సాక్షి, సిటీబ్యూరో: వినాయక విగ్రహాల నిమజ్జనం శుక్రవారం రెండో రోజూ కొనసాగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విగ్రహాలు తరలివచ్చాయి. దీంతో ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా వైపు నిమజ్జన వాహనాలు భారీ ఎత్తున బారులు తీరాయి. గురువారం మొదలైన వినాయక విగ్రహాల నిమజ్జన వేడుకలు నిరాటంకంగా శుక్రవారం కూడా కొనసాగగడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
♦ రామంతాపూర్, అంబర్‌పేట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి విగ్రహాలు తరలివచ్చాయి. రెండు రోజులుగా సుమారు 10 వేలకుపైగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు పోలీసు వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు 5 అడుగుల కంటే తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలు సుమారు 30 వేలకుపైగా నిమజ్జనం చేసినట్లు తెలిపారు.
నవరాత్రి ఉత్సవాలు ఆరంభమైన మూడో రోజు నుంచే నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. 5వ రోజు కూడా భారీ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఉత్సవాల అనంతరం గురువారం పెద్ద ఎత్తున విగ్రహాలను నిమజ్జనం చేయగా, శుక్రవారం కూడా అన్ని వైపులా నుంచి విగ్రహాలు తరలి వచ్చాయి. శుక్రవారం రాత్రి వరకూ నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా వైపు విగ్రహాల నిమజ్జనం కొనసాగింది.
మహాగణపతి నిమజ్జనంతో మొదలు..
ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత మిగతా విగ్రహాల తరలింపు క్రమంగా పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మందకొడిగా సాగిన తరలింపు ప్రక్రియ రాత్రి నుంచి వేగంగా సాగింది. బాలాపూర్ విగ్రహాన్ని తరలించిన అనంతరం వరుసగా పాతబస్తీలోని వివిధ ప్రాంతాలకు చెందిన విగ్రహాలు బారులు తీరాయి.భారీ విగ్రహాలు కావడంతో నెమ్మదిగా ముందుకు కదిలాయి. అదే సమయంలో రామంతాపూర్, అంబర్‌పేట్ వైపు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు కూడా ప్రధాన శోభాయాత్రలో చేరడంతో నిమజ్జనం నెమ్మదిగా సాగింది.
కొన్నిచోట్ల అర్ధరాత్రి తర్వాత నిమజ్జన ఏర్పాట్లు చేయగా, కొన్ని విగ్రహాలను శుక్రవారం ఉదయం తరలించారు. దీంతో గురువారం మొదలైన నిమజ్జన శోభాయాత్ర నిరాటంకంగా సాగింది. అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సిటీబస్సులు, ఇతర వాహనాలు స్తంభించడంతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు.
సాధారణంగా ప్రతి సంవత్సరం మొదటి రోజే ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. రెండో రోజు మిగిలిన విగ్రహాలను ఉదయం పదింటి వరకే పూర్తి చేస్తారు.కానీ అందుకు పూర్తిగా భిన్నంగా రెండు రోజులు నిమజ్జనం కొనసాగింది. శుక్రవారం రాత్రి కూడా విగ్రహాలను నిమజ్జనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment