బోడో మిలిటెంట్ల దుశ్చర్య భయాందోళనలో కుటుంబ సభ్యులు
హైదరాబాద్/కడప/రామాపురం: అసోం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ కిడ్నాప్‌నకు గురయ్యారు. దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన పప్పిరెడ్డి మేహ శ్వరరెడ్డిని ఆదివారం బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేసినట్లు అతడి బంధువులు తెలిపారు. క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అయిన మహేశ్వరరెడ్డి హసనాపురం గ్రామానికి గతంలో సర్పంచ్‌గా కూడా పనిచేశారు. గత మూడేళ్ల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాంకీ టవర్‌స ఈ-బ్లాక్ ఫ్లాట్ న ంబర్ 1607లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య సుభద్రమ్మ, కూతురు నిశిత, కొడుకు మంజునాథ్ ఉన్నారు. ప్రస్తుతం మహేశ్వరరెడ్డి గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాలలో ఐఎల్‌ఎఫ్ (రాంకీ కంపెనీ )లో సబ్ కాంట్రాక్టర్‌గా పనులు చేయిస్తున్నారు. అసోం రాష్ట్రం దివాస్ జిల్లాలో రూ.45 కోట్లతో 70 కిలోమీటర్ల వరకు రోడ్డుపనులు ఆయన పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. కాగా, అక్కడ ఇటీవల కురిసిన వర్షాలకు చేసిన నిర్మాణాలన్నీ కొట్టుకుపోవడంతో పనులకు సంబంధిన బిల్లులు ఆగిపోయాయి. దీంతో తిరిగి నిర్మాణ పనులు పర్యవే క్షించేందుకు మహేశ్వరరెడ్డి సైట్ ఇంజనీర్‌తో కలసి ఆదివారం ఉదయం 5.30 గంటలకు బైక్ మీద డిమహసవో జిల్లా లుమ్‌డింగ్‌లోని గెస్ట్‌హౌస్ సమీపంలోని సైట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో హత్‌కళి గ్రామం సమీపంలో ఐదుగురు వ్యక్తులు వారి బైక్‌ను ఆపి మహేశ్వరరెడ్డి, సైట్ ఇంజనీర్‌ను తమతోపాటు తీసుకెళ్లారు. కొద్దిదూరం వెళ్లాక సైట్ ఇంజనీర్‌ను వదిలిపెట్టారు. మహేశ్వరరెడ్డి కిడ్నాప్ ఉదంతం తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ చేసిన వారి నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు అసోం పోలీసు అధికారులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే మాదాపూర్ డీసీపీ కార్తికేయ డిమహసవో ఎస్పీ ప్రసాద్ జంధ్యాలతో మాట్లాడారు. మహేశ్వరరెడ్డిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, తన భర్తను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ, అసోం ప్రభుత్వాలకు మహేశ్వరరెడ్డి భార్య సుభద్రమ్మ విజ్ఞప్తి చేసింది. గత నెల 28న తన భర్త అసోం వెళ్లాడని, శనివారం రాత్రి ఫోన్ చేసి రెండు రోజుల్లో వస్తానని చెప్పినట్లు ఆమె పోలీసులకు తెలిపింది.
బాధితులకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రె డ్డి పరామర్శ
వైఎస్సార్‌సీపీ నేత, రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి కిడ్నాప్‌నకు గురైన మహేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదివారం సాయంత్రం రాంకీటవర్స్‌కు వెళ్లి మహేశ్వర్‌రెడ్డి భార్య సుభద్రమ్మ, కూతురు నిశితలకు ైధైర్యం చెప్పారు. అసోం ప్రిన్సిపల్ సెక్రటరీ భానుతో మాట్లాడానని.. ఇప్పటికే ఆర్మీ అధికారులు చర్యలు చేపట్టారని వివరించారు.
నేడు కేంద్ర హోం మంత్రి దృష్టికి కిడ్నాప్ వ్యవహారం
చొరవ చూపిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఢిల్లీలోనే ఉండి పర్యవేక్షించాల్సిందిగా ఎంపీలకు ఆదేశం
సాక్షి ప్రతినిధి, కడప : కాంట్రాక్టర్ పి.మహేశ్వరరెడ్డి కిడ్నాప్ వ్యవహారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లనుంది. మహేశ్వరరెడ్డి కిడ్నాప్ విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుసుకున్న కడప మేయర్ సురేష్‌బాబు, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిలు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులు పలు సమస్యలపై కేంద్ర హోంమంత్రిని కలసి బయటకు వచ్చారు. ఆ తర్వాత వీరికి విషయం తెలియడంతో సోమవారం మరోమారు హోంమంత్రిని కలసి కిడ్నాప్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కాగా, ఎంపీలు అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి బృందాన్ని ఢిల్లీలోనే ఉండాలని వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిసింది. వీరు కేంద్ర హోం మంత్రిని కలసి కిడ్నాప్ విషయంపై చర్చించి కాంట్రాక్టర్ విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అలాగే అసోం ముఖ్యమంత్రితో కూడా ఈ విషయంపై మాట్లాడాలని వారు విన్నవించనున్నారు. ఈ మేరకు కడప నగర మేయర్ సురేష్‌బాబు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.
అసోంలో ఏపీ కాంట్రాక్టర్ కిడ్నాప్
Published Mon, Nov 10 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM
Advertisement
Advertisement