తిరుపతి రూరల్: వినాయక చవితిని పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో పేపర్, బంకమట్టితో తయారు చేసిన 1,060 భారీ వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని తిరుచానూరు మార్కెట్ యార్డులో శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు చేసి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని పల్లెలకు చెందిన యువకులు స్థానికులతో కలిసి వినాయక ఉత్సవాలు నిర్వహించుకునేందుకు సంకల్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇలా విగ్రహాల కోసం 1,060 వినతులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దృష్టికొచ్చాయి.
దాదాపు 25 వేల మంది యువత ఇందులో భాగస్వాములవుతున్నారు. పల్లెల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు యువతను ఆధ్యాత్మికత వైపు నడిపించాలని గత 15 ఏళ్లుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి.. వినాయక విగ్రహాలను సొంత నిధులతో తయారు చేయించి ఉచితంగా అందిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు చెందిన నిపుణులైన 160 మంది కార్మికులు ఏడు నెలలుగా నిర్విరామంగా శ్రమించి వీటిని తయారు చేశారు.
ప్రతి సచివాలయానికి పది చొప్పున పల్లెలకు పంపించేందుకు సిద్ధం చేసిన విగ్రహాలతో కూడిన వాహనాలను ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా చైర్మన్ మోహిత్‌రెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. వీటిని తీసుకెళ్లేందుకు నియోజకవర్గంవ్యాప్తంగా దాదాపు 25 వేల మంది యువకులు విగ్రహాల పంపిణీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సాటి మరెవరూ లేరని కొనియాడారు. హిందూ ధర్మాన్ని పెంపొందించేలా చెవిరెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. కాగా, మట్టి విగ్రహాలను ఆదివారం నియోజకవర్గంలో ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment