కార్మికుడి కష్టం కాంట్రాక్టర్ పాలు
ప్రారంభమైన వినాయక విగ్రహాల వ్యాపారం
కడప కల్చరల్: మరో మూడు వారాల్లో శ్రావణ మాసం ముగిసి భాద్రపదం వస్తుంది. సందుగొందుల్లో సైతం గణపయ్య విగ్రహాలు వెలుస్తాయి. ఏటా నెలరోజుల ముందే ఊరిబయట విగ్రహాల తయారీ మొదలవుతుంది. రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాల తయారీదారులు వచ్చి అక్కడి నుంచి తెచ్చుకున్న సామగ్రితోపాటు స్థానికంగా లభించే సామగ్రితో విగ్రహాలు తయారు చేస్తారు. ఊరి బయట పెద్ద టెంట్లు వేసుకుని కుటుంబాలతో గడుపుతారు. ఒకటి, రెండు నెలలపాటు తయారు చేసిన విగ్రహాలను అమ్ముకుని సంతృప్తిగా తిరిగి తమ ప్రాంతానికి వెళతారు.
కానీ ఈ సంవత్సరం పరిస్థితి కొద్దిగా మారింది. స్థానికంగా ఉండే పెట్టుబడిదారులు ముందే ముడి విగ్రహాలను తెచ్చిపెట్టుకుని రాజస్తానీ కళాకారులకు కాంట్రాక్టుపై రంగులు పూసే పని అప్పగించారు. సదరు పెట్టుబడి పెట్టిన స్థానికులే విగ్రహాలకు అడ్వాన్సులు తీసుకుని ప్రజలు కోరిన తేదికి విగ్రహాలను సిద్ధం చేయాలని కళాకారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలస్యమైతే కూలీ తగ్గుతుందన్న భయంతో కళాకారులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. కడప నగరంతోపాటు ఇతర పట్టణాలు, మండల కేంద్రాల శివార్లలో పెద్ద టెంట్లు వేసుకుని గణపయ్య విగ్రహాలను తయారు చేస్తున్నారు.
నిజానికి విగ్రహాల వ్యాపారం నిన్న, మొన్నటివరకు కళాకారుల ద్వారానే జరిగేది. ప్రస్తుతం పెట్టుబడి దారులు రంగప్రవేశం చేశాక కళాకా రులంతా కూలీలుగా మారారు. తయారీదారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్లే విగ్రహాలకు ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. ఐదు అడుగుల విగ్రహం రూ. 8–10 వేలకు విక్రయిస్తున్నారు. 13 అడుగుల భారీ విగ్రహం రూ. 50–60 వేలకు ఇస్తున్నారు. తాము మాత్రం ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకుంటూ కళాకారులకు కూలీ మాత్ర మే ఇస్తున్నారు. సీజన్ పోతే ఈ ఆదాయం కూడా ఉండదంటూ కళాకారులు వచ్చిన కాడికే తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment