అయోధ్య: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. పూజరులు నిర్వహిస్తున్న ప్రత్యేక క్రతువులు రెండో రోజుకు చేరాయి. బుధవారం కలశ పూజ చేపట్టారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా దంపతులు ‘యజమానులుగా’ సరయూ నది తీరంలో కలశ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలశాలను సరయూ నదీ జలాలలో నింపి పూజలు చేశారు.
రామ్‌లల్లా ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ఈ కలశాలను తీసుకెళ్తారు. ప్రతిష్టాపన కంటే ముందు ఈ జలాలతో పూజలు చేస్తారు. మొత్తం 121 మంది ఆచార్యులు క్రతువుల్లో పాల్గొంటున్నారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు. గురువారం గణేశ్ అంబికా పూజ, వరుణ పూజ, మాత్రికా పూజ, వాస్తు పూజ నిర్వహిస్తారు. మంగళవారం ప్రారంభమైన ఈ క్రతువులు ఈ నెల 21వ తేదీ దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
అయోధ్యకు చేరుకున్న ‘రామ్‌లల్లా’
భవ్య మందిరంలో ప్రతిష్టించబోయే రామ్‌లల్లా విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకుంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య వాహనంలో ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. గర్భాలయంలోని వేదికపైకి చేర్చారు. కళ్లకు గంతలు కట్టి ఉన్న ఈ విగ్రహం చిత్రాలను తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేయలేదు. ఈ నెల 22న ఇదే విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు. ప్రాణప్రతిష్ట తర్వాతే రామ్‌లల్లా చిత్రాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, రామ్‌లల్లా ప్రతీకాత్మక (సింబాలిక్) విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది.
19 నుంచి ‘అఖండ్ పథ్’
అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కోసం హిందువులతోపాటు ఇతర మతాల ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ మూడు రోజులపాటు ‘అఖండ్ పథ్’ నిర్వహించేందుకు సిక్కు మతస్థులు సిద్ధమవుతున్నారు. అయోధ్యలోని గురుద్వారా బ్రహ్మకుండ్ సాహిబ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్ట సజావుగా జరగాలని ఆకాంక్షిస్తూ అఖండ్ పథ్ నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సిక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు.
అయోధ్య శ్రీరాముడితో సిక్కులకు చరిత్రాత్మక అనుబంధం ఉందని వివరించారు. 1510లో గురునానక్ అయోధ్యను దర్శించుకున్నారని గుర్తుచేశారు. 1858లో సిక్కు మత పెద్దలు అయోధ్య రామాలయంలో పూజలు చేశారని, గోడలపై రామ్ అని రాశారని చెప్పారు. సిక్కు మత ఆచారాలు, సంప్రదాయాల్లో అఖండ్ పథ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పవిత్ర గురుగ్రంథ సాహిబ్‌ను నిరంతరాయంగా భక్తితో పఠించడమే అఖండ్ పథ్. ఇందుకు 48 గంటలకుపైగా సమయం పడుతుంది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ సాహిబ్‌లో ‘రామ్’ అనే పదం 2,533 సార్లు ఉందని ఆర్‌పీ సింగ్ వెల్లడించారు.
ప్రాణప్రతిష్టకు ‘ప్రధాన యజమాని’ ప్రధాని మోదీ
అయోధ్య: రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ప్రధాన యజమాని’గా వ్యవహరిస్తారని ప్రధాన ఆచార్యుడు పండిత లక్ష్మీకాంత్ దీక్షిత్ చెప్పారు. మొదట రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రాను ప్రధాన యజమానిగా ఖరారు చేశారు. కానీ, ఈ విషయంలో మార్పు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గర్భాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతోపాటు కీలకమైన పూజలను ప్రధాన యజమాని తన చేతుల మీదుగా నిర్వహిస్తారు.
అయోధ్యకు 200కుపైగా ఆస్థా ప్రత్యేక రైళ్లు
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత భక్తులు పోటెత్తనున్నారు. వారి సౌకర్యార్థం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు 2 వేల ఆస్థా ప్రత్యేక రైళ్లు నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టయర్–1, టయర్–2 నగరాల నుంచి బయలుదేరి ఈ రైళ్లు అయోధ్య ధామ్ స్టేషన్‌కు చేరుకుంటాయి. ఈ నెల 22వ తేదీ నుంచి 100 రోజులపాటు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇవి పరిమితమైన స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. అయోధ్య ధామ్ స్టేషన్ నుంచి మళ్లీ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ రైళ్లలో ప్రయాణానికి ఐఆర్‌సీటీసీ ద్వారా మాత్ర మే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్తగా 20 వేల ఉద్యోగాలు
అయోధ్య ఇక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారనుంది రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యను ప్రతిఏటా కోట్లాది మంది దర్శించుకోనున్నారు. అదేస్థాయిలో ఇక్కడ ఉద్యోగ, ఉపాధి పెరగడం ఖాయం. ఆతిథ్యం, రవాణా, పర్యాటక రంగాల్లో కలిపి 20 వేల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని సమాచారం.
ప్రతిఏటా శ్రీరాముడికి ‘సూర్య తిలకం’
అయోధ్య రామ మందిరంలో ప్రతిఏటా చైత్ర మాసంలో శ్రీరామనవమి రోజు భక్తులు అపూర్వమైన దృశ్యాన్ని తిలకించవచ్చు. ఆ రోజు గర్భాలయంలో రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. సూర్య కిరణాలే తిలకంగా రామయ్యను అలంకరిస్తాయి. దీన్ని సూర్య తిలకంగా పిలుస్తారు. ఈ తిలకం వ్యవస్థను సీఎస్‌ఐఆర్–సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీబీఆర్‌ఐ) సైంటిస్టులు డిజైన్ చేశారు. ఇందుకోసం ఆలయంలో కటకాలు, అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 6 నిమిషాల పాటు సూర్య తిలకాన్ని దర్శించుకోవచ్చు.
రామ భక్తులపై మోసాల వల
సైబర్ నేరగాళ్లు అయోధ్య రామమందిర ప్రారం¿ోత్సవాన్ని కూడా అక్రమ సంపాదనకు వాడుకుంటున్నారు. అయోధ్య నుంచి రామమందిర ప్రసాదం పంపిస్తామంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమెజాన్ వంటి ఆన్‌లైన్ మార్కెట్ సైట్లలో ఇలాంటి ప్రసాదం కనిపిస్తోంది. డెలివరీ చార్జీల కింద కేవలం రూ.51 ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే చాలు ఈ నెల 22వ తేదీ నాటికి ఉచితంగా ప్రసాదం పంపిస్తామంటూ మరికొందరు నేరగాళ్లు వల విసురుతున్నారు. నిజానికి దీనికి, అయోధ్య రామమందిరానికి ఎలాంటి సంబంధం లేదు.
అదంతా నకిలీ ప్రసాదమని అధికారులు అంటున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొందరైతే డొనేషన్లు సేకరిస్తున్నామంటూ రామ్ జన్మభూమి ట్రస్టు పేరిట వాట్సాప్ ద్వారా క్యూఆర్ కోడ్ పంపుతున్నారు. వాటిని స్కాన్ చేస్తే బ్యాంకు ఖాతాల్లో నగదు గల్లంతవుతోంది. అలాగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపనను ప్రత్యక్షంగా తిలకించడానికి వీఐపీ పాసులు అందజేస్తామంటూ ఉచ్చులోకి లాగుతున్నారు. ‘రామ్ జన్మభూమి గృహ్ సంపర్క్ అభియాన్–ఏపీకే’ పేరిట ఇలాంటి సందేశాలను ఫోన్ల ద్వారా పంపిస్తున్నారు. నగదు బదిలీ చేయించుకొని ఫోన్లు స్విచ్ఛాప్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment