
హుస్సేన్‌సాగర్ బోటు అగ్నిప్రమాదం ఘటనలో యువకుడి గల్లంతు
సాగర్‌లో గాలింపు చేపట్టిన పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందాలు
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమం..కోలుకున్న ముగ్గురు
రాంగోపాల్‌పేట్: హుస్సేన్ సాగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక యువకుడు అదృశ్యమయ్యాడు. భారతమాతకు మహా హారతి కార్యక్రమం సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో బోటు నుంచి బాణసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, కుషాయిగూడ నాగారానికి చెందిన సిల్వేరు అజయ్ (21) అనే బీటెక్ విద్యార్థి రాత్రి నుంచి అదృశ్యం అయ్యారు.
ఉదయం నుంచి ఆ యువకుడి కోసం లేక్ పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా ఆచూకీ మాత్రం దొరక లేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి అనే వ్యక్తి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయన పరిస్థితి విషమంగా ఉండగా..ప్రణీత్‌కుమార్, సునీల్ అదే ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా డిశ్చార్జ్ చేశారు.
స్నేహితుడితో కలిసి వచ్చిన...
కుషాయిగూడ నాగారానికి చెందిన ఆటో డ్రైవర్ జానకిరాం, నాగలక్ష్మి దంపతుల కుమారుడు అజయ్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్‌తో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అజయ్ స్నేహితుడు రాఘవేంద్రకు టపాకాయల వ్యాపారి మణికంఠ డబ్బులు ఇచ్చేది ఉంది. ఆదివారం సాయంత్రం మణికంఠకు రాఘవేంద్ర ఫోన్ చేయగా తాను ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్నానని, ఇక్కడికి వస్తే డబ్బు ఇస్తానని చెప్పాడు. దీంతో మరో స్నేహితుడు సాయిసందీప్‌తో కలిసి ఆదివారం రాత్రి 7.30 గంటలకు ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మణికంఠకు ఫోన్ చేయగా బోటులో సాగర్ లోపల నుంచి ఒడ్డుకు వచ్చి వారికి డబ్బులు చెల్లించాడు.
తాము బోటులో లోపలికి వస్తామని చెప్పడంతో అందరూ కలిసి బాణసంచా కాల్చే దగ్గరకు వెళ్లగా అదే సమయంలో అగి్నప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో బోటు సిబ్బందితో పాటు మరికొంత మంది బోటు సిబ్బంది అక్కడ ఉన్నారు. బాణసంచాను కచాప్‌లో ఉంచగా దానికి అనుసంధానంగా మెకనైజ్డ్ బోటు, మరో స్పీడ్ బోటు ఉన్నాయి. మెకనైజ్డ్ బోటుకు కూడా మంటలు అంటుకోవడంతో అందరూ అందులో నుంచి కిందకు నీళ్లలోకి దూకేశారు. అక్కడే ఉన్న బోటు సిబ్బంది నీళ్లలోకి దూకి కొందర్ని రక్షించగా..అజయ్ మాత్రం గల్లంతయ్యారు. అజయ్‌తో పాటు వచి్చన రాఘవేంద్ర, సాయి సందీప్‌లకు ఈత రావడంతో కొద్ది దూరం ఈదుకుంటూ రాగా అక్కడికి వచి్చన స్పీడ్ బోట్ సిబ్బంది వారిని రక్షించి బయటకు తీసుకు వచ్చారు.
తెల్లవారు జామున గుర్తించిన స్నేహితులు
గాయపడిన వారిని మొదట పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ తెల్లవారు జామున 2 గంటలకు రాఘవేంద్ర, సాయిసందీప్‌లు కలుసుకుని అజయ్ గురించి ఆరాతీశారు. అయితే అప్పుడు అజయ్‌కి ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ ఉంది. అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశారు.
కుటుంబ సభ్యుల ఆందోళన..
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తెల్లవారు జామున హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుని అజయ్ కోసం ఆరా తీశారు. తమ కుమారుడు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. కాగా అజయ్ కోసం లేక్ పోలీసులు, డీఆర్‌ఎఫ్‌లకు చెందిన 5 బృందాలు సోమవారం ఉదయం నుంచి హుస్సేన్ సాగర్‌లో గాలింపు చేపట్టాయి. ఉదయం నుంచి బోట్లు, గజ ఈత గాళ్ల సహాయంతో సాగర్ మొత్తం సాయంత్రం 6.30 గంటల వరకు గాలించినా యవకుడి ఆచూకీ మాత్రం కనిపించ లేదు. మంగళవారం మరో మారు గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా..సోమవారం అజయ్ కుటుంబ సభ్యులు ఇచి్చన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హన్మంతు తెలిపారు.
లేటుగా వస్తానని చెప్పి..
రాత్రి 8.30కి ఫోన్ చేస్తే ట్యాంక్‌బండ్‌పై ఉన్నా..కొద్దిగా లేటుగా వస్తాను అని చివరి మాటలు చెప్పాడంటూ అజయ్ తల్లి నాగలక్ష్మి, తండ్రి జానకిరాం కన్నీరుమున్నీరుగా రోదించారు.