మనిషి జీవితం అనుభవాల పుట్ట. అనుభవాలకంటేే అనుభూతులేే బాగుంటాాయి. అంటేే ఏ విషయమైనా అది అనుభవించేేటప్పటి కంటేే అవి గుర్తు తెచ్చుకున్నప్పుడే ఎక్కువ ఆనందిస్తామనిపిస్తుంది. అందుకే కొంత వయసొచ్చాక మనం చేసే కొన్ని పనులు.. గతించిన మధుర జ్ఞాపకాలని మళ్లీ పునరుజ్జీవం చేసేందుకు.. తద్వారా మళ్లీ అలాంటి ఆనందం పొందేందుకూ చేసే ప్రయత్నాలు అనిపిస్తుంది. అయితే ఒకప్పుడు పొందిన ఆనందానుభూతి మళ్లీ కలుగుతుందా అంటే అనుమానాస్పదమే.. చాలా సార్లు ఆశాభంగమే మిగులుతుంది.
నా చిన్నప్పుడు మా తాతగారింటి దగ్గరలో తామరలు.. కలువలతో నిండిన చెరువు వుండేది. మా ఇంటి దగ్గర బయలు దేరి తాతగారుండే వీథి మలుపు తిరుగుతూనే,తామరపూల సువాసనను మోసుకొచ్చే చల్లని గాలి మేను తాకేది, ఆ దారిని వెళ్లినప్పుడల్లా, ఆ అనుభూతి కోసం వెదుక్కునే దానిని. ఎప్పుడో ఒకసారి మాత్రమే అది దక్కేది. ఆ తర్వాతర్వాత.. కలువలూ, తామరలూ పోయి ఉత్త చెరువుగా మారింది. చేపల పెంపకానికి ఇప్పుడదీ లేదు.. పిచ్చి మొక్కలు పెరిగి పెద్దగుంటలా మిగిలింది. కానీ నాలో ఆ చిన్ననాటి జ్ఞాపకం పదిలంగానే వుంది. అలాగే మొట్టమొదటి సారి అరవిచ్చిన జాజులనో, మల్లెలనో.. అరచేతిలో తీసుకున్నపుడు చుట్టుముట్టిన వాటి సన్నని పరిమళం ఎన్నటికీ మరువదు మనసు. ఇప్పుడు వాటిని చేతిలోకి తీసుకున్నా పరిమళించేది ఆనాటి జ్ఞాపకాలే .
కొంత పెద్దయిన తర్వాత పండగలంటే ఉత్సాహం పోతుంది. నిరాసక్తంగా అనిపిస్తుంది. అందరికీ అంతేనేమో అనుకుంటా. కానీ వినాయక చవితి మాత్రం ఎందుకో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రతి వినాయక చవితి పండగకు నా చిన్ననాటి జ్ఞాపకాలు పునరుజ్జీవితమవుతూ వుంటాయి.
ఆ రోజు పొద్దున్నే"ఇవాళ పండగ లేలే "అంటూ అమ్మ నిద్ర లేపంగానే,బయటకు వచ్చి చూస్తే ఆకాశం నీలంగా చల్లగా హాయిగా అనిపించేది. గబా గబా మొహం కడిగేసి.. పత్రి కోసం పిల్లలందరం కలిసి సంచులు తీసుకుని బయలు దేరే వాళ్లం,(ఇప్పటిలాగా పత్రి కట్టలు కొనే వాళ్లం కాదు) సరే వేణు గోపాల స్వామి గుడి దగ్గరకు వచ్చే సరికి గుడి గోడల మీద, గుడి ఆవరణలోనూ అంతా కోలాహలంగా అరుస్తూ పిల్ల మూకలు.. "అరేయ్ గన్నేరు పూలు కొయ్యండ్రా అంటూనో,జమ్మి కొమ్మలు తెంపండిరా అంటూనో, మారేడు దళాలు కూడా కావాలోయ్ అంటూనో " పిల్లలు అరుస్తుంటే కొంతమంది చెట్లెక్కలేని పెద్దలు కింద నిలబడి "బాబూ నాకో రెండు రెమ్మలు ఇటు పడెయ్యి నాయనా" అంటుండే వారు.మేము గుళ్లో పత్రి సేకరించాక.. ఆ ఆవరణ అంతా పెరిగిన టపాకాయల మొక్కల నుండీ సన్నగా బారుగా వుండే కాయలు కోసి అక్కడవుండే నూతిలో వేసి అవి ఠప్ ఠప్ మని మోగుతుంటే చప్పట్లు కొట్టి నవ్వుకునే వాళ్లం.
ఇక అక్కడ నుండీ చెరువు దగ్గర కొచ్చేటప్పటికి ఈత వచ్చిన పిల్లలు ,అప్పటికే చెరువులో ఈదుతూ కలువలూ తామరలూ తెంపుతూ వుండేవాళ్లు ,ఈతరాని నా లాంటి పిల్లలు ఒడ్డు నుండి "నాకా తెల్లకలువ తెచ్చిపెట్టవా అనీ,ఆ ఎర్ర కలవ మొగ్గ చేతి కందేంత దూరంలో వుందనీ,ఆ తెల్ల తామర దగ్గరలోనే వుందనీ" కేకలు వేస్తూ సందడి చేస్తూ వుండే వాళ్లం.
అలా చెరువు దగ్గరనుండీ బయలు దేరి,డొంక దారి పట్టేటప్పటికి, అప్పటికే అక్కడ పిల్లలనిపూచిన,కాసిన చెట్లుండేవి,"అదుగో ఆ వెలగ కొమ్మ కాయతో సహా కొయ్యాలి"అని కింద నుండి ఎవరో కేకేసే వారు(వెలగచెట్టు నిలువుగా చాలా ఎత్తులో వుంటుంది, ఎక్కడం చాలా కష్టం) "మామిడి రెమ్మలు మాకూ నాలుగందుకో" అనే వారింకొకరు, "మాష్టారూ ఉత్తరేణి అంటే ఇదేనా?దూర్వార అంటే ఈ గరిక పోచలేనా? అరె జిల్లేడు కొమ్మలతో జాగ్రత్త పాలు కంట్లో పడితేకళ్లు పోతాయి" ఇలాంటి సలహాలతో, సహాయాలతో ఎలాగో మోపెడు పత్రితో ఇల్లు జేరేటప్పటికి ఉదయం పది గంటలయ్యేది. అప్పటికే అమ్మ పూజకన్నీ సిధ్ధం చేసి వుంచేది,ఈ లోగా వీథిలో ఎవరో "వినాయకుళ్లోయ్ "అంటూ మట్టి వినాయకుళ్లమ్మొచ్చేవారు,ఇంట్లో పెద్ద బొమ్మలొకటో రెండో వున్నా తప్పని సరిగా ఆ మట్టి వినాయకుణ్ణి ప్రతి సంవత్సరం కొనాల్సిందే.
"తొందరగా స్నానాలు చేసి అక్కడ పెట్టిన పట్టుబట్టలు కట్టుకోండర్రా "అని అమ్మ పెట్టే కేకతో స్నానం ముగించి.. చదువుకునే క్లాస్ పుస్తకాలలో పసుపుతో శ్రీ రాసి బొట్లు బెట్టి దేవుడు ముందు పెట్టే వాళ్లం. అలా చేస్తే బాగా చదువు వస్తుందని చెప్పేవాళ్లు. పుస్తకాలు చదవకుండానే చదువెలా వస్తుందనే సందేహాలూ, ప్రశ్నలూ లేనే లేవు చెప్పింది చేసెయ్యడమే.
అమ్మ పిండివంటలు తయారు చేస్తూ వుండేది పూజ మేమే మొదలు పెట్ఠేవాళ్లం "వినాయక వ్రత కల్పం "పుస్తకం సహాయంతో,సగం పూజ అయ్యే సరికి వినాయకుడి వాహనం సంగతేమో కానీ మాకే కడుపుల్లో ఎలకలు పరిగెత్తుతూ వుండేవి,అయినా సరే పట్టుదలగా ,అమ్మ అరటి పండు కాస్త నోట్టో వేసుకోవచ్చే అన్నా సరే నిష్ఠగా పూజ చేశారనిపించుకోవాలని,చివరి వరకూ పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా పూజ ముగించే వాళ్లం.
ఇక భోజనం చేసిన దగ్గర నుండి ఇంకో పెద్ద పనుండేది. అది ఇరుగు పొరుగుల ఇళ్లకెళ్లి వాళ్ల వినాయకుణ్ణి చూసి రావడం. అప్పట్లో మాకు ఇలా వీథుల్లో పెద్ద పెద్ద వినాయకుళ్లని నిలబెట్టడం.. వారం రోజులపాటు మైకుల్లో మెదడు బయటకు వచ్చే పాటలు పెట్టి ఊదర కొట్టడం ఉండేవి కావు. ఎవరిళ్లల్లో వాళ్లు పూజ చేసుకోవడం, స్నేహితుల ఇళ్లకెళ్లి వాళ్ల దేవుణ్ణి చూసి, మా పిండి వంటలు వాళ్లూ వాళ్ల పిండి వంటలు మేమూ మెక్కడం, మూడో రోజో అయిదో రోజో దేవుణ్ణి మొక్కల్లో పెట్టడమో ,చెరువులో కలపడమో ఇంతే.. ఎప్పుడు బయలు దేరిందో ఈ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టే సంస్కృతి ? నాకు తెలిసి ఇది మనది కాదు.
ఇప్పుడు పండగ రోజు పొద్దున్నే పత్రి కోసం వెళ్లే పిల్లలెవరూ కనబడడం లేదు. వేణుగోపాల స్వామి గుడి గోడలు వెలవెల బోతున్నాయి. చెరువులో ఈతకొట్టే పిల్లలూ లేరు. కలువలూ తామరలూ కనుమరుగయ్యాయి. పత్రి కావలసిన వాళ్లకి పదో ఇరవయ్యో పెడితే బజారులో కావలసినంత పత్రి, కలువలు తామరలూ కూడా అమ్మకానికి దొరుకుతాయి. వీథి వీథినా పెద్ద పెద్ద వినాయకుళ్లు కొలువుదీరి వుంటున్నారు. ఒక వీథిని మించి ఇంకో వీథి పోటీ పడుతున్నాయి. నిమజ్జనాల రోజయితే, చెప్పే పనే లేదు పెద్ద పేద్ద మైకులతో,టపాసుల సందడితో, తూగి పోతూ జనం వేసే చిందులతోవినాయకుణ్ణి సాగనంపే కార్యక్రమం ఒక పెద్ద జాతర లాగ జరుపుతున్నారు.
ఈ రోజు నాకు ఎందుకో ,పాపం పుణ్యం తెలియని ,అమాయక మైన అయిదారేళ్ల వయసులో మేము సంబరంగా జరుపుకున్న పండగ గుర్తొస్తోంది. వినాయక చవితి నా దృష్టిలో పిల్లలు సామూహికంగా కలిసి ఆడుకునే ఒక ఆట, అంతే కాదు ఎలక నుండీ ఏనుగు దాకా ప్రకృతి లో ఒక భాగమే, అవి కూడా పూజ్యనీయాలే అని చెప్పే పండగ అందుకే నాకు వినాయక చవితి ఇష్టమైన పండగ.
- భార్గవి
Comments
Please login to add a commentAdd a comment