడానికి అదనంగా మరో 24 కెమెరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
►ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్‌సాగర్‌లోనే మూడు కమిషనరేట్లలో అనేక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో దాని చుట్టూ అందుబాటులో ఉన్న 66 సీసీ కెమెరాలకు తోడు అదనంగా అవసరమైన ప్రాంతాల్లో 27 ఏర్పాటు చేస్తున్నారు. 500 మీటర్ల పరిధిలో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్‌తో పని చేసే 10 మెగా పిక్సల్ కెమెరాలు ట్యాంక్‌బండ్ చుట్టూ ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ.. ఎంఎంటీఎస్.. మెట్రో సేవలు
హుస్సేన్‌సాగర్ వద్ద నిర్వహించనున్న నిమజ్జన వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 565 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. శనివారం తెల్లవారు జాము వరకు బస్సులు నడుస్తాయి. శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
నడుస్తాయి.
ఇబ్బందులు రానీయొద్దు: మేయర్
నిమజ్జనం సందర్భంగా కొలనుల వద్ద తాగునీటి వసతితో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండాలని, వ్యర్థాలు పోగవకుండా పారిశుద్ధ్యం సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లకు నగర మేయర్ విజయలక్ష్మి సూచించారు. నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వెకిలి చేష్టలు వద్దు
శోభా యాత్రలో అమ్మాయిలు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు. అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలకు అరదండాలు తప్పవు. వాటర్ ప్యాకెట్లు చింపి మహిళల మీద చల్లడం, పేపరు ముక్కలను వేయటం, పూలు చల్లడం వంటివి చేస్తూ ఇబ్బందులకు గురి చేయొద్దు. అనుమతి లేకుండా మహిళల ఫొటోలు, వీడియోలు తీయటం చేయకూడదు. పోకిరీల వెకిలి చేష్టలను సీసీ కెమెరాలలో రికార్డ్ చేసి, ఆధారాలతో సహా న్యాయస్థానంలో హాజరుపరుస్తాం.
– రాచకొండ షీ టీమ్స్ డీసీపీ ఎస్‌కే సలీమా
196 తాగునీటి శిబిరాలు
భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి 196 నీటి క్యాంపులను ఏర్పాటు చేసింది. శోభాయాత్ర జరగనున్న ప్రధాన మార్గాలు, ట్యాంక్ బండ్ పరిసరాలు, నిమజ్జన కొలనుల వద్ద ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మొత్తంగా 30.72 లక్షల నీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో తాగునీటిని అందుబాటులో ఉంచినట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటి శిబిరాల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించారు.
వినాయకుడికో కోడ్!
నిమజ్జన ఊరేగింపుల పర్యవేక్షణకు నగర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 9 వేల విగ్రహాలను చేశారు. పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకున్న గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు.
నిరంతరాయంగా విద్యుత్
గణేష్ నిమజ్జనం సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలకు ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. గురువారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆయన ప్రారంభించారు. నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక లైన్లు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 500 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 20, 315 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 7, 160 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 43 సహా 13 కిలోమీటర్ల ఎల్‌టీ కేబుల్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100/1912/ 7901530966/ 790153086లను సంప్రదించాలి.
డ్రోన్లతో డేగకన్ను
గణేష్ నిమజ్జనానికి సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే 35 చెరువుల వద్ద తొలిసారిగా డ్రోన్లు, బాడీవార్న్ కెమెరాలతో అనుక్షణం పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే డయల్ 100 లేదా 94906 17444ను
సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment