Vinayaka idols
-
బొజ్జ గణపయ్యా...పొట్ట నింపవయ్యా!
కడప కల్చరల్: మరో మూడు వారాల్లో శ్రావణ మాసం ముగిసి భాద్రపదం వస్తుంది. సందుగొందుల్లో సైతం గణపయ్య విగ్రహాలు వెలుస్తాయి. ఏటా నెలరోజుల ముందే ఊరిబయట విగ్రహాల తయారీ మొదలవుతుంది. రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాల తయారీదారులు వచ్చి అక్కడి నుంచి తెచ్చుకున్న సామగ్రితోపాటు స్థానికంగా లభించే సామగ్రితో విగ్రహాలు తయారు చేస్తారు. ఊరి బయట పెద్ద టెంట్లు వేసుకుని కుటుంబాలతో గడుపుతారు. ఒకటి, రెండు నెలలపాటు తయారు చేసిన విగ్రహాలను అమ్ముకుని సంతృప్తిగా తిరిగి తమ ప్రాంతానికి వెళతారు. కానీ ఈ సంవత్సరం పరిస్థితి కొద్దిగా మారింది. స్థానికంగా ఉండే పెట్టుబడిదారులు ముందే ముడి విగ్రహాలను తెచ్చిపెట్టుకుని రాజస్తానీ కళాకారులకు కాంట్రాక్టుపై రంగులు పూసే పని అప్పగించారు. సదరు పెట్టుబడి పెట్టిన స్థానికులే విగ్రహాలకు అడ్వాన్సులు తీసుకుని ప్రజలు కోరిన తేదికి విగ్రహాలను సిద్ధం చేయాలని కళాకారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలస్యమైతే కూలీ తగ్గుతుందన్న భయంతో కళాకారులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. కడప నగరంతోపాటు ఇతర పట్టణాలు, మండల కేంద్రాల శివార్లలో పెద్ద టెంట్లు వేసుకుని గణపయ్య విగ్రహాలను తయారు చేస్తున్నారు. నిజానికి విగ్రహాల వ్యాపారం నిన్న, మొన్నటివరకు కళాకారుల ద్వారానే జరిగేది. ప్రస్తుతం పెట్టుబడి దారులు రంగప్రవేశం చేశాక కళాకా రులంతా కూలీలుగా మారారు. తయారీదారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్లే విగ్రహాలకు ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. ఐదు అడుగుల విగ్రహం రూ. 8–10 వేలకు విక్రయిస్తున్నారు. 13 అడుగుల భారీ విగ్రహం రూ. 50–60 వేలకు ఇస్తున్నారు. తాము మాత్రం ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకుంటూ కళాకారులకు కూలీ మాత్ర మే ఇస్తున్నారు. సీజన్ పోతే ఈ ఆదాయం కూడా ఉండదంటూ కళాకారులు వచ్చిన కాడికే తీసుకుంటున్నారు. -
రెండో రోజూ.. బైబై గణేశా
సాక్షి, సిటీబ్యూరో: వినాయక విగ్రహాల నిమజ్జనం శుక్రవారం రెండో రోజూ కొనసాగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విగ్రహాలు తరలివచ్చాయి. దీంతో ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా వైపు నిమజ్జన వాహనాలు భారీ ఎత్తున బారులు తీరాయి. గురువారం మొదలైన వినాయక విగ్రహాల నిమజ్జన వేడుకలు నిరాటంకంగా శుక్రవారం కూడా కొనసాగగడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ♦ రామంతాపూర్, అంబర్పేట్, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి విగ్రహాలు తరలివచ్చాయి. రెండు రోజులుగా సుమారు 10 వేలకుపైగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు పోలీసు వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు 5 అడుగుల కంటే తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలు సుమారు 30 వేలకుపైగా నిమజ్జనం చేసినట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు ఆరంభమైన మూడో రోజు నుంచే నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. 5వ రోజు కూడా భారీ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఉత్సవాల అనంతరం గురువారం పెద్ద ఎత్తున విగ్రహాలను నిమజ్జనం చేయగా, శుక్రవారం కూడా అన్ని వైపులా నుంచి విగ్రహాలు తరలి వచ్చాయి. శుక్రవారం రాత్రి వరకూ నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా వైపు విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. మహాగణపతి నిమజ్జనంతో మొదలు.. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత మిగతా విగ్రహాల తరలింపు క్రమంగా పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మందకొడిగా సాగిన తరలింపు ప్రక్రియ రాత్రి నుంచి వేగంగా సాగింది. బాలాపూర్ విగ్రహాన్ని తరలించిన అనంతరం వరుసగా పాతబస్తీలోని వివిధ ప్రాంతాలకు చెందిన విగ్రహాలు బారులు తీరాయి.భారీ విగ్రహాలు కావడంతో నెమ్మదిగా ముందుకు కదిలాయి. అదే సమయంలో రామంతాపూర్, అంబర్పేట్ వైపు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు కూడా ప్రధాన శోభాయాత్రలో చేరడంతో నిమజ్జనం నెమ్మదిగా సాగింది. కొన్నిచోట్ల అర్ధరాత్రి తర్వాత నిమజ్జన ఏర్పాట్లు చేయగా, కొన్ని విగ్రహాలను శుక్రవారం ఉదయం తరలించారు. దీంతో గురువారం మొదలైన నిమజ్జన శోభాయాత్ర నిరాటంకంగా సాగింది. అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సిటీబస్సులు, ఇతర వాహనాలు స్తంభించడంతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. సాధారణంగా ప్రతి సంవత్సరం మొదటి రోజే ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. రెండో రోజు మిగిలిన విగ్రహాలను ఉదయం పదింటి వరకే పూర్తి చేస్తారు.కానీ అందుకు పూర్తిగా భిన్నంగా రెండు రోజులు నిమజ్జనం కొనసాగింది. శుక్రవారం రాత్రి కూడా విగ్రహాలను నిమజ్జనం చేశారు. -
చంద్రగిరిలో 1,060 భారీ వినాయక విగ్రహాల పంపిణీ
తిరుపతి రూరల్: వినాయక చవితిని పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో పేపర్, బంకమట్టితో తయారు చేసిన 1,060 భారీ వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని తిరుచానూరు మార్కెట్ యార్డులో శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు చేసి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని పల్లెలకు చెందిన యువకులు స్థానికులతో కలిసి వినాయక ఉత్సవాలు నిర్వహించుకునేందుకు సంకల్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇలా విగ్రహాల కోసం 1,060 వినతులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దృష్టికొచ్చాయి. దాదాపు 25 వేల మంది యువత ఇందులో భాగస్వాములవుతున్నారు. పల్లెల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు యువతను ఆధ్యాత్మికత వైపు నడిపించాలని గత 15 ఏళ్లుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి.. వినాయక విగ్రహాలను సొంత నిధులతో తయారు చేయించి ఉచితంగా అందిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు చెందిన నిపుణులైన 160 మంది కార్మికులు ఏడు నెలలుగా నిర్విరామంగా శ్రమించి వీటిని తయారు చేశారు. ప్రతి సచివాలయానికి పది చొప్పున పల్లెలకు పంపించేందుకు సిద్ధం చేసిన విగ్రహాలతో కూడిన వాహనాలను ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా చైర్మన్ మోహిత్‌రెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. వీటిని తీసుకెళ్లేందుకు నియోజకవర్గంవ్యాప్తంగా దాదాపు 25 వేల మంది యువకులు విగ్రహాల పంపిణీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సాటి మరెవరూ లేరని కొనియాడారు. హిందూ ధర్మాన్ని పెంపొందించేలా చెవిరెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. కాగా, మట్టి విగ్రహాలను ఆదివారం నియోజకవర్గంలో ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. -
గణేశ్ విగ్రహాల ధరలు పెరిగాయ్... ఎందుకంటే..
ముంబై: పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంట గ్యాస్ ధరలతో సతమతమవుతున్న వినాయకుని భక్తులకు గణేశ్ విగ్రహాలు, అలంకరణ సామాగ్రి ధరలు కూడా తోడయ్యాయి. విగ్రహాల తయారీకి ఉపయోగించే నల్ల మట్టి, రంగులు, ఇనుప చువ్వలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ), కలప తదితర సామాగ్రి ధరలు 25–30 శాతం పెరిగాయి. అంతేగాకుండా వర్క్ షాపుల్లో విగ్రహాలను తయారుచేసే కళాకారులు, కార్మికుల జీతాలు కూడా పెంచాల్సి వచ్చింది. ఫలితంగా విగ్రహాల ధరలు పెంచక తప్పలేదని తయారీదారులు అంటున్నారు. విగ్రహాలతోపాటు మండపాల నిర్మాణానికి వినియోగించే వెదురు బొంగులు, ప్లాస్టిక్ పేపర్లు, తాడ్పత్రి, అలాగే «థర్మాకోల్, గ్లూ, రంగురంగుల కాగితాలు, విద్యుత్ దీపాలు, లేజర్ లైట్ల తోరణాలు తదితర అలంకరణ సామాగ్రి ధరలు 10–20 శాతం పెరిగాయి. అదేవిధంగా పూజా సాహిత్యం ధరలు 20–25 శాతం పెరిగాయి. దీంతో ఈ ఏడాది గణేశోత్సవాలు నిర్వహించే పేదలు, మధ్య తరగతి కుటుంబాల ఆర్ధిక అంచనాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఉత్సవాలకు భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్ధితి వచ్చింది. పెరిగిన సామాగ్రి ధరల ప్రభావం సార్వజనిక గణేశోత్సవ మండళ్లపై అంతగా పడకపోయినప్పటికీ ముఖ్యంగా ఇళ్లలో ప్రతిష్టించుకుని పేదలు, సామాన్య భక్తులపై తీవ్రంగా చూపనుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సార్వజనిక గణేశోత్సవ మండళ్లు, ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు ఉత్సవాలు సాదాసీదాగా నిర్వహించారు. అలంకరణ పనులకు కూడా చాలా తక్కువ స్ధాయిలో ఖర్చు చేశారు. కానీ ఈసారి బీజేపీ ప్రభుత్వం ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు, సార్వజనిక మండళ్లు భారీగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కానీ విగ్రహాల ధరలు, అలంకరణ సామాగ్రి ధరలు పెరగడంతో ఉత్సవాలపై నీళ్లు చల్లాల్సిన పరిస్ధితి వచ్చింది. వరదలతో తయారీకి ఇక్కట్లు... గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి అన్ని వస్తువులకు భారీగా ధరలు పెరిగాయి. గత సంవత్సరం కేజీ పీఓపీ రూ.130 లభించగా ఇప్పుడు రూ.210పైగా లభిస్తోంది. అంతేగాకుండా రంగుల ధరలు 10–20 శాతం, ఇనుప చువ్వల ధరలు 50–60 శాతం మేర పెరిగాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక జిలాలలో వరదలు వచ్చాయి. అలాగే గుజరాత్లో కూడా కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి నుంచి వర్క్ షాపుల్లోకి రావల్సిన కలప నిలిచిపోయింది. దీంతో కొరత ఏర్పడడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. సామాగ్రి ధరలు పెరిగినప్పటికీ కొనుగోలు చేయకతప్పడం లేదు. చౌక ధర సామాగ్రి వినియోగిస్తే విగ్రహాల నాణ్యత దెబ్బతింటుంది. దీంతో గత్యంతరం లేక విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని బడా విగ్రహాల తయారీదారులు అంటున్నారు. వలస కూలీలు తిరిగిరాలేదు.. కరోనా కాలంలో అమలుచేసిన లాక్డౌన్ వల్ల ఉపాధి లేక అనేక మంది కళాకారులు, కార్మికులు స్వగ్రామాలకు తరలిపోయారు. అందులో అనేక మంది తిరిగి రాలేకపోయారు. దీంతో కళాకారులు, కార్మికుల కొరత ఏర్పడింది. వారికి కూడా ఎక్కువ కూలీ, వేతనాలిచ్చి రాష్ట్రానికి రప్పించాల్సిన దుస్ధితి వచ్చింది. ఎక్కువ జీతంతో పనులు చేయించుకోవల్సి వస్తోందని విగ్రహాల తయారీదారుడు రాహుల్ ఘోణే పేర్కొన్నారు. మరో విగ్రహాల తయారిదారుడు ప్రశాంత్ దేశాయ్ మాట్లాడుతూ రెండు, నాలుగు అడుగులోపు విగ్రహాలు తయారు చేయడం కొంత గిట్టుబాటు అవుతుంది. అందులో ఇనుప చువ్వలు, కలప వినియోగం ఉండదు. కాని భారీ విగ్రహాలు తయారు చేయాలంటే ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఇందులో ఇనుప చువ్వలు, కలప పెద్ద మాత్రలో వినియోగించాల్సి ఉంటుంది. దీంతో ధరలు పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదంటున్నారు. విగ్రహాల డిమాండ్ పెరిగింది. కాని సమయం తక్కువగా ఉండడంతో కళాకారులకు, కార్మికులకు ఓవర్ టైం డబ్బులు చెల్లించడంతో భోజన, బస వసతులు కల్పించి పనులు చేయించుకోవల్సిన పరిస్ధితి వచ్చిందంటున్నారు. ఇలా అన్ని విధాల ఖర్చులు పెరగడంతో విగ్రహాల ధరలు పెంచకతప్పడం లేదని వారు వాపోతున్నారు. -
పర్యావరణ హితమే లక్ష్యంగా....
తిరుపతి రూరల్: పర్యావరణ హితమే లక్ష్యంగా..ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 1.24 లక్షల బంకమట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా చెవిరెడ్డి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గురువారం తిరుచానూరు మార్కెట్ యార్డ్‌లో బంకమట్టి విగ్రహాల తయారీని ఆయన పరిశీలించారు. విగ్రహాల తయారీకి అవసరమైన బంకమట్టి మిశ్రమాన్ని కలపడంలో కుమ్మరి కార్మికులతో కలిసి పాలుపంచుకున్నారు. చెవిరెడ్డి మాట్లాడుతూ..చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఏటా, ప్రతి ఇంటికీ బంకమట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పంపిణీతో పాటు పూజించేలా ప్రోత్సహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 25 ప్రదేశాల్లో.. 7 వేల మంది కుమ్మరి కార్మికులు 25 రోజులుగా బంకమట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారని, 2,500 టన్నుల బంకమట్టిని ఉపయోగించినట్లు చెప్పారు. ప్రజలకు గణనాథుని పూజించే విధానంపై బుక్‌లెట్‌ను అందించనున్నట్లు తెలిపారు. 2వేల మంది వలటీర్లతో ఈ విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహ ప్రతిష్టకు ఏపీ హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహ ప్రతిష్టకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని.. కానీ ఐదుగురికి మించి వేడుకల్లో పాల్గొనకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను హైకోర్టు సమర్థించింది. (చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి) పబ్లిక్ ప్రాంతాల్లో విగ్రహాలు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన హక్కును నిరాకరించలేమని.. అదే సమయంలో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కునూ కాదనలేమని వ్యాఖ్యానించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్టకు అనుమతి నిరాకరిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. -
‘సందేశాల’ గణపతి
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశ మండపమది. దాంట్లో చేతిలో ఘంటంతో రాస్తున్న భంగిమలో వినాయకుడి విగ్రహం ఉంది. భక్తుడు మండపంలోకొచ్చి అక్కడున్న గంటను మోగించగానే వినాయకుడు తల ఊపుతూ రాయడం మొదలు పెడతాడు.రాత పూర్తవగానే అక్కడున్న ప్రింటర్‌లోంచి ఒక కాగితం బయటకు వస్తుంది. దాంట్లో రోడ్డు భద్రత, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన సందేశం ఒకటి ఉంటుంది. ఆ కాగితాన్నే గణపతి ప్రసాదంగా భక్తుడు ఇంటికి తీసుకెళ్లిపోతాడు... ఇది గోవాలోని ఫాంటైన్హాస్ దగ్గరున్న వారసత్వ ప్రాంతమైన ఫాంటే ఫోనిక్స్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రత్యేకత. సామాజిక సందేశాలను స్వయంగా రాసి ఇచ్చే ఈ వినాయకుడిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. యువ అనే సామాజిక స్వచ్ఛంద సంస్థ ఈ యాంత్రిక వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించింది.ఊరికే వినాయకుడి విగ్రహాన్ని పెట్టే బదులు దాని ద్వారా ఏదైనా సామాజిక ప్రయోజనం సాధించాలని భావించాం. అందుకే ఈ యాంత్రిక గణపతిని నెలకొల్పాం. రహదారి భద్రత, పరిశుభ్రత, మహిళా సాధికారత, కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగాలకు సంబంధించిన సందేశాలు ఆయన రాసి భక్తులకు ఇస్తున్నారు. వాటిని భక్తులు ఎంతో భక్తితో ఇంటికి తీసుకెళుతున్నారు.’అంటూ తమ ఉద్దేశాన్ని వివరించారు యువ వ్యవస్థాపకుడు రఘువీర్ మహలే. ఈ విగ్రహాన్ని సుద్ద ముక్కలతో తయారు చేశారు. విగ్రహం తయారీకి నెలన్నర పట్టిందని,5వేల సుద్దముక్కలు వాడామని మహలే తెలిపారు. కరెంటు ఎక్కువ ఖర్చు కాకూడదన్న ఉద్దేశంతో గంట మోగినప్పుడే వినాయకుడి విగ్రహం కదిలేలా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. -
విఘ్ననాథుడికి వీడ్కోలు
మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పూజలందుకున్న విఘ్ననాయకుడి విగ్రహాలు బుధవారం కృష్ణానదిలో నిమజ్జనం కోసం బయలుదేరాయి. ఉదయం ఏకదంతునికి పూజలు చేసిన భక్తులు.. సాయంత్రం ఊరేగింపుగా బ్యారేజీ దిగువున ఉన్న అఫ్రాన్ ప్రాంతానికి తీసుకెళ్లి నమజ్జనం చేశారు. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు మూడు క్రేన్లను అందుబాటులో ఉంచారు. అవాంఛనీయ ఘనలు జరుగకుండా పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు. గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. రాత్రి 8 గంటల వరకు బ్యారేజీ వద్ద 500 పైగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేశారు. – విజయవాడ కల్చరల్ -
గబ్బర్ సింగ్, బాహుబలి..వినాయకుడి ప్రతిమలేంటి?
-
108 నిమిషాల్లో 108 వినాయకులు..
హైదరాబాద్: 108 మంది విద్యార్థులు 108 నిమిషాల్లో 108 రకాల గణనాధ చిత్రాలను గీసి అబ్బురపరిచారు. ఈ అరుదైన చిత్ర మాలికల సమాహారానికి నగరంలోని వీఎన్ఆర్ సద్గురు పాఠశాల వేదికైంది. పాఠశాలకు చెందిన 108 మంది విద్యార్థులు వివిధ రూపాలలో పార్వతీ తనయుడి చిత్రాలను గీసి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
వినాయకా.. సెలవిక
తాండూరు టౌన్/తాండూరు, న్యూస్‌లైన్ : ఐదురోజుల పాటు పూజలందుకున్న గణనాథునికి తాండూరులో ఘనంగా వీడ్కోలు పలి కారు. శుక్రవార ఘనంగా నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. రాత్రి భారీగా విగ్రహాలు తరలిరావడంతో అక్కడక్కడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విగ్రహాలను పలు వాహనాల్లో తరలిస్తూ వాటి ముందు యువకులు పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. యోగ్చాప్, చిరుతల భజన, సన్నాయివాయిద్యాలు, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది. భారీ వర్షంలోనూ ఊరేగింపు ... నిమజ్జనానికి బయలుదేరిన వినాయకులను వరుణదేవుడు పలకరించాడు. సాయంత్రం 5గంటల నుంచి రెండుగంటలకు పైగా భారీ వర్షం కురిసింది. అయినా ఊరేగింపు ఉత్సాహంగా కొనసాగింది. భద్రప్ప గుడి వద్ద హిం దూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్, డీసీసీబీ జిల్లా చైర్మన్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షు డు లక్ష్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. భారీ బందోబస్తు నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీ సులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ వెంకటస్వామి పరిస్థితిని సమీక్షించారు. 200మందికి పైగా పోలీసులు డీఎస్పీ షేక్‌ఇస్మాయిల్ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించారు. అంతకుముందు వినాయక విగ్రహాల వేదికల వద్ద, ఊరేగింపు వెళ్లే మార్గాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. లక్కీడ్రాలో రూ.లక్ష విలువైన బంగారం తాండూరులోని వినాయక్‌చౌక్‌లో వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీడ్రా ఉత్కంఠగా కొనసాగింది. శుక్రవారం వందలాది మంది సమక్షంలో డ్రా నిర్వహిం చారు. చివరి బహుమతి నుంచి డ్రా తీస్తుండటంతో రూ.లక్ష బంగారం ఎవరికి దక్కుతుం దోననే ఉత్కంఠ నెలకొంది. ‘6715’ నంబర్‌కు రూ.లక్ష విలువైన బంగారం దక్కింది. 7487 నంబర్‌కు (కెరెళ్లికి చెందిన రైతు కె.రాజయ్య) ద్వితీయ బహుమతిగా రూ.25వేల బంగారం, 2432 నంబర్‌కు (తాండూరుకు చెందిన ఖాజామొయినొద్దీన్) తృతీయ బహుమతిగా రూ.10వేల వెండి బహుమతి దక్కింది. గణపతి లడ్డూకు భలే డిమాండ్ తాండూరులోని వినాయక మండపాల వద్ద గణపతి లడ్డూలకు భలే డిమాండ్ పలికింది. శుక్రవారం ఆయా మండపాల ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహిం చారు. గణపతి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. పసారి వార్డు వద్ద రూ.55,559కు అల్లాపూర్ జైపాల్‌రెడ్డి, సాయిపూర్ పోచమ్మ గుడి వద్ద రూ.42 వేలకు బంటు హన్మంతు లడ్డూను దక్కించుకున్నారు. తాతాగుడి (హనుమాన్‌దేవాలయం) వద్ద పట్లోళ్ల రవీందర్‌రెడ్డి రూ.40వేలు, బోనమ్మ గుడి వద్ద రూ.36లకు, అంబేద్కర్ చౌక్‌వద్ద రూ.30వేలకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పట్లోళ్ల రత్నమాల భర్త పి.నర్సింహులు, సాయిపూర్లో రూ.30వేలకు పట్లోళ్ల జనార్దన్, మైసమ్మ గుడి వద్ద రూ.23వేలకు పట్లోళ్ల వెంకటేశం, యాదిరెడ్డి చౌక్‌లో రూ.38,001 మేస్త్రీలు అంకమరాజు, హరిబాబు, రూ.23,001కు మరో లడ్డూను మేస్త్రీ వీరబాబు, శాంతినగర్‌లో రెండు లడ్డూలు రూ.30వేలకు భక్తులు వేలంలో దక్కించుకున్నారు. కోకట్ కాగ్నా నదిలో... యాలాల: మండల పరిధిలోని కోకట్ కాగ్నా నదిలో నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. తాండూరుతో పాటు వివిధ గ్రామాల్లో ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులను భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. రెవెన్యూ, పోలీసులు, తాండూరు మున్సిపల్ సిబ్బంది, అగ్నిమాపక, వైద్య, గజ ఈతగాళ్లు, ఎలక్ట్రిసిటీ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ఎస్పీ రాజకుమారి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి పరీశీలించారు.