సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: బందోబస్తు, భద్రత కోణంలో నగర పోలీసు విభాగానికి అత్యంత కీలకమైన గణేష్ ఉత్సవాలు సమీపిస్తుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఏమరుపాటుకు తావు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కొత్వాల్ సీవీ ఆనంద్ దృష్టి పెట్టారు. బంజారాహిల్స్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని ఆడిటోరియంలో బుధవారం తొలి సన్నాహాక, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 31న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 9న నిమజ్జనం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో మండపాలు/విగ్రహాలు నిమజ్జనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం సిటీలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీలు, డీసీపీల్లో అనేక మంది కొత్తవారు ఉన్నారు. వీరి గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం బందోబస్తు నిర్వహించడం తొలిసారి. ఈ నేపథ్యంలో ఆనంద్ ఈ సమావేశంలో వారిని ఉద్దేశించి పలు కీలక సూచనలు చేశారు. ‘కోవిడ్ తర్వాత ఈ ఏడాది అనేక పండుగలు, ఇతర ఘట్టాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సెమీ ఫైనల్స్ లాంటి వాటిని సమర్థంగా నిర్వహించాం.
ఫైనల్ లాంటి గణేష్ బందోబస్త్‌లోనూ కచ్చితంగా రాణిస్తామనే నమ్మకం ఉంది’ అని ఆనంద్ అన్నారు. మండపాల ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు స్థానిక పోలీసుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కొత్వాల్ స్పష్టం చేశారు. ఇతర విభాగాలతో కలిసి సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని ఆనంద్ ఆదేశించారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచి అభ్యంతరకర పోస్టులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు సీపీలు డీఎస్ చౌహాన్, ఏఆర్ శ్రీనివాస్, సంయుక్త సీపీలు పి.విశ్వప్రసాద్, ఎం.రమేష్, ఏవీ రంగనాథ్, గజరావ్ భూపాల్, ఠాణాల ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
చదవండి: గ్రేట్ లవర్స్.. ఫేస్‌బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా..
నిమజ్జనానికి 3 రకాల కొలనులు
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాల నిర్వహణతో పాటు మరోవైపు విగ్రహాల నిమజ్జనాల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఎక్కడి విగ్రహాలను అక్కడే దగ్గరి ప్రాంతాల్లో నిమజ్జనాలు చేసేందుకు వీలుగా 75 కొలనుల్ని అధికారులు సిద్ధం చేయనున్నారు. కేవలం గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసమే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్మించిన 25 కొలనులున్నాయి. వీటిని బేబీ పాండ్స్‌గా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు అదనంగా మరో 24 ప్రీఫ్యాబ్రికేటెడ్ ఎఫ్‌ఆర్‌పీ (ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్) పాండ్స్‌కు ఇప్పటికే టెండర్లు పిలిచారు.
వీటికి ఒక్కో దానికి రూ. 10 లక్షలు వెచ్చించనున్నారు. వీటినే కృత్రిమ తటాకాలుగా కూడా వ్యవహరిస్తున్నారు. 20మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 1.35 మీటర్ల లోతులో ఉండే వీటిలో నాలుగడుగుల ఎత్తు వరకు విగ్రహాలను నిమజ్జనం చేయొచ్చు. వీటితోపాటు ఆయా ప్రాంతాల్లోని అవసరాలకనుగుణంగా గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసం మరో 26 ప్రాంతాల్లో చెరువులు తవ్వి, నిమజ్జనాల కోసం వినియోగించనున్నారు. వీటిని తాత్కాలిక నిమజ్జన కొలనులుగా వ్యవహరిస్తున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనాల కోసం ఇలా మూడు రకాల కొలనుల్ని వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
నిర్వహణ లేక చెత్తా చెదారాలు పేరుకుపోయిన బేబీ పాండ్స్‌ను శుభ్రం చేయడంతోపాటు, తాత్కాలిక చెరువుల కోసం తవ్వకాల పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. ఈ కొలనుల్లో వేసిన విగ్రహాలను ఎప్పటికప్పుడు బయటకు తీసి, తాజా నీరు నింపుతారని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఆరు లక్షల మట్టివిగ్రహాలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన విగ్రహాలు కూడా వినియోగించనుండటంతో చెరువుల్లో నీరు కలుషితం కాకుండా ఉండేందుకు, నిమజ్జనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment