sarayu river
-
Draupadi Murmu: అయోధ్యలో రాష్ట్రపతి
అయోధ్య: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం అయోధ్య సందర్శించారు. నూతన మందిరంలో ఇటీవలే కొలువుదీరిన బాలరామున్ని తొలిసారిగా దర్శించుకున్నారు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి హారతిచ్చారు. అంతకుముందు సరయూ నది హారతి కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొన్నారు. అంగవస్త్రం ధరించి సంప్రదాయబద్ధంగా హారతిచ్చారు. అనంతరం నదికి పూలమాలలు సమరి్పంచి మొక్కుకున్నారు. తర్వాత ప్రఖ్యాత హనుమాన్ గఢి ఆలయాన్ని సందర్శించారు. పూజల్లో పాల్గొని ఆంజనేయునికి హారతిచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం రామాలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ రాష్ట్రపతికి దగ్గరుండి దర్శనం చేయించారు. రామ్ లల్లా పట్ల ఆమె భక్తిశ్రద్ధలు అపూర్వమని కొనియాడారు. ‘‘స్వామికి రాష్ట్రపతి హారతిచ్చారు. సాష్టాంగం చేసి భక్తిని చాటుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ గొప్ప రామ భక్తులు కావడం నిజంగా గొప్ప విషయం’’ అని సత్యేంద్రదాస్ అన్నారు. అప్పట్లో విపక్షాల రగడ... అయోధ్యలో నూతన రామాలయం నిర్మాణానంతరం రాష్ట్రపతి అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఆలయం జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవడం తెలిసిందే. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులను కార్యక్రమానికి ఆహా్వనించారు. రాష్ట్రపతి మాత్రం అందులో పాల్గొనలేదు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని పూర్తిగా పక్కన పెట్టి సర్వం మోదీమయంగా కార్యక్రమం జరిపించారని కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ తదితరులు దుయ్యబట్టారు. ముర్ము ఆదివాసీ కాబట్టే రాష్ట్రపతి అని కూడా చూడకుండా కావాలనే కార్యక్రమానికి దూరంగా ఉంచారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బుధవారం ఆమె అయోధ్య వెళ్లి నూతన ఆలయాన్ని, బాలరామున్ని దర్శించుకోవడం విశేషం. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో కలశ పూజ
అయోధ్య: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. పూజరులు నిర్వహిస్తున్న ప్రత్యేక క్రతువులు రెండో రోజుకు చేరాయి. బుధవారం కలశ పూజ చేపట్టారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా దంపతులు ‘యజమానులుగా’ సరయూ నది తీరంలో కలశ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలశాలను సరయూ నదీ జలాలలో నింపి పూజలు చేశారు. రామ్‌లల్లా ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ఈ కలశాలను తీసుకెళ్తారు. ప్రతిష్టాపన కంటే ముందు ఈ జలాలతో పూజలు చేస్తారు. మొత్తం 121 మంది ఆచార్యులు క్రతువుల్లో పాల్గొంటున్నారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు. గురువారం గణేశ్ అంబికా పూజ, వరుణ పూజ, మాత్రికా పూజ, వాస్తు పూజ నిర్వహిస్తారు. మంగళవారం ప్రారంభమైన ఈ క్రతువులు ఈ నెల 21వ తేదీ దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అయోధ్యకు చేరుకున్న ‘రామ్‌లల్లా’ భవ్య మందిరంలో ప్రతిష్టించబోయే రామ్‌లల్లా విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకుంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య వాహనంలో ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. గర్భాలయంలోని వేదికపైకి చేర్చారు. కళ్లకు గంతలు కట్టి ఉన్న ఈ విగ్రహం చిత్రాలను తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేయలేదు. ఈ నెల 22న ఇదే విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు. ప్రాణప్రతిష్ట తర్వాతే రామ్‌లల్లా చిత్రాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, రామ్‌లల్లా ప్రతీకాత్మక (సింబాలిక్) విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. 19 నుంచి ‘అఖండ్ పథ్’ అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కోసం హిందువులతోపాటు ఇతర మతాల ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ మూడు రోజులపాటు ‘అఖండ్ పథ్’ నిర్వహించేందుకు సిక్కు మతస్థులు సిద్ధమవుతున్నారు. అయోధ్యలోని గురుద్వారా బ్రహ్మకుండ్ సాహిబ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్ట సజావుగా జరగాలని ఆకాంక్షిస్తూ అఖండ్ పథ్ నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సిక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. అయోధ్య శ్రీరాముడితో సిక్కులకు చరిత్రాత్మక అనుబంధం ఉందని వివరించారు. 1510లో గురునానక్ అయోధ్యను దర్శించుకున్నారని గుర్తుచేశారు. 1858లో సిక్కు మత పెద్దలు అయోధ్య రామాలయంలో పూజలు చేశారని, గోడలపై రామ్ అని రాశారని చెప్పారు. సిక్కు మత ఆచారాలు, సంప్రదాయాల్లో అఖండ్ పథ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పవిత్ర గురుగ్రంథ సాహిబ్‌ను నిరంతరాయంగా భక్తితో పఠించడమే అఖండ్ పథ్. ఇందుకు 48 గంటలకుపైగా సమయం పడుతుంది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ సాహిబ్‌లో ‘రామ్’ అనే పదం 2,533 సార్లు ఉందని ఆర్పీ సింగ్ వెల్లడించారు. ప్రాణప్రతిష్టకు ‘ప్రధాన యజమాని’ ప్రధాని మోదీ అయోధ్య: రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ప్రధాన యజమాని’గా వ్యవహరిస్తారని ప్రధాన ఆచార్యుడు పండిత లక్ష్మీకాంత్ దీక్షిత్ చెప్పారు. మొదట రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రాను ప్రధాన యజమానిగా ఖరారు చేశారు. కానీ, ఈ విషయంలో మార్పు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గర్భాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతోపాటు కీలకమైన పూజలను ప్రధాన యజమాని తన చేతుల మీదుగా నిర్వహిస్తారు. అయోధ్యకు 200కుపైగా ఆస్థా ప్రత్యేక రైళ్లు అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత భక్తులు పోటెత్తనున్నారు. వారి సౌకర్యార్థం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు 2 వేల ఆస్థా ప్రత్యేక రైళ్లు నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టయర్–1, టయర్–2 నగరాల నుంచి బయలుదేరి ఈ రైళ్లు అయోధ్య ధామ్ స్టేషన్‌కు చేరుకుంటాయి. ఈ నెల 22వ తేదీ నుంచి 100 రోజులపాటు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇవి పరిమితమైన స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. అయోధ్య ధామ్ స్టేషన్ నుంచి మళ్లీ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ రైళ్లలో ప్రయాణానికి ఐఆర్సీటీసీ ద్వారా మాత్ర మే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా 20 వేల ఉద్యోగాలు అయోధ్య ఇక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారనుంది రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యను ప్రతిఏటా కోట్లాది మంది దర్శించుకోనున్నారు. అదేస్థాయిలో ఇక్కడ ఉద్యోగ, ఉపాధి పెరగడం ఖాయం. ఆతిథ్యం, రవాణా, పర్యాటక రంగాల్లో కలిపి 20 వేల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని సమాచారం. ప్రతిఏటా శ్రీరాముడికి ‘సూర్య తిలకం’ అయోధ్య రామ మందిరంలో ప్రతిఏటా చైత్ర మాసంలో శ్రీరామనవమి రోజు భక్తులు అపూర్వమైన దృశ్యాన్ని తిలకించవచ్చు. ఆ రోజు గర్భాలయంలో రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. సూర్య కిరణాలే తిలకంగా రామయ్యను అలంకరిస్తాయి. దీన్ని సూర్య తిలకంగా పిలుస్తారు. ఈ తిలకం వ్యవస్థను సీఎస్ఐఆర్–సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీబీఆర్ఐ) సైంటిస్టులు డిజైన్ చేశారు. ఇందుకోసం ఆలయంలో కటకాలు, అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 6 నిమిషాల పాటు సూర్య తిలకాన్ని దర్శించుకోవచ్చు. రామ భక్తులపై మోసాల వల సైబర్ నేరగాళ్లు అయోధ్య రామమందిర ప్రారం¿ోత్సవాన్ని కూడా అక్రమ సంపాదనకు వాడుకుంటున్నారు. అయోధ్య నుంచి రామమందిర ప్రసాదం పంపిస్తామంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెట్ సైట్లలో ఇలాంటి ప్రసాదం కనిపిస్తోంది. డెలివరీ చార్జీల కింద కేవలం రూ.51 ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే చాలు ఈ నెల 22వ తేదీ నాటికి ఉచితంగా ప్రసాదం పంపిస్తామంటూ మరికొందరు నేరగాళ్లు వల విసురుతున్నారు. నిజానికి దీనికి, అయోధ్య రామమందిరానికి ఎలాంటి సంబంధం లేదు. అదంతా నకిలీ ప్రసాదమని అధికారులు అంటున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొందరైతే డొనేషన్లు సేకరిస్తున్నామంటూ రామ్ జన్మభూమి ట్రస్టు పేరిట వాట్సాప్ ద్వారా క్యూఆర్ కోడ్ పంపుతున్నారు. వాటిని స్కాన్ చేస్తే బ్యాంకు ఖాతాల్లో నగదు గల్లంతవుతోంది. అలాగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపనను ప్రత్యక్షంగా తిలకించడానికి వీఐపీ పాసులు అందజేస్తామంటూ ఉచ్చులోకి లాగుతున్నారు. ‘రామ్ జన్మభూమి గృహ్ సంపర్క్ అభియాన్–ఏపీకే’ పేరిట ఇలాంటి సందేశాలను ఫోన్ల ద్వారా పంపిస్తున్నారు. నగదు బదిలీ చేయించుకొని ఫోన్లు స్విచ్ఛాప్ చేస్తున్నారు. -
22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య
లక్నో/అయోధ్య: అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నిస్ రికార్డునే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కించి, ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించడంతో నగరం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. గతేడాది ఈ వేడుకలో 15.76 లక్షల ప్రమిదలు వెలిగించడం తొలిసారి గిన్నిస్ రికార్డులకెక్కింది. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో ఏటా దీపోత్సవం జరుగుతోంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేబినెట్ మంత్రులు కూడా దీపాలు వెలిగించి, సరయూ నది ఒడ్డున పూజలు చేశారు. దీపోత్సవం 100 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
శ్రీరాముడే స్ఫూర్తి: మోదీ
అయోధ్య: ప్రభుత్వ నినాదం ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’కు శ్రీరాముడి పాలన, ఆయన అందించిన విలువలే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపోత్సవంలో పాల్గొన్నారు. ప్రజలు వెలిగించిన 15.76 లక్షల దీపాలతో సరయూ తీరం వెలుగులతో కనువిందు చేసింది. ఈ కార్యక్రమం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను, మ్యూజిక్ షోను మోదీ తిలకించారు. భవ్య రామమందిర నిర్మాణానికి ఆయన 2020 ఆగస్టు 5న భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన అయోధ్యకు రావడం ఇదే తొలిసారి. తొలుత రామజన్మభూమి స్థలంలోని తాత్కాలిక ఆలయంలో రామ్‌లల్లాను మోదీ దర్శించుకున్నారు. దీపం వెలిగించారు. ప్రత్యేక పూజలు చేశారు. హారతి అందుకున్నారు. అనంతరం రామ మందిర నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రామకథా పార్కులో శ్రీరాముడు, సీతల ప్రతీకాత్మక పట్టాభిషేక కార్యక్రమంలో మోదీ పాలుపంచుకున్నారు. పుష్పక విమానం(హెలికాప్టర్) నుంచి రాముడు, లక్ష్మణుడు, సీత పాత్రధారులు దిగడం అందరినీ అకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. రాముడి ఆశయాలు, విలువలు రాబోయే 25 ఏళ్లలో మన లక్ష్యాల సాధనకు దిక్సూచి అని చెప్పారు. మన రాజ్యాంగ ఒరిజినల్ కాపీపై రాముడు, లక్ష్మణుడు, సీతామాత చిత్రాలు ఉన్నాయని గుర్తుచేశారు. మన రాజ్యాంగ హక్కులకు అది మరో గ్యారంటీ అని అభివర్ణించారు. -
నదీస్నానంలో భార్యకు ముద్దు.. చితకబాదిన జనం
లక్నో: పవిత్ర నదీస్నానంలో భార్యకు ముద్దు పెట్టాడంటూ ఓ వ్యక్తిని తిడుతూ.. చితకబాదారు ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో. సరయూ నదిలో ఓ జంట నీళ్లలోకి దిగగా.. భర్త తన భార్యకు ముద్దు పెట్టాడు. ఈ వ్యవహారాన్ని అక్కడున్న వ్యక్తులు రికార్డు చేయగా.. కొందరు అతన్ని బయటకు లాగేసి చెయ్యి చేసుకున్నారు. ఇది పవిత్రమైన నేల. అయోధ్యలో ఇలాంటి పనులు సహించం అంటూ రామ భక్తుడిగా ఓ వ్యక్తి మాట్లాడడం ఆ వీడియోలో చూడొచ్చు. ఘటన ఎప్పుడు జరిగిందన్నది స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారు. अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO — Suneet Singh (@Suneet30singh) June 22, 2022 -
అయోధ్యకు ‘రామాయణ క్రూయిజ్ టూర్’
న్యూఢిల్లీ: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను సందర్శించే భక్తుల కోసం పర్యాటక శాఖ సరయూ నదిలో ‘రామాయణ క్రూయిజ్’ టూర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దీనిపై డిసెంబర్ 1 న కేంద్ర షిప్పింగ్, జల మార్గాల శాఖామంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన క్రూయిజ్ సేల అమలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇది సరయూ నదిలో మొట్టమొదటి లగ్జరీ క్రూయిజ్ సేవ. ఈ సేవలతో పవిత్ర సరయు నదిలోన ప్రసిద్ధ ఘాట్ల గుండా సాగే ఈ ప్రయాణ ప్రధాన లక్ష్యం భక్తులకు ఆధ్యాత్మికతతో కూడిన అద్భుతమైన అనుభవానలు అందించడమే. ఈ క్రూయిజ్‌లో అన్ని లగ్జరీ సౌకర్యాలతో, భద్రతా ప్రమాణాలు గ్లోబల్ స్టాండర్డ్ తో సమానంగా ఉంటాయని.. క్రూయిజ్ లోపల, బోర్డింగ్ పాయింట్‌ని రామ్‌చరితమానస్ థీమ్ ఆధారంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ 80 సీట్ల క్రూయిజ్ ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అని.. సుందరమైన ఘాట్ల సౌందర్యాన్ని చూడటానికి పెద్ద గాజు కిటికీలు ఉంటాయన్నారు. ఇక పర్యాటకుల సౌకర్యార్థం వంట గది, చిన్నగదితో కూడిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రామాయణాన్ని తలపించేలా కొన్ని సంఘటనా చిత్రాలు, సెల్ఫీ పాయింట్లు ఉంటాయన్నారు. (చదవండి: 1992 డిసెంబర్ 6న ఏం జరిగింది ?) అయోధ్య హిందువులు ఆరాధించే ఏడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో మొదటిదని, యుపీ టూరిజం గణాంకాల ప్రకారం 2019 సంవత్సరంలో సుమారు రెండు కోట్ల మంది పర్యాటకులు అయోధ్యను సందర్శించారని, రామ్ మందిరం పూర్తయిన తర్వాత పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని మన్సుఖ్ మాండవియా తెలిపారు. ‘రామాయణ క్రూయిజ్ టూర్’ పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడమే కాక, ఈ ప్రాంతం ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుందని, ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ క్రూయిజ్ సేవ సజావుగా సాగడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అందిస్తుందని తెలిపారు.. -
కోర్టు తీర్పు తర్వాత అయోధ్య ఎలా ఉంది?
-
తీర్పు తర్వాత అయోధ్య ఎలా ఉంది?
లక్నో: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇప్పుడు అందరి దృష్టి రామ మందిరం నిర్మాణంపై పడింది. మందిరం పనులు ఎప్పుడు ఎలా చేపడతారు.. ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పట్లో పూర్తవుతాయి? అన్నవిషయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేది సంక్రాంతికా.. లేక శ్రీరామనవమికా అనే విషయంలో స్పష్టత లేకపోయినా అయోధ్యలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా సాధువులు, భక్తులతో కోలాహలంగా ఉంది. ఇన్నాళ్లూ ఆలయ నిర్మాణంపై స్థానికుల్లో కొంత సందిగ్ధత నెలకొన్నా సుప్రీం తీర్పు సంతోషాన్ని ఇస్తోందంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో వాతావరణమంతా ప్రశాంతగా మారింది. పవిత్ర సరయూ నది తీరంలో ఉన్న రాముడి జన్మస్థలంగా భావించే అయోధ్య పట్టణానికి భక్తులు భారీగా పొటెత్తున్నారు. ఆలయ నిర్మాణానికి కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల వరకు పడుతుందని శిల్పులు చెబుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. -
అయోధ్యలో రాముని భారీ విగ్రహం!
లక్నో: అయోధ్యలోని సరయూ నదీ తీరంలో శ్రీరాముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నట్లు సమాచారం. 36 మీటర్ల పీఠంపై 100 మీటర్ల ఎత్తైన రాముని విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే దీపావళి రోజు ప్రకటించనున్నారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ.. దీపావళి రోజు అయోధ్యకు సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక శుభవార్త చెప్పనున్నారని, అది ఆయన ద్వారానే వింటే బావుంటుందన్నారు. -
మోదీ రూట్లో యూపీ సీఎం కూడా...
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ రాముడి విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేయబోతున్నారు. సరయు నది ఒడ్డున ‘నవ్య అయోధ్య’లో భాగంగా విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నాహాలు ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు గవర్నర్ రామ్ నాయక్‌కు పర్యాటక శాఖ ఓ ప్రతిపాదన పంపగా.. టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ అవానిశ్ కుమార్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారంట. సుమారు 100 మీటర్లు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నప్పటికీ.. ఎత్తు విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అది ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఓ అధికారి తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు పొందాక సరయుఘాట్ లో రాముడి విగ్రహ నిర్మాణ పనులు మొదలవుతాయని చెబుతున్నారు. అధికారికంగా ఎంత ఖర్చవుతుందో వెల్లడించలేదు. ఇదే సమావేశంలో దీపావళి పండగ సందర్భంగా నిర్వహించబోయే వేడుకల గురించి కూడా చర్చించినట్లు అధికారులు తెలిపారు. లక్ష దీపోత్సవంతోపాటు అయోధ్య వరకు శోభ యాత్ర నిర్వహించేందుకు ఆదిత్యానాథ్ సర్కార్ సిద్ధమౌతోంది. దేశ ఐక్యతకు చిహ్నంగా మోదీ పేర్కొంటూ ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అతిపెద్ద విగ్రహాన్ని నర్మదా నదీ తీరంలో నెలకొల్పబోతున్న విషయం తెలిసిందే. 182 మీటర్ల(597 అడుగులు) ఎత్తుతో 19వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధంలో 2500 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదన్న మాట. ఈ విగ్రహం నిర్మాణానికి మూడు నుంచి మూడున్నర సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. -
'సరయూ' లో ఘోరం
బరైచ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సరయూ నదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. స్థానిక గోపాల్‌పుర ప్రాంతానికి చెందిన వారు రామ్గావ్కు వెళ్లి తిరిగి వస్తుండగా.. బెహతా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని జిల్లా కలెక్టర్ అజయ్ దీప్ సింగ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 9 మంది ఉండగా.. అందులో ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను బయటకు తీశారు. మృతులను రాజేష్(25), బ్రిజేష్(20), మగన్(17), విజయ్(16), తిరితి(12) షకీల్(12)లుగా గుర్తించారు. -
సరయూలో చక్రపాణి, కిరణ్ మృతదేహాలు లభ్యం
హైదరాబాద్ : సరయూ నదిలో గల్లంతు అయిన ఇద్దరు వేద పండిత విద్యార్థుల మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. గల్లంతైన డబీర్‌పురాకు చెందిన కిరణ్ కుమార్ శర్మ (20), మల్కాజ్‌గిరికి చెందిన చక్రపాణిశర్మ(21) మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే రామాయణ సుందరకాండ యజ్ఞానికి 48 మంది విద్యార్థులు హైదరాబాద్ నుంచి వెళ్లిన విషయం తెలిసిందే. వీరంతా నిన్న తెల్లవారు జామున సరయూ నదిలో స్నానానికి వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా చక్రపాణి, కిరణ్ శర్మ ప్రమాదవశాత్తు నదిలో గల్లంతు అయ్యారు. విద్యార్థుల మృతదేహాలు లభ్యం కావటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సరయూలో ఇద్దరు గల్లంతు
సాక్షి, హైదరాబాద్/జగ్గయ్యపేట: బియాస్ నది, డిండి ప్రాజెక్ట్ ఉదంతాల నుంచి తేరుకోక ముందే తాజాగా సరయూ నదిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వేద పండిత విద్యార్థులు గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే రామాయణ సుందరకాండ యజ్ఞానికి 48 మంది విద్యార్థులు వెళ్లారు. వీరు బుధవారం తెల్లవారు జామున సరయూ నదిలో స్నానానికి వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా ఇద్దరు ప్రమాదవశాత్తు అందులో పడ్డారు. గల్లంతైన వారిలో డబీర్‌పురాకు చెందిన కిరణ్(20), మల్కాజ్‌గిరికి చెందిన చక్రపాణిశర్మ(21)లు ఉన్నారు. అల్వాల్‌కు చెందిన విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో 48 మంది విద్యార్థుల బృందం సోమవారం వరంగల్ నుంచి అయోధ్యకు రైలులో వెళ్లింది. బుధవారం అయోధ్యలో రామాయణ సుందరకాండ యజ్ఞం జరగాల్సి ఉంది. ఈ యజ్ఞానికి ముందు తెల్లవారు జామున వీరంతా సరయూ నది తీరంలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. స్నానాలు చేస్తూ ఫొటోలు దిగేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే నదిలోకి దిగిన వారిలో కిరణ్, చక్రపాణిశర్మలు గల్లంతయ్యారు. చక్రపాణి మెదక్ జిల్లా వర్గల్ గ్రామంలో వేద పాఠశాలలో చదువు పూర్తి చేసుకుని సికింద్రాబాద్‌లోని ఎన్ఆర్ఐఐ సంస్థలో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. కిరణ్ తండ్రి గతంలోనే మృతి చెందగా, ఇప్పుడు అతనూ గల్లంతు కావడంతో అతని తల్లికి రోదనే మిగిలింది. అన్నీ మేమే అయి పెంచాం... ‘తండ్రి మరణించడంతో అన్నీ మేమే అయి పెంచాం. పెళ్లి కూడా చేసేందుకు సంబంధాలు చూస్తున్నాం.. ఇంతలో ఎంత ఘోరం జరిగింది..’ అంటూ గల్లంతైన పెద్దింటి కిరణ్‌కుమార్ శర్మ(25) అక్క, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జగ్గయ్యపేటకు చెందిన కిరణ్‌కుమార్ శర్మ తండ్రి మరణించడంతో అతని అక్క జయలక్ష్మి, బావ మార్తి ఆదిత్యకుమార్‌శర్మ, మేనమామలు పెంచి పెద్దచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తక్షణమే స్పందించి నదిలో మునిగిపోయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్ సంతాపం అయోధ్య వద్ద సరయూ నదిలో వేదపాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల మరణం పట్ల తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.